Rokitansky Syndrome: యోని లోపలి భాగాలు, గర్భాశయం లేకుండా పిల్లలు పుట్టే అవకాశముందా

రొకిటాన్స్‌కీ సిండ్రోమ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ప్రిసిల్లా కర్వాలో
    • హోదా, బీబీసీ ముండో

పదమూడేళ్ల వయసులో మోడల్ కీసా నాసిమెంటో శరీరం ఆ వయసు అమ్మాయిల కంటే కాస్త మెరుగ్గా కనిపించేది. కానీ, ఆమెకు పీరియడ్స్ మొదలు కాలేదు అప్పటికి.

‘‘మా అమ్మకు కూడా పీరియడ్స్ కాస్త ఆలస్యంగా మొదలయ్యాయి. దీంతో అంతా సవ్యంగానే ఉందని అనుకొనేవాళ్లం. కొంత సమయం వేచిచూడాలని మేం అనుకున్నాం’’అని కీసా చెప్పారు.

15ఏళ్లు వచ్చినప్పటికీ ఆమెకు పీరియడ్స్ మొదలు కాలేదు. దీంతో ఆమె వైద్యులను సంప్రదించారు. అయితే, ఇంకొన్నాళ్లు చూడాలని వైద్యులు ఆమెకు సూచించారు.

కానీ, 16ఏళ్ల వయసులో కొన్ని పరీక్షలు చేయించుకోవాలని గైనకాలజిస్టు ఆమెకు సూచించారు. అయితే, కోవిడ్-19 వ్యాప్తి నడుమ ఆమె ఆ పరీక్షలు చేయించుకోలేకపోయారు.

మొత్తంగా 17ఏళ్ల వయసులో ఆమె బ్లడ్ కౌంట్స్, ట్రాన్స్‌వాజినల్ అల్ట్రాసౌండ్, ఇతర గైనకాలజికల్ టెస్టులు చేయించుకున్నారు. అయితే, ఆమె పరీక్ష రిపోర్టులు చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అసలు ఆమెకు గర్భాశయం, యోని లోపలి మార్గం లేనేలేవు.

ఆమె ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయ్యింది.

కీసా నాసిమెంటో

ఫొటో సోర్స్, Archivo personal

ఫొటో క్యాప్షన్, కీసా నాసిమెంటో

ఏమిటీ అరుదైన వ్యాధి?

ఆ తర్వాత మరికొన్ని పరీక్షలు, వైద్యులతో మాట్లాడిన తర్వాత కీసా జీవితం పూర్తిగా తలకిందులైంది.

ఆమె రొకిటాన్స్‌కీ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధరించారు. ఈ రుగ్మతతో పుట్టే పిల్లలకు గర్భాశయం, యోని లోపలి భాగాలు పూర్తిగా అభివృద్ధి కావు.

‘‘వైద్యురాలు ఆ మాట చెప్పినప్పుడు, నేను షాక్‌కు గురయ్యాను. అలాంటివి ఎవరూ ఊహించరు. నేను బాత్‌రూమ్‌లోకి వెళ్లి గట్టిగా ఏడ్చేశాను. ఆ తర్వాత కళ్లు తుడుచుకొని మళ్లీ అమ్మ దగ్గరకు వచ్చాను’’అని నాటి ఘటనను ఆమె గుర్తు చేసుకున్నారు.

ఇంటికి వచ్చేటప్పుడు కీసాను ఎన్నో ప్రశ్నలు వెంటాడుతూ ఉండేవి. దీంతో ఆమె మరింత ఆందోళనకు గురయ్యేవారు. ‘‘అసలు అంతా వైద్య పరిభాషలో చెప్పేవారు. ఒక టీనేజర్‌కు అవి ఏం అర్థం అవుతాయి’’అని ఆమె అన్నారు. ఆ సమయంలో యాంక్సైటీతో ఆమె బాధపడ్డారు.

రొకిటాన్స్‌కీ సిండ్రోమ్

ఫొటో సోర్స్, Getty Images

రొకిటాన్స్‌కీ సిండ్రోమ్ అంటే?

శిశువు కడుపులో ఉన్నప్పుడు కొన్ని లోపాల వల్ల గర్భాశయం, యోని లోపలి భాగాలు అభివృద్ధి కావు.

