పఠాన్: బికినీ రంగు, ‘లవ్ జిహాద్’ వివాదంలో షారుఖ్, దీపికల సినిమా

దీపికా పదుకొణె, షారుఖ్ ఖాన్

బాలీవుడ్‌లో త్వరలో విడుదల కాబోయే సినిమా అందులో నటించిన టాప్‌ స్టార్స్ ధరించిన దుస్తుల రంగు కారణంగా రాజకీయ తుఫానులో చిక్కుకుంది.

‘‘బాయ్‌కాట్ పఠాన్’’ అంటూ ఒక హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె నటించిన ‘పఠాన్’ అనే హిందీ సినిమా జనవరిలో విడుదల కానుంది.

సినిమాలోని ‘‘బేషరమ్ రంగ్’’ అనే పాట మంగళవారం విడుదలైనప్పటి నుంచి దానిపై విమర్శలు మొదలయ్యాయి.

ఈ పాట సినిమా అధికారిక యూట్యూబ్ చానెల్‌లో అయిదున్నర కోట్లకుపై వ్యూస్‌ను సాధించింది. సోషల్ మీడియాలో ఇంకా అనేక కాపీలు ప్రచారంలో ఉన్నాయి.

దీపికా పదుకొణె, షారుఖ్ ఖాన్

ఫొటో సోర్స్, Getty Images

అభ్యంతరాలు ఏంటి?

ఈ పాటపై వివాదం రేకెత్తించిన మొదటి వ్యక్తి అధికార భారతీయ జనతా పార్టీ నేత.

"బేషరం రంగ్ అనే పాట టైటిల్, దాని అర్థం అభ్యంతరకరంగా ఉన్నాయని నేను భావిస్తున్నాను" అని మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా బుధవారం అన్నారు.

‘‘కలుషిత మనస్తత్వంతో రూపొందించిన ఈ పాటలో నటించినవారు ఆకుపచ్చ, కాషాయ రంగు దుస్తులు ధరించి, అభ్యంతరకరంగా కనిపించారు’’ అన్నారాయన.

కాషాయాన్ని హిందువులు, ఆకుపచ్చను ముస్లింలు పవిత్రమైన రంగులుగా భావిస్తారు.

ఈ సినిమాని బహిష్కరించాలంటూ పిలుపునిస్తూ ఆన్‌లైన్‌లో అనేక పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.

అయితే కొంతమంది సోషల్ మీడియా యూజర్లు ఈ పాటలో పెద్దగా అభ్యంతరం చెప్పాల్సిన అంశాలు లేవంటున్నారు.

షారూఖ్ ఖాన్ నల్ల చొక్కా ధరించారని, దీపిక కాషాయానికి కాస్త దగ్గరగా ఉన్న రంగున్న దుస్తులను ధరించారని కొందరు వాదించారు.

కానీ, ఇవేవీ అభ్యంతరాలు వ్యక్తం చేసేవారిని సంతృప్తి పరచలేదు.

ఈ సినిమాలో మరో వివాదాస్పద అంశం లవ్ జిహాద్. హిందూ అనుకూల సంస్థలు లవ్ జిహాద్ పేరుతో ఇటీవలి కాలంలో తరచూ ఆరోపణలు చేస్తున్నాయి.

పఠాన్ సినిమాలో కూడా అలాంటి ఇతివృత్తం ఉందని వారు వాదిస్తున్నారు. ఈ సినిమాలో హీరో ముస్లిం కాగా, హీరోయిన్ హిందూ.

మహారాష్ట్రకు చెందిన మరో బీజేపీ నేత కూడా ఈ సినిమాలోని పాట హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు.

దీపికా పదుకొణె

ఫొటో సోర్స్, Getty Images

వివాదాల్లో నటులు

షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె ఇద్దరికీ వివాదాలు కొత్తకాదు.

దీపిక గతంలో కూడా బికినీలు ధరించి కనిపించారు. మరికొన్ని సినిమాల్లో హాట్ సన్నివేశాల్లో నటించారు. సాధారణంగా ప్రధాన స్రవంతి బాలీవుడ్ సినిమాల్లో శృంగార దృశ్యాలు తక్కువ కనిపిస్తాయి. ఈ సినిమాలు కుటుంబంతో కలిసి చూస్తారన్న పేరుంది.

పౌరసత్వ చట్టానికి వ్యతికేరంగా దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులను పరామర్శించడానికి వెళ్లినప్పటి నుంచి దీపిక పై రాజకీయ విమర్శలు పెరిగాయి.

దిల్లీ విశ్వవిద్యాలయం వామపక్ష విద్యార్ధి సంఘాలు, వామపక్షవాదులైన ప్రొఫెసర్లకు నిలయమని పేరుంది.

అంతకు ముందు కూడా పద్మావత్, బాజీరావ్ మస్తానీ వంటి చిత్రాలలో ప్రధానపాత్ర పోషించినందుకు దీపిక బెదిరింపులను ఎదుర్కొన్నారు. ఈ సినిమాలు తమ మనోభావాలను దెబ్బతీశాయని రాజస్థాన్, మహారాష్ట్రలకు చెందిన కొన్ని కమ్యూనిటీలు ఆందోళన వ్యక్తం చేశాయి.

ఒక దశలో ఆమె ముక్కును కోసేస్తామంటూ కొందరు బెదిరించారు కూడా.

బాలీవుడ్‌లో చాలామంది ముస్లిం నటులు ఉన్నారు. కానీ సంప్రదాయవాద ఇస్లామిక్ సంస్థలు భారతీయ సినిమాలో ముస్లిం యాక్టర్ల విజయాలను వారు పెద్దగా గుర్తించరు.

సినిమా పరిశ్రమ తమ మత నమ్మకాలకు విరుద్ధమైనదిగా ఇస్లామిక్ సంస్థలు చూస్తుంటాయి.

హీరో షారుఖ్ ఖాన్‌కు వ్యతిరేకంగా ఒక ముస్లిం మత సంస్థ కూడా నిరసన వ్యక్తం చేసింది.

"పఠాన్లు అత్యంత గౌరవప్రదమైన ముస్లిం కమ్యూనిటీలలో ఒకరు" అని మధ్యప్రదేశ్ ఉలేమా బోర్డు అధ్యక్షుడు సయ్యద్ అనాస్ అలీ అన్నారు.

"ఈ సినిమాతో పఠాన్‌లనే కాదు, మొత్తం ముస్లిం సమాజపు పరువు తీస్తున్నారు. సినిమా పేరు పఠాన్ అని పెట్టి అందులో మహిళలతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారు. సినిమాలో పఠాన్‌లను తప్పుగా చిత్రీకరిస్తున్నారు" అని ఆయన విమర్శించారు.

రాష్ట్రంలో సినిమాను విడుదల చేయనివ్వబోమని హెచ్చరించారు.

అయితే, దీపిక, షారూఖ్‌‌ల ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో తమ అభిమాన స్టార్లను సమర్థిస్తున్నారు.

హిందూత్వ వాదులు మాత్రం ఈ సినిమాపై విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నాయి.

దీపికా పదుకొణె, షారుఖ్ ఖాన్

భారీ ఫ్యాన్ ఫాలోయింగ్

షారుఖ్ ఖాన్ అనేక కమర్షియల్ హిట్ సినిమాలు అందించారు. దక్షిణాసియా ఆవల కూడా ఆయనకు భారీగా అభిమానులున్నారు.

దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీని నడిపించిన గాంధీలతో తన స్నేహం గురించి ఆయన ఓపెన్‌గానే చెప్పారు. అయితే, ఎన్నికల సమయంలో ఆయన ఏ రాజకీయ పార్టీకి మద్ధతుగా వ్యవహరించలేదు. రాజకీయాలకు దూరంగానే ఉంటూ వచ్చారు.

తాజాగా తన సినిమాను ప్రమోట్ చేయడానికి ముందు ఆయన మక్కా తీర్థయాత్రతోపాటు, జమ్మూ కశ్మీర్‌లోని ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రాన్ని కూడా సందర్శించారు.

వీడియో క్యాప్షన్, బాలీవుడ్‌లో హీరోతో సమానంగా పారితోషికం ఎప్పుడూ తీసుకోలేదన్న ప్రియాంక ఛోప్రా

సోషల్ మీడియాపై విమర్శలు

కోల్‌కతాలో జరిగిన ఓ అవార్డు కార్యక్రమంలో షారుఖ్‌ఖాన్ గురువారం మాట్లాడారు.

‘‘ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా అందరినీ కలుపుతుందని అనుకుంటున్నాం. కానీ, అది సినిమాలపై నెగెటివ్ ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ దశలో సినిమా మరింత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని నేను నమ్ముతున్నాను’’ అని 28వ కోల్‌కతా అంతర్జాతీయ చలనచిత్రం ప్రారంభోత్సవంలో షారుఖ్ వ్యాఖ్యానించారు.

"సోషల్ మీడియా తరచుగా ఒక నిర్దిష్ట సంకుచిత దృక్కోణంతో నడుస్తోంది. అది మానవ స్వభావంలో నీచ గుణానికి పరిమితమవుతోంది. నెగెటివ్ ప్రకటనల కారణంగా సోషల్ మీడియా వినియోగం పెరుగుతుందని, దానివల్ల దానికి దాని మార్కెట్ కూడా పెరుగుతుందని నేను ఎక్కడో చదివాను. ఇలాంటి ఆలోచనలు విధ్వంసానికి, విభజనకు దారితీస్తాయి" అని ఆయన అన్నారు.

ఇదే వేదికపై మాట్లాడిన బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ కూడా తన ఆందోళనను వ్యక్తం చేశారు.

‘‘పౌర హక్కులు, భావప్రకటనా స్వేచ్ఛపై ప్రశ్నలు తలెత్తుతున్న విషయాన్ని ఈ వేదికపై ఉన్నవారంతా అంగీకరిస్తారని నేను భావిస్తున్నాను’’ అని అమితాబ్ అన్నారు.

షారుఖ్ ఖాన్

ఫొటో సోర్స్, Getty Images

హీరోలపై నేతల ఆధిపత్యం

గతంలో సీన్లు మార్చేందుకు రాజకీయ నాయకులు సెన్సార్ బెదిరింపులతో సినిమా నిర్మాతలను చేతులెత్తేలా చేసేవారు.

మరికొన్ని సందర్భాల్లో డిస్ట్రిబ్యూటర్లు సినిమాను కొనుగోలు చేయకుండా నేతలు ఒత్తిడి చేయగలిగేవారు.

చాలా సందర్భాలలో నిరసనకారులను సంతృప్తిపరచడానికి చిత్ర నిర్మాతలు కొన్ని సన్నివేశాలను తొలగించడమో లేదా మార్చడమో చేసేవారు.

2006లో ఆమిర్‌ఖాన్ నటించిన ఓ సినిమాను గుజరాత్‌లో ఆడనివ్వలేదు. అప్పట్లో గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సినిమాలో కొన్ని విమర్శలు ఉండటంతో అది రిలీజ్ కాకుండా అడ్డుకున్నారు.

అయితే, ఇండియాలో ప్రాంతీయ నేతలు అనేకమందికి సినిమా రంగంతో అనుబంధం ఉంది.

కొందరు నటులు తమ సందేశాన్ని వినిపించడానికి, మరికొందరు ప్రభుత్వానికి చేరువయ్యేందుకు సినిమాలను వాడుకునే వారు.

కశ్మీర్ లోయలోని హిందువులకు సంబంధించిన కథనంతో విడుదలైన ది కశ్మీర్ ఫైల్స్ అనే సినిమాకు బీజేపీ పాలిత రాష్ట్రాలు పన్ను రాయితీల ద్వారా సహకరించాయి.

బాలీవుడ్ సినిమాల్లో ధనవంతులు, శక్తివంతులైన నాయకులతో హీరోలు పోరాడి విజయం సాధిస్తుంటారు. కానీ, వాస్తవ జీవితంలో మాత్రం రాజకీయ నేతలదే పై చేయిగా కనిపిస్తోంది.

వీడియో క్యాప్షన్, Avatar 2 review: జేమ్స్ కామెరూన్ సృష్టించిన మ‌రో విజువ‌ల్ వండ‌ర్‌

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)