మహిళల్లో ఆవేశం బాగా పెరిగిందంటున్న సర్వేలు...ఏంటి కారణం?

మహిళల్లో కోపం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, స్టెఫనీ హెగార్టీ
    • హోదా, బీబీసీ న్యూస్

గత పదేళ్లుగా మహిళల్లో కోపం క్రమంగా పెరుగుతూ వస్తోందని అమెరికా కన్సల్టింగ్, రీసెర్చ్ సంస్థ గాలప్ చేపట్టిన సర్వేలో వెల్లడైంది. ఇంతకీ మహిళల్లో కోపం పెరగడానికి కారణాలు ఏమిటి?

రెండేళ్ల క్రితం తాషా రెనీ కిచెన్‌లో పనిచేస్తూ ఆత్మవిమర్శ చేసుకున్నప్పుడు తన గుండెల్లో గూడు కట్టుకున్న కోపం గురించి ఆమెకు తెలిసింది. ఆమెకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది.

‘‘కోపం అనేది నాకు వెంటనే వచ్చేస్తోంది’’అని ఆమె చెప్పారు. అయితే, ఇదివరకు ఇలా జరిగేదికాదని ఆమె వివరించారు.

కోవిడ్-19 వ్యాప్తి నడుమ ‘‘ఇక చాలు’’ అనే పరిస్థితి ఆమెకు వచ్చింది. ఆ తర్వాత 20 నిమిషాలు తన ఇంట్లో అటూఇటూ తిరిగారు. తనకు కోపం తెప్పిస్తున్న అంశాలన్నీ ఒక జాబితాగా ఆమె రాసుకున్నారు.

అయితే, గట్టిగా అరవడంతో తనలో కొంత కోపం తగ్గినట్లు ఆమె గుర్తించారు.

హిప్నోథెరపిస్టు, లైఫ్ కోచ్‌గా పనిచేసే తాషా ఈ విషయంపై ప్రపంచంలోని భిన్న ప్రాంతాలకు చెందిన మహిళలతో జూమ్‌లో మాట్లాడుతున్నారు. తమకు ఎందుకు కోపం వస్తుంది? దీని వెనుక కారణలు ఏమిటి?అని ఆమె తెలుసుకుంటున్నారు.

వీడియో క్యాప్షన్, ఇంటా బయటా వారిపై ఉన్న ఒత్తిడే కారణమంటున్న నిపుణులు..

గాలప్ వరల్డ్ పోల్ సేకరించిన గత పదేళ్ల సమాచారాన్ని బీబీసీ విశ్లేషించింది. దీంతో మహిళల్లో కోపం స్థాయిలు క్రమంగా పెరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చింది.

ఏటా 150కిపైగా దేశాలకు చెందిన 1,20,000 మందిని గాలప్ సర్వే చేస్తుంది. ఆ ముందు రోజు తమలో ఎలాంటి భావోద్వేగాలు కనిపించాయో ఈ సర్వేలో అడుగుతారు.

కోపం, బాధ, ఒత్తిడి, ఆందోళన లాంటి నెగెటివ్ భావోద్వేగాలు పురుషులతో పోలిస్తే, మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది.

2012 నుంచి బాధ, ఆందోళన లాంటివి పురుషుల కంటే మహిళల్లోనే ఎక్కువ కనిపిస్తున్న బీబీసీ విశ్లేషణలో తేలింది. అయితే, ఇక్కడ పురుషుల్లోనూ కోపం, బాధ అనేవి క్రమంగా పెరుగుతున్నాయి. అయితే, ఆ స్థాయిలు మహిళల్లో కాస్త ఎక్కువ ఉన్నాయి.

కోపం

ముఖ్యంగా కోపం, ఒత్తిడిని స్థాయిలను పరిశీలించినప్పుడు మహిళల, పురుషుల మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంటోంది. 2012లో ఇటు పురుషులు, అటు మహిళలు తమలో కోపం, ఒత్తిడి ఒకేలా ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పుడు తొమ్మిదేళ్ల తర్వాత మహిళల్లో కోపం ఆరు శాతం ఎక్కువగా కనిపిస్తోంది. వీరిలో ఒత్తిడి కూడా పెరిగింది. కోవిడ్-19 వ్యాప్తి నడుమ ఈ కోపం పెరగడాన్ని చాలా మంది మహిళలు గుర్తించారు కూడా.

అయితే, ఈ డేటా తనకు ఆశ్చర్యంగా అనిపించడంలేదని అమెరికాకు చెందిన థెరపిస్టు సారా హార్మన్ చెప్పారు. 2021 మొదట్లో ఈ సమస్యలతో తన దగ్గర వచ్చే మహిళల సంఖ్య పెరిగిందని ఆమె వివరించారు. తమలో గూడుకట్టుకున్న కోపాన్ని బయటకు పంపేందుకు ఒక సమావేశంలో వీరంతా కలిసి ఒకసారి గట్టిగా అరిచారు.

‘‘నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పైగా నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా. ఏదైనా తప్పు జరిగితే కొంత విసుగు వచ్చేది. అలా అది ఎక్కువై కోపంగా మారేది’’అని ఆమె చెప్పారు.

ఏడాది తర్వాత కూడా వీరు తమ కోపాన్ని బయటకు పంపేందుకు మళ్లీ ఇలా గట్టిగా అరిచారు. ‘‘అది వైరల్ అయ్యింది. ఒక గ్రూపులో ఆ వీడియోను చూసిన ఒక జర్నలిస్టు నాకు ఫోన్ చేశారు. ఆ తర్వాత చాలా ప్రాంతాల నుంచి నాకు ఫోన్లు వచ్చాయి’’అని ఆమె వివరించారు.

చాలా మంది మహిళల్లో ఇలానే కోపం గూడుకట్టుకుని ఉంటుందని, దాన్ని బయటపెట్టే విధానాన్ని తాను చూపించానని సారా చెప్పారు.

ఆందోళన
బాధ

2020లో ఇంగ్లంలోనూ ఇలానే 5000 మందిపై ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిస్కల్ స్టడీస్ ఒక అధ్యయనం చేపట్టింది. దీంతో లాక్‌డౌన్ సమయంలో ఇంట్లోని పురుషులతో పోలిస్తే, మహిళలే ఎక్కువ ఇంటి పనులు చేయాల్సి వచ్చినట్లు తెలిసింది. దీని వల్ల ఉద్యోగం కోసం తాము కేటాయించే పని గంటలను తగ్గించాల్సి వచ్చేది. ఒక్కోసారి పురుషుల కంటే తామే ఎక్కువ పనిచేస్తున్నప్పటికీ వారు ఇంటి పనులను ఎక్కువగా చూసుకోవాల్సి వచ్చేది.

కొన్ని దేశాల్లో మహిళలు, పురుషుల మధ్య కోపంలో వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంటోంది.

ఉదాహరణకు కంబోడియాను తీసుకోండి. 2021లో ఇక్కడ వ్యత్యాసం 17 శాతం ఉంది. మరోవైపు భారత్, పాకిస్తాన్‌లలో ఈ వ్యత్యాసం 12 శాతం.

ఒత్తిడి
వీడియో క్యాప్షన్, 28 ఏళ్ల పాటు ఒదగని శరీరంతో పురుషుడిగా జీవించి, చివరకు మహిళగా మారిన రియా

ఈ దేశాల్లో చదువుకుంటున్న, ఉద్యోగం చేస్తున్న, ఆర్థికంగా స్వతంత్రంగా ఉంటున్న మహిళల సంఖ్య పెరగడమే దీనికి కారణమని సైకియార్టిస్టు డాక్టర్ లక్ష్మీ విజయ్‌కుమార్ చెప్పారు.

‘‘అదే సమయంలో ఇక్కడ పురుషాధిక్య సమాజం ఉందనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి’’అని ఆమె చెప్పారు.

‘‘చుట్టుపక్కల ఉండే పురుషాధిక్య సమాజం, తమ సాధికారత మధ్య వ్యత్యాసమే ఈ కోపానికి కారణం’’అని ఆమె వివరించారు.

ప్రతి శుక్రవారం సాయంత్రం భారత్‌లోని చెన్నైలో ఈ విషయం తనకు స్పష్టంగా కనిపిస్తుందని ఆమె చెప్పారు.

‘‘ఆ రోజు సాయంత్రం పురుషులు ప్రశాంతంగా టీ దుకాణం దగ్గర విశ్రాంతి తీసుకుంటూ కనిపిస్తారు. కానీ, మహిళలు మాత్రం బస్సు లేదా రైలు కోసం వేగంగా పరుగులు తీస్తుంటారు. ఇంటికి వెళ్లి ఏం వండాలా? అని వారు ఆలోచిస్తుంటారు. కొంతమంది మహిళలు అయితే, ఇంటికి వెళ్లే దారిలో అంటే ట్రైనులోనే కూరగాయలు కోయడం మొదలుపెడతారు’’అని ఆమె అన్నారు.

గతంలో తమలో కోపం గూడుకట్టుకుందని చెప్పేందుకు మహిళలు అంగీకరించేవారుకాదని ఆమె అన్నారు. కానీ, నేడు పరిస్థితి మారుతోందని ఆమె చెప్పారు. ‘‘నేడు మహిళలు తమ భావోద్వేగాలను మెరుగ్గా వ్యక్తం చేయగలుగుతున్నారు. దీంతో కోపం ఎక్కువగా కనిపిస్తోంది’’అని ఆమె వివరించారు.

కోవిడ్-19 మహమ్మారితో పనిచేసే విధానంలో వచ్చిన మార్పులు కూడా తాజా పరిస్థితికి కారణం కావొచ్చు. 2020కి ముందు కార్మిక శక్తిలో మహిళల పెరుగుదల నెమ్మదిగా ఉండేదని ఐరాస మహిళల విభాగం డేటా సైంటిస్టు జీనెట్ అజ్‌కోనా చెప్పారు. అయితే, 2020లో ఇది పూర్తిగా స్తంభించిపోయిందని చెప్పారు. ప్రస్తుత ఏడాదిలో 169 దేశాల్లోని కార్మిక విభాగాల్లోలో మహిళల వాటా 2019 కంటే తక్కువగా ఉంది.

వీడియో క్యాప్షన్, అబ్బాయిలా డ్రెస్ వేసుకుని అందరి దృష్టినీ ఆకర్షిస్తోన్న మంజీత్ కౌర్

పురోగతి ఇంతేనా?

బీబీసీ 100 విమెన్ పదో వార్షికోత్సవం సందర్భంగా.. 15 దేశాల్లో మహిళల పరిస్థితి గత పదేళ్లలో ఎలా మారిందో విశ్లేషించాలని మార్కెట్ రీసెర్చ్ కంపెనీ సవాంటా కోమ్‌రెస్‌ను బీబీసీ కోరింది.

  •  ఈ సర్వేలో పాల్గొన్న వారిలో సగం మంది గత పదేళ్లలో స్వతంత్రంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరిగిందని చెప్పారు.
  • అమెరికా, పాకిస్తాన్‌లలో సగం మంది మహిళలు తమ జీవిత భాగస్వాములతో తమ అనుమతి, తమ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడంపై చర్చించడం నేడు సులువైందని చెప్పారు.
  • చాలా దేశాల్లో మూడింట రెండొంతుల మంది సోషల్ మీడియాతో తమ జీవితంపై సానుకూల ప్రభావం పడిందని చెప్పారు. అయితే, అమెరికా, బ్రిటన్‌లలో ఇలా చెబుతున్న మహిళల వాటా 50 శాతం కంటే తక్కువే ఉంది.
  • మరోవైపు అమెరికాలోని 46 శాతం మంది మహిళలు గత పదేళ్లతో పోలిస్తే, నేడు అబార్షన్ చేయించుకోవడం కష్టం అవుతోందని వివరించారు.
వీడియో క్యాప్షన్, 21 ఏళ్లకే పంచాయితీ ఎన్నికల్లో గెలిచిన యువతి.. ఈ యంగెస్ట్ సర్పంచ్ లక్ష్యం ఏంటో తెలుసా?

మార్కెట్‌లో తేడా కనిపిస్తోంది..

‘‘మన మార్కెట్‌లలో జెండర్ తేడా స్పష్టంగా కనిపిస్తోంది’’అని అమెరికాకు చెందిన ఫెమినిస్టు రచయిత సొరయ చెమ్లీ చెప్పారు. ‘‘రేజ్ బికమ్స్ హెర్’’ పేరుతో 2019లో ఆమె ఒక పుస్తకం కూడా రాశారు.

ఆరోగ్య సంరక్షణ లాంటి మహిళలు ఎక్కువగా ఉండే రంగాల్లో కోవిడ్-19 కోతల ప్రభావం కనిపిస్తోందని ఆమె చెప్పారు.

‘‘ఇదొక వెట్టిచాకిరీ లాంటిది. పెద్దగా జీతం కూడా ఇవ్వరు. మనం వారితో మాట్లాడేటప్పుడు వీరిలో గూడుకట్టుకున్న కోపం కనిపిస్తుంది. అసలు అలసిపోకుండా పనిచేయాలని వీరి నుంచి కోరుకుంటారు. అసలు విశ్రాంతి అనేదే వీరికి ఇవ్వరు’’అని ఆమె అన్నారు.

