డేటింగ్: బహుళ వ్యక్తులతో సంబంధాలు నడిపే ‘సోలో పాలియమరి’లో మంచి, చెడు ఏమిటి?

సోలో పాలియామరిస్టులు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జెస్సికా క్లెయిన్
    • హోదా, ...

తమకంటూ ఒక ప్రత్యేక జీవిత భాగస్వామి లేకుండా, పలువురు వ్యక్తులతో సన్నిహిత సంబంధాలను కొనసాగించే సోలో పాలియామరిస్టులు.. రిలేషన్‌షిప్ పరంగా సమాజంలో ఉన్న ఎన్నో కట్టుబాట్లకు, ఆంక్షలకు తెరదించుతున్నారు.

35 ఏళ్ల క్రిష్‌కి మూడేళ్ల క్రితం తాను బైసెక్సువల్ అని తెలిసిన తర్వాత, ఆయన ఇక సంప్రదాయబద్ధమైన వివాహ జీవితంలో గడపాల్సినవసరం లేదని నిర్ణయించుకున్నారు.

‘‘నా జీవితంలో ఒకేసారి అమ్మాయి, అబ్బాయి ఇద్దరితో సంబంధాలను కలిగి ఉండాలనుకున్నాను’’ అని క్రిష్ తెలిపారు. అయితే, క్రిష్ తన ఇంటిపేరును గోప్యంగా ఉంచాలనుకున్నారు. ‘జీవితంలో ఏక పత్నిత్వం వల్ల, నన్ను నేను మోసం చేసుకున్నట్టు అవుతుందని భావించాను’ అని క్రిష్ అన్నారు.

కరోనా మహమ్మారి సమయంలో, క్రిష్ న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో ఉన్న సెక్స్-పాజిటివ్ కమ్యూనిటీకి వెళ్లారు. తన సెక్స్, సెక్యువాలిటీతో ఉన్న తన సంబంధాలను మరింత పెంచుకునేందుకు అదే సురక్షితమైన ప్రదేశంగా క్రిష్ భావించారు. ఆ కమ్యూనిటీ ద్వారా ఓపెన్ స్మార్టర్ అనే కోర్సును ఆయన కనుగొన్నారు.

ఈ కోర్సు నైతికంగా ఒకరికి మించిన వ్యక్తులతో వివిధ రకాల సంబంధాలను ఎలా కలిగి ఉండాలో విద్యార్థులకు బోధిస్తుంది. అక్కడే క్రిష్ తొలిసారి ‘సోలో పాలియామరి’ అనే పదాన్ని విన్నారు. తన డేటింగ్ విధానానికి ఇది సరిగ్గా సరిపోతుందని క్రిష్ వెంటనే భావించారు.

ఎలాంటి నిర్దిష్ట, ప్రాథమిక భాగస్వామి లేకుండా బహుళ వ్యక్తులతో సంబంధాలను కలిగి ఉండటం లేదా డేటింగ్ చేయడాన్ని సోలో పాలియామరిగా నిర్వచిస్తున్నారు. దీనిలో ఒక వ్యక్తి పైన పేర్కొన్న విధంగా ఇతర అందరి భాగస్వాములతో సంబంధాలను కలిగి ఉంటాడు.

సోలో పాలియామరిస్ట్ తనని తాను మాత్రమే ప్రైమరీ పార్టనర్‌గా భావిస్తాడు. మరో వ్యక్తిని ప్రైమరీ పార్టనర్‌గా తన జీవితంలోకి ఆహ్వానించలేడు. ఇతరులతో తన ఆర్థిక సంబంధాలను కానీ ఇంటిని కానీ పంచుకోలేరు. అంతేకాక పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలనుకోరు.

వీడియో క్యాప్షన్, ఒక వ్యక్తి ఒకేసారి ఇద్దరమ్మాయిలను పెళ్లి చేసుకోవడం చట్టబద్ధమేనా?