ఈ రుగ్మత శిశువు పిండం దశలో ఉన్నప్పుడే మొదలవుతాయి. అంటే పిండం ఆరు వారాల దశలో ఉన్నప్పుడే ఈ లక్షణాలు ఉంటాయి.

‘‘ఈ రుగ్మత వల్ల అంతర్గత అవయవాలు కొన్నిసార్లు భిన్నంగా అభివృద్ధి చెందుతాయి. సాధారణంగా అమ్మాయిల్లో అయితే, రుతుచక్రం మొదలుకాదు. దీంతో వారు ముందుగా వైద్యులను ఆశ్రయిస్తుంటారు’’అని బ్రెజిల్‌లోని యూనివర్సిడాడ్ పాజిటివో ప్రొఫెసర్, గైనకాలజిస్టు నటాలియా పియోవనీ చెప్పారు.

గర్భాశయానికి చుట్టూఉండే కణజాలం పూర్తిగా అభివృద్ధి కాకపోవడంతో అసలు రుతుచక్రమే మొదలుకాదు. సాధారణంగా తొమ్మిది నుంచి 13ఏళ్ల వయసులో అమ్మాయిలకు పీరియడ్స్ మొదలవుతాయి. కానీ, ఈ సిండ్రోమ్ వచ్చిన బాలికలను మూడు వర్గాలుగా విభజించొచ్చు. దీనిలో టైప్‌-1 మొదటిది. మొత్తంగా 70 శాతం కేసులు ఇవే ఉంటాయి. వీరిలో ప్రత్యుత్పత్తి వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి కాదు.

ఇక టైప్-2 చాలా అరుదుగా వస్తుంటుంది. దీనిలో అండాశయ, కిడ్నీ, ఎముకలు.. ఇలా ఏదో ఒక సమస్య కనిపిస్తుంది.

టైప్-3 అనేది మరింత తీవ్రంగా ఉంటుంది. ఇది చాలా అరుదు. దీనిలో ఒకేసారి రెండు, మూడు సమస్యలు కనిపిస్తాయి.

సాధారణంగా రుతుచక్రం మొదలు కాకపోవడం లేదా సెక్స్ చేసేటప్పుడు విపరీతమైన నొప్పి రావడం లాంటి సమస్యల వల్ల ఈ వ్యాధి బయటపడుతుంది.

అయితే, యోని బయటి భాగాలు చూడటానికి సవ్యంగానే కనిపిస్తాయి. దీంతో తొలి దశల్లో ఈ వ్యాధిని నిర్ధారించడం చాలా కష్టం. వరుస వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాతే, పరిస్థితి ఏమిటో వైద్యులకు అవగాహన వస్తుంది.

‘‘మొదట పెల్విక్ ఎగ్జామ్, అల్ట్రాసౌండ్ లాంటి పరీక్షలు నిర్వహించుకొని నివేదికలు తీసుకురావాలని చెబుతాం. ఒక్కోసారి జన్యు పరీక్షలు కూడా అవసరం అవుతాయి’’అని ఫెడరల్ యూనివర్సిటీ ఆఫ్ సవ్‌పాలోకి చెందిన క్లాడియా టకనో వివరించారు.

రొకిటాన్స్‌కీ సిండ్రోమ్

ఫొటో సోర్స్, Archivo personal

ఫొటో క్యాప్షన్, క్లాడియా టకనో

దీనికి చికిత్స ఉందా?

రొకిటాన్స్‌కీ సిండ్రోమ్‌కు కొన్ని థెరపీలు, ఎక్సర్‌సైజ్‌లను వైద్యులు సూచిస్తుంటారు. వీటిలో డయాలేటర్ చికిత్స మొదటిది. యోని ద్వారం వెడల్పు చేయడానికి, సాధారణ పరిస్థితికి రావడానికి డయాలేటర్లు ఉపయోగపడతాయి.

‘‘వీరికి యోని పరిమాణం సాధారణంతో పోల్చితే మూడింట రెండొంతులు మాత్రమే ఉంటుంది. అందుకే సెక్స్ చేసేటప్పుడు విపరీతమైన నొప్పి వస్తుంటుంది. మొదట చిన్న డయాలేటర్లు, ఆ తర్వాత పెద్ద డయాలేటర్లతో ప్రయత్నించాలి’’అని హాస్పిటల్ మెనెఫీసెన్సియా పోర్చుగీస్‌కు చెందిన గైనకాలజిస్టు ప్రిసిలా మెడీనా చెప్పారు.

ఒకవేళ డయాలేటర్లతో ఎలాంటి ప్రభావం లేకపోతే, శస్త్రచికిత్సలు కూడా నిర్వహించొచ్చు. ముఖ్యంగా యోని లోపలి ద్వారాన్ని శస్త్రచికిత్స చేసి ఏర్పాటుచేశారు. దీని వల్ల సదరు యువతి నాలుగైదు రోజులు ఆసుపత్రిలోనే ఉండాల్సి ఉంటుంది. ఆ తర్వాత నాలుగైదు నెలలపాటు ఆమె సెక్స్‌లో పాల్గొనడానికి వీలు ఉండదు.

సదరు యువతి తల్లి అయ్యే అవకాశాలను నిర్ధరించేందుకు వరుస పరీక్షలు నిర్వహించాల్సి అవసరం ఉంటుంది.

వీడియో క్యాప్షన్, సంతానలేమికి దోశ పెనం, పిజ్జా బాక్స్ కూడా కారణం అవుతోందా?

అవగాహన లేమి...

కీసా తరహాలోనే 19ఏళ్ల దెబోరా మోరేస్‌కు కూడా రొకిటాన్స్‌కీ సిండ్రోమ్‌ ఉంది. 16ఏళ్ల వరకు ఆమెకు రుతుచక్రం మొదలుకాలేదు.

చాలా పరీక్షల తర్వాతే, ఆమెకు అండాశయంలేదని నిర్ధారణ అయ్యింది. అయితే, అసలు ఈ సిండ్రోమ్ అంటే ఏమిటో ఆమెకు ఎవరూ పూర్తిగా వివరించలేదు.

‘‘అసలు తప్పు ఎక్కడ జరిగిందో నాకు అర్థమయ్యేదికాదు. వైద్యులు కూడా నాకు సరిగా చెప్పేవారు కాదు’’అని ఆమె వివరించారు.

‘‘ఒకసారి ఆసుపత్రి నుంచి వచ్చాక, చాలా ఏడుపు వచ్చింది. ఈ విషయం గురించి ఎవరికీ చెప్పొద్దని వైద్యులు నాతో అన్నారు. దీంతో అసలు ఏమీ అర్థమయ్యేదికాదు’’అని ఆమె తెలిపారు.

వీడియో క్యాప్షన్, మొదటి కలయిక తర్వాత కన్నెపొరకు ఏమవుతుంది, అసలు కన్యత్వంతో దానికి లింకేంటి?

సరోగసీ..

ఈ వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత, బాధితులను తొలచివేసే తొలి ప్రశ్న... తాము సాధారణ పద్ధతుల్లో గర్భం ధరించగలమా?

తల్లి కాలేనని ఊహే చాలా బాధ అనిపించేదని కీసా చెప్పారు. మోరేస్ మాత్రం తను ఎలాగైనా తల్లి కావాలని భావించేవారు.

ఇది చాలా శ్రమతో కూడుకున్న పనని, అయితే, దీనికి కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.

సరోగసీ లేదా దత్తత మార్గాల ద్వారా వీరు తల్లి కావొచ్చని వైద్యులు చెబుతున్నారు. ‘‘మరోవైపు గర్భాశయ మార్పిడి చికిత్సతోనూ కొంతవరకు ఉపయోగం ఉండొచ్చు. అయితే, ఈ చికిత్స ఇంకా అధ్యయన దశలోనే ఉంది’’అని టకనో వివరించారు.

ప్రస్తుతం మోరేస్ ఆరోగ్యం కాస్త మెరుగుపడింది. అయితే, కీసా మాత్రం ఈ రుగ్మత తన మాతృత్వాన్ని తీసేసుకుందని ఆవేదన చెందుతున్నారు.

ఇదే వ్యాధితో బాధపడుతున్న మరికొంత మంది అమ్మాయిలను కలిసిన తర్వాత జీవితంపై కీసాలో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.

‘‘ఇలాంటి వ్యాధి బాధితుల గ్రూపుల్లో చేరి, వారితో మాట్లాడుతున్నప్పుడు.. అసలు నాలో ఏం జరుగుతోందో అర్థం చేసుకోవడానికి కొంతమంది ఉన్నారనే భావన కలుగుతుంది’’అని ఆమె చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)