ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీలు ఇరుకు సందులు, రోడ్లపైనే సభలు ఎందుకు పెడుతున్నాయి?

- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ నాయకుల ర్యాలీలు జరిగిన తరువాత రోజు తెలుగు పత్రికలు తిరగేస్తే కొన్ని ఫొటోల కింద ఆసక్తికర క్యాప్షన్లు కనిపిస్తుంటాయి. ఆయా పార్టీలకు అనుకూల పత్రికల్లో ఈ ట్రెండ్ ఉంటుంది.
అదేంటంటే, ‘‘నాయకుడి సభకు హాజరైన జన సందోహంలో ఒక భాగం.’’
మొత్తం ఎంతమంది జనం వచ్చారో చూపించడానికి తమ కెమెరాలు సరిపోలేదనీ, కాబట్టి, వచ్చిన జనంలో ఒక భాగం ఫొటోను మాత్రమే వేస్తున్నట్టు అర్థం వచ్చేలా రాసిన క్యాప్షన్ ఇది.
దాదాపు ఇదే టెక్నిక్ టీవీల్లోనూ వాడతారు. జనం కిక్కిరిసి ఉన్న వీడియో క్లిప్పింగులు మాత్రమే కనిపించేలా ఆయా పార్టీల తరపున మీడియా మేనేజ్‌మెంట్ చేసేవారు, అనుకూల ఛానెల్స్ లో పనిచేసే సిబ్బందీ జాగ్రత్తలు తీసుకుంటారు.
ముఖ్యంగా గాల్లో ఎగురుతూ వీడియోలు తీసే డ్రోన్ కెమెరాలు వచ్చిన తరువాత ఈ ట్రెండ్ మరింత పెరిగింది.
‘‘జన సముద్రం’’, ‘‘జన సునామీ’’, ‘‘జన ప్రవాహం’’ వంటి విశేషణాలు ఉపయోగించడం కోసం తాపత్రయపడుతోన్న పార్టీలు, అది సహజంగా కాకుండా, అలా జనాలు కనిపించే ఏర్పాట్లు చేసే టెక్నిక్‌లను పాటిస్తున్నాయి.

నెల్లూరు జిల్లా కందుకూరులో తెలుగుదేశం పార్టీ సభలో చంద్రబాబు ప్రసంగం సందర్భంగా జరిగిన ఘటనలో 8 మంది చనిపోయారు. కందుకూరులాంటి చిన్న టౌన్లో రోడ్డుపై అంత మందితో సభ జరిగింది.
ఇందులో నిర్వాహక తెలుగుదేశం తప్పు ఉందనీ, కాన్వాయ్ వేగంగా కదలడం, రోడ్డును కావాలని కుదించడం, చెప్పిన స్థలంలో కాకుండా వేరే చోట సభ పెట్టడం – ఈ ఉల్లంఘనలన్నీ జరిగాయని స్థానిక ఎస్పీ మీడియాతో అన్నారు.
పోలీసులే భద్రత కల్పించడంలో విఫలం అయ్యారంటూ తెలుగుదేశం పోలీసులపై ఆరోపణలు చేస్తోంది.
ఈ క్రమంలో అసలు ఊరి మధ్యలో సభలకు ఎలా అనుమతిస్తారనే దానిపై చర్చ జరుగుతోంది.

ఒకప్పుడు సభలు వేరు..
ఒకప్పుడు పెద్ద రాజకీయ నాయకుల పర్యటనల్లో కేవలం బహిరంగ సభలు ఉండేవి. అంటే ఆయా పట్టణాలు, లేదా పెద్ద పల్లెల్లోని కాలేజీ గ్రౌండ్లూ, హైస్కూలు గ్రౌండ్లూ, మునిసిపల్ గ్రౌండ్లూ, పీడబ్ల్యూడీ గ్రౌండ్లూ.. ఇవేవీ దొరక్కపోయినా, సరిపోకపోతే పొలాల్లో సమావేశాలు పెట్టేవారు. స్టేజీ వేసి, టెంట్లు వేసేవారు. అక్కడకే జనం వచ్చేవారు.
ఆ వేదిక వరకూ వెళ్లే అవకాశం లేనివారు, వెళ్లే ఉద్దేశం లేని వారు దారిలో నాయకుడు అక్కడ వరకూ యాత్రలా వెళ్లడం చూసి సరిపెట్టుకునే వారు.
దారి పొడవునా నుంచున్న వారికి కనిపించడం కోసం ఓపెన్ టాప్ జీపుల నుంచి చేతులు ఊపుతూ వెళ్లే దగ్గర నుంచి ఇప్పుడు అన్ని హంగులతో అల్ట్రా లగ్జరీలతో కూడా ప్రత్యేక బస్సులు కాలానికి వచ్చేశారు.
వాహనాలు మాత్రమే కాదు, పార్టీలు కూడా అప్‌డేట్ అయ్యాయి. జనం కోసం సభ పెడితే జనాన్ని తీసుకురావాలి. అది ఖర్చు ప్రయాస. ఆ ప్రసంగం ఏదో జనం నుంచున్న చోటే ఇచ్చేస్తే సులువు – ఇలా ఆలోచిస్తోన్న పార్టీలు, దానికి తగ్గట్టే రోడ్ షోలనే బహిరంగ సభలుగా మార్చేశాయి.

రోడ్డే సభా ప్రాంగణం..
కేవలం నాయకులను చూడ్డానికి రోడ్ షోలు, ప్రసంగం వినడానికి సభలు – అనే గీత చెరిగిపోయి, ఇప్పుడు నడిరోడ్డే సభా ప్రాంగణంగా మారిపోయింది.
‘‘ప్రజలను మీటింగు జరిగే చోటుకు తీసుకురావాలి అంటే లక్షల ఖర్చు. టెంట్ వేయాలి. స్టేజ్ వేయాలి. ఖర్చు + కష్టం. రెండూను. గతంలో 40-50 ఏళ్ల క్రితం ఇందిరా గాంధీ, జయప్రకాశ్ నారాయణ వంటి వారు వస్తున్నారంటే, జనం లక్షమందో రెండు లక్షల మందో సొంతంగా వచ్చేవారు. ఇప్పుడు ఎవరో ఒకరిద్దరు నాయకులకు తప్ప అలా రావడం లేదు. పూర్వంలాగా జనాలను లారీల్లో తరలించే పరిస్థితి లేదు. బస్సులు, జీపులు వంటివి పెట్టాలి. ఇవన్నీ తప్పించుకోవడానికి పార్టీల వాళ్లు రోడ్ షోలు పెట్టేస్తున్నారు’’ అని రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు బీబీసీతో అన్నారు.
‘‘రోడ్ షోలు అంటే రోడ్డు మీద నాయకుడు వెళితే ఆ నాయకుడిని చూడ్డానికి జనం వస్తారు. అక్కడక్కడా ఆగి రోడ్డు బ్లాక్ చేస్తే, ఇంకా జనం కనిపిస్తారు. టీవీల్లో చూపించడానికి, పేపర్లో వేయడానికి మంచి ఫొటోలు, వీడియోలు దొరుకుతాయి. ఇంత జనం వచ్చారా అని ఆశ్చర్యపోయేలా ఉంటాయి ఆ ఫొటోలు. గత 20 ఏళ్లుగా ఈ ట్రెండు బాగా పెరిగింది.’’ అన్నారు పుల్లారావు.

ఫొటో సోర్స్, @JANASENAPARTY
మార్పు అలా..
రాజకీయ పార్టీల దగ్గరకు కార్పొరేట్ ఎలక్షన్ ప్లానర్లు చేరాక పరిస్థితిలో ఇంకా మార్పు వచ్చింది. అధినాయకుడి చుట్టూ ఎప్పుడూ జనం ఉండేలా, వారంతా ఆయన మీదకు ఎగబడుతున్నారని కనిపించేలా చేయడం కోసం వారు ఎన్నో వ్యూహాలను అమలు చేస్తున్నారు.
వాహనాలు వస్తున్నప్పుడు చుట్టూ ఉన్న వారిని తోస్తూ హడావుడి చేయడం, ఇరుకు రోడ్లలో యాత్రలు చేయడం ఇందులో భాగాలే.
‘‘రోడ్ షోలు చాలా కాలం నుంచి ఉన్నప్పటికీ, అప్పట్లో ఇంత హడావుడి ఉండేది కాదు. గతంలో చిన్న జీపు లేదా ప్రస్తుతం కనిపించే బొలెరో లాంటి బండిపై నుంచి మాట్లాడేవారు నాయకులు. అవి తక్కువ ఎత్తు. కాబట్టి తక్కువ దూరం కనిపిస్తాయి. కొద్ది మంది జనం మాత్రమే ఉన్నప్పుడు, ఏదైనా పెద్ద సభకు వెళుతూ, దారిలో మరేదైనా ఊరిలో గుమిగూడి కొద్ది మంది ప్రజలను మాత్రం ఉద్దేశించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఇలా చేసేవారు. కానీ రాను రాను ఈ పద్ధతి మారింది. చిన్న బండ్లు కాకుండా ఎత్తైన వాహనాలపై రెయిలింగ్, మెట్లు పెట్టించి ఇలాంటి సభల కోసమే సిద్ధం చేస్తున్నారు. సౌండ్ బాక్సులన్నిటికీ కలపి ప్రత్యేకంగా ఒక డీసీఎం బండి పెడుతున్నారు. పెద్ద నాయకుడు మంచి కారులో, లేదా హైఎండ్ బస్సులో అక్కడ వరకూ వచ్చి, అక్కడి నుంచి ఈ ప్రసంగం కోసం సిద్ధం చేసిన బస్సు ఎక్కి, మాట్లాడుతున్నారు. దీనివల్ల గతంలో కంటే ట్రాఫిక్ జాం, న్యూసెన్స్ అన్నీ పెరిగాయి.’’ అంటూ తన అనుభవం వివరించారు రిటైర్డ్ డీఎస్పీ శ్రీనివాస రావు.
పరిష్కారం ఏమిటి?
‘‘దీనికి ఒకటే పరిష్కారం. రోడ్ షో అంటే చేతులు ఊపుతూ వెళ్లిపోవాలి తప్ప, ఎక్కడా ఆగి ప్రసంగించే కార్యక్రమం రోడ్లపై, ఊరి మధ్యలో చేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రసంగాలూ, సభలూ ఊరి బయట ఖాళీ స్థలాల్లో ఉండాలి’’అని అన్నారు శ్రీనివాస రావు.
సాధారణంగా రాజకీయ యాత్రలు అంటే ఊరి అవతలి నుంచి వెళ్లే బైపాస్ రోడ్లు, మునిసిపల్ గ్రౌండ్లు దాటి మెయిన్ రోడ్లపై మెయిన్ సెంటర్ లో సభ పెట్టడం ఇప్పుడు అనివార్యం అయింది.
అక్కడ స్టేజీ ఉండదు. ఒక టెంపో లాంటి బండిపై టాప్ చుట్టూ రెయిలింగ్ పెట్టి, నాయకులు ఎక్కడానికి మెట్లు పెడతారు. అదే బండిపై ఇరుక్కుని తోటి ఎమ్మెల్యే స్థాయి నాయకులంతా నుంచుంటే, వారి మధ్య నుంచి అధినేత మాట్లాడతారు.
ఆ వాహనం సరిగ్గా ఊరి మధ్యలో, బిజీగా ఉండే రోడ్డు మీద పెట్టి మాట్లాడతారు. దీంతో ఆ రోడ్డు మొత్తం నిజంగానే ఇసకేస్తే రాలనంత జనం కనిపిస్తారు.
పార్టీలకతీతంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ పద్ధతినే పాటించారు.
‘‘పాదయాత్రలు, రోడ్ షోలు పేరు ఏదైనా ఊరేగింపులు ఊరి మధ్యలో నుంచి వెళ్లాలనే పద్ధతికి పోలీసులు చెక్ పెట్టాలి. దీనికి సరైన గైడ్ లైన్స్ తేవాలి. ఒకవేళ దానికి రాజకీయ నాయకులు ఒప్పుకోకపోతే, కోర్టులు జోక్యం చేసుకుని గైడ్ లైన్స్ ఇవ్వాలి. వాళ్ల పాపులారిటీ చూపించుకోవడానికి సామన్యుల జీవనం నరకం చేస్తున్న ఈ పద్ధతి మారాలి’’అని పుల్లారావు అన్నారు.
ఇవి కూడా చదవండి:
- వరల్డ్ కప్ ఫైనల్: ఇక ఫుట్‌బాల్ రారాజు మెస్సీయేనా
- ఖతార్‌లో ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌తో దుబాయ్ భారీగా ఎలా లబ్ధి పొందుతోందంటే
- Argentina vs France: అర్జెంటీనాకు యువ ఆటగాడు జులియన్ అల్వారెజ్ ఎలా కీలకం అయ్యాడు
- సోక్రటీస్: ప్రపంచంలోనే అత్యుత్తమ ఫుట్‌బాల్ ఆటగాడు.. ప్రపంచ కప్ గెలవలేకపోయాడు
- పీలే: ఫుట్‌బాల్ దిగ్గజం కన్నుమూత
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