యువత ఎక్కువగా ఈ సంబంధాలను కోరుకుంటున్నారు

సాధారణంగా పాలియామరిస్టులలో సోలో పాలియామరిస్టులు చాలా తక్కువ సంఖ్యలోనే ఉంటారని, వారిలో చాలా మందికి ప్రైమరీ పార్టనర్‌ ఉంటారని లేదా ఒకర్ని ప్రైమరీ పార్టనర్‌గా ఉంచుకోవాలనుకుంటారని 39 ఏళ్ల ఫిలాడెల్ఫియా సెక్సు ఎడ్యుకేటర్, థెరపిస్టు లిజ్ పావెల్ చెప్పారు.

అయితే మొత్తం జనాభాలో ఇలాంటి సంబంధాలను కలిగి ఉన్న వారు ఎంత శాతంలో ఉన్నారో చెప్పడం కష్టమని అన్నారు. పాత తరంతో పోలిస్తే ప్రస్తుత యువతరం ఎక్కువగా ఇద్దరి కంటే ఎక్కువ మందితో సంబంధాలను కలిగి ఉండేందుకు మొగ్గు చూపుతున్నారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

2020లో 1,300 మంది అమెరికా అడల్ట్స్‌పై చేపట్టిన యూగవ్ సర్వేలో.. 43 శాతం మంది యువత ఎక్కువగా తమ సంబంధాలను ఇద్దరికి మించిన వ్యక్తులతో కలిగి ఉండాలనుకుంటున్నారని తెలిపారు. అలాగే జనరేషన్ ఎక్స్‌కు చెందిన వారు కేవలం 30 శాతం మంది మాత్రమే ఇలాంటి సంబంధాలను కోరుకుంటున్నారు.

ఇక్కడ గమనించాల్సింది ఒకటుంది.. 2016లో చేపట్టిన రెండు భిన్నమైన అమెరికా అధ్యయనాల్లో కేవలం 20 శాతం మంది రెస్పాడెంట్లే ఒక దశలో తాము ఇద్దరికి మించిన వ్యక్తులతో సంబంధాలను నెరిపామని చెప్పారు. అయితే, ఈ అధ్యయనాల్లో ఎంత మంది సోలో పాలియామరి అన్నది గుర్తించి చెప్పడం కష్టం.

వీడియో క్యాప్షన్, ప్రేమ, పెళ్లి గురించి యువత చెబుతున్నదేంటి? చేస్తున్నదేంటి?

రొమాంటిక్ పార్టనర్‌షిప్ కోసం ప్రత్యామ్నాయ విధానాలు ఎంపిక...

సోలో పాలియామరిస్టులు మైనార్టీలుగా గుర్తించినప్పటి నుంచి వారి జీవన విధానాల్లో పలు అపోహలు, సందేహాలు తలెత్తాయి. ఎవరైనా తమకంటూ ఒక ప్రత్యేకమైన జీవిత భాగస్వామి దొరికే వరకు సోలో పాలియామరిస్టుగా ఉంటే వారిని ప్రజలు స్వార్థపరులుగా లేదా అత్యాశ కలిగిన వారిగా పరిగణిస్తున్నారు.

అయితే, సోలో పాలియామరి సామాజికపరంగా ఉన్న కట్టుబాట్లను తెంచుకుని, సెక్సువల్, రొమాంటిక్ పార్టనర్‌షిప్‌ల కోసం పలు ప్రత్యామ్నాయ విధానాలను ఎంచుకునేలా ప్రోత్సహిస్తుంది.

సోలో పాలియామరి అనే పదం జర్నలిస్టు అమీ గెహ్రాన్ రాసిన బ్లాగ్ సోలోపాలి డాట్ నెట్ ద్వారా బాగా ప్రాచుర్యం పొందింది. ఆమె తన పెన్ నేమ్ అగీ సెజ్ పేరుతో ఈ బ్లాగ్‌ను నడుపుతున్నారు. తన తొలి బ్లాగ్ పోస్టు 2012లో ‘‘రైడింగ్ ది రిలేషన్‌షిప్ ఎస్కలేటర్ (ఆర్ నాట్)’’ పేరుతో ప్రచురితమైంది.

ఆ తర్వాత ఐదేళ్లకు, ఇదే అంశంపై ఆమె పుస్తకం శారు. స్టెప్పింగ్ ఆఫ్ ది రిలేషన్‌షిప్ ఎస్కలేటర్: అన్‌కామన్ లవ్ అండ్ లైఫ్ పేరుతో ఈ పుస్తకం మార్కెట్లోకి వచ్చింది.

ఇక్కడ ఆమె ఎస్కలేటర్ అనే పదాన్ని సన్నిహిత సంబంధాలలో సరియైన ప్రవర్తన కోసం సామాజిక కట్టుబాట్లు కలిగి ఉండటం నిర్వచించారు. మరో విధంగా చెప్పాలంటే, జీవిత భాగస్వామితో కలిసి జీవించడం, ఆర్థిక సంబంధాలను పంచుకోవడం, పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం వంటి సంప్రదాయ విధానాల వల్ల సంబంధాలు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు.

ఒక వ్యక్తి తన సంబంధాలన్ని సీరియస్‌గా తీసుకున్నాడనే దానికి సంకేతంగా లేదా సూచనగా మనం వీటిని తీసుకుంటామని కాలిఫోర్నియాకు చెందిన రచెల్ క్రాంట్జ్ అన్నారు. ఆమె ఓపెన్: అన్ సెన్సార్డ్ మెమోయిర్ ఆఫ్ లవ్, లిబరేషన్, నాన్ మోనోగమీ అనే పుస్తకాన్ని రాశారు. అయితే, సోలో పాలియామరి వ్యక్తులు తమ జీవితాన్ని కేవలం ఒక్కరితోనే పెనవేసుకోకుండా చూసుకుంటారు.

సోలో పాలియామరిస్టులు

ఫొటో సోర్స్, Getty Images

సోలో పాలీగా ఉండేందుకు ఎన్నో మార్గాలు

సోలో నిర్వచనం చాలా పరిమితంగా ఉన్నప్పటికీ, సోలో పాలీగా ఉండేందుకు ఎన్నో రకాలైన మార్గాలున్నాయి. సోలో పాలియామర్స్ అనే వారు అలోసెక్సువల్‌గా కూడా ఉంటారని కోలోరాడోకి చెందిన ఎలిసాబెత్ షెఫ్ అన్నారు. ఆమె ది పాలియామరిస్ట్స్ నెక్ట్స్ డోర్‌తో పాటు పలు పుస్తకాలను రాశారు.

అంటే కొందరికి సెక్సువల్ కోరికలుంటాయని, కానీ కొందరు మాత్రం ఎలాంటి లైంగిక సంబంధాలు లేకుండా బహుళ మందితో రిలేషన్‌షిప్‌లను కొనసాగిస్తూ ఉంటారని చెప్పారు. వీరు కూడా ఇతరుల స్వతంత్రకు విలువనిస్తారని షెఫ్ అన్నారు. సింగిల్ పేరెంట్‌గా ఉండే వారు, తమ పిల్లల్ని రిలేషన్‌షిప్‌లలో సోలో పాలీగా ఉంచేందుకు ప్రాధాన్యత ఇస్తారని షెఫ్ అన్నారు.

‘‘అయితే, సోలో పాలియామరి జీవిత కాలం ఉండదు. నేడు సోలో పాలీగా గుర్తింపు పొందిన వారు, ఏదో ఒకసమయంలో తమ ఇంటిని లేదా ఆర్థిక సంబంధాలను మరో వ్యక్తితో పంచుకోవాల్సి వస్తుంది. నిర్దిష్ట గుర్తింపుగా ఇది వాలిడ్ కాదు’’ అని న్యూయార్క్‌కు చెందని సెక్స్ రీసెర్చర్, కన్సల్టెంట్ ఝానా వ్రాంగలోవా అన్నారు.

సోలో పాలియామరిగా ఉండాలనుకుంటోన్న క్రిష్‌కి కూడా ఏదో ఒక రోజు ప్రైమరీ పార్టనర్ దొరకవచ్చు. కానీ, ఈ సమయంలో మాత్రం తాను సోలో పాలీగా ఉండేందుకు, ఇతరులతో సంబంధాలను కలిగి ఉంచుకునేందుకు, మరింత మంది వ్యక్తులను కలుసుకునేందుకు, తన కోరికలను తీర్చుకునేందుకు ఇది తనకు అనుమతిస్తుందని క్రిష్ అన్నారు. తన ఉద్దేశాలేమిటో ప్రజలతో కమ్యూనికేట్ అయ్యేందుకు తనకు ఈ లేబుల్ ఉపయోగపడనున్నట్టు చెప్పారు.

‘‘పెళ్లికి సంబంధించిన సంప్రదాయబద్ధమైన విధానం నాకు నచ్చదు. నేను దీనికి పూర్తిగా వ్యతిరేకంగా ఉండాలనుకుంటున్నాను’’ క్రిష్ అన్నారు.

న్యూయార్క్‌లో క్రిష్ నేర్చుకుంటోన్న ఓపెన్ స్మార్టర్ కోర్సును వ్రాంగలోవా బోధిస్తున్నారు. ఆమె మాసిడోనియాకు చెందిన వారు. తన క్లాస్‌లో ఉన్న మూడింట రెండొంతుల మంది రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు ఆమె అంచనా వేస్తున్నారు. వారిలో సగానికంటే కాస్త ఎక్కువ మంది కేవలం ఒకే ఒక్క వ్యక్తితో సంబంధాన్ని కొనసాగిస్తుంటే, మిగిలిన వారు బహుళ సంబంధాలు వారికి సరియైనవా? కావా? అన్నది తెలుసుకోవడం కోసం చూస్తున్నట్టు చెప్పారు. ఆ సంబంధాల్లో వారిని మెరుగైన వారిగా తీర్చిదిద్దుకునేందుకు వారు మరింత మెరుగైన స్కిల్స్ కోసం చూస్తున్నారు. లేదంటే వారు ఒంటరిగా ఉంటూ, రిలేషన్‌షిప్ కోసం చూస్తున్నారని అన్నారు.

వీడియో క్యాప్షన్, యువతులను ఎత్తుకెళ్లి బలవంతంగా పెళ్లి చేసుకునే ఆచారం

ప్రతి ఒక్కరికీ ఇది సరియైన పద్ధతి కాదు

అయితే, సోలో పాలియామరి ప్రతి ఒక్కరికీ సరియైన విధానం కాదు. ఈ సంబంధాలు ఎవరికి సరియైనవో తెలుసుకునేందుకు తన విద్యార్థులకు వ్యక్తిత్వ క్విజ్‌లను కూడా నిర్వహిస్తున్నట్టు వ్రాంగలోవా చెప్పారు. ఈ క్విజ్‌లో ఎంత మేరకు సాహాసాన్ని విద్యార్థులు కోరుకుంటున్నారు, వారి రిలేషన్‌షిప్‌లలో సెక్యూరిటీ ఎంత కావాలనుకుంటున్నారో తెలుసుకుంటున్నట్టు చెప్పారు. అయితే, సోలో పాలియామరిస్టులకు తమ రిలేషన్‌షిప్‌లో సెక్యూరిటీ అవసరం ఉండదని వ్రోంగలోవా చెప్పారు.

ఏది ఏమైనప్పటికీ, సోలో పాలీగా కొనసాగే వ్యక్తులు తమ భాగస్వాములతో లోతైన, జీవితకాల సంబంధాన్ని కలిగి ఉండరు. అంతేకాక, దీర్ఘకాల సంబంధాల్లో ఉండే వారు ఎలాంటి సెక్యూరిటీనైతే పొందుతున్నారో, అదే స్థాయిలో వీరికి సెక్యూరిటీ దొరకదు.

తన భాగస్వాములతో మరింత విశ్వసనీయమైన సంబంధాలను పెంపొందించుకునేందుకు, వారి అవసరాల, కోరికల విషయంలో చాలా ముందంజలో ఉంటానని సోలో పాలీగా గుర్తింపు పొందిన సెక్యు ఎడ్యుకేటర్ పావెల్ చెప్పారు. ‘రిలేషన్‌షిప్‌లో నాకేం కావాలో నేను అడగను. ఎందుకంటే, ఒకవేళ మీరు నో చెబుతారేమోనని నేను చాలా బాధపడతాను. ఒకవేళ నో చెబితే, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలన్నది మనం తేల్చుకోవాల్సి ఉంటుంది’’ అని ఆమె అన్నారు.

సంప్రదాయబద్ధమైన సీరియస్ సంబంధాలను ఎందుకు సోలో పాలియామరిస్టులు వద్దనుకుంటున్నారో తెలియకపోవడంతోనే.. వారి విషయంలో చాలా అపోహలు, సందేహాలు నెలకొన్నాయని వ్రాంగలోవా అన్నారు. అంతేకాక సోలో పాలీ ప్రజల మూస పద్ధతులు కూడా చాలా స్వార్థపూరితంగా, పలు విషయంలో తప్పించుకునే ధోరణిలో ఉంటాయని చెప్పారు.

వీడియో క్యాప్షన్, క్షమా బిందు: పెళ్లి కొడుకు లేకుండానే పెళ్లి, హనీమూన్‌ కూడా.. ఏంటీ సోలోగమి?

అలాగే పెళ్లి, పిల్లలు లాంటి సంబంధాలకు కట్టుబడి ఉండటంలో వారికి అవగాహన లేకపోవడం కూడా ఒక కారణంగా పేర్కొన్నారు. ‘మనం పెద్దలుగా పరిగణించే వారు పెళ్లిళ్లు చేసుకుని, పిల్లల్ని కంటారు. వారు ఇళ్లను ఇతరులతో షేర్ చేసుకుంటారు. ఆర్థిక విషయాలను భాగస్వామితో పంచుకుంటారు’’ అని పావెల్ అన్నారు.

అదేవిధంగా పెళ్లి చేసుకోకుండా, ఒక్కరే బతికే తన లాంటి పెద్దలు మాత్రం సమాజంలో జరిగే ప్రతి దానికి తప్పుడు ఉదాహరణలా నిలుస్తున్నట్టు చెప్పారు. అయితే, పెద్దలు కూడా ఒంటరిగా, తమకు తాముగా విజయవంతంగా జీవించవచ్చని అన్నారు.

సోలో పాలీగా గుర్తింపు పొందిన వారు, ఇతరులను కేర్ చేయరని కాదని షెఫ్ అన్నారు. కేవలం వారు రోమాంటిక్ పార్టనర్‌తో కలిసి తమ జీవితాన్ని అనుభవించాలని మాత్రమే కోరుకోరని పేర్కొన్నారు.

వీటన్నింటితో పాటు ‘‘కపుల్ ప్రివిలైజ్’’ కూడా ఒక సామాజిక కోణంగా నిలుస్తుంది. ఒంటరిగా ఉండే వారితో పోలిస్తే కపుల్స్‌కి ఎక్కువ ప్రయోజనాలున్నాయని ఈ పదం తెలియజేస్తుంది. అంటే పెళ్లిలో ఆర్థిక ప్రయోజనాల నుంచి, కపుల్‌హుడ్ వరకు పలు ప్రయోజనాలను తెలుపుతోంది.

పాలియామరస్ సంబంధాల్లో ఎవరితో అయితే మనం ఆనందంగా, విజయవంతంగా సంబంధాన్ని కొనసాగించామో తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎందుకంటే పాలియామర్‌గా ఉండి, ఎప్పుడైనా ప్రైమరీ రిలేషన్‌షిప్ కొనసాగించాలనుకున్నప్పుడు, ఇతర భాగస్వాముల అందరితో ఉన్న సంబంధాలను వారు పరిగణనలోకి తీసుకుంటారు.

సోలో పాలిమరిస్టులు

ఫొటో సోర్స్, Getty Images

ఈ సంబంధాలకు థెరపిస్టులే ఉండేవారు కాదు

సోలో పాలీగా గుర్తింపు పొందిన వ్యక్తులకు సామాజిక ధోరణలు, ఇతర విషయాలు అడ్డుగోడగా నిలుస్తున్నాయి. 2014లో పావెల్ అమెరికాలో, జార్జియాలో పాలియామరి సంబంధాలను కొనసాగించినప్పుడు, ఒకరి కంటే ఎక్కువ మందితో సంబంధాలు కొనసాగించే వారికి సాయంగా ఉండే థెరపిస్ట్ కోసం చూశారు. కానీ అప్పటికి ఆ థెరపిస్టులు అందుబాటులో లేరు. దీంతో ఆమెనే సొంతంగా ప్రాక్టీసు మొదలు పెట్టి, ఒకరికి మించిన వ్యక్తులతో సంబంధాలు కొనసాగించే వ్యక్తులను గుర్తించే వారు.

సైకాలజీ సర్కిల్స్‌లో కూడా పాలియామరి గురించి అవగాహన లేదు. ఇక సోలో పాలియామరి గురించైతే చెప్పనక్కర్లేదు. కౌన్సిలర్లు, థెరపిస్టులకు పాలియామరి తెలపడం కోసం అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ సబ్‌గ్రూప్ డివిజన్ 44 ఎడ్యుకేషన్ మెటీరియల్ తయారు చేయడం ప్రారంభించారు. ఈ సబ్‌గ్రూప్‌లో షెఫ్ కూడా ఒకరు.

చివరిగా, సోలో పాలియామరి అంటే ఒంటరిగా జీవిస్తూ.. పలువురు వ్యక్తులతో డేట్ చేయడానికి మించినది. ఇది సాంప్రదాయబద్ధంగా వస్తున్న ఎన్నో రిలేషన్‌షిప్ ఆంక్షలను తిరస్కరిస్తుంది.

అన్ని సంబంధాలు కొనసాగిన మాదిరిగా మూస పోత పద్ధతిలో కాకుండా రిలేషన్‌షిప్‌లో ఏం కావాలనుకుంటున్నారో నిజాయితీగా తెలుసుకోవడమే తాను సోలో పాలియామరిగా భావిస్తానని పావెల్ అన్నారు.

క్రిష్ కూడా ఇదే విధంగా సోలో పాలీకి ఆకర్షితుడయ్యాడు. ఎందుకంటే రిలేషన్‌షిప్‌లో తాను భిన్నంగా ఆలోచించి, వారికి చేరువకావాలనుకున్నాడు. అమెరికాలో గే పెళ్లిళ్లు చట్టబద్ధం కావడానికంటే ముందే, తమకు పెళ్లి కాదని తెలిసిన వారితో సెక్సువల్ రిలేషన్‌షిప్‌లను ఆయన కలిగి ఉన్నట్లు చెప్పాడు.

క్రిష్ ప్రస్తుతం వివాహాన్ని పూర్తిగా తోసిపుచ్చడం లేదు. కానీ తాను ఆ పద్ధతికి అభిమానిని కాదని చెబుతున్నాడు. బైసెక్సువల్ వ్యక్తి, తనకి సంప్రదాయబద్ధమైన పెళ్లి విధానమంటే ఇష్టముండదని మాత్రమే చెప్పాడు. దీనికి తాను వ్యతిరేకిగా మారాలనుకుంటున్నట్లు తెలిపాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)