బ్రిటన్‌లోని 30 నగరాల్లో చెత్త ఏరుతున్న భారతీయ యువకుడు.. ఎందుకు?

వివేక్ గౌరవ్

ఫొటో సోర్స్, VIVEK GURAV

బ్రిటన్‌లోని 30 నగరాల్లో 30 రోజులపాటు చెత్త సేకరించాలని ఓ భారతీయ విద్యార్థి లక్ష్యంగా పెట్టుకున్నారు. వాతావరణ మార్పులపై పోరాటంలో భాగంగా వివేక్ గౌరవ్ ప్రధాన నగరాల్లో చెత్తను ఏరుతున్నారు.

రన్నింగ్ చేసేటప్పుడు ఆయన పరిసరాల్లో చెత్తను ఏరుతుంటారు. దీన్నే ‘‘ప్లాగింగ్’’గా పిలుస్తారు. ఇలా బ్రిస్టల్‌లో మొత్తంగా వివేక్ 5,000 కేజీలకుపైనే చెత్తను సేకరించారు.

‘‘నేను భారత్‌లో ఇలానే చెత్త సేకరించేవాడిని. బ్రిటన్‌లో కూడా నాతోపాటు చాలా మంది ఇలా చెత్తను సేకరించేలా స్ఫూర్తి నింపాలని భావిస్తున్నాను’’అని 26 ఏళ్ల గౌరవ్ చెప్పారు.

వివేక్ గౌరవ్

ఫొటో సోర్స్, VIVEK GURAV

గత ఏడాది ఎన్విరాన్‌మెంటల్ పాలసీ, మేనేజ్‌మెంట్‌లో మాస్టర్ డిగ్రీ చేసేందుకు గౌరవ్.. బ్రిస్టల్ వచ్చారు. అంతకుముందు భారత్‌లోని తన సొంత ఊరైన పుణెలోనూ ఆయన ఇలానే రోడ్లపై చెత్తను సేకరించేవారు.

గత నాలుగేళ్లలో ఆయన 675 కి.మీ. మేర ప్లాగింగ్ చేశారు. మొత్తంగా ఇలాంటి 120 కార్యక్రమాలు చేపట్టారు.

వివేక్ గౌరవ్

ఫొటో సోర్స్, VIVEK GURAV

బ్రిటన్‌లో ఆయన చేపడుతున్న ప్లాగింగ్‌పై బీబీసీ వన్‌లో కథనం ప్రచురితమైంది. ఆ తర్వాత మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను నుంచి ప్రత్యేక అవార్డు కూడా ఆయన అందుకున్నారు.

గత అక్టోబరులో కొత్త ప్రధాన మంత్రి రిషీ సునక్ నుంచి 10 డౌనింగ్ స్ట్రీట్‌కు రావాలని ఆయనకు ఆహ్వానం వచ్చింది. కాప్27 యూత్ సమ్మిట్ కాయ్17లోనూ గౌరవ్ మాట్లాడారు.

వివేక్ గౌరవ్

ఫొటో సోర్స్, VIVEK GURAV

‘‘ఆ వాతావరణ సదస్సు అద్భుతమైనది. దాని ద్వారా ఒక మంచి అవకాశం దొరికింది. మరోవైపు ప్రధాని నుంచి అవార్డు అందుకోవడంతో నాలో స్ఫూర్తి మరింత పెరిగింది. 10 డౌనింగ్ స్ట్రీట్‌కు వెళ్లడం అనేది నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని అనుభూతి’’అని గౌరవ్ చెప్పారు.

వివేక్ గౌరవ్

ఫొటో సోర్స్, VIVEK GURAV

తను ఒక్కో నగరానికి ప్లాగింగ్‌కు వెళ్లినప్పుడు అక్కడి పర్యావరణవేత్తలు, ప్లాగర్లు తనతో కలుస్తారని గౌరవ్ భావిస్తున్నారు. తను ప్రతి నగరానికి ప్రభుత్వ రవాణా సదుపాయాలపైనే వెళ్తానని, ఆ తర్వాత అక్కడ చెత్తను సేకరిస్తానని వివరించారు.

డిసెంబరులో నెలలో డెర్బీ, నాటింగ్హమ్, లీడ్స్, షెఫ్ఫీల్డ్, మాంచెస్టర్, లివర్‌పూల్, లెస్టర్, బర్మింగ్హమ్, వార్సెస్టెర్‌లలో గౌరవ్ పర్యటించబోతున్నారు.

వివేక్ గౌరవ్

ఫొటో సోర్స్, VIVEK GURAV

ఇలాంటి కార్యక్రమాలతో మానసిక ఆరోగ్యంపైనా సానుకూల ప్రభావం పడుతుందని గౌరవ్ చెబుతున్నారు. ముఖ్యంగా భారత్‌లో ప్లాగింగ్‌ చేయడానికి ఇది కూడా ఒక కారణమని చెప్పారు.

గత నాలుగేళ్లలో వాలంటీర్లతో కలిసి ఆయన పది లక్షల కేజీలకుపైనే చెత్తను సేకరించారు.

వీడియో క్యాప్షన్, గ్రీన్ వాషింగ్ విషయంలో ఏం జరుగుతోంది?

‘‘నేడు బ్రిటన్‌కు చదువుకోవడానికి వచ్చే అందరూ నాలానే ప్లాగింగ్ చేయాలని పిలుపునిస్తున్నాను. ఎందుకంటే ఇలా సాయం చేయడం అనేది చాలా మంచి అలవాటు’’అని ఆయన చెప్పారు.

బ్రిటన్‌లో తాను నేర్చుకున్న నైపుణ్యాలతో భారత్‌తోపాటు మిగతా ప్రాంతాల్లోనూ సుస్థిర పర్యావరణ మార్పుల కోసం కృషిచేస్తానని గౌరవ్ వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)