ఖతార్: ఫిఫా ప్రపంచకప్ 2022.. ‘మెస్సీ వరల్డ్ కప్’ కానుందా? ఫైనల్‌లో అర్జెంటీనా విజయం సాధిస్తుందా?

మెస్సీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఫిల్ మెక్‌నల్టీ
    • హోదా, లుసైల్ స్టేడియం చీఫ్ ఫుట్‌బాల్ రైటర్

లియోనల్ మెస్సీ, వరల్డ్ కప్‌ను ముద్దాడటానికి కేవలం ఒక విజయం దూరంలో ఉన్నాడు.

ఖతార్‌లో ఆదివారం జరిగే ఫైనల్‌లో మ్యాచ్ చివరి క్షణం వరకు అందరి కళ్లూ మెస్సీపైనే ఉంటాయి.

ఎందుకంటే, ఈ టోర్నీ ‘మెస్సీ ప్రపంచకప్’గా గుర్తుండిపోవడానికి ఇంకా 90 నిమిషాల ఆట మాత్రమే మిగిలి ఉంది.

అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ ఇప్పటివరకు వరల్డ్ కప్‌ను అందుకోలేదు. 2014లో అర్జెంటీనా జట్టు ఫైనల్స్‌కు చేరుకున్నా రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈ లోటు అతనికి మిగిలిపోయింది.

1986లో మెక్సికో వేదికగా జరిగిన వరల్డ్‌కప్ ఫైనల్‌లో అర్జెంటీనా విజయంపై డిగో మారడోనా, యోకోహామాలో 2002 బ్రెజిల్ విజయంలో స్ట్రయికర్ రొనాల్డో చెదరని ముద్రలు వేసినట్లుగానే.... ఒకవేళ ఈ ఫైనల్లో అర్జెంటీనా గెలుపులో మెస్సీ కీలక పాత్ర పోషిస్తే ఇది ‘మెస్సీ వరల్డ్ కప్’గా చరిత్రలో గుర్తుండిపోతుంది.

మెస్సీ

ఫొటో సోర్స్, Getty Images

ఫ్రాన్స్, మొరాకో జట్ల మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో ఫైనల్లో అర్జెంటీనా టైటిల్ కోసం తలపడుతుంది.

ఈ వరల్డ్ కప్‌లో అర్జెంటీనాకు పెద్ద షాక్ తగిలింది. ఆరంభంలోనే సౌదీ అరేబియా చేతిలో అర్జెంటీనా ఓటమి పాలైంది. ఈ ఓటమి ప్రపంచాన్ని నివ్వెరపరిచింది.

కానీ, క్రొయేషియాతో సెమీఫైనల్లో మెస్సీతో పాటు యువ ఆటగాడు జులియన్ అల్వారెజ్ సత్తా చాటిన తీరు, వారు ఒక కచ్చితమైన ప్రణాళికతో ఫైనల్‌ను ఆడబోతున్నారనే హెచ్చరికలను ప్రపంచానికి పంపింది.

ఆరోసారి వరల్డ్ కప్ ఫైనల్ ఆడనున్న అర్జెంటీనా ఈ మ్యాచ్‌లో గెలిచి తన ఖాతాలో మూడోసారి టైటిల్‌ను వేసుకుంటుందా? ఆటలో దిగ్గజ క్రీడాకారుడిగా పేరున్న మెస్సీ తన చేతితో వరల్డ్ కప్‌ను అందుకుంటాడా? అనేది ఆదివారం లుసైల్ స్టేడియంలో జరిగే ఫైనల్‌తో తేలుతుంది.

35 ఏళ్ల మెస్సీ వరల్డ్ కప్‌లలో 25 మ్యాచ్‌లు ఆడి లోథర్ మాథౌస్ రికార్డును సమం చేశాడు.

సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుండగా అర్జెంటీనా మద్దతుదారులు కాసేపు ఆందోళనకు గురయ్యారు. మ్యాచ్ 19వ నిమిషంలో మెస్సీ తొడ కండరాల నొప్పితో బాధపడ్డాడు. అసౌకర్యంగా కదిలాడు. దీంతో మెస్సీ ఆటకు దూరం అవుతాడేమోనని అభిమానులు కాసేపు కలవరపడ్డారు.

మెస్సీ

ఫొటో సోర్స్, Getty Images

అయితే, వెంటనే కోలుకున్న మెస్సీ లయను అందుకోవడం ప్రారంభించాడు.

మ్యాచ్ 34వ నిమిషంలో అందరూ కోరుకుంటున్న అవకాశం రానే వచ్చింది. అల్వారెజ్‌ను అడ్డుకునే ప్రయత్నంలో క్రొయేషియా కీపర్ ఫౌల్ చేయడంతో అర్జెంటీనాకు పెనాల్టీ లభించింది.

ఈ అవకాశాన్ని లియోనల్ మెస్సీ సద్వినియోగం చేసుకుంటూ గోల్ చేయడంతో అర్జెంటీనా 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.

తర్వాత అయిదు నిమిషాలకే ఈ ఆనందం రెట్టింపు అయింది. మెస్సీ హెడర్ నుంచి వచ్చిన బంతిని అదుపు చేస్తూ , డిఫెన్స్‌ను తప్పించుకుంటూ అల్వారెజ్ అద్భుత గోల్‌ను సాధించాడు.

ప్రత్యర్థి ఆటగాళ్లు జోసిప్ జురానోవిక్, బోర్నా సోసాలను బోల్తా కొట్టిస్తూ తర్వాత గోల్ కీపర్ లివాకోవిక్‌ను తప్పిస్తూ అతను బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది.

మ్యాచ్ 69వ నిమిషంలో మెస్సీ, అల్వారెజ్ జోడీ మరోసారి మ్యాజిక్ చేసింది. మెస్సీ లాఘవంగా అందించిన పాస్‌ను అల్వారెజ్ మరోసారి గోల్‌గా మలచడంతో అర్జెంటీనాకు 3-0తో తిరుగులేని ఆధిక్యం దక్కింది.

ఈ దశలో ‘ఎ-లిస్ట్’ డిఫెండర్‌గా పేరున్న జోస్కో గ్వాడ్రియల్, మెస్సీని చుట్టుముట్టాడు. కానీ తెలివిగా జోస్కోను బురిడీ కొట్టించిన మెస్సీ, అల్వారెజ్‌కు బంతిని అందించాడు.

మెస్సీ, గ్వాడ్రియల్‌ను విస్తుపోయేలా చేయడం ఇదొక్కసారే కాదు, అంతకుముందు మరో రెండు సందర్భాల్లో కూడా మెస్సీ ఇలాగే చేశాడు.

అర్జెంటీనా

ఫొటో సోర్స్, Getty Images

ఈ మ్యాచ్‌ను అర్జెంటీనా ప్లేయర్ మెస్సీ, క్రొయేషియా ఆటగాడు లుకా మోడ్రిచ్‌ల మధ్య పోటీగా అందరూ పరిగణించారు.

అయితే, చివరకు క్రొయేషియా స్టార్ ప్లేయర్ లుకా మోడ్రిచ్‌కు నిరాశే మిగిలింది. మ్యాచ్ ముగియడానికి 9 నిమిషాల ముందు అతను మైదానం నుంచి బయటకు వచ్చాడు. అతని స్థానంలో సబ్‌స్టిట్యూట్ ఆటగాడు లోపలికి వెళ్లాడు. ఈ సమయంలో అభిమానులంతా లుకాను చప్పట్లతో అభినందించారు. ఇక్కడితో మోడ్రిచ్ ప్రయాణం ముగిసినట్లే.

చివరి విజిల్ శబ్ధం రాగానే అర్జెంటీనా కోచ్ లియోనల్ స్కలోనీ భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. మెస్సీ ప్రదర్శనకు అభినందనలు తెలిపారు.

ఆదివారం కూడా మెస్సీ షో కొనసాగనుంది. 2014 వరల్డ్ కప్ ఓటమి చేదు గుర్తులను చెరిపేసే అవకాశం ప్రస్తుతం మెస్సీ ముందుంది.

1996 నుంచి ప్రపంచకప్‌ టోర్నీలోని నాలుగు వేర్వేరు మ్యాచ్‌ల్లో గోల్‌ చేయడంతో పాటు మరో ఆటగాడు గోల్ చేయడానికి సహకారం అందించిన తొలి ప్లేయర్‌గా మెస్సీ ఘనత సాధించాడు.

2006 వరల్డ్‌కప్‌లో సెర్బియాతో మ్యాచ్‌లో, ఈ వరల్డ్‌కప్‌లో మెక్సికో, నెదర్లాండ్స్, క్రొయేషియాలతో మ్యాచ్‌ల్లో మెస్సీ స్వయంగా గోల్ చేయడంతో పాటు ఇతరులకు గోల్‌ అవకాశాలు సృష్టించాడు.

ఈ ప్రపంచకప్‌లో అర్జెంటీనా మొత్తం 12 గోల్స్ చేసింది. ఇందులో 5 గోల్స్ మెస్సీ చేశాడు. మరో 3 గోల్స్‌కు అతను సహకరించాడు.

ఓవరాల్‌గా వరల్డ్ కప్ టోర్నీల్లో అతను 11 గోల్స్ చేశాడు. ఇది అర్జెంటీనా తరఫున రికార్డు.

తాజా టోర్నీలో 5 గోల్స్‌తో మెస్సీ, గోల్డెన్ బూట్ అవార్డు రేసులో కైలియన్ ఎంబాపేతో సమానంగా నిలిచాడు.

క్రొయేషియా

ఫొటో సోర్స్, Getty Images

ఎవరు గొప్ప?

అర్జెంటీనాలో గొప్ప ఫుట్‌బాల్ ఆటగాడు మెస్సీనా? లేక మారడోనానా? అనే వాదన నేపథ్యంలో... ఆదివారం అర్జెంటీనా జట్టు వరల్డ్ కప్‌ను గెలుపొందితే దానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుందని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలన్ షియరర్ అన్నారు.

‘‘ఒకవేళ అర్జెంటీనా గెలిస్తే అది ఎంత బావుంటుంది. మెస్సీ, మారడోనాలో ఎవరు గొప్ప అనే చర్చకు ఇక్కడితో తెరపడుతుందా?

అర్జెంటీనాకు మారడోనా వరల్డ్ కప్ అందించాడు.

ఒక్క వరల్డ్ కప్ తప్ప తాను ఆడిన క్లబ్ తరఫున, దేశం తరఫున మెస్సీ అన్నింటినీ గెలిచాడు. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా గెలిస్తే నా దృక్పథం మారిపోతుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

ఆదివారం లుసైల్ స్టేడియం ఈ ఘటనకు సాక్ష్యంగా నిలుస్తుందా? ఒకవేళ అదే జరిగితే ఈ వరల్డ్ కప్ ఎల్లప్పుడూ ‘మెస్సీ వరల్డ్ కప్’ అనే పేరుతోనే గుర్తుండిపోతుంది.

వీడియో క్యాప్షన్, 'నీళ్లు తాగండి' అన్న రొనాల్డో... 400 కోట్ల డాలర్లు నష్టపోయిన కోకాకోలా

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)