రెడ్ ఆపిల్ అంతరించిపోతుందా? అసలు ఆపిల్ ఎక్కడ పుట్టింది? దానికి ఆ రంగు ఎలా వస్తుంది?

ఆపిల్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, వెరోనిక్ గ్రీన్‌వుడ్
    • హోదా, బీబీసీ ఫ్యూచర్

ఎర్రటి ఆపిల్ పండు అంటే మనుషులకు ఎంతో కాలంగా చాలా ఇష్టం. కానీ.. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల ఎర్రని ఆపిల్ అంతరించిపోయే ప్రమాదం ఉంది.

ఆదిమ ఆపిల్ పండు అంటే.. రెడ్ ఆపిల్. మరో మాట లేదు. పండ్ల దుకాణంలో ఆకుపచ్చని, పసుపుపచ్చని ఆపిల్స్ ఉండొచ్చు. కొన్ని ప్రాంతాల్లో చారలున్న ఆపిల్స్, అనేక రంగులు కలగలసిన యాపిల్స్ - కాక్స్ ఆరెంజ్ పిప్పిన్ వంటివి కూడా మనం చూడొచ్చు.

కానీ.. మనం అక్షర మాలను చదువుకునే పుస్తకాల్లో అత్యధికంగా కనిపించే ఆపిల్ ఎర్ర ఆపిల్. కొన్నిసార్లు స్వచ్ఛమైన, నిశితమైన ఆకుపచ్చని గ్రానీ స్మిత్ ఆపిల్ కనిపిస్తుంటుంది. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ఎందుకంటే ఆపిల్స్ ఎల్లప్పుడూ ఇంత స్థిరంగా ఏకవర్ణంలో ఉండవు.

ఆధునిక ఆపిల్స్ పూర్వీకులు.. ఇప్పుడు మనకి కజకిస్తాన్‌గా తెలిసిన ప్రాంతంలోని అడవి చెట్లు. పశ్చిమ చైనా సరిహద్దులోని పర్వతాల పశ్చిమ దిగువన ఈ అడవులు ఉన్నాయి. ఇప్పుడు కూడా అక్కడ అడవి ఆపిల్ చెట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఆ చెట్ల నుంచి రాలిన పండ్ల సువాసనతో అక్కడి గాలి నిండిపోతుంటుంది. ఆ రాలిన పండ్లను ఆ అడవిలో సంచరించే ఎలుగుబంట్లు ఆరగిస్తుంటాయి. అయితే.. మానవ అభివృద్ధి పుణ్యమా అని ఈ అడవి ఆపిల్ చెట్ల సంఖ్య గత 50 సంవత్సరాల్లో 90 శాతం కుదించుకుపోయింది. వీటి భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది.

ఆపిల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కజకిస్తాన్‌లోని అటవీ ప్రాంతం నుంచి ఆపిల్ పండ్లు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించాయి

ఆ పండ్లు లేత పసుపు రంగు నుంచి చెర్రీ ఎరుపు రంగు, చిగురు ఆకుపచ్చ రంగు వరకూ అనేక వర్ణాల్లో ఉంటాయి. అయితే.. మిగతా రంగులకన్నా ఎరుపు రంగు సాధారణంగా అంత ప్రముఖంగా కనిపించదు. (విషాదకరంగా.. ఒక వ్యాపార పండ్ల తోటలో - ప్రపంచంలోని అన్ని పండ్ల తోటల తరహాలోనే - అమెరికాలో పుట్టిన రెడ్ డెలీసియష్, గోల్డెన్ డెలీసియష్ ఆపిల్స్‌ను సాగు చేస్తున్నట్లు ఆపిల్ ప్రేమికుడు, యాత్రికుడు బెక్ లో ఒక కథనంలో తెలిపారు.)

ఆపిల్‌కు దాని రంగు.. దాని తోలులోని నిర్దిష్ట జన్యువుల వ్యక్తీకరణ స్థాయిని బట్టి వస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. న్యూజిలాండ్‌లోని ప్లాంట్ అండ్ ఫుడ్ రీసెర్చ్‌కు చెందిన ఒక జన్యుశాస్త్రవేత్త డేవిడ్ చేగ్న్.. ఎంజైముల జతలు కలిసి పనిచేస్తూ.. నిర్దిష్ట కణాలను ఆంథోసియానిన్లు అని పిలిచే పిగ్మెంట్లుగా మారుస్తాయని వివరిస్తారు. ఊదా రంగు చిలగడదుంపలకు, ద్రాక్షపండ్లకు, రేగుపండ్లకు వాటి రంగును ఇచ్చేది కూడా ఇవే రకం ఆంథోసియానిన్లు.

ఈ ఎంజైముల స్థాయిలను ఎంవైబీ10 అనే ప్రతిలేఖన మూలకం నియంత్రిస్తుంది. ఒక జన్యువు ఎంతగా వ్యక్తీకృతమవుతుంది అనే దానిని ఈ ఎంవైబీ10 ప్రొటీన్ పర్యవేక్షిస్తుంటుంది. సాధారణంగా ఈ ఎంవైబీ10 ఎంత ఎక్కువగా ఉంటే.. పండు తోలు అంత ఎర్రగా ఉంటుంది. నిజానికి.. ఎరుపు చారలు గల ఆపిల్స్‌లో తోలు మీద ఎర్రటి చారలు ఉన్న ప్రాంతాల్లో ఎంవైబీ10 స్థాయిలు అధికంగా ఉన్నాయని ఒక అధ్యయనంలో గుర్తించారు.

ఆపిల్

ఫొటో సోర్స్, Getty Images

అప్పుడప్పుడూ.. ఈ రంగు ఉష్ణోగ్రత మీద కూడా ఆధారపడి ఉంటుంది. మొత్తం ఎరుపు రంగులో ఉండే ఆపిల్‌ కావాలంటే ఉష్ణోగ్రతలు చల్లగానే ఉండాలని డేవిడ్ చాగ్న్ చెప్తున్నారు. ఎందుకంటే.. 40 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటి ఉష్ణోగ్రతలు పెరిగితే ఎంవైబీ10, ఆంథోసియానిన్ స్థాయిలు కుప్పకూలుతాయని వివరించారు.

స్పెయిన్‌లోని పైరినీస్ ప్రాంతంలో సాధారణంగా చాలా స్వచ్ఛమైన ఎరుపు చారలతో ఉండే ఆపిల్ పండ్లు.. చాలా వేడిగా ఉన్న ఒక జూలై నెల తర్వాత వెలసిపోయాయని ఆయన, ఆయన సహోద్యోగులు గుర్తించారు. వెచ్చని ఉష్ణోగ్రతల్లో ఆపిల్స్ ఎరుపు రంగును సంతరించుకోవటం మరింత కష్టమవుతుందని ఆయన పేర్కొన్నారు.

అయితే.. చిక్కటి రూబీ రంగు ఆపిల్‌కు ఆదరణ ఎక్కువగా ఉండే ఆసియా మార్కెట్ కోసం ఎంత సాధ్యమైతే అంత ఎరుపు రంగులో ఆపిల్‌ను పుట్టించాలని ఆయన, ఆయన సహచరులు ప్రయత్నిస్తున్నారు. అందుకోసం ఈ రంగు వెనుక గల జీవశాస్త్రానికి సంబంధించి తమకు అర్థమైన వాటిని ఉపయోగించుకుంటున్నారు.

ఎరుపు రంగు ఆపిల్‌కు పర్యావరణ మార్పు నుంచి పొంచివున్న ముప్పును.. బహుశా ఎర్రటి ఆపిల్స్‌ను పుట్టించాలన్న మన అకుంఠిత పట్టుదలతో మాత్రమే ఎదుర్కోగలమేమో. అందుకోసం ఖరీదైన కార్యక్రమాలు అవసరమవుతాయి.

మెయిన్‌లోని పాలెర్మోలో నివసించే ఆపిల్ సేకర్త జాన్ బంకర్.. అనేక విస్మృత జాతులు అంతరించిపోకుండా సంరక్షించారు. తోటల పెంపకం మీద ఇంతగా దృష్టి కేంద్రీకరించటానికి ముందు.. ఒక శతాబ్దం పూర్వం పెరిగిన ఆపిల్స్ కూడా ఆ జాతుల్లో ఉన్నాయి. అద్భుతమైన బ్లాక్ ఆక్స్‌ఫర్డ్ వీటిలో ఒకటి. దీని ఎరుపు రంగు ఎంత చిక్కగా ఉంటుందంటే.. అందులోని కండను చూడకపోతే అదో పెద్ద రేగు పండు అని పొరపాటు పడతాం.

ఆపిల్

ఫొటో సోర్స్, Getty Images

''ఈ రంగులు అసాధారణమైనవి. నాతో సహా కొంతమందికి ఇదే అసలైన ఆకర్షణ'' అని ఆయన చెప్తారు.

''పెంపకందారులు ఒక కొత్త చెట్టును అంచనావేస్తున్నపుడు.. ఆ చెట్టు ఆపిల్‌ రంగు కన్నా కానీ.. దాని ఇతర లక్షణాల మీద - రుచి, వినియోగం మీద - దృష్టి కేంద్రీకరించినట్లు కనిపిస్తుంది. కొన్ని పండ్లు సారాయికి బాగుంటాయి. కొన్ని తినుబండారాలకు బాగుంటాయి. కొన్ని సాస్‌కు పనికివస్తాయి. కొన్ని తినటానికి ఉపయోగపడతాయి. అప్పుడు పండు ఎలా కనిపిస్తుందనే దానికి పెద్దగా ప్రాధాన్యం లేదు. అన్ని చెట్ల పండ్లూ ఒకేలా కనిపిస్తున్నాయా అనేదీ లెక్కలోకి రాలేదు. ఎందుకంటే రైతులు ఆ పండ్లను తమ కోసం, స్థానిక మార్కెట్ కోసం వీటిని పండించేవారు. అవి ఎలా కనిపిస్తాయనే దానికన్నా అవి ఎలా ఉపయోగపడతాయనే అంశమే ముఖ్యంగా ఉండేది.

కానీ.. దాదాపు వందేళ్ల కిందట ఇదంతా మారిపోయిందంటారు బంకర్. ''చిన్న, విభిన్న పంటల సంస్కృతిలో.. చిన్నవైన భిన్నత్వంగల వ్యవసాయ ఆర్థిక వ్యవస్థల్లో ఏకరూపతకు పరిమితమైన విలువే ఉంటుంది'' అని ఆయన పేర్కొన్నారు. కానీ ఆపిల్స్‌ను వేల కిలోమీటర్ల పరిధిలో సాగుచేస్తూ.. మార్కెట్ విక్రయాల కోసం పండించేట్లయితే.. వాటి రంగు అనేది ఒక రకమైన బ్రాండింగ్‌కు మారుతుంది. ''మనం ఆశించాల్సింది దీనిని'' అని ఆ బ్రాండింగ్ చెప్తుంది. వినిమయ వ్యవస్థలో ఏకరూపత అనే దానికి మరింత విలువ పెరుగుతుంది. అదే సమయంలో.. ఆపిల్స్ పూర్తిగా పక్వానికి రాకముందే కోయటం జరుగుతోంది. ఎందుకంటే.. అవి పాడవకుండా సుదీర్ఘ దూరాలకు రవాణా చేయాలి మరి.

అయితే.. ఇక్కడో సమస్య ఎదురైంది. ''రంగు అనేది పక్వానికి వచ్చిందనేదానికి గుర్తు'' అని బంకర్ ఉటంకిస్తారు. పక్వానికి రాకముందే కోసిన ఆపిల్స్‌కు సరైన రంగు లేదు. అదే సమయంలో.. పక్వానికి రాకపోయినా కూడా జన్యుపరివర్తనం వల్ల మంచి ఎరుపు రంగు తిరిగిన ఆపిల్స్ కూడా కనిపించాయని ఆయన వివరించారు. ఆ ఆపిల్‌కే 'రెడ్ డెలీషియస్' అని పేరు పెట్టారు. దానిని 1921లో వాణిజ్య ఉత్పత్తి కోసం తోటల సాగుదారులకు విడుదల చేశారు.

ఆపిల్

ఫొటో సోర్స్, Getty Images

ఇతర రకాల ఆపిల్‌లకు కూడా ఆదరణ పెరిగింది. ఒక క్రమబద్ధమైన, ఏకరీతి రంగు ఉన్నట్లుగా గుర్తించిన ఆపిల్‌లు - ముఖ్యంగా పూర్తిగా పక్వానికి రాకముందే ఆ రంగు సంతరించుకోగల రకాలను గుర్తించారు. అవి వ్యాపారానికి బాగా ఉపయోగపడతాయి.

రైతులు సాగు చేసే రకాల సంఖ్య కుంచించుకుపోవటం మొదలైంది. మరోవైపు.. రంగు, రూపం మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి రుచి విషయాన్ని విస్మరించటంతో ఈ రకాల ఆపిల్స్ రుచి నెమ్మదిగా తగ్గిపోయింది.

రెడ్ డెలీషియస్ ఆపిల్‌ను తాను చిన్నప్పటి నుంచీ తినేవాడినని.. దానివల్ల ఆపిల్స్ అంటే తనకు అంతగా ఇష్టం ఏర్పడలేదని యూనివర్సిటీ ఆఫ్ మినిసొటాకు చెందిన ఆపిల్ బ్రీడర్ సృష్టికర్త డేవిడ్ బెడ్‌ఫోర్డ్ చెప్తారు. మరో రకం ఆపిల్‌ను రుచి చూసినపుడు ఆపిల్స్ ఇంకా భిన్నంగా కూడా ఉండగలవని తనకు తెలిసివచ్చిందని ఆయన గుర్తుచేసుకుంటారు. ''అది సింథటిక్ రబ్బర్ వంటి తోలు.. ఎల్మర్స్ గ్లూ వంటి నిర్మాణం కాదు'' అని పేర్కొన్నారు.

విస్తృతంగా విజయవంతమైన హనీక్రిస్ప్ ఆపిల్‌ను రూపొందించింది ఆయన, ఆయన సహచరులే. కొన్నేళ్ల కిందట విడుదల చేసిన ఈ ఆపిల్.. రసం ఊరుతూనే కరకరలాడే ఆపిల్‌గా బాగా ప్రజాదరణ పొందింది. నిజానికి వీరు రూపొందించిన హనీక్రిస్ప్ ఆపిల్ పసుపు, ఎరుపు చారలతో అందంగా ఉంటుంది.

ఆపిల్

ఫొటో సోర్స్, Getty Images

రెడ్ డెలీషియస్ రకానికి గల చెడ్డ పేరు నుంచి బయటపడటానికి తయారు చేసిన ఆపిల్స్‌లో కూడా.. ఎరుపు రంగు తీసుకురావాలన్న తీవ్ర కాంక్ష కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు మరింత ఎక్కువగా ఎరుపు రంగులో ఉండే జన్యుపరివర్త గల హనీక్రిస్ప్ ఆపిల్‌ రకాలను చాలా మంది తీసుకొచ్చారు. ''మార్కెట్‌లో ఉన్న ప్రతి ఒక్క ఆపిల్ రకం విషయంలో ఇదే జరుగుతుంది'' అంటారు బెడ్‌ఫోర్డ్. ''ఆపిల్.. మనం కోరుకున్న రంగు, రూపంలో ఉండాలన్న మన ప్రగాఢ వాంఛ స్వభావం ఇది... మనిషి తన సొంత ఎంపిక చేసుకుంటున్నప్పటి నుంచీ ఆపిల్స్‌ను మరింత ఎరుపు రంగులో మారుస్తూనే ఉన్నారు'' అని ఆయన వ్యాఖ్యానించారు.

ఎక్కువ ఎరుపు రంగులో ఉండే ఆపిల్స్.. పసుపు రంగు ఆపిల్స్ కన్నా మెరుగుగా ఉండకపోవచ్చు - నిజానికి వాటికన్నా దారుణంగా కూడా ఉండొచ్చు - కానీ.. ''ఎరుపు ఆపిల్ అమ్ముడవుతుంది... అదే అసలు సమస్య'' అంటారు బెడ్‌ఫోర్డ్. భవిష్యత్ ఆపిల్స్‌లో దీనిని సరి చేయటానికి యూనివర్సిటీ ఆఫ్ మినిసొటా 'క్లబ్ మోడల్' (మిశ్రమ నమూనా) పేరుతో ఇతర ఆపిల్స్‌ను విడుదల చేసింది. ఈ విధానంలో.. ఆపిల్ సాగుదారులు అధిక ఎరుపు రంగు ఉండే పండు రకాన్ని ఎంచుకునే వీలు ఉండదు.

అడవి ఆపిల్ రకాల్లో సాధ్యంకాగల అనేక రంగులను చూసినపుడు.. ఎక్కువ ఎరుపు రంగు కోసం వెంపర్లాటలో అసలైన రుచితో అనుబంధం తెగిపోవటం వల్ల తలెత్తిన ప్రమాదాన్ని గుర్తించినపుడు - ఆపిల్ ప్రియులకు మంచి రోజులు రావాలనే ఆశ పుడుతుంది. ఎరుపు రంగు కోసం పడే తపనను.. ఆపిల్ నిజమైన చిత్రమైన స్వభావం అసలు జయిస్తుందా? అది కఠోర యుద్ధమే అవుతుందని చరిత్ర చెప్తోంది.

కానీ అలా జరుగుతుందని మనమందరం అందమైన కలగనొచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)