యువ అథ్లెట్లలో కొందరికి గుండెపోటు ఎందుకు వస్తోంది?

డమార్ హ్యామ్లిన్‌

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డమార్ హ్యామ్లిన్‌
    • రచయిత, మిషెల్ రాబర్ట్స్
    • హోదా, డిజిటల్ హెల్త్ ఎడిటర్

అమెరికా ఫుట్‌బాలర్ డమార్ హ్యామ్లిన్‌కు గ్రౌండ్‌లో ఆడుతుండగానే గుండె పోటు వచ్చింది.

ఆట మధ్యలో బాల్‌ను ప్రత్యర్థి నుంచి తీసుకునే క్రమంలో 24 ఏళ్ల డమార్ నేలపై కుప్పకూలాడు.

అతడికి కార్డియాక్ అరెస్టు అయిందని వైద్యులు ధ్రువీకరించారు. అంటే అతడి గుండె సరిగా కొట్టుకోవడం లేదు, శరీరంలోని ఇతర భాగాలకు గుండె నుంచి రక్తం సరఫరా సరిగా జరగడం లేదు.

అతడి ప్రాణాలను కాపాడేందుకు, వెంటనే మళ్లీ గుండె కొట్టుకునేలా ఛాతీపై అక్కడున్న సిబ్బంది చేతితో గట్టిగా ఒత్తారు.

ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో ఉన్నాడు. అతడికి గుండె పోటు రావడానికి గల కారణం ఏమిటో ఇప్పుడే చెప్పలేమని వైద్యులు అంటున్నారు.

గుండె

ఫొటో సోర్స్, Getty Images

శరీరానికి ఏదైనా ఒక వస్తువు బలంగా తాకడంతో కలిగే బ్లంట్ ట్రామా వల్ల ‘‘కమోషియో కార్డిస్’’ వస్తుంది. అయితే, ఆ వస్తువు నేరుగా ఛాతీపై తగిలితే గుండె అసాధారణంగా కొట్టుకోవడం మొదలవుతుంది. ఫలితంగా కార్డియాక్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.

ఇది గుండె పోటు కంటే భిన్నమైనది. గుండెకు వచ్చే రక్త సరఫరా నిలిచిపోయినప్పుడు లేదా అంతరాయం కలిగినప్పుడు గుండె పోటు వచ్చే అవకాశం ఉంటుంది.

మరోవైపు బ్లంట్ ట్రామా వల్ల కలిగే బలమైన ఒత్తిడి వల్ల కూడా గుండె నిర్మాణం దెబ్బతినే ముప్పు ఉంటుంది.

అయితే, బాల్ తగడంతో డమార్‌కు అంతర్గత స్రావం ఏమైనా అయిందా? అతడి గుండె కూడా దెబ్బతిందా? లాంటి అంశాలు తెలియాల్సి ఉంది.

గుండె

ఫొటో సోర్స్, PETER DAZELEY/GETTYIMAGES

కొంతమంది యువ అథ్లెట్లలో కనిపించే జన్యు రుగ్మత హైపర్‌ట్రోఫిక్ కార్డియోమయోపతి గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఇది ప్రాణాంతక గుండె సమస్య.

ఈ రుగ్మత ఉండే వ్యక్తులు చూడటానికి ఆరోగ్యంగా, ఫిట్‌గా కనిపిస్తారు. అసలు అలాంటి సమస్య వారి కుందని తెలుసుకోవడం కూడా చాలా కష్టం.

హైపర్‌ట్రోఫిక్ కార్డియోమయోపతి రోగుల్లో గుండె కండరాలు విపరీతంగా పెరుగుతాయి. దీన్నే ‘‘హైపర్‌ట్రోఫీడ్’’గా పిలుస్తారు. గుండె కండరాలు మందంగా అయిపోయివడంతో రక్తాన్ని సరఫరా చేయడం కష్టం అవుతుంది. ఫలితంగా గుండె కొట్టుకోవడంలో ఇబ్బందులు వస్తాయి.

మరోవైపు కోవిడ్-19 వ్యాక్సీన్ల వల్ల కూడా ఇలా ఈ సమస్య డమార్‌కు వచ్చుండొచ్చని కొందరు కోవిడ్-19 వ్యాక్సీన్ వ్యతిరేక ప్రచారకర్తలు చెబుతున్నారు.

‘‘వరుసగా అథ్లెట్లు ఇలా గ్రౌండ్‌లోనే కుప్పకూలడం సాధారణం కాదు. దీని వెనుక ఒక ప్యాటెర్న్ ఉంది’’అని వారు వ్యాక్సీన్లకు వ్యతిరేకంగా వీడియోలు కూడా చేస్తున్నారు. ఇటీవల కాలంలో వస్తున్న ఇలాంటి గుండె పోటు, కార్డియాక్ అరెస్టు కేసులను వారు ప్రస్తావిస్తున్నారు.

గుండె పోటు

ఫొటో సోర్స్, ALEKSANDR ZUBKOV/GETTYIMAGES

అయితే, ఒక్క అమెరికాలోనే స్పోర్ట్స్‌లో ఏటా దాదాపు వంద నుంచి 150 మంది గుండె సంబంధిత జబ్బులతో మరణిస్తున్నట్లు 2016లో నిర్వహించిన ఒక అధ్యయనం వెల్లడించింది.

మరోవైపు డమార్ అసలు వ్యాక్సీన్ తీసుకున్నాడో లేదో తెలియదు. తమ క్రీడాకారుల్లో 95 శాతం మంది వ్యాక్సీన్ తీసుకున్నట్లు ఎన్ఎఫ్ఎల్ గత మార్చిలో వెల్లడించింది.

గ్రౌండ్‌లో ఇలానే కార్డియాక్ అరెస్టుతో గత ఏడాది క్రిస్టియన్ ఎరిక్‌సన్ కూడా కుప్పకూలాడు. అతడు మరణం అంచుల వరకు వెళ్లాడు.

వెంటనే అతడి గుండె పనిచేసేలా చేసేందుకు వైద్యులు డిఫిబ్రిలేటర్‌తో ఛాతీపై షాక్ ఇచ్చారు. ప్రస్తుతం అతడికి ఐసీడీగా పిలిచే ఒక చిన్నపరికరాన్ని అమర్చారు. గుండె సరిగ్గా పనిచేసేందుకు ఇది తోడ్పడుతోంది.

నిజానికి ఎరిక్‌సన్ లేదా అతడి కుటుంబంలో ఎవరికీ గుండె సంబంధిత వ్యాధులు లేవు. ఇతర ఫుట్‌బాల్ క్రీడాకారుల్లానే అతడికి కూడా దీనికి ముందుగా గుండె సంబంధిత పరీక్షలు చేశారు.

2012లో మరో ఫుట్‌బాలర్ ఫ్యాబ్రిస్ మాంబా కూడా ఇలానే గ్రౌండ్‌లో కుప్పకూలాడు. వెంటనే వైద్యులు డిఫిబ్రిటేర్‌తో అతడి 15 షాక్‌లు ఇచ్చి ప్రాణాలు కాపాడగలిగారు.

వీడియో క్యాప్షన్, కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి? ఇది ఎందుకు ప్రాణాలు తీస్తోంది?

వెంటనే స్పందిస్తే..

గుండె పోటుతో కుప్పకూలినప్పుడు వెంటనే అత్యవసర వైద్య సాయం అందిస్తే ప్రాణాలు కాపాడొచ్చు. కానీ, అన్నిసార్లు ఇది సాధ్యంకాదు.

యువకులు కార్డియాక్ అరెస్టుతో చనిపోవడాన్ని సడెన్ డెత్ సిండ్రోమ్ (ఎస్‌డీఎస్)గా పిలుస్తారు. చాలా అరుదుగా ఇలా జరుగుతుంటుంది.

కార్డియాక్ రిస్క్ ఇన్ ద యంగ్ (సీఆర్‌వై) సమాచారం ప్రకారం, ఏటా ఒక్క బ్రిటన్‌లో 35 ఏళ్ల లోపు వయసున్న 12 మంది కార్డియాక్ అరెస్టుతో చనిపోతున్నారు.

ప్రతి 20 సడెన్ కార్డియాక్ మరణాల్లో ఒకటి, ప్రతి ఐదుగురు యువకుల సడెన్ కార్డియాక్ మరణాల్లో ఒకటికి అసలు ఎందుకు ఇలా జరుగుతుందో తెలియడంలేదని సీఆర్‌వై వెల్లడించింది. నిపుణులు రోగుల గుండె నిర్మాణాన్ని పరిశీలించినప్పటికీ కారణాలు తెలియడంలేదని పేర్కొంది.

గుండె సమస్యలను ఎలక్ట్రోకార్డియోగ్రామ్ టెస్టు అంటే ఈసీజీతో తెలుసుకోవచ్చు. మొదట్లోనే గుర్తిస్తే సమస్యలు పెద్దవి కాకుండా అడ్డుకోవచ్చు.

వీడియో క్యాప్షన్, వేరు శెనగ నూనె, సన్‌ఫ్లవర్‌ ఆయిల్, ఆలివ్ ఆయిల్.. ఏ నూనె ఆరోగ్యానికి మంచిది

సీపీఆర్ ఎప్పుడు చేయాలి?

ఎవరైనా శ్వాస అందకుండా అపస్మారక స్థితిలోకి వెళ్లినప్పుడు మాత్రమే మనం సీపీఆర్ చేయాల్సి ఉంటుంది.

ఒకవేళ అపస్మారక స్థితిలో శ్వాస సరిగానే తీసుకుంటే వెంటనే అత్యవసర సేవలకు ఫోన్ చేయాలి.

ఒకవేళ శ్వాస తీసుకోకుండా, ఎలాంటి స్పందనలు లేకుండా ఉంటే చేతి నాడిని పరిశీలిస్తూ సమయాన్ని వృథా చేయకూడదు. వెంటనే సీపీఆర్ మొదలుపెట్టాలి.

(కథనం కోసం మైక్ వెండ్లింగ్ సాయం అందించారు)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)