సీఓపీ27: వాతావరణానికి మేలు చేసే జీవన విధానం ఎలా ఉంటుంది... అది భారత్‌కు సాధ్యమవుతుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నవీన్ సింగ్ ఖడ్కా
- హోదా, పర్యావరణ విలేకరి, బీబీసీ వరల్డ్ సర్వీస్
పర్యావరణ హితమైన జీవన విధానాన్ని అలవరచుకోవటం.. వాతావరణ మార్పుతో పోరాడటానికి ఒక కీలక మార్గమని భారతదేశం ఇటీవల ఐక్యరాజ్యసమితికి సమర్పించిన తాజా వాతావరణ కార్యాచరణ ప్రణాళికలో పేర్కొంది. కానీ భారతదేశం తన ఆర్థిక ఆకాంక్షలకు, వాతావరణ హిత జీవనశైలికి మధ్య సంతులనం సాధించగలదా?
ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పు ఒడంబడికలో చేరిన దేశాలు.. ప్రతి ఐదేళ్లకూ నేషనల్ డిటర్మిన్డ్ కంట్రిబ్యూషన్ (ఎన్‌డీసీ) అని పిలిచే ప్రణాళికను సమర్పించాల్సి ఉంటుంది. భూతాపాన్ని నెమ్మదింపజేయటం కోసం కర్బన ఉద్గారాలను తగ్గించటానికి, వాతావరణ మార్పు ప్రభావాలకు అనుగుణంగా మారటానికి తమ ప్రణాళికలు ఏమిటనేది ఇందులో వివరిస్తారు.
భారతదేశం సమర్పించిన తాజా ఎన్‌డీసీలో.. జీడీపీ యూనిట్‌కు కర్బన ఉద్గారాల పరిమాణాన్ని తగ్గించటం, విద్యుత్ ఉత్పత్తి కోసం శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించటం వంటి చర్యలు ఉన్నాయి.
అయితే ఈ జాబితాలో అగ్రభాగాన ‘లైఫ్ – లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ (పర్యావరణం కోసం జీవనశైలి)’ అనే అంశం ఉంది.
‘‘ప్రజా ఉద్యమంతో పాటు.. సంరక్షణ, సమన్వయంతో కూడిన సంప్రదాయాలు, విలువలు ప్రాతిపదికగా గల ఆరోగ్యవంతమైన, సుస్థిరమైన జీవన విధానం’’ ఆ జీవనశైలిగా వివరించింది.
లైఫ్ లక్ష్యం మన గ్రహానికి అనుగుణంగా ఉండే, దానికి హాని చేయని జీవనవిధానం అని ప్రభుత్వ ప్రకటన చెప్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2021లో గ్లాస్గోలో జరిగిన కాప్26 సదస్సులో తొలిసారి దీనిని ప్రతిపాదించారు.
కానీ ఈ లక్ష్యానికి, ఆర్థికాభివృద్ధిని నడిపించటంతో పాటు, దానివల్ల వేగవంతమయ్యే ‘వినియోగ పెరుగుదల’కు మధ్య వైరుధ్యం ఉందని నిపుణులు అంటున్నారు.
‘‘ఆధునికత అంటే ప్రాధమిక అర్థం వినియోగం పెరుగుదల. ‘లైఫ్’ భావన ఈ వినియోగం పోకడకు అనుగుణంగా లేదు’’ అంటున్నారు ఇండియన్ సొసైటీ ఫర్ ఎకలాజికల్ ఎకానమిక్స్ అధ్యక్షుడు డాక్టర్ నీలాంజన్ ఘోష్.

ఫొటో సోర్స్, Getty Images
పెరుగుతున్న వినియోగం, వృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థ
భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోని అగ్రస్థాయి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉంది. ఈ ఏడాది ఇతర ప్రధాన ఆర్థిక శక్తులు మాంద్యాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో.. భారతదేశం సుమారు 7 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని అంచనా.
ద్రవ్యోల్బణం, అంతర్జాతీయంగా ఎదురుగాలులు ఆందోళన కలిగిస్తున్నప్పటికీ.. వినియోగ డిమాండ్ బలంగా ఉంది. భారతదేశపు జీడీపీలో ప్రైవేటు వినియోగం 55 శాతంగా ఉంది. ఇది వృద్ధిని ముందుకు నడిపించటం కొనసాగుతుందని నిపుణులు భావిస్తున్నారు.
