Valentine's Day: ప్రేమ మార్కెట్ ఎలా మారిపోయింది?

ఫొటో సోర్స్, PIYAL ADHIKARY/EPA
- రచయిత, ప్రియాంక ఝా
- హోదా, బీబీసీ ప్రతినిధి
వాలెంటైన్స్ డే వచ్చే ఫిబ్రవరి నెలలో ఈసారి గతంలో మాదిరిగా హడావిడి కనిపించడం లేదు. ఒకవైపు కరోనా భయాలు ఇంకా వెంటాడుతున్నాయి. మరోవైపు, లాక్‌డౌన్ కష్టాల నుంచి పూర్తిగా తేరుకోవడానికి ప్రజలు ఇంకా పోరాడుతున్నారు. దీనితో పాటు చాలా కుటుంబాలు ఆత్మీయుల్ని కోల్పోయిన బాధల్లో ఉన్నాయి.
ఈ పోరాటం మానవ సంబంధాల పునరుద్ధరణ కోసం సాగుతున్న పోరాటం. ప్రేమను సజీవంగా కాపాడుకునేందుకు సాగుతున్న పోరాటం. ఇది మన అందరి పోరాటం. మనలో చాలా మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఇంకా లాక్‌డౌన్ కష్టాల నుంచి తేరుకోలేదు.
ఇలాంటి పరిస్థితుల్లో కూడా రోడ్ సైడ్ పూల వ్యాపారులు బొకేలతో ఆనందాన్ని అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. చిన్న బేకరీలు, చాక్లెట్ షాపులు, గిఫ్ట్ షాపులు ఈ-కామర్స్‌కు పోటీగా అమ్మకాలు పెంచుకునేందుకు ఆరాటపడుతున్నాయి.
గత రెండేళ్ళుగా కరోనా భయంతో ప్రజలు గుంపులుగా వెళ్లడం మానుకున్నారు. బొకేలు, బేకరీల యజమానులు తమ షాపులను అందంగా అలంకరించుకుని కస్టమర్ల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇంకా కరోనా ప్రభావం వారిని వెంటాడుతోంది.
ఇలాంటి పరిస్థితుల్లో యువతీ యువకులు ప్రేమికుల రోజున బహుమతులు కొనడం మానేశారా లేక తగ్గించుకున్నారా అన్నదే అసలైన ప్రశ్న.

ఫొటో సోర్స్, Getty Images
ప్రేమ మార్కెట్ ఎలా మారిపోయింది?
వాస్తవానికి, ఆఫ్‌లైన్ షాపింగ్ బాగా పడిపోయింది. దీనికి ఒక కారణం మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ యాక్సెస్ చాలా మందికి అందుబాటులోకి రావడం. బీహార్‌లోని దర్భంగా జిల్లాకు చెందిన 19 ఏళ్ల విద్యార్థిని నిఖిత ఏమంటున్నారో చూడండి. "గత సంవత్సరం నేను వేరే చోట ఉన్నందున ప్రేమికుల రోజున నా స్నేహితుడికి మరో దారి లేక ఆన్‌లైన్‌లో బహుమతి పంపాను. ఈసారి కూడా నేను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసి పంపిస్తాను. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం ఉత్తమం. చాలా వెరైటీలు చూసుకోవచ్చు. వాటిల్లోంచి నచ్చింది ఎంచుకోవచ్చు."
నిఖిత దర్భంగాలోని ఓ కాలేజీలో ఇంగ్లీష్ ఆనర్స్ చదువుతోంది. అయితే, ఇప్పటికీ కొంతమంది ఆన్‌లైన్ షాపింగ్‌ను నమ్మడం లేదు. వారు బహుమతిగా ఇవ్వాల్సిన వస్తువును ముందుగా చూసి, చేతులతో తడిమి చూడడాన్ని ఇష్టపడతారు. అలా కొన్న తరువాత పంపించడమే వారికి సంతోషాన్నిస్తుంది.
ఢిల్లీలో నివసించే నేహా అలాంటి వారిలో ఒకరని చెప్పవచ్చు. ఆమెకు ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. ఆమె ప్రేమికుల రోజున తనకు కాబోయే భర్తకు ఏదైనా ప్రత్యేక బహుమతి ఇవ్వాలని భావిస్తున్నారు. గత ఏడాది దిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసిన నేహాకు ఆన్‌లైన్ షాపింగ్‌పై ఆసక్తి లేదు.
"నాకు కాబోయే భర్తకు బహుమతిని దుకాణానికి వెళ్లి కొంటాను. అన్ లైన్లో కొంటే ఎలాంటి అనుభూతి కలగదు. ఫోన్ తెర మీద చూసిన వస్తువు నిజంగా ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు? అందుకే సరదాగా షాపింగ్‌కు వెళ్లి నచ్చింది కొనుక్కోవడమే మంచిది" అని నేహా చెప్పారు.
గత రెండేళ్లుగా ఇంట్లో నాలుగ్గోడల మధ్య ఉండిపోయానని చెబుతున్న నేహాకు ఇప్పుడు కొంత ఉపశమనం లభించింది. ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లి తనకు కాబోయే భర్త కోసం నచ్చిన వస్తువును కొనాలనుకుంటోంది.

ఫొటో సోర్స్, PIYAL ADHIKARY/EPA
పూల వ్యాపారం
కరోనా కారణంగా ఈ రోజుల్లో పూల వ్యాపారం కూడా సరిగ్గా సాగడం లేదు. ఢిల్లీలోని చిత్తరంజన్ పార్క్‌లో పూల దుకాణం నడుపుతున్న 22 ఏళ్ల రంజన్ దాస్, "నేను 2017లో పూల దుకాణం తెరిచాను. ఆ తరువాత కరోనా వచ్చింది. వ్యాపారం పూర్తిగా ఆగిపోయింది. దుకాణాన్ని మూసేశాను. ఈ మధ్యే మళ్లీ తెరిచాను" అని చెప్పారు.
కోల్‌కతా నుంచి దిల్లీకి వచ్చిన రంజన్ దాస్ మిత్రుల సూచనతో జస్ట్‌డయల్ వంటి ఆన్ లైన్ వేదికల్లో షాపును నమోదు చేయించుకున్నారు.
"నేను జస్ట్ డయల్‌లో రిజిస్టర్ అయ్యాను. ఇప్పుడు చాలావరకు పనులు ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయి. కానీ, వ్యాపారం మునుపటిలా సాగడం లేదు. రోజ్ డే రోజున కూడా 5-6 ఆర్డర్‌లు మాత్రమే వచ్చాయి. ఈ సంవత్సరం ప్రేమికుల రోజున ఏం జరుగుతుందో చూడాలి?" అని రంజన్ దాస్ అన్నారు.
గత 20 ఏళ్లుగా తూర్పు ఢిల్లీలో గిఫ్ట్ షాప్ నడుపుతున్న కిషోర్ కుమార్ శర్మ కూడా ఇదే మాట చెప్పారు.
అంతకుముందు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా దుకాణం వద్ద బాగా రద్దీ ఉండేదని, గత రెండేళ్లుగా ఆ పరిస్థితి లేదని కిషోర్ శర్మ చెప్పారు. "నేను ఆన్ లైన్లో వస్తువులు అమ్మేవాడ్ని కాదు. కానీ, ఇప్పుడు పాత కస్టమర్లు కూడా వాట్సాప్ ద్వారానే ఆర్డర్ చేస్తున్నారు. వారికి అలాగే పంపిస్తున్నా. షాప్‌కు వచ్చే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది" అని కిషోర్ చెప్పారు.
దుకాణాల వద్ద రద్దీ తగ్గడం వెనుక మరేదైనా కారణం ఉందా?
కరోనా ప్రభావంతో పాటు ఈ-కామర్స్ బూమ్ కూడా షాపుల వద్ద జనం తగ్గడానికి కారణమైంది. ఈ కామర్స్ గణాంకాలే అందుకు నిదర్శనం. గత ఏడాది డిసెంబర్‌లో ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ డేటా ప్రకారం భారతదేశంలో ఈ-కామర్స్ దేశీయ వ్యాపారం సరళిని బాగా మార్చేసింది.
భారతీయ ఈ-కామర్స్ మార్కెట్ 2025 నాటికి 111.40 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. 2020లో ఈ మొత్తం 46.2 బిలియన్ డాలర్లు మాత్రమే. ఈ-కామర్స్ మార్కెట్ 2030 నాటికి 350 బిలియన్ డాలర్లకు పెరిగిపోతుందని కూడా అంచనా వేస్తున్నారు.
భారతదేశం 2020లో 50 బిలియన్ డాలర్ల వ్యాపారంతో ఎనిమిదో అతిపెద్ద ఈ-కామర్స్ మార్కెట్‌గా అవతరించింది. ఫ్రాన్స్, కెనడాలను మించిపోయింది.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
నాస్కామ్ ప్రకారం, కోవిడ్-19 వల్ల సవాళ్లు, అడ్డంకులు ఉన్నప్పటికీ, 2021లో 56.6 బిలియన్ డాలర్ల అమ్మకాలతో భారతదేశ ఇ-కామర్స్ మార్కెట్ 5% పెరిగింది. స్మార్ట్‌ఫోన్ల వ్యాప్తి, 4G నెట్‌వర్క్‌లు, పెరిగిన వినియోగదారులతో భారత ఇ-కామర్స్ మార్కెట్ 2026 నాటికే 200 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
ముఖ్యంగా, 2020 సంవత్సరం చివరి త్రైమాసికంలో భారత ఈ-కామర్స్ ఆర్డర్‌లు 36 శాతం పెరిగాయి. అత్యధికంగా విక్రయమైన ఉత్పత్తులలో వ్యక్తిగత ఆరోగ్యం, సంరక్షణలకు సంబంధించిన ఉత్పత్తులు ఉన్నాయి.
కన్సల్టింగ్ సంస్థ అయిన బెయిన్, ఫ్లిప్‌కార్ట్ సంయుక్తంగా గత ఏడాది లాక్‌డౌన్ ఎత్తివేసిన ఒక నివేదికను విడుదల చేశాయి. లాక్‌డౌన్ పరిమితులు నెలల పాటు కొనసాగినప్పటికీ 2021లో భారత ఈ-రీటైల్ మార్కెట్ 25 శాతం పెరిగిందని 'హౌ ఇండియా డూయింగ్ ఆన్‌లైన్ షాపింగ్' అనే ఆ నివేదిక వెల్లడించింది.
దేశంలోని ఎనిమిది మెట్రో నగరాల్లో ఆన్‌లైన్ షాపింగ్ సర్వసాధారణమైందని, ఇక్కడ ప్రతి ముగ్గురిలో ఒకరు సంవత్సరానికి ఒకసారైనా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తారని ఆ నివేదిక పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ-కామర్స్ దిగ్గజాలు ఏమంటున్నాయి?
వాలెంటైన్స్ వీక్‌లో విక్రయానికి సంబంధించి మేం ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌తో కూడా మాట్లాడాం.
దేశీయ సంస్థలను ప్రోత్సహించడానికి గత సంవత్సరం "షాప్సీ" అనే యాప్‌ను ప్రారంభించినట్లు ఫ్లిప్‌కార్ట్ మాకