సోక్రటీస్: ప్రపంచంలోనే అత్యుత్తమ ఫుట్‌బాల్ ఆటగాడు.. ప్రపంచ కప్ గెలవలేకపోయాడు

సోక్రటీస్

ఫొటో సోర్స్, SIMON & SCHUSTER PUBLICATION

    • రచయిత, ప్రదీప్ కుమార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆదివారం ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్ 2022 ఫైనల్స్ జరగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అభిమానులందరూ ఈ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు. అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ కల ఈసారైన నెరవేరుతుందో లేదోనని ఉత్కంఠగా ఉన్నారు.

మెస్సీ ఒక్క వరల్డ్ కప్ తప్ప ఫుట్‌బాల్ ఆటలో సాధించాల్సిన విజయాలన్నీ సాధించాడు. 2006 నుంచి ప్రపంచ కప్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉన్నాడు. కానీ, అతడి కెరీర్‌లో ఆ మూల ఖాళీగా ఉండిపోయింది. ఇప్పుడు అయిదవసారి ఈ టోర్నమెంటులో పాల్గొంటున్నాడు.

మెస్సీకి సరిసమానమైన ఆటగాడు పోర్చుగల్‌కు చెందిన క్రిస్టియానో ​​రొనాల్డో కల కూడా క్వార్టర్ ఫైనల్స్‌లోనే కుప్పకూలిపోయింది. ఓటమి తరువాత రొనాల్డో కన్నీళ్లల్లో ఆ బాధ కనిపించింది. వీరిద్దరికీ బహుసా ఇదే చివరి వరల్డ్ కప్ కావచ్చు.

ఈ జాబితాలో క్రొయేషియాకు చెందిన లుకా మాడ్రిచ్, బ్రెజిల్‌కు చెందిన నేమార్‌లను కూడా చేరవచ్చు. ఫుట్‌బాల్ ప్రపంచంలో వీరూ దిగ్గజాలే. కానీ, ప్రపంచ కప్ సాధించలేకపోయారు. 

క్వార్టర్ ఫైనల్లో అత్యుత్తమ గోల్ చేసినప్పటికీ, క్రొయేషియా చేతిలో బ్రెజిల్ ఓడిపోయింది. ఈ ఓటమిని ఎప్పటికీ మరిచిపోలేనని నేమార్ అన్నాడు. అయితే, ఇది తనకు చివరి ప్రపంచ కప్ కాదని, మళ్లీ ఆడతానని చెప్పాడు. 

ఇదే ప్రపంచ కప్ చేసే మాయ. దిగ్గజాలను మళ్లీ మళ్లీ మైదానంలోకి లాక్కొస్తుంది. అయినప్పటికీ, వాళ్ల కల నెరవేరట్లేదు.

అయితే, ఈ ట్రెండ్ ఇప్పటిది కాదు. చరిత్రలో ఎంతోమంది అత్యుత్తమ ఆటగాళ్లు వరల్డ్ కప్ ఛాంపియన్లు కాలేకపోయారు. ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన ఫుట్‌బాల్ ఆటగాడు జార్జ్ బెస్ట్, నెదర్లాండ్స్‌ ఆటగాడు జోహాన్ క్రయఫ్, హంగేరీ ఆటగాడు ఫ్రెనెక్ పుస్కాస్, ఫ్రాన్స్‌కు చెందిన మిచెల్ ప్లాటిని, రష్యాకు చెందిన గోల్ కీపర్ లెవ్ యాషిన్.. వీరంతా ఈ విన్యాసాన్ని సాధించలేకపోయినవారే.

ఈ జాబితాలో ప్రథమ స్థానం మాత్రం బ్రెజిల్‌కు చెందిన సోక్రటీస్‌దే. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్న అద్భుతమైన ఆటగాడు వరల్డ్ కప్ గెలవలేకపోయాడు.

నేడు జరగబోయే మ్యాచ్‌లో అర్జెంటీనా ఓడిపోతే భవిష్యత్తు తరం మెస్సీ గురించి కూడా ఇలాగే చెప్పుకుంటుంది.

ఇంతకీ ఎవరీ సోక్రటీస్? ఏమా కథ?

సోక్రటీస్

ఫొటో సోర్స్, Getty Images

'డాక్టర్ సోక్రటీస్ - ఫుట్‌బాలర్, ఫిలాసఫర్ అండ్ లెజెండ్'

సోక్రటీస్ గురించి తెలుసుకోవాలంటే, అతడి జీవిత చరిత్రపై వచ్చిన పుస్తకం పేరు చూస్తే చాలు.. 'డాక్టర్ సోక్రటీస్ - ఫుట్‌బాలర్, ఫిలాసఫర్ అండ్ లెజెండ్'. 

డాక్టర్, ఫుట్‌బాల్ క్రీడాకారుడు, తత్వవేత్త, లెజెండ్.. ఇదే సోక్రటీస్ ప్రత్యేకత. ఈ పుస్తకాన్ని ఫుట్‌బాల్ జర్నలిస్ట్ ఆండ్రూ డోనే రాశారు. ఆయన రాయిటర్స్ వార్తా సంస్థ కోసం బ్రెజిల్‌లో 17 ఏళ్లు పనిచేశారు. సోక్రటీస్ ఆటను, జీవితాన్ని, అతడికున్న క్రేజ్‌ను ప్రత్యక్షంగా చూసిన తరువాత ఈ పుస్తకం రాశారు. 

ఈ పుస్తకానికి మరొక స్టార్ ఆటగాడు జోహాన్ క్రయఫ్ (నెదర్లాండ్స్) ముందుమాట రాశాడు.

"సోక్రటీస్ బంతితో ఏం చేయాలనుకుంటే అది చేయగలడు. అతను మైదానంలో వేగంగా పరిగెత్తడు. ఇతర ఆటగాళ్లను ముప్పుతిప్పలు పెట్టడు. అద్భుతమైన హెడర్స్ వేయడు. కానీ తను అనుకున్నది చేస్తాడు. కొందరు ఆటగాళ్లు అన్నిట్లోనూ వేలు పెట్టగలరు. వాళ్లు వేలు పెట్టిన ప్రతీదీ బెస్ట్ అవుతుంది. సోక్రటీస్ అలాంటి ఆటగాడు."

సోక్రటీస్ తండ్రి బాగా చదువుకున్నవాడు, పండితుడు. ఆయనపై గ్రీకు తత్వశాస్త్రం ప్రభావం ఎక్కువగా ఉండేది. అందుకే కొడుక్కి సోక్రటీస్ అని పేరు పెట్టారు. సోక్రటీస్ తండ్రికి కూడా ఫుట్‌బాల్ అంటే మక్కువ.

సోక్రటీస్‌కు ఆరేళ్లు ఉన్నప్పుడు, తండ్రి బ్రెజిల్‌లోని ప్రసిద్ధ క్లబ్ శాంటోస్ టీ-షర్టు కొనిచ్చారు. పీలే లాంటి దిగ్గజాలు శాంటోస్ క్లబ్ నుంచే వచ్చారు. వాళ్ల ఆటను చూసే అవకాశం సోక్రటీస్‌కు దక్కింది. 

సోక్రటీస్‌కు చిన్నతనంలో ఫుట్‌బాల్‌తో పాటు జూడో, బాక్సింగ్‌ అంటే కూడా ఇష్టంగా ఉండేది. అయితే, చాలా త్వరగా అతడికి బొటాఫోగో క్లబ్‌తో ఆడే అవకాశం వచ్చింది. గరించా వంటి లెజెండ్ ఆటగాళ్లు ఈ క్లబ్ నుంచి వచ్చారు. 

సోక్రటీస్

ఫొటో సోర్స్, Getty Images

 మెడిసిన్ చదువు, ఆట

ఫుట్‌బాల్‌లో ఆరితేరక ముందే సోక్రటీస్ మెడిసిన్ చదువు పూర్తి చేశాడు. సావో పాలో యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ డిగ్రీ పొందాడు. 

చిన్నతనంలో చదువులు, క్రీడలు రెండు కష్టమవుతున్నాయని, చదువు మానేశాడు. కానీ, ఈ విషయాన్ని ఇంట్లో చెప్పలేదు. చదువుకోవడానికని చెప్పి సినిమాలకు, పబ్‌లకు వెళ్లేవాడు. సోక్రటీస్ పరీక్షలో ఫెయిల్ అయిన తరువాత ఈ విషయాలన్నీ కుటుంబ సభ్యులకు తెలిశాయి.

ఈ సంగతులన్నీ సోక్రటీస్ జీవిత చరిత్రలో రాశారు.

ఆ తరువాత, అతడి తండ్రి విద్య ప్రాముఖ్యాన్ని వివరించి చెప్పడంతో మళ్లీ చదువులో పడ్డాడు. 18 ఏళ్ల వయసులో మెడిసిన్ చదువు కోసం నాలుగు యూనివర్సిటీలకు ప్రవేశ పరీక్ష రాస్తే, నాలుగింటిలోనూ ఎంపికయ్యాడు. ఇంటికి దగ్గరగా ఉన్న సావో పాలోను ఎంచుకున్నాడు. 

సోక్రటీస్ 1979లో బ్రెజిల్ ఫుట్‌బాల్ జట్టులోకి వచ్చాడు. 1982లో తొలి వరల్డ్ కప్ ఆడాడు. పొడవాటి జుట్టు, గడ్డం, జీన్స్‌లతో సోక్రటీస్ కూల్ ఫుట్‌బాల్ అటగాడిగా పేరు పొందాడు.

బ్రెజిల్‌లో సోక్రటీస్‌ను కేవలం ఒక ఫుట్‌బాల్ ఆటగాడిలా మాత్రమే కాకుండా, క్రీడలు, సామాజిక, రాజకీయ అంశాలను అర్థం చేసుకున్న మేధావిగా పరిగణిస్తారు. 

ఫుట్‌బాల్ గురించి సోక్రటీస్ ఏమంటారంటే, "ఫుట్‌బాల్ మిమ్మల్ని నిజానికి దగ్గర చేస్తుంది. మరే ఇతర వృత్తి అలా చేయదు. ఫుట్‌బాల్ అంత ప్రజాస్వామ్యంగా ఉంటుంది. నేనెప్పుడూ భిన్న సామాజిక నేపథ్యాల నుంచి వచ్చిన ఆటగాళ్లతో ఉంటాను. అందుకే సత్యం కళ్లకు కనిపిస్తుంది." 

సోక్రటీస్‌కు జట్టులోని నల్లజాతీయులు, పేద ఆటగాళ్లకు సహాయం చేయాలన్న ఆలోచన వచ్చింది. ఆటగాళ్లు క్లబ్‌లతో చేసుకునే ఒప్పందాలు క్లబ్ ప్రయోజనాలు నెరవేర్చేవేగానీ, ఆటగాళ్లకు లాభదాయకంగా ఉండేవి కాదని అతడు నమ్మాడు. అందుకే, సోక్రటీస్‌ను మేధావిగా పరిగణిస్తారు. 

బ్రెజిల్ జాతీయ జట్టులోకి చేరకముందు, బ్రెజిలియన్ క్లబ్ కొరింథియన్స్‌లో స్టార్ ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ క్లబ్ నిజానికి బ్రెజిల్‌లోని శ్రామిక వర్గాల వారి క్లబ్. ఇక్కడి ఆటగాళ్లు క్లబ్ కార్మికుల ప్రయోజనాల కోసం పోరాడారు. ఆ తరువాత ఇది కొరింథియన్స్ డెమొక్రసీగా పేరు పొందింది. క్లబ్‌లో అవినీతి బాగా తగ్గింది. ఈ పోరాటం సోక్రటీస్‌ను హీరోను చేసింది. 

సోక్రటీస్ మైదానంలో నెమ్మదిగా కదులుతాడు. కానీ, సాంకేతికంగా ఆటలో నిపుణుడు. గేమ్‌ను ముందుగానే పసిగట్టగలడు. అందుకే కచ్చితమైన షాట్లు కొడతాడు. కచ్చితమైన గోల్స్ కొడతాడు.

సోక్రటీస్

ఫొటో సోర్స్, Getty Images

1982 ప్రపంచ కప్‌లో నిప్పులు చెరిగిన జట్టు

1982 వరల్డ్ కప్‌లో బ్రెజిల్ ఫేవరెట్ టీంగా బరిలోకి దిగింది. కెప్టెన్‌గా సోక్రటీస్ జట్టును ముందుకు నడిపించాడు. గేమ్‌లో సెంటర్ మిడ్‌ఫీల్డర్ పాత్ర పోషించాడు. అతడితో పాటు జికో, క్రెజ్సీ, ఇదార్, ఫాల్కావో వంటి మిడ్‌ఫీల్డర్లు ఉన్నారు. 

వీరందిరితో కలిసి సోక్రటీస్ గట్టి రక్షణ వ్యూహం తయారుచేశాడు. టోర్నమెంట్‌కు ముందు విలేఖరుల సమావేశంలో సోక్రటీస్‌ను ఓ ప్రశ్న అడిగారు.

'ఫుట్‌బాల్ కనిపెట్టిందే డచ్ జట్టు. పీలే జట్టు ఈ ఆటను చీల్చి చెండాడుతుంది. మీ సంగతేంటి?' అని సోక్రటీస్‌ను అడిగారు.

దానికి, "ఆర్గనైజ్డ్ కేయోస్" (సంఘటిత గందరగోళం) అని జవాబిచ్చాడు. 

రష్యాతో జరిగిన తొలి మ్యాచ్ లో బ్రెజిల్ జట్టు వెనుకబడింది. 75 నిమిషాల ఆట తరువాత, జట్టు ఒక గోల్ వెనుకబడి ఉంది. అప్పుడే గోల్‌పోస్ట్‌కు 40 గజాల దూరంలో సోక్రటీస్ బంతిని అందుకున్నాడు. రెప్పపాటులో ఇద్దరు డిఫెండర్‌లను తప్పించి గోల్‌పోస్ట్ ఎడమ వైపుకు బాల్ కొట్టాడు. ఆ తరువాత, ఐడర్‌ మరో గోల్‌ కొట్టడంతో జట్టు విజయం సాధించింది.

తన గోల్ గురించి మాట్లాడుతూ "అది గోల్ కాదు, అంతులేని స్కలనం" అన్నడు సోక్రటీస్. 

అయితే, బ్రెజిల్ చివరి క్షణంలో ఇటలీ చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో కూడా సోక్రటీస్ గోల్స్ చేసి జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. 2-2 డ్రా తర్వాత, ఇటలీ ఆటగాడు పాలో రోస్సీ హ్యాట్రిక్ గోల్స్ కొట్టడంతో బ్రెజిల్ టోర్నమెంట్ నుండి నిష్క్రమించింది. సెమీ ఫైనల్స్‌కు చేరకుండానే వెనుదిరిగింది. బ్రెజిల్ ఓడిపొయినందుకు అభిమానులు కన్నీళ్లు పెట్టుకున్నారు. 

"టోర్నమెంటులో ఓడిపోయాంగానీ, మేం బాగా ఆడాం. ఆటగాళ్ల మధ్య స్నేహం, సోదరభావం చెదరదు" అని చెబుతూ సోక్రటీస్ కూడా కన్నీటిపర్యంతమయ్యాడు.

పీలే తన ఆటోబయోగ్రఫీలో బ్రెజిల్ జట్టు గురించి సోక్రటీస్ గురించి రాస్తూ, "సోక్రటీస్ అద్భుతమైన మిడ్‌ఫీల్డర్. అతడి జట్టు కూడా తక్కువేం కాదు. కానీ, ఇదే జట్టు బలం, బలహీనత. జట్టుకు స్ట్రైకింగ్ ఫార్వర్డ్‌లు లేరు" అన్నాడు.

1982 వరల్డ్ కప్‌లో ఓటమి సోక్రటీస్‌ను చాలా నిరాశపరిచింది.

"ఈ ఓటమిని అర్థం చేసుకోవడం కష్టం. ఎందుకంటే మేం ఏ తప్పు చేయలేదు. ఎక్కడా ఏమీ తక్కువ కాలేదు. మనం ఓటమికి సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా ఫుట్‌బాల్ ఆటలో. ఇది ఆత్మీయుల చావు లాంటిది. ఎప్పుడో ఒకప్పుడు చనిపోతారని తెలిసినా, దుఃఖం తరగదు" అన్నాడు సోక్రటీస్. 

ఆ దుఃఖం నుంచి సోక్రటీస్ కోలుకోలేదు. మైదానంలో చురుకుగా ఉన్నప్పటికీ, ఆట పట్ల అతని అంకితభావం మళ్లీ కనిపించలేదు.

ఈ ఓటమి ప్రభావం బ్రెజిల్‌లో కూడా కనిపించింది. కొరింథియన్స్ డెమోక్రసీ ఉద్యమం ఆగిపోతుందని సమాజంలోని సంపన్న వర్గం భావించింది. కానీ, బ్రెజిల్ దేశీయ టోర్నమెంటుల్లో సోక్రటీస్ తన జట్టును ఛాంపియన్ చేసి, ఉద్యమాన్ని సజీవంగా నిలిపాడు.

సోక్రటీస్

ఫొటో సోర్స్, SIMON & SCHUSTER PUBLICATION

ప్రజాస్వామ్యంపై గురి

సోక్రటీస్ 1986 ప్రపంచ కప్‌లో కూడా ఆడాడు. మెక్సికోలో జరిగిన ఈ ప్రపంచ కప్‌లో గాయాల కారణంగా కెప్టెన్సీకి దూరమైనా, జట్టులో ఎంపికయ్యాడు.

స్పెయిన్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో పెనాల్టీ మీద గోల్ సాధించాడు. కానీ, క్వార్టర్-ఫైనల్స్‌లో పెనాల్టీ షూట్ అవుట్‌లో ఓడిపోయాడు. ఫ్రాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రెజిల్ ఓడిపోయింది. ఇదే అతడికి చివరి మ్యాచ్ అని స్పష్టమైంది. 

సోక్రటీస్‌ భిన్న జీవనశైలి, తాగుడు, సిగరెట్ లాంటి అలవాట్లు ఉన్నప్పటికీ, ఫుట్‌బాల్ ప్రపంచంలో అతడు ఎప్పుడూ చర్చలో నిలిచాడు.

సోక్రటీస్ ప్రజాస్వామ్య దృక్పథాలు అతడికి తత్వవేత్త, లెజెండ్ హోదాను సంపాదించిపెట్టాయి. జీవితాంతం పేదల పక్షం వహించాడు. 

ఫుట్‌బాల్ ఆటగాడు అయినప్పటికీ, తన హీరోలు ఫిడెల్ కాస్ట్రో, చేగువేరా అని చెప్పుకునేవాడు. కాస్ట్రో మీద ఇష్టంతో తన కొడుక్కి ఫిడెల్ అని పేరు పెట్టుకున్నాడు.

బీటల్ గ్రూప్‌కు చెందిన యుద్ధ వ్యతిరేక ఉద్యమకారుడు జాన్ లెనన్ ప్రభావం కూడా సోక్రటీస్‌పై ఉంది.

సోక్రటీస్ వ్యక్తిగత జీవితం గందరగోళంతో నిండిపోయింది. నాలుగు వివాహాలు చేసుకున్నాడు. అయిదుగు పిల్లలు పుట్టారు.

ఆర్థిక, రాజకీయ అంశాలపై వార్తాపత్రికలలో కథనాలు రాసేవాడు. ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానులు అతడిని ప్రేమిస్తూనే ఉన్నారు. 

మితిమీరిన మద్యపానం కారణంగా 2011 డిసెంబర్ 4న కేవలం 57 సంవత్సరాల వయస్సులోనే మరణించాడు. 

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సోక్రటీస్ బ్రెజిల్‌కు ప్రపంచ కప్‌ను గెలవలేకపోయినా, అతడి తమ్ముడు రాయ్ కెప్టెన్సీలో బ్రెజిల్ 1994 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. సోక్రటీస్ చూసిన కలను, తన తమ్ముడు నెరవేర్చాడు. 

ఇవి కూడా చదవండి: