మహిళల్లో హార్మోన్లు ఎందుకు గతి తప్పుతాయి, ఇది మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందా?

హార్మోన్ల అసమతుల్యం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఆలమూరు సౌమ్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సరితకు పీరియడ్స్ సరిగ్గా రావట్లేదు. బ్లీడింగ్ మొదలైతే 15-20 రోజులైనా ఆగదు. దానితో పాటు, పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి. బ్లీడింగ్ తగ్గేవరకు ఆ నొప్పి అలాగే ఉంటుంది.

మరొకసారి, రెండు నెలలు దాటిన తర్వాత పీరియడ్స్ వస్తాయి. ఎన్ని నెలలైనా ఈ సమస్య తగ్గకపోవడంతో ఆమె డాక్టర్ దగ్గరకు వెళ్లారు.

35 ఏళ్ల సరితకు హార్మోన్ల అసమతుల్యం ఉందని, అందుకు హార్మోనల్ మెడిసిన్ వాడాలని డాక్టర్ సూచించారు. 

38 ఏళ్ల శిరీషకు ఊరికే చికాకు, కోపం, నిద్రలేమి, అలసట, దీని వల్ల ఇంట్లో, బయట గొడవలు.

మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. డిప్రెషన్‌కు లోనయ్యారు. సైకియాట్రిస్ట్ దగ్గర చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

దీనంతటికీ కారణం హార్మోన్ల అసమతుల్యమని పరీక్షలలో తేలింది. 

భారతదేశంలో ప్రతి పది మంది మహిళలలో ఒకరు హార్మోన్ల అసమతుల్యత అనే సమస్యను ఎదుర్కొంటారని నిపుణులు చెబుతున్నారు.

హార్మోన్లు గతి తప్పడం అనే సమస్య ఏ వయసులోనైనా రావచ్చు. యుక్తవయసుకు వచ్చిన దగ్గర నుంచి, గర్భధారణ, కాన్పు, పెరి మెనోపాజ్, మెనోపాజ్.. ఇలా ఏ దశలోనైనా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడవచ్చు.

హార్మోన్లు అంటే ఏమిటి? ఇవి ఏం చేస్తాయి?

హార్మోన్లు అనేవి ఒక రకమైన రసాయనాలు. మన శరీరంలో వివిధ రకాల గ్రంథులు (glands) ఉంటాయి. ఈ గ్రంథులన్నిటినీ కలిపి ఎండోక్రైన్ వ్యవస్థ అంటారు.

ఎండోక్రైన్ గ్రంథులు హార్మోన్లను ఉత్పత్తి చేసి, రక్తం ద్వారా శరీరంలోని వివిధ భాగాలకు తరలిస్తాయి. అవయవాల పని తీరును సమన్వయపరిచే బాధ్యత హార్మోన్లదే.

శరీరంలోని అంతర్గత జీవక్రియ, శక్తి స్థాయి, పునరుత్పత్తి, ఎదుగుదల, గాయాలు, ఒత్తిడి, చుట్టూ ఉన్న వాతావరణానికి స్పందించే గుణం మొదలైనవాటిని హార్మోన్ల ద్వారా నియంత్రించి, సమన్వయం చేస్తుందీ ఎండోక్రైన్ వ్యవస్థ.

హార్మోన్లలో హెచ్చుతగ్గులు రావడాన్నే హార్మోన్ల అసమతుల్యత అంటారు. ఇది శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.

ఒత్తిడి, బయట వాతావరణం, దీర్ఘకాల వ్యాధులు, జన్యు మార్పులు, కొన్ని రకాల మందులు, జీవన శైలిలో మార్పులు, అలెర్జీలు, మద్యపానం, ధూమపానం ఇలా పలు కారణాల వల్ల హార్మోన్లలో హెచ్చుతగ్గులు రావచ్చు.

హార్మోన్ల అసమతుల్యం

ఫొటో సోర్స్, Getty Images

లక్షణాలు ఎలా ఉంటాయి?

శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడితే కింది లక్షణాలు కనిపించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

  • అలసట, ఏకాగ్రత కుదరకపోవడం
  • విపరీతంగా చెమటలు పట్టడం
  • వేగంగా బరువు పెరగడం లేదా తగ్గడం
  • మొహంపై మొటిమలు
  • మానసిక ఆందోళన, డిప్రెషన్,
  • సంతానలేమి,
  • పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, అధిక రక్తస్రావం
  • జుట్టు ఊడిపోవడం లేదా అవాంఛిత రోమాలు
  • గుండె కొట్టుకునే వేగంలో మార్పు
  • రక్తపోటు, మధుమేహం
  • సెక్స్ పట్ల విముఖత

ఈ లక్షణాలను గుర్తించిన వెంటనే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. 

హార్మోన్ల అసమతుల్యతను ఎలా గుర్తిస్తారు?

లక్షణాలు, రోగి వైద్య చరిత్ర బట్టి డాక్టర్లు హార్మోన్ల అసమతుల్యాన్ని గుర్తిస్తారు. కొన్నిసార్లు క్లినికల్ పరీక్షలు నిర్వహించవలసి ఉంటుంది.

స్కానింగ్, రక్తపరీక్ష ద్వారా హార్మోన్లలో వచ్చే మార్పులను తెలుసుకోగలుగుతారు.

హార్మోన్ల సమతుల్యాన్ని సాధించడానికి ఆహార పద్ధతులలో మార్పు, జీవన శైలిని మెరుగుపరచుకోవడం, మందులు మొదలైనవాటిని డాక్టర్లు సూచిస్తారు. 

ఈ సమస్య వల్ల మహిళలు ఎదుర్కునే కొన్ని ముఖ్యమైన సమస్యలేమిటో చూద్దాం.

హార్మోన్ల అసమతుల్యం

ఫొటో సోర్స్, Getty Images

1. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ డిజార్డర్ (PCOD)

పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ డిజార్డర్ (PCOD) లేదా పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోం (PCOS) అనేది సంతానోత్పత్తి వయసులో ఉన్న మహిళలలో అత్యంత సాధారణంగా కనిపించే హార్మోన్ రుగ్మత. ఇది మహిళల అండాశయం పనితీరును ప్రభావితం చేస్తుంది. 

PCOD లో ప్రధానంగా మూడు లక్షణాలు కనిపిస్తాయని నేషనల్ హెల్త్ సర్వీస్, బ్రిటన్ సూచిస్తోంది. 

పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం - అంటే అండాశయంలో అండాలు క్రమంగా విడుదల కావట్లేదని అర్థం.

అధిక ఆండ్రోజెన్స్ - ఆండ్రోజెన్స్ అంటే పురుష హార్మోన్లు. మహిళలలో ఇవి చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. ఆండ్రోజెన్ స్థాయిలు ఎక్కువైతే ముఖం, శరీరంలోని ఇతర భాగాలపై అవాంఛిత రోమాలు పెరుగుతాయి. 

పాలిసిస్టిక్ ఓవరీస్ - అండాశయాలు పెద్దవిగా సాగుతాయి. ద్రవాలతో నిండిన సంచులు ఏర్పడతాయి. వీటినే నీటి తిత్తులు లేదా ఫోలికల్స్ అంటారు. అండాల చుట్టూ ఈ ఫోలికల్స్ ఏర్పడతాయి.

పై వాటిలో ఏ రెండు లక్షణాలు కనిపించినా PCOD ఉన్నట్టు వైద్యులు నిర్థరిస్తారు.

చాలామందికి PCOD లక్షణాలు 20ల వయసులోనే బయటపడతాయని, దీని వలన గర్భధారణలో సమస్యలు తలెత్తవచ్చని, కొంతమందిలో లక్షణాలు తొందరగా బయటపడకపోవచ్చని ఎన్‌హెచ్ఎస్ చెబుతోంది.

PCOD వలన పీరియడ్స్ సరిగా రాకపోవడం లేదా ఆగిపోవడం, అధిక రక్తస్రావం, గర్భధారణ సమస్యలు, ముఖం, ఛాతి, పిరుదులపై అవాంచిత రోమాలు, బరువు పెరగడం, జుట్టు ఊడిపోవడం, ముఖం జిడ్డుబారడం, మొటిమలు, వయసు పెరిగేకొద్దీ టైప్ 2 డయాబెటిస్, అధిక కొవ్వు సమస్యలు ఉత్పన్నమవుతాయి. 

PCOD రావడానికి కారణాలను స్పష్టంగా చెప్పలేమని, అసాధారణ స్థాయిలో హార్మోన్లు పెరిగితే ఈ సమస్య ఉత్పన్నమవుతుందని ఎన్‌హెచ్ఎస్ చెబుతోంది.

కొన్నిసార్లు వంశపారంపర్యంగా రావచ్చని కూడా అంటోంది. 

కొన్ని సందర్భాలలో శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ పట్ల వ్యతిరేకత ఏర్పడుతుంది. దీన్ని అధిగమించడానికి ఇన్సులిన్ హార్మోన్ స్థాయి మరింత పెరుగుతుంది. అధిక ఇన్సులిన్ పురుష హార్మోన్లు ఎక్కువగా విడుదల కావడానికి కారణమవుతుంది. 

ఇన్సులిన్ హార్మోన్ల పెరుగుదల టెస్టోస్టీరాన్ లాంటి హార్మోన్ల చురుకుదనం, అధిక ఉత్పత్తికి దారితీస్తుంది. అధిక బరువు కూడా ఇన్సులిన్ పెరగడానికి కారణం కావచ్చు. 

PCOD కి చికిత్స లేదని, లక్షణాలు తగ్గించేందుకు వైద్యులు మందులు సూచిస్తారని ఎన్‌హెచ్ఎస్ చెబుతోంది.

బరువు తగ్గడం, ఆహార పద్ధతులు మార్చుకోవడం, జీవన శైలిలో మార్పుల ద్వారా కూడా లక్షణాలను తగ్గించుకోవచ్చు.

పీరియడ్స్ సమస్యలు, అవాంఛిత రోమాలు, సంతానలేమి లాంటి సమస్యలకు మందులు ఉన్నాయి.

సంతానలేమికి మందులు పనిచేయకపోతే, లాపరోస్కోపిక్ ఓవరియన్ డ్రిల్లింగ్ (LOD) అనే చిన్న సర్జరీని వైద్యులు సూచించవచ్చు. ఇందులో భాగంగా లేజర్ చికిత్స ద్వారా అండాశయాలలో అవాంఛిత టిష్యూలను తొలగిస్తారని, చికిత్స తరువాత చాలామంది మహిళలలో గర్భధారణ సామర్థ్యం పెరుగుతుందని ఎన్‌హెచ్ఎస్ చెబుతోంది.

హార్మోన్ల అసమతుల్యం

ఫొటో సోర్స్, Getty Images

2. ప్రీమెన్‌స్ట్రువల్ డిస్పోరిక్ డిజార్డర్ (PMDD)

నెల నెల పీరియడ్స్ వచ్చే ముందు మహిళలలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. దాన్ని ప్రీమెన్‌స్ట్రువల్ సిండ్రోం (పీఎంఎస్) అంటారు.

మూడ్స్ అటూ ఇటూ కావడం, ఆందోళన, చిరాకు, అలసట, నిద్ర పట్టకపోవడం, కడుపు ఉబ్బరం, పొత్తి కడుపులో నొప్పి, రొమ్ములు సలపడం, తలనొప్పి మొదలైన లక్షణాలు కనిపించవచ్చు. అయితే, ప్రతి నెల ఒకే రకమైన లక్షణాలు కనిపించకపోవచ్చు.

కొన్నిసార్లు లక్షణాలు తీవ్రంగా ఉండవచ్చు. అలాంటప్పుడు, హార్మోనల్ మెడిసిన్, యాంటీ డిప్రెసంట్స్ లాంటి చికిత్సలను వైద్యులు సూచిస్తారని ఎన్‌హెచ్ఎస్ చెబుతోంది.

పీఎంఎస్ ఎందుకు వస్తుందన్న దానికి స్పష్టమైన సమాధానం లేదని, పీరియడ్స్ సమయంలో హార్మోన్ స్థాయిలలో వచ్చే మార్పులు ఇందుకు కారణం కావచ్చని ఎన్‌హెచ్ఎస్ సూచిస్తోంది. 

అయితే, కొద్దిమంది మహిళలలో పీఎంఎస్ తీవ్ర స్థాయికి చేరవచ్చు. అప్పుడు దాని ప్రీమెన్‌స్ట్రువల్ డిస్పోరిక్ డిజార్డర్ (PMDD) అంటారు.

PMDD లక్షణాలు పీఎంఎస్ లక్షణాల కన్నా చాలా తీవ్రంగా ఉంటాయి. రోజువారీ జీవితంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపించవచ్చు. 

  • తిమ్మిర్లు, తలనొప్పి, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు వంటి శారీరక బాధలు 
  • అదే పనిగా తినడం, నిద్ర పట్టకపోవడం లాంటి ప్రవర్తనకు సంబంధించిన సమస్యలు
  • ఆందోళన, కంగారు, కోపం, డిప్రెషన్, కొన్నిసార్లు ఆత్మహత్య ఆలోచనలు రావచ్చని ఎన్‌హెచ్ఎస్ చెబుతోంది. 

పైవాటిలో ఎలాంటి లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తోంది. 

ప్రీమెన్‌స్ట్రువల్ డిస్పోరిక్ డిజార్డర్‌ను ఆరోగ్య సమస్యగా డబ్ల్యూహెచ్ఓ గుర్తించింది.

PMDDని తేలికగా తీసుకోకూడదని, లక్షణాలను గుర్తించి వెంటనే చికిత్స అందించాలని నిపుణులు చెబుతున్నారు. 

మెనోపాజ్

ఫొటో సోర్స్, Getty Images

3. మెనోపాజ్

మహిళలకు మధ్య వయసు దాటిన తరువాత పీరియడ్స్ పూర్తిగా ఆగిపోతాయి. దీన్నే మెనోపాజ్ అంటారు.

45 నుంచి 55 సంవత్సరాల మధ్యలో మెనోపాజ్ ఎప్పుడైనా రావచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చెబుతోంది.

అండాశయంలో అండాల ఉత్పత్తి నిలిచిపోవడం, రక్తప్రసరణలో ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గిపోవడం వలన మెనోపాజ్ వస్తుందని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. 

మెనోపాజ్ తరువాత గర్భం ధరించే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. మెనోపాజ్ దశ క్రమంగా వస్తుంది. ముందుగా పీరియడ్స్ సైకిల్‌లో మార్పులు సహా కొన్ని లక్షణాలతో పెరి మెనోపాజ్ దశ ప్రారంభమవుతుంది. తరువాత మెనోపాజ్ దశకు చేరుకుంటారు.

పెరి మెనోపాజ్ దశ కొన్ని సంవత్సరాలు కొనసాగవచ్చు. ఇది స్త్రీలను మానసికంగా, శారీరకంగా, భావోద్వేగాలు, సామాజిక అంశాల పరంగా ప్రభావితం చేయవచ్చని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది.

మెనోపాజ్ అనేది జబ్బు కాదని, సహజమైన ప్రక్రియ అని, అండాశయం నుంచి అండాలు విడుదల కాకపోవడం, హార్మోన్ల సమతుల్యత దెబ్బ తినడం వలన మెనోపాజ్ వస్తుందని డాక్టర్ రొంపిచర్ల భార్గవి చెప్పారు. 

"మన దేశంలో ఏటా సుమారు కోటి మంది మెనోపాజ్ దశకు చేరుకుంటున్నారు. ఈస్ట్రోజెన్ అనేది స్త్రీ హార్మోన్. ఇది తగ్గి పోవడం వలన స్త్రీలలో కొన్ని శారీరకమైన, మానసికమైన మార్పులు వస్తాయి. మెనోపాజ్ లక్షణాలకి ఇవే కారణం. సుమారు 12 నెలల పాటు పీరియడ్స్ ఆగిపోతే మెనోపాజ్ వచ్చినట్టు భావించాలి" అని డాక్టర్ భార్గవి వివరించారు. 

మెనోపాజ్ దశలో అధిక రక్తస్రావం లేదా మరీ తక్కువ రక్తస్రావం, అలసట, ఒళ్లంతా వేడి ఆవిర్లు రావడం, చెమటలు కక్కడం, గుండెదడ, నిద్ర పట్టక పోవడం, మానసిక ఆందోళన, చిరాకు, కోపం, డిప్రషన్, కారణం లేకుండా ఏడుపు రావడం, మరికొన్ని శారీరక సమస్యలు కనిపిస్తాయని ఆమె చెప్పారు. 

ఆహార నియమాలు పాటించడం, క్రమం తప్పని వ్యాయామం, కెఫీన్, స్మోకింగ్, ఆల్కహాల్, మసాలాలకు దూరంగా ఉండడం మొదలైనవి పాటిస్తే మెనోపాజ్ లక్షణాల నుంచి ఉపశమనం లభిస్తుంది. 

మెనోపాజ్ లక్షణాలైన హాట్ ఫ్లషెస్, నైట్ స్వెట్స్ అధికంగా ఉండే వారికి, చిన్న వయసులో మెనోపాజ్ వచ్చిన వాళ్లకి, చిన్న వయసులో గర్భసంచి తొలగించిన వారికి మందులు సూచించవచ్చని డాక్టర్ భార్గవి చెప్పారు. 

హార్మోన్ రిప్లేస్‌మెంట్ థెరపీ

ఫొటో సోర్స్, Getty Images

హార్మోన్ రిప్లేస్‌మెంట్ థెరపీ అంటే ఏంటి?

మెనోపాజ్ లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు హార్మోన్ రిప్లేస్‌మెంట్ థెరపీ (HRT)ని వైద్యులు సూచిస్తారు. శరీరంలో తక్కువ స్థాయిలో ఉన్న హార్మోన్లను భర్తీ చేయడానికి ఈ చికిత్సను అందిస్తారని ఎన్‌హెచ్ఎస్ చెబుతోంది. 

వేడి ఆవిర్లు, రాత్రిపూట చెమటలు, మూడ్ స్వింగ్, యోని పొడిబారడం సెక్స్‌పై ఆసక్తి లేకపోవడం మొదలైన లక్షణాలను HRT తగ్గిస్తుంది. 

అయితే, కొన్ని రకాల మందులు బ్రెస్ట్ క్యాన్సర్‌కు దారి తీయవచ్చని ఎన్‌హెచ్ఎస్ హెచ్చరిస్తోంది.

బ్రెస్ట్ క్యాన్సర్, ఓవరియన్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్‌లకు చికిత్స చేయించుకున్నవారు, రక్తనాళాలలో గడ్డలు, హై బీపీ, కాలేయ సమస్యలు ఉన్నవారు, గర్భిణులు తీసుకోకపోవడం మంచిదని ఎన్‌హెచ్ఎస్ హెచ్చరిస్తోంది. 

"మెనోపాజ్ లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు, చిన్న వయసులో మెనోపాజ్ వచ్చినప్పుడు, ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరోన్ నోటిమాత్రలను తక్కువ మోతాదులో సాధ్యమయినంత తక్కువ కాలం వాడడం మంచిది. ఎక్కువ కాలం వాడితే రక్త నాళాలకు, బ్రెస్ట్, గుండె, మెదళ్లకు సమస్యలు ఏర్పడతాయి. లివర్ మీదా ప్రభావం పడుతుంది.అందుకే హార్మోన్లను తక్కువకాలం అంటే ఒక ఆరు నెలలో, సంవత్సరమో మాత్రమే వాడడం మంచిది" అని డాక్టర్ భార్గవి చెప్పారు.

హార్మోన్ రిప్లేస్‌మెంట్ థెరపీ

ఫొటో సోర్స్, Getty Images

'హార్మోన్ల అసమతుల్యత జెనిటిక్ కావచ్చు'

హార్మోన్ల అసమతుల్యం వలన సంతానలేమి, పీరియడ్స్ రాకపోవడం, ఉబ్బకాయం ఎక్కువమంది మహిళలలో కనిపించే సమస్యలని డాక్టర్ శైలజ చెబుతున్నారు.

"హార్మోన్ల అసమతుల్యం జెనిటిక్ కావచ్చు. కుటుంబంలో ఈ సమస్య ఉండవచ్చు. మెనోపాజ్‌కు చాలా ముందే అండాశయంలో హార్మోన్లు తగ్గిపోవడం అనేది జన్యుపరంగా తలెత్తే సమస్య కావచ్చు. జీవనశైలిలో మార్పులు, ప్రాసెస్ చేసిన ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలు తినడం, ఊబకాయం ఇవన్నీ కూడా హార్మోన్ల అసమతుల్యానికి కారణాలు కావచ్చు" అని డాక్టర్ శైలజ వివరించారు. 

సంతానోత్పత్తి వయసులో పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, ఆగకుండా రోజుల తరబడి బ్లీడింగ్ అవ్వడం మొదలైనవాటికి చికిత్సగా కాంట్రాసెప్టివ్ పిల్స్ ఇస్తారని ఆమె చెప్పారు. 

"ఈ పిల్స్‌ను ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ స్థాయిలను సరి చేయడానికి ఇస్తాం. వీటిని అధికంగా ఆరు నెలలు లేదా ఒక ఏడాది పాటు ఇస్తాం. వీటిని ఎక్కువ కాలం వాడినా సమస్యలే. బీపీ రావడం, శరీర భాగాలలో బ్లడ్ క్లాట్ కావడం, ఊబకాయం మొదలైన సమస్యలు తలెత్తుతాయి" అని డాక్టర్ శైలజ చెప్పారు. 

ఏ వయసులోనైనా హార్మోన్ల అసమతుల్యం రావచ్చని ఆమె చెబుతున్నారు. 

"యుక్తవయసులో అంటే ప్యూబర్టీ దశలో హార్మోన్ల ఎదుగుదల, పనితీరు సరిగా లేకపోవడం వలన అధిక రక్రస్రావం సమస్య తలెత్తవచ్చు. 30-40 ఏళ్ల వయసులో అసలైన హార్మోన్ల అసమతుల్యం వస్తుంది. మెనోపాజ్ దశలో శరీరంలో రకరకాల మార్పులు చోటుచేసుకుంటాయి. వాటికి అడ్జస్ట్ అవుతున్నప్పుడు అధిక రక్రస్రావం ఉండవచ్చు."

"నేటి తరంలో ఆడపిల్లలు చాలా తొందరగా, చిన్న వయసులోనే మెచ్యూర్ అవుతున్నారు. దానికి కారణం వారిలో ఈస్ట్రోజెన్ స్థాయిలు తొందరగా పెరగడమే. వారు తీసుకునే ఆహారం ద్వారా ఇవి శరీరంలోకి చేరుతున్నాయి. పాలు, మాంసాహారం, జంక్ ఫుడ్ మొదలైన వాటి ద్వారా ఈస్ట్రోజెన్ చేరుతుంది. అధిక పాల దిగుబడి కోసం గేదెలకు, ఆవులకు హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తారు. అలాగే చికెన్, మటన్ మొదలైనవాటికి కూడా హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి తొందరగా ఎదిగేలా చేస్తారు. జంక్ ఫుడ్‌లో ఈస్ట్రోజెన్ లాంటి పదార్థాలు ఉంటాయి. వీటన్నిటి ద్వారా ఇవి శరీరంలోకి చేరుతాయి. అందుకే పిల్లలకి తొందరగా ప్యూబర్టీ వస్తోంది" అని డాక్టర్ శైలజ వివరించారు.

మానసిక ఆరోగ్య సమస్యలు

కాన్పు తరువాత వచ్చే హార్మోన్ మార్పులు, మెనోపాజ్ దశలో వచ్చే మార్పుల వలన డిప్రెషన్ ఎక్కువగా వస్తుందని ఆమె చెబుతున్నారు. 

"సంతానోత్పత్తి వయసులో హార్మోన్ల అసమతుల్యం వలన డిప్రెషన్‌కు గురయ్యే అవకాశాలు తక్కువ. కానీ, మెనోపాజ్ దశలో ఎక్కువమంది మహిళలు మానసిక సమస్యలు ఎదుర్కొంటారు. శరీరంలో వచ్చే మార్పులు మెదడుపై పెద్ద ప్రభావం చూపిస్తాయి. అలాగే, కాన్పు తరువాత పోస్ట్‌నాటల్ దశలో తల్లులకు హార్మోన్ ప్రభావాలు తీవ్రతరం కావచ్చు" అని డాక్టర్ శైలజ చెప్పారు. 

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)