అందువల్లనే.. ‘లైఫ్’ విషయంలో ప్రభుత్వ ఉద్ఘాటనలో ‘ద్వంద్వం’ ఉందని డాక్టర్ ఘోష్ అంటున్నారు.
‘‘విభిన్నమైన శైలిని అలవరచుకోవటానికి చర్యలు చేపడతారా? లేదంటే ఎప్పటిలాగానే యధావిధిగా కొనసాగుతుందా? అనేది ప్రశ్న’’ అని ఆయన చెప్పారు.
వాతావరణ సంక్షోభానికి పరిష్కారాలు.. ‘లైఫ్’ ఉద్యమం తరహాలో సాధారణ ప్రజల మీద దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో పర్యావరణ ఆర్థికశాస్త్రం అసిస్టెంట్ ప్రొఫెసర్ యూజెనీ డుగోవా పేర్కొన్నారు.
‘‘అయితే దానివల్ల ఉద్గారాలు ఎంతగా తగ్గుతాయనే దాని గురించి అతి ఆశాభావంతో ఉండకూడదు’’ అని ఆమె వ్యాఖ్యానించారు. ఇటువంటి చర్యలు స్వల్ప కాలికంగా సానుకూల ప్రభావం చూపినప్పటికీ.. దీర్ఘకాలం పాటు కొనసాగవని ఆమె అభిప్రాయపడ్డారు.
‘‘ప్రవర్తనా మార్పు అవసరం, ముఖ్యం, కానీ విధాన రూపకర్తలకు అదే ప్రధాన పనిముట్టు కాజాలదు’’ అని పేర్కొన్నారు.
‘‘దానికిబదులు ఇంధనం, రవాణా, వ్యవసాయ పద్ధతుల్లో వ్యవస్థాగత మార్పుల మీద ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది’’ అని చెప్పారు.
ఇంధన డిమాండ్‌లో భారీ పెరుగుదల
భారతదేశంలో అత్యధికంగా కర్బన ఉద్గారాలను వెలువరించేది ఇంధన రంగం.
భారతదేశపు తలసరి ఇంధన వినియోగం ప్రపంచ సగటుతో పోలిస్తే సగానికన్నా తక్కువగా ఉన్నప్పటికీ.. ఈ దశాబ్దంలో ప్రపంచ దేశాల్లో భారతదేశంలోనే ఇంధన డిమాండ్ అత్యంత భారీగా పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ ఇంధన సంస్థ తన అక్టోబర్ నివేదికలో చెప్పింది.
అయితే.. వినియోగం పెరుగుదల కొనసాగుతున్నా కూడా జీవనశైలి మార్పులు సాధ్యమేనని కొందరు నిపుణులు భావిస్తున్నారు.
‘‘ప్రజలు ఎయిర్ కండిషన్లు కొనవద్దని చెప్పటం కాదు. గదుల ఉష్ణోగ్రతలను 25 డిగ్రీల సెంటీగ్రేడ్ల వద్ద ఉండేలా చూసుకోవటం ఒక అలవాటుగా చేయవచ్చు. దానివల్ల మన ఇంధన వినియోగం తగ్గుతుంది’’ అంటున్నారు వరల్డ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ ఇండియా తాత్కాలిక సీఈఓ మాధవ్ పాయ్. ‘లైఫ్’ కార్యక్రమం సందేశాన్ని ప్రజలకు అందించటానికి భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ అది.
ప్రజలు తమ జీవనశైలిని క్రమంగా మార్చుకోవటానికి సాయం చేయాలన్నది ఈ కార్యక్రమం లక్ష్యమని మాధవ్ పేర్కొన్నారు.
‘‘150 కోట్ల మంది భారతీయులను ప్రవర్తనా మార్పు దిశగా, ఆవృత్త ఆర్థికవ్యవస్థ దిశగా కొంచెం ముందుకు నెట్టే ప్రయత్నం’’ అని అభివర్ణించారు.

ఫొటో సోర్స్, Getty Images
విస్తృత సందేశం
‘లైఫ్’ అనే దానిని పశ్చిమ దేశాలకు ఒక సందేశంగా కూడా భారత ప్రభుత్వం ముందుకు తెచ్చింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘మిషన్ లైఫ్’ కార్యాచరణ ప్రణాళికను ఆవిష్కరించిన కొద్ది రోజులకు.. భారత పర్యావరణ, వాతావరణ మార్పు శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అక్టోబర్‌లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తాపత్రికలో ఒక వ్యాసం రాస్తూ.. ‘‘ప్రపంచ వినియోగ క్రమం అనాలోచితంగా ఉంది. పర్యావరణం గురించి ఏమాత్రం పట్టింపు లేదు’’ అని పేర్కొన్నారు.
‘‘యూజ్ అండ్ త్రో (వాడి పారేసే)’ మనస్తత్వం స్థానంలో ‘రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ (తగ్గించటం, పునర్వినియోగించటం, వాడిన పదార్థాలతో మళ్లీ వస్తువులను తయారుచేయటం)’ అనే దానిని తక్షణమే అలవాటు చేయటానికి ‘మిషన్ లైఫ్’ కృషి చేస్తుంది’’ అని చెప్పారు.
అయితే భారతదేశం కూడా తన వంతు తీవ్రమైన పర్యావరణ సమస్యలను ఎదుర్కొంటోంది.
భారతదేశంలో 2019-20 సంవత్సరంలో 35 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అయ్యాయని, వాటిలో కేవలం 12 శాతాన్ని మాత్రమే రీసైకిల్ చేయగా, 20 శాతాన్ని దహనం చేశారని దిల్లీ కేంద్రంగా గల సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ అనే థింక్-ట్యాంక్ నివేదిక ఒకటి చెప్తోంది.
‘‘మిగతా 68 శాతం లెక్కలోకి రాకుండా పోయింది. అంటే అదంతా పర్యావరణంలో (భూమిలో లేదా నీటిలో) కానీ చెత్త కుప్పల్లో కానీ ఉందని దాని అర్థం’’ అని ఆందోళన వ్యక్తంచేసింది.
భారతదేశంలోని ప్రతి నాలుగు నదీ పర్యవేక్షణ కేంద్రాల్లో మూడు కేంద్రాలు.. భారీ విష లోహాలు ఆందోళనకర స్థాయిలో ఉన్నట్లు నివేదించాయని కూడా వెల్లడైంది.
దేశంలో, ముఖ్యంగా ఉత్తర భారత రాష్ట్రాల్లో వాయు కాలుష్యం అనేది ఒక ప్రధాన ఆందోళనగా ఉంది.
ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన ప్రపంచ బ్యాంకు నివేదిక ఒకటి.. అత్యంత చెడ్డ పర్యావరణ ఆరోగ్యం గల దేశాల జాబితాలో భారతదేశాన్ని చేర్చింది. ఈ నివేదిక అనుసరించిన విధానంతో ప్రభుత్వం విభేదించింది. తన సొంత పర్యావరణ, పరిరక్షణ ప్రమాణాలను ప్రతిపాదించింది.
దేశంలో వరుస ప్రభుత్వాలు మౌలిక సదుపాయాలు, అభివృద్ధి ప్రాజెక్టలను అభివృద్ధి చేసే క్రమంలో పర్యావరణ చట్టాలను విస్మరించాయని, ముఖ్యంగా సున్నితమైన హిమాలయ ప్రాంతంలో ఈ చట్టాలను పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి.
వాతావరణ మార్పు మీద పోరాడటానికి తమ దేశ ప్రజలు జీవనశైలిని మార్చుకోవాలని కోరుకుంటున్న ప్రభుత్వం.. ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించాల్సిన అవసరముందని నిపుణులు అంటున్నారు.
‘‘మార్పు అనేది సంపూర్ణంగా ఉండాలి. ప్రభుత్వ చర్యలు, ప్రజల ప్రవర్తన మధ్య పొంతన ఉండాలి’’ అంటారు డాక్టర్ నీలాంజన్ ఘోష్.
ఇవి కూడా చదవండి:
- కళ్ళు చెప్పే ఆరోగ్య రహస్యాలు
- ‘ఆడవాళ్లు రోజుకో గంట అదనంగా నిద్రపోతే 14 శాతం ఎక్కువగా సెక్స్‌లో పాల్గొంటారు’
- ఒక నగరంలోని ప్రజలంతా ఒకే భవనంలో నివసించే రోజులు వస్తాయా, ఇది ఎలా సాధ్యం?
- బ్రిటిష్ వలస పాలనలో భారతీయ మహిళలను టార్గెట్ చేసిన సబ్బులు, క్రీముల ప్రకటనలు ఎలా ఉండేవి?
- ‘లోన్ రైట్ ఆఫ్’ అంటే ప్రజల సొమ్మును లూటీ చేయడమేనా?
- ఆంధ్రప్రదేశ్: రెడ్లు, కాపుల మధ్య ఆధిపత్య పోరులో ఇప్పటం నలిగి పోతోందా?
సంబంధిత కథనాలు














