భారత్, చైనాల మౌలిక వసతుల పోటీ హిమాలయ ప్రాంతాన్ని ముప్పులోకి నెడుతోందా

ఫొటో సోర్స్, FRANK BIENEWALD
- రచయిత, నవీన్ సింగ్ ఖేడ్కా
- హోదా, పర్యావరణ ప్రతినిధి, బీబీసీ వరల్డ్ సర్వీస్
జోషిమఠ్, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటీవల మళ్లీ భూమిపై మరిన్ని పగుళ్లు కనిపించడంతో హిమాయల పర్వత సానువుల్లోని ఈ పట్టణం మరోసారి వార్తలకెక్కుతోంది.
ఈ పట్టణం ఎందుకు భూమిలోకి కుంగిపోతోంది అనేది చర్చనీయమవుతోంది. హిమాలయాలలో ఇంతకంటే ఆందోళన కలిగించే చిత్రాలు ముందుముందు రానున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
హిమాలయ ప్రాంతంలో చైనా, భారత్‌లు మౌలిక సదుపాయాల కల్పన పేరిట నిర్మాణాలు సాగిస్తుండడం ప్రకృతి వైపరీత్యాల ముప్పును మరింత పెంచుతోందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
భూతాపం, పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల హిమనీనదాలు, నేలపై గడ్డకట్టిన మంచు కరుగుతుండడం దుర్బలమైన ఈ ప్రాంతాన్ని మరింత అస్థిరతలోకి నెట్టనుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఇదే ప్రాంతంలో కొత్తగా హైవేలు, రైల్వే లైన్లు వేస్తున్నారు. సొరంగాలు తవ్వుతున్నారు. హిమాలయాలకు రెండు వైపులా ఆనకట్టలు, ఎయిర్‌స్ట్రిప్‌లు నిర్మిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘ప్రమాదాలను మరింత దగ్గరకు తెస్తున్నారు’ అని ఓస్లో విశ్వవిద్యాలయంలో ఫిజికల్ జాగ్రఫీ, హైడ్రాలజీ ప్రొఫెసర్ ఆండ్రియాస్ కబాబ్ అన్నారు.
ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో 2021లో వినాశకర అవలాంచీ సంభవించడానికి గల కారణాలపై నివేదిక రూపొందించినవారిలో ఆయన కూడా ఒకరు.
ఈ ప్రాంతంలోని ముప్పుపై జరిగిన అధ్యయనాలన్నీ వేర్వేరు ఘటనలపై విడివిడిగా దృష్టి సారించాయి. కానీ, ఈ అన్ని ఘటనలనూ కలిపి చూసినప్పుడు ఈ ప్రాంతం అంతటా ముప్పు తీవ్రత ఉన్నట్లు స్పష్టమవుతోంది.
3,500 కిలోమీటర్ల విస్తీర్ణం గల ఈ ప్రాంతం భారత్, చైనాల మధ్య విస్తరించి ఉంది. రెండు దేశాల మధ్య ఇక్కడున్న సరిహద్దును వాస్తవాధీన రేఖ(లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్- ఎల్‌ఏసీ)గా పిలుస్తారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Getty Images
2022 సెప్టెంబర్-అక్టోబర్‌లో ఉత్తరాఖండ్‌లోని 7వ నంబర్ జాతీయ రహదారిపై సగటున ప్రతి కిలోమీటరు దూరంలో కొండ చరియలు విరిగిపడినట్లు సైన్స్ జర్నల్ ‘నేచురల్ హజార్డ్స్ అండ్ ఎర్త్ సిస్టమ్స్’లో ఫిబ్రవరిలో ప్రచురితమైన ఒక అధ్యయనంలో వెల్లడించారు. మరికొన్ని ఇతర అధ్యయనాలలోనూ ఇలాంటివి రిపోర్ట్ అయ్యాయి.
మరోవైపు యూరోపియన్ జియోసైన్సెస్ యూనియన్ ప్రచురించిన ఒక అధ్యయనంలో ఇక్కడ కొండచరియలు విరిగిపడడానికి గల కారణాలను విశ్లేషించారు.
‘అక్కడి సహజ పరిస్థితులతో పాటు కొత్తగా రోడ్లను నిర్మించడానికి, ఉన్న రోడ్లను విస్తరించడానికి చేసిన ప్రయత్నాలు ఇలా కొండచరియలు విరిగిపడడానికి కారణమయ్యాయి. ఇవి ఒక్కోసారి చిన్నఘటనలే అయినా విధ్వంసకరమే’ అని ఆ అధ్యయనంలో పేర్కొన్నారు.
ఇటీవల కాలంలో ఇలా కొండచరియలు విరిగిపడడం, ఇతర ప్రకృతి విపత్తులు సాధారణమైపోయాయి. ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్ హైవేకు చెందిన కొంత భాగం గత ఏడాది వర్షాలకు దెబ్బతింది.
చమోలీ అవలాంచీ కారణంగా 200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో రెండు నిర్మాణంలోని జల విద్యుత్కేంద్రాలు దెబ్బతిన్నాయి.
‘విపత్తులను ఎదుర్కోవడానికి ప్రణాళికలు వేసేటప్పుడు చమోలీ జిల్లా అధికారులు వాతావరణం, మౌలిక సదుపాయాలకు సంబంధించిన నష్టాలను పరిగణనలోకి తీసుకోలేదు’ అని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ ఘటనపై ఇచ్చిన నివేదికలో పేర్కొంది.

ఫొటో సోర్స్, WANG HE
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల కారణంగా హిమాలయ ప్రాంతానికి ముప్పు కలుగుతుందా అనే ప్రశ్నకు భారత పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పులు మంత్రిత్వ శాఖ నుంచి ఎలాంటి జవాబు రాలేదు.
చైనా వైపు ఉన్న హిమాలయ ప్రాంతంలోనూ ప్రకృతి విపత్తుల ముప్పు భారత్‌లో ఉన్నంత ఎక్కువ స్థాయిలోనే ఉందని నిపుణులు చెప్తున్నారు.
కమ్యూనికేషన్స్ ఎర్త్ అండ్ ఎన్విరాన్‌మెంట్ జర్నల్‌లో 2022 అక్టోబరులో ప్రచురించిన ఒక అధ్యయనంలో.. క్వింగాయి టిబెట్ పీఠభూమిలో మంచుతో గడ్డకట్టిన నేలపై సుమారు 9,400 కిలోమీటర్ల రోడ్లు, 580 కిలోమీటర్ల రైలు మార్గాలు, 2,600 కిలోమీటర్ల కంటే ఎక్కువ విద్యుత్ లైన్లు, వేలసంఖ్యలో భవనాలు ఉన్నాయని పేర్కొన్నారు.
‘‘2050 నాటికి మంచు కరగడం వల్ల వీటిలో 38.14 శాతం రోడ్లు, 38.76 శాతం రైలు మార్గాలు, 39.41 శాతం విద్యుత్ లైన్లు, 20.94 శాతం భవనాలకు ముప్పు కలగొచ్చు’ అని ఆ నివేదిక సూచించింది.
అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల ఉత్తర ప్రాంతాలలో నేల కష్టతరంగా మారుతోంది. నదులు వాటి అసలు మార్గాన్ని మార్చుకుని కట్టలు తెంచుకునే ప్రమాదం ఉంది.
‘హిమనీనదాలు కరిగి పొంగిపొర్లడం, అవలాంచీలు వంటి అనుభవాలను ఈ ప్రాంతం ఇటీవల కాలంలో చూసింది’ అని ‘క్రయోస్పియర్’ జర్నల్‌లో గత ఏడాది ప్రచురించిన ఓ నివేదిక ప్రస్తావించింది.

ఫొటో సోర్స్, Getty Images
టిబెట్‌లోని మెడోగ్ కౌంటీలో ఇటీవల అవలాంచీ కారణంగా 28 మంది మరణించారు. టిబెట్‌లోని బోమీ కౌంటీలో 2000 సంవత్సరంలో కొండచరియలు విరిగిపడి రోడ్లు, వంతెనలు, టెలికమ్యూనికేషన్ సౌకర్యాలు ధ్వంసమయ్యాయి.
‘చైనా ప్రభుత్వం ఈ ప్రాంతంలో సిచువాన్-టిబెట్ హైస్పీడ్ రైల్వే లైన్ సహాయ ఇతర మౌలిక వసతులకు భారీగా పెట్టుబడులు అందిస్తోంది’ అని ‘క్రయోస్పియర్’లో ప్రచురితమైన నివేదికలో పేర్కొన్నారు.
సముద్ర మట్టానికి 4 వేల అడుగుల ఎత్తున మంచుతో కప్పి ఉండే 21 పర్వతాలు, 14 ప్రధాన నదులను దాటుతూ ఈ రైలు మార్గం వేస్తున్నట్లు చైనా అధికారులు చెప్తున్నారు.
చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ మౌంటెయిన్ హజార్డ్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ చీఫ్ ఇంజినీర్ యు యోంగ్ ఈ రైలు మార్గం గురించి చైనా అధికారిక వార్తాసంస్థ జిన్‌హువాతో మాట్లాడుతూ... ‘దుర్గమ భూభాగంతో పాటు హిమపాతాలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదాలు, భూకంపాలు వంటి అనేక ప్రమాదాలు ఈ రైలు మార్గంలో పొంచి ఉన్నాయి’ అన్నారు.
న్యాంగ్చి, షిగజె వంటి ప్రాంతాలలో ఆవాసాలు పెరగడం వల్ల కూడా మౌలిక సదుపాయాల కల్పన అవసరం పెరిగిందని నిపుణులు చెప్తున్నారు.
చైనా తన సరిహద్దు వెంబడి 624 కొత్త ఆవాసాలను ఏర్పాటు చేసినట్లు ఆ దేశ మీడియా రిపోర్ట్స్‌ను ఉటంకిస్తూ లండన్‌లోని స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్‌లో ప్రొఫెషనల్ రీసెర్చ్ అసోసియేట్ రాబీ బార్నెట్ చెప్పారు.
‘చాలామంది 4000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో నివసిస్తున్నారు. అంతకుముందెప్పుడూ ఆ ప్రాంతాలలో మానవ ఆవాసాలు లేవు’ అన్నారు రాబీ.
చైనా ‘ఎకాలజీ, ఎన్విరాన్‌మెంట్ మినిస్ట్రీ’తో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించినా సాధ్యం కాలేదు.

ఫొటో సోర్స్, Getty Images
చైనా భూభాగ దక్షిణ ప్రాంతాలలో కొత్తగా ఆవాసాలు కనిపిస్తుండగా భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం వంటి రాష్ట్రాలలో కొత్తగా జల విద్యుత్కేంద్రాల నిర్మాణం జోరందుకుంటోంది.
2009, 2020 మధ్య హిమనీనదాలు కరగడం వల్ల సరస్సులు, ఇతర జలవనరుల విస్తృతి పెరుగుతున్నట్లు భారత సెంట్రల్ వాటర్ కమిషన్ గుర్తించిన రాష్ట్రాల జాబితాలో అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం కూడా ఉన్నాయి.
కాగా ఇండియాలోని 23 హిమనీనద సరస్సులలో 17 ఒక్క సిక్కిం రాష్ట్రంలోనే ఉన్నట్లు అమెరికన్ జియోఫిజికల్ యూనియన్ 2020 నాటి తన అధ్యయనంలో వెల్లడించింది.
కాగా అంతర్జాతీయ వాతావరణ చర్చల సమయాలలో చైనా, ఇండియాలు తమ ప్రయోజనాలను కాపాడుకోవడానికి కలిసి పనిచేసిన సందర్భాలున్నాయి. ఈ విషయంలో రెండు దేశాలు కలసికట్టుగా పాశ్చాత్య దేశాలతో ఘర్షణ పడిన సందర్భాలున్నాయి.
అయితే హిమాలయాలలో వాతావరణ మార్పుల ప్రభావం, పర్యావరణ క్షీణతల కారణంగా తలెత్తుతున్న పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడానికి రెండు దేశాల మధ్య భాగస్వామ్యం మాత్రం లేదని నిపుణులు అంటున్నారు.
భౌగోళిక రాజకీయాలు, పరస్పర శత్రుత్వం కారణంగా ఈ రెండు దేశాలూ హిమాలయ ప్రాంతంలో పోటాపోటీగా సైనిక కార్యకలాపాలు పెంచుతున్నాయని నిపుణులు చెప్తున్నారు.
హిమాలయాలపై అనేక అధ్యయనాలు చేసిన అమెరికన్ జియాలజిస్ట్ జెఫ్ఱీ కార్గెల్ ఈ ప్రాంతం గురించి మాట్లాడుతూ.. దీన్ని ఇంటర్నేషనల్ బయోస్పియర్ రిజర్వ్‌గా ప్రకటించాల్సి ఉందని.. ఇక్కడ ఎలాంటి అనవసర కార్యకలాపాలూ అనుమతించరాదని అన్నారు.
ఇప్పటికే ఇక్కడ అనేక ప్రమాదాలు చూస్తున్నామని.. ముందుముందు ఇక్కడ చాలా విపత్తులు మరింత ముప్పు ఎదుర్కోవాల్సి ఉంటుందని జెఫ్రీ కార్గెల్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- గోళ్లు ఎందుకు కొరుకుతారు?
- యువ అథ్లెట్లలో కొందరికి గుండెపోటు ఎందుకు వస్తోంది?
- ఈ స్కూలు పిల్లలు రోజూ రెండుసార్లు డబ్బాలు పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నారు?
- తెలంగాణ: ఇంటర్ విద్యార్థులకు హెచ్‌సీఎల్‌లో సాఫ్ట్వేర్ జాబ్... ఎంపిక ఎలా?
- గుజరాత్: శివాలయం మీద హక్కులను హిందూ సంస్థలకు ఇచ్చేందుకు జైనులు ఎందుకు ఒప్పుకోవడం లేదు...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