అమెరికాలో కోవిడ్-19 వ్యాప్తి నడుమ మహిళలపై పడుతున్న భారం గురించి చాలా కథనాలు వచ్చాయి. అయితే, మహమ్మారి వ్యాప్తి వల్ల ఇక్కడి పురుషుల కంటే మహిళల్లోనే కోపం ఎక్కువ ఉన్నట్లు గాలప్ వరల్డ్ పోల్‌లో ఏమీ కనిపించలేదు.

‘‘అమెరికాలో మహిళలు తమ కోపాన్ని బయటకు చెప్పుకొనేందుకు సిగ్గుగా భావిస్తున్నారు’’అని సొరయ అన్నారు. ఇక్కడ కోపాన్ని ఒత్తిడి లేదా బాధ రూపంలో చూపిస్తుంటారని వివరించారు.

బహుశా అందుకే ఒత్తిడి, బాధలో పురుషుల కంటే ఇక్కడ మహిళల శాతం ఎక్కువగా కనిపిస్తోంది.

మరికొన్ని ప్రాంతాల్లోనూ మహిళలు ఇలాంటి అభిప్రాయాలనే వ్యక్తంచేశారు. బ్రెజిల్, ఉరుగ్వే, పెరూ, సైప్రస్, గ్రీస్‌లలోనూ పురుషుల కంటే మహిళల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటోందని వెల్లడించారు.

బ్రెజిల్‌లో ప్రతి 10 మందిలో ఆరుగురు తాము సర్వేకు ముందురోజు ఒత్తిడి ఎదుర్కొన్నట్లు చెప్పారు. అయితే, పురుషుల విషయంలో ఇది ప్రతి పది మందిలో నలుగురు మాత్రమే.

బాధ విషయంలోనూ బొలివియా, పెరూ, ఈక్వెడార్‌లలో ఈ తేడా కనిపిస్తోంది. ఇక్కడ పురుషుల కంటే మహిళల్లో బాధలో 15 శాతం వ్యత్యాసం ఎక్కువగా కనిపిస్తోంది.

వీడియో క్యాప్షన్, వయసు పైబడ్డాక శృంగారం‌ గురించి ఈ సెక్స్ హెల్త్ ఎడ్యుకేటర్ ఏమంటున్నారు

2012 నుంచే మొదలు..

మహిళల్లో నెగెటివ్ భావోద్వేగాలు పురుషుల కంటే ఎక్కువగా ఉంటున్నట్లు చెప్పడం 2012 నుంచి ఎక్కువగా కనిపిస్తోంది. ఈ పరిస్థితి క్రమంగా తీవ్రం అవుతోంది.

అయితే, అమెరికాతోపాటు చాలా ప్రాంతాల్లో మహిళలు నేడు ‘‘ఇక చాలు’’అని చెప్పే స్థాయికి పరిస్థితి వచ్చిందని తాషా చెబుతున్నారు.

‘‘నిజానికి ఇది మార్పుకు దారితీస్తోంది. వారు తమ కోపాన్ని వ్యక్తం చేయగలుగుతున్నారు. కొన్నిసార్లు కోపం, ఆవేశం కూడా మనకు అవసరం అవుతాయి’’అని జీనెట్ కూడా అన్నారు.

‘‘పనులు జరగాలంటే కొన్నిసార్లు ఇవి అవసరం. మన మాట వినాలన్నా, మనం చెప్పే దానిపై శ్రద్ధ పెట్టాలన్నా కోపం కూడా ఉండాలి’’అని ఆమె చెప్పారు.

(డేటా జర్నలిజం కోసం లియానా బ్రావో, క్రిస్టిన్ జీవన్స్, హెలీనా రోసీకా సాయం అందించారు. రిపోర్టింగ్‌లో వెలేరియా పెరస్సో, జార్జియానా పీయర్స్ సాయం అందించారు.)

వంద మంది మహిళలు

బీబీసీ ప్రతీ ఏడాది ప్రపంచంలోని 100 మంది స్ఫూర్తిమంతమైన, ప్రభావశీలురైన మహిళల పేర్లతో ‘బీబీసీ 100 విమెన్’ జాబితాను ప్రకటిస్తుంది. ఆ సిరీస్‌లో భాగంగానే ఈ కథనం అందిస్తున్నాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)