నరేంద్ర మోదీ: ప్రధాని హిందుత్వ ఇమేజ్.. ఇస్లామిక్ దేశాలతో సంబంధాలకు అవరోధం కాలేదు.. ఎందుకు?

యూఏఈ తమ దేశ అత్యున్నత పురస్కారం 'ఆర్డర్ ఆఫ్ జాయెద్‌'ను నరేంద్ర మోదీకి ప్రదానం చేసింది

ఫొటో సోర్స్, @MEAINDIA

ఫొటో క్యాప్షన్, యూఏఈ తమ దేశ అత్యున్నత పురస్కారం 'ఆర్డర్ ఆఫ్ జాయెద్‌'ను నరేంద్ర మోదీకి ప్రదానం చేసింది
    • రచయిత, రజనీశ్ కుమార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అరబ్ ప్రపంచం ఒక కోటి మూడు లక్షల చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. ఇది పశ్చిమాన మొరాకో నుంచి ఉత్తరాన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వరకు విస్తరించి ఉంది.

అయితే, వీటిలోని చాలా ప్రాంతాలలో ప్రజలు అరబ్ మూలాలకు చెందినవారు కారు. అరబిక్ ధారాళంగా మాట్లాడలేని సమూహాలు కూడా ఉన్నాయి. కానీ, అరబ్ సంస్కృతి ప్రభావం వలన వారందరినీ కూడా అరబ్ ప్రపంచంలో భాగంగానే చూస్తారు.

అరబ్ ప్రపంచంలోని ప్రజలను మూడు సమూహాలుగా చూడవచ్చు.. ఉత్తర ఆఫ్రికా, లెవాంటైన్ అరబ్, గల్ఫ్ అరబ్.

ఈ కథనంలో గల్ఫ్ అరబ్ దేశాలకు, మోదీ ప్రభుత్వానికి మధ్య సంబంధాలను పరిశీలిద్దాం. 

2002 గుజరాత్‌ అల్లర్ల సమయంలో నరేంద్ర మోదీ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ ఘటన తరువాత మోదీకి ముస్లిం వ్యతిరేకిగా పేరొచ్చింది. ఈ ఇమేజ్ అంతర్జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశమైంది. 

2005లో నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, యూఎస్ ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడం యాక్ట్ 1998 కింద అమెరికా ఆయన వీసాను నిషేధించింది. అమెరికా సంస్థ అయిన కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడం సిఫార్సుపై ఈ నిషేధాన్ని విధించింది. 2002 అల్లర్లలో నరేంద్ర మోదీ పాత్రను ఈ కమిషన్ విమర్శించింది.

2014లో మోదీ భారత ప్రధానమంత్రి అయిన తరువాత అమెరికా ఈ నిషేధాన్ని ఎత్తివేసింది.

జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్జీ హత్యకు సంబంధించి సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ అమెరికాలో ఎలాంటి చట్టపరమైన ప్రక్రియను ఎదుర్కోవలసిన అవసరం లేదని గత ఏడాది నవంబర్ 18న జో బైడెన్ ప్రభుత్వం నిర్ణయించింది. 

జమాల్ ఖషోగ్జీ హత్యకు సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ బాధ్యత వహించాలని అమెరికా దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. కానీ, సౌదీ క్రౌన్ ప్రిన్స్‌కు మినహాయింపు ఇవ్వడంతో బైడెన్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. 

ఈ విమర్శలపై అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ స్పందిస్తూ, నియమానుసారమే ఈ నిర్ణయం తీసుకున్నామని, 2014లో మోదీ భారత ప్రధాని అయిన తరువాత ఆయన విషయంలో కూడా ఇలాంటి మినహాయింపు ఇచ్చారని చెప్పారు.

గత ఏడాది నవంబర్ 27న సౌదీ అరేబియా రాజు సల్మాన్ తన కుమారుడు మహమ్మద్ బిన్ సల్మాన్‌ను ప్రధానిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు.

అయితే, సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్‌కు మినహాయింపు ఇచ్చిన విషయంలో మోదీని ఉదహరించడం అనవసరం, అసంబద్ధమని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. 

2014 తరువాత మోదీ చాలాసార్లు అమెరికా వెళ్లారు. 2016లో అమెరికా కాంగ్రెస్‌లో ప్రసంగించారు కూడా. 

గతంలో జో బైడెన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మానవ హక్కుల విషయంలో సౌదీ అరేబియాపై కఠినమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. కానీ, ఆయన ప్రభుత్వం క్రౌన్ ప్రిన్స్‌కు చట్టపరమైన రక్షణ కల్పించవలసి వచ్చింది.

ఈ ఏడాది జూలైలో బైడెన్ సౌదీ అరేబియాలో పర్యటించారు. సౌదీ అరేబియా నుంచి చమురు ఉత్పత్తిని పెంచాలని బైడెన్ కోరుతూనే ఉన్నారు. కానీ, క్రౌన్ ప్రిన్స్ వినిపించుకోవట్లేదు.

వీటన్నిటి బట్టి, అగ్ర రాజ్యమైన అమెరికా, అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ గల్ఫ్ దేశాలతో సంబంధాలకు ప్రాముఖ్యం ఇస్తున్నాయన్న విషయం స్పష్టమవుతోంది.

సౌదీ అరేబియా కూడా తమ దేశ అత్యున్నత పురస్కారాన్ని మోదీకి ఇచ్చి సత్కరించింది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సౌదీ అరేబియా కూడా తమ దేశ అత్యున్నత పురస్కారాన్ని మోదీకి ఇచ్చి సత్కరించింది

ఇస్లామిక్ దేశాలలో మోదీ పర్యటనలు...

2002 అలర్ల తరువాత మోదీకి వచ్చిన యాంటీ ముస్లిం ఇమేజ్ ఇస్లామిక్ దేశాలతో సంబంధాలకు ఎందుకు అడ్డంకి కాలేదు?

గత నెలలో, గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అహ్మదాబాద్‌లోని సరస్‌పూర్‌లో నిర్వహించిన ర్యాలీలో నరేంద్ర మోదీ మాట్లాడుతూ, “2014 నుంచి మేం ఇస్లామిక్ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్‌లతో స్నేహ సంబంధాలను బలోపేతం చేశాం. ఈ దేశాల సిలబస్‌లో యోగాను చేర్చారు. అబుదాబి, బహ్రెయిన్‌లలో హిందువుల కోసం దేవాలయాలు నిర్మిస్తున్నారు" అని అన్నారు. 

మోదీ ప్రధాని అయిన తరువాత గల్ఫ్ దేశాలతో సంబంధాలపై కసరత్తు చేశారు. గత ఎనిమిదేళ్లలో నాలుగుసార్లు యూఏఈ పర్యటనకు వెళ్లారు. 2015 ఆగస్టులో తొలిసారి సందర్శించారు.

1981లో ఇందిరా గాంధీ యూఏఈ పర్యటన తరువాత, ఏ భారత ప్రధానీ అక్కడకు వెళ్లలేదు. 34 ఏళ్ల తరువాత 2015లో మోదీ యూఏఈలో పర్యటించారు. 

ఆ తరువాత, 2018 ఫిబ్రవరిలో, 2019 ఆగస్టులో, చివరిగా 2022 జూన్‌లో పర్యటించారు.

2022 జూన్ 28న ప్రధాని మోదీ అబుదాబి విమానాశ్రయంలో దిగినప్పుడు, యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆయనకు స్వాగతం పలికేందుకు రిసెప్షన్ వద్ద వేచి ఉన్నారు. ఇది అక్కడి ప్రోటోకాల్‌కు విరుద్ధం. కానీ, మోదీ విషయంలో అల్ నహ్యాన్ దానిని ఉల్లంఘించారు. 

దీని గురించి పాకిస్తాన్‌లో కూడా చాలా చర్చ జరిగింది. భారత్‌లోని పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ ఈ అంశంపై స్పందిస్తూ, మే నెలలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ యూఏఈని సందర్శించినప్పుడు, ఒక జూనియర్ స్థాయి మంత్రి ఆయనకు స్వాగతం పలికారని, గల్ఫ్ దేశాలు భారత్‌కు ఇస్తున్న ఈ ప్రత్యేక గౌరవం కలవరపెడుతోందని అన్నారు. 

షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌, నరేంద్ర మోదీల మధ్య అపూర్వమైన స్నేహం కుదిరిందని విశ్లేషకులు చెబుతున్నారు. 2017లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా మోదీ ప్రభుత్వం మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. 

అప్పుటికి మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ యూఏఈ అధ్యక్షుడు కాలేదు. అబుదాబి క్రౌన్ ప్రిన్స్‌గా ఉన్నారు. భారత్‌లో గణతంత్ర వేడుకలకు ఒక దేశ ప్రధాని లేదా అధ్యక్షుడి హోదాలో ఉన్నవారినే ముఖ్య అతిథిగా ఆహ్వానించడం ఆనవాయితీ. కానీ, 2017లో రిపబ్లిక్ డేకి అల్ నహ్యాన్ ముఖ్య అతిథిగా వచ్చారు.

 విమానాశ్రయంలో నరేంద్ర మోదీకి స్వాగతం పలుకుతున్న యూఏఈ అధ్యక్షుడు

ఫొటో సోర్స్, @MEAINDIA

ఫొటో క్యాప్షన్, విమానాశ్రయంలో నరేంద్ర మోదీకి స్వాగతం పలికిన యూఏఈ అధ్యక్షుడు

దూరాలు ఎలా తొలగిపోయాయి?

థింక్ ట్యాంక్ కార్నెగీ ఎండోమెంట్ నుంచి అబుదాబిలోని పశ్చిమ దేశాల మాజీ రాయబారి ఒకరు మాట్లాడుతూ, మోదీ వ్యవహారికమైన రాజకీయ విధానం, బలమైన నాయకుడిగా ఆయన శైలి సౌదీ, యూఏఈ యువరాజులను ఆకర్షించిందని అన్నారు. 

మోదీ 2016, 2019లలో సౌదీ అరేబియాలో పర్యటించారు. 2016లో ఖతార్‌, 2018లో ఒమన్, జోర్డాన్, పాలస్తీనా భూభాగాలు, 2019లో బహ్రెయిన్ దేశాలను సందర్శించారు. 

2015లో షేక్ జాయెద్ గ్రాండ్ మసీదును, 2018లో ఒమన్ సుల్తాన్ ఖబూస్ గ్రాండ్ మసీదును సందర్శించారు.

సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్‌లు నరేంద్ర మోదీకి తమ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందించాయి కూడా. 

కార్నెగీ ఎండోమెంట్ 2019 ఆగస్టులో విడుదల చేసిన ఒక నివేదికలో మోదీకి గల్ఫ్ దశాలతో ఉన్న సంబంధాల గురించి ఇలా రాశారు. 

"మోదీ హిందుత్వ జాతీయవాదం అరబ్ దేశాలతో సంబంధాలను కొనసాగించడానికి అడ్డుపడుతుందని మొదట్లో అనిపించింది. 2002 గుజరాత్ అల్లర్ల తరువాత మోదీ ఇంటర్నేషనల్ ఇమేజ్ కూడా దెబ్బతింది. ఈ అల్లర్లలో వందలాది ముస్లింలు చనిపోయారు. కానీ, గల్ఫ్ దేశాలు ముఖ్యంగా సౌదీ అరేబియా, యూఏఈ మోదీని ఆ దృష్టితో చూడలేదు. పొలిటికల్ ఇస్లాం పరిష్కారంలో మోదీ దృష్టికోణం ఆ దేశ పాలకుల అభిప్రాయాలతో సరిపోయింది. 2019 ఫిబ్రవరిలో న్యూ దిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ నరేంద్ర మోదీని 'పెద్దన్నయ్య' అంటూ సంభోదించారు."

2019 ఫిబ్రవరిలో సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ భారత్‌లో పర్యటించారు. దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రసంగిస్తూ, మోదీ తనకు అన్నయ్య అని అన్నారు.

"మేమిద్దరం అన్నదమ్ములం. ప్రధాని మోదీ నాకు పెద్దన్నయ్య. నేను ఆయన తమ్ముడిని, ఆయన అభిమానిని. అరేబియా ద్వీపకల్పంతో భారతదేశానికి ఉన్న సంబంధం వేల సంవత్సరాల నాటిది. చరిత్రను పుస్తకాలకు ఎక్కించక ముందు నుంచీ ఉన్న సంబంధం ఇది. అరబ్ దేశాలకు, భారత్‌కు ఉన్న సంబంధం మా డీఎన్ఏలో ఉంది. గత 70 సంవత్సరాలుగా భారత ప్రజలు మాకు స్నేహితులు. సౌదీ అరేబియా నిర్మాణంలో భాగస్వాములు” అని అన్నారు.

అబ్జర్వర్ రిసెర్చ్ ఫౌండేషన్‌లో పరిశోధకులు, మిడిల్ ఈస్ట్ నిపుణుడు అయిన కబీర్ తనేజా ఒక వ్యాసంలో ఇలా రాశారు.

"2002 అల్లర్ల సమయంలో దిల్లీలోని గల్ఫ్ దేశాల రాయబార కార్యాలయాలు, భారత విదేశాంగ శాఖ నుంచి ఎటువంటి వివరణ కోరలేదు. కానీ, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ (ఓఐసీ)లో పాకిస్తాన్ ఈ అంశాన్ని లేవనెత్తింది. మోదీపై అమెరికా వీసా నిషేధంతో ఈ చర్చ మరింత రాజుకుంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ విజయం సాధించినప్పుడు గల్ఫ్ దేశాలు పెద్దగా స్పందించలేదు. భారతదేశంలో వచ్చిన రాజకీయ మార్పును స్వాగతించడంలో ఆతృత, ఆవశ్యకత కనబర్చలేదు. కానీ, నెమ్మదిగా పరిస్థితులు మారిపోయాయి. మోదీ అలీన విధానానికి దూరం జరిగారు. గతంలో గల్ఫ్ యుద్ధంలో భారతదేశం సద్దాం హుస్సేన్‌కు మద్దతు ఇచ్చింది. కానీ, 2014 తరువాత మోదీ గల్ఫ్ దేశాలతో సంబంధాలను ప్రభావంతంగా పునరుద్ధరించారు."

మోదీ

ఫొటో సోర్స్, @NARENDRAMODI

గల్ఫ్ దేశాలపై మోదీ దృష్టి

2014లో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత గల్ఫ్ దేశాలతో భారత్ సంబంధాలు బలపడ్డాయని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీపై ఉన్న ముస్లిం వ్యతిరేక ఇమేజ్‌ను బద్దలు కొట్టడానికి ఆయన గల్ఫ్ దేశాలపై ప్రత్యేక దృష్టి పెట్టారని భావిస్తున్నారు.

2022లో బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ మొహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు ఇస్లామిక్ దేశాలు ఆగ్రహించాయి. 

ఆ సమయంలో అప్పటి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఖతార్‌ పర్యటనకు వెళ్లారు. వెంకయ్య నాయుడుతో జరగాల్సిన రాజకీయ విందును ఖతార్ రద్దు చేసిందని వార్తలు వచ్చాయి. ఇది భారతదేశ ప్రతిష్టను దెబ్బతీసిందని చాలా మంది అభిప్రాయపడ్డారు.

అయితే, అరబ్ దేశాలతో భారత్ సంబంధాలు చాల బలంగా ఉన్నాయని, ఇలాంటి ఘటనలు లేదా వ్యాఖ్యలు వాటిపై అంతగా ప్రభావం చూపవని లిబియా, జోర్డాన్‌లలో భారత రాయబారిగా పనిచేసిన అనిల్ త్రిగుణాయత్ అభిప్రాయపడ్డారు. 

"అరబ్ ప్రపంచంతో భారత్‌కు చారిత్రక సంబంధం ఉంది. భారతదేశంలోని ఇస్లామిక్ వారసత్వం మన ఉమ్మడి సంస్కృతిలో భాగం. సుమారు 90 లక్షల భారతీయులు గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్నారు. కష్టించి పని చేస్తారని, నిజాయితీగా ఉంటారని మంచి పేరు తెచ్చుకున్నారు. వారి కష్టాన్ని పాడు చేసే విధానాలు మన రాజకీయాల్లో ఉండకూడదు. అరబ్ దేశాలతో సంబంధాలను మెరుగుపరిచేందుకు మోదీ ప్రభుత్వం చాలా కృషి చేసింది. సౌదీ అరేబియా, యూఏఈలు ప్రధాని నరేంద్ర మోదీకి తమ దేశ అత్యున్నత గౌరవాన్ని అందించాయి" అని ఆయన అన్నారు.

2006లో సౌదీ అరేబియా రాజు భారతదేశాన్ని సందర్శించారు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య స్నేహానికి ముఖ్యమైనదని చెబుతారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2006లో సౌదీ అరేబియా రాజు భారతదేశాన్ని సందర్శించారు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య స్నేహానికి ముఖ్యమైనదని చెబుతారు.

భారత్ సహకారం

గల్ఫ్ దేశాలలోని అనేక ముఖ్య రంగాలలో భారత్ సహకారం అందిస్తోంది. ఇంధన, భద్రతా రంగాలలో భారత్ గల్ఫ్ దేశాలతో కలిసి పనిచేస్తోంది.

అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ఏడీఎన్ఓసీ) 2018లో భారత్‌తో ఏడేళ్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో భాగంగా భారత్‌కు కావాల్సిన వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను నింపే బాధ్యత ఈ సంస్థ తీసుకుంది. దీని కింద మంగళూరులోని ఒక నిల్వలో 50.860 లక్షల బ్యారెళ్ల ముడి చమురు నింపాల్సి ఉంది.

ఏడీఎన్ఓసీ, సౌదీ అరేబియా ఆయిన్ కంపెనీ అరాంకో కలిసి మహారాష్ట్రలో 12 లక్షల బ్యారెల్ రిఫైనరీని నిర్మించాలని యోచిస్తున్నాయి. దీనికి 44 బిలియన్ డాలర్ల ఖర్చు అవుతుంది. 

ఇరాన్ వంటి దేశాల నుంచి చమురు దిగుమతులపై అమెరికా ఆంక్షలు విధించిన నేపథ్యంలో, ఈ ప్రాజెక్టులు చాలా ముఖ్యమైనవి. డోనాల్డ్ ట్రంప్ హయాంలో అమెరికా ఈ ఆంక్షలు విధించిన తరువాత, 2018లో భారత్‌ ఇరాన్‌ నుంచి చమురు దిగుమతిని నిలిపివేసింది. 

మరోవైపు, యూఏఈతో భారతదేశ భద్రతా సహకారం అనేక స్థాయిలలో పెరిగింది. మహ్మద్ బిన్ జాయెద్ ప్రభుత్వం ఇస్లామిక్ తీవ్రవాదాన్ని తీక్షణంగా వ్యతిరేకించింది. ఇస్లామిక్ తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశానికి యూఏఈ నుంచి చాలా సహాయం అందింది.

భారత్ పాకిస్తాన్‌లో వైమానిక దాడులను నిర్వహించినప్పుడు, జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేసినప్పుడు కూడా గల్ఫ్ దేశాల నుంచి వ్యతిరేకత రాలేదు.

1970లలో భారత్‌కు యూఏఈతో ద్వైపాక్షిక వాణిజ్యం 18 కోట్ల డాలర్లు కాగా, ఇప్పుడు అది 73 బిలియన్ డాలర్లకు పెరిగింది.

2021-22లో భారతదేశానికి అమెరికా, చైనా తరువాత మూడవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి యూఏఈ. భారత్ నుంచి అమెరికా తరువాత అత్యధిక ఎగుమతులు యూఏఈకే వెళతాయి.

గల్ఫ్ దేశాలు

ఫొటో సోర్స్, Getty Images

గల్ఫ్ నుంచి వచ్చే ఆదాయం

సుమారు 90 లక్షల భారతీయులు గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్నారు. ప్రతి ఏటా కోట్ల డాలర్ల రెమిటెన్స్ అక్కడి నుంచి భారత్‌కు వస్తుంది. 

2019లో గల్ఫ్ దేశాల్లోని భారతీయులు స్వదేశానికి 40 బిలియన్ డాలర్లు పంపారు. ఇది భారత్‌కు వచ్చే మొత్తం రెమిటెన్స్‌లో 65 శాతం. భారత జీడీపీలో మూడు శాతం.

భారత్‌కు కావాల్సిన చమురులో మూడో వంతు గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి అవుతోంది. భారత్‌కు గ్యాస్ సరఫరా చేస్తున్న దేశాల్లో ఖతార్ అగ్రస్థానంలో ఉంది.

గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ)లో మొత్తం ఆరు దేశాలు ఉన్నాయి.. సౌదీ అరేబియా, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్, ఖతార్, బహ్రెయిన్.

2021-2022లో జీసీసీ దేశాలతో భారత్ ద్వైపాక్షిక వాణిజ్యం 154 బిలియన్ డాలర్లు. ఇది భారతదేశం మొత్తం ఎగుమతుల్లో 10.4 శాతం, దిగుమతుల్లో 18 శాతం. 

గత రెండు దశాబ్దాలుగా సౌదీ అరేబియా, యూఏఈలు భారత్‌తో సంబంధాలను బలోపేతం చేసుకోవడంలో నిమగ్నమయ్యాయి. ఈ దేశాలకు అమెరికా, పాకిస్తాన్‌లపై నమ్మకాలు వీగిపోవడంతో ముందు జాగ్రత్త చర్యగా భారత్‌తో స్నేహ సంబంధాలను మెరుగుపరుచుకుంటున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

సౌదీ అరేబియా, యూఏఈ గత రెండు దశాబ్దాలుగా భారతదేశంలో మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు పెడుతున్నాయి. ఇది కాకుండా, భారత్ నుంచి ఈ రెండు దేశాలు గోధుమలు, వ్యాక్సిన్‌ల దిగుమతులను పెంచాయి.

"అబ్రహం ఎకార్డ్స్ తరువాత గల్ఫ్ దేశాల్లో ఇజ్రాయెల్‌కు ఆదరణ పెరగడంతో, భారత్‌కు గల్ఫ్ దేశాలు విడిపోతాయన్న భయం తగ్గింది. ఇజ్రాయెల్‌లో పర్యటించిన తొలి భారత ప్రధాని నరేంద్ర మోదీ. ఆయన ప్రభుత్వం ఇజ్రాయెల్‌తో కూడా సంబంధాలను ముందుకు తీసుకెళ్లింది. భారతదేశం, ఇజ్రాయెల్, యూఏఈ, అమెరికా కలిసి I2U2 కూటమిని ఏర్పాటు చేశాయి" అని అనిల్ త్రిగుణాయత్ వివరించారు.

 అరబ్ దేశాలు

ఫొటో సోర్స్, Getty Images

'మహమ్మద్ ప్రవక్త జోలికి వస్తే అరబ్ దేశాలు ఊరుకోవు'

భారత్‌కు గల్ఫ్ దేశాలతో మంచి సంబంధాలు ఉన్నా, మహమ్మద్ ప్రవక్రపై అనుచిత వ్యాఖ్యలు తగవని, ఇలాంటి సున్నితమైన అంశాల పట్ల భారత్ జాగ్రత్త వహించాలని సౌదీ అరేబియా సహా పలు దేశాలలో భారత రాయబారిగా వ్యవహరించిన తల్మీజ్ అహ్మద్ అన్నారు.

"భారతదేశంలో ముస్లింలకు సంబంధించిన సున్నితమైన అంశాలు చాలా ఉన్నాయి. మతం పేరుతో వారిపై హింస, ఇస్లామిక్ వారసత్వాన్ని తుడిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక దేశం అంతర్గత వ్యవహారాల్లో ఇతర దేశాలు జోక్యం చేసుకోకూడదన్నది ఆనవాయితీ. కానీ, మహమ్మద్ ప్రవక్త జోలికి వస్తే అరబ్ దేశాలు ఊరుకోవు. భారత్ వ్యవహారాలపై విదేశాల్లో చాలా విమర్శలు విన్నాను. స్వదేశంలో ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ, బయటి దేశాల్లో నైతికత గురించి ప్రసంగాలు ఇస్తే చెల్లదు. ఈ ధోరణి ఎల్లకాలం సాగదు. ఈ విషయాలలో భారత్ తన వైఖరిని సరిదిద్దుకోకపోతే భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. భారత వస్తువుల బహిష్కరణ, గల్ఫ్‌లో ఉద్యోగాల్లో భారతీయుల నియామకంపై ప్రతికూలత మొదలైన అంశాలు తెరపైకి రావచ్చు" అని ఆయన అన్నారు. 

ఇవి కూడా చదవండి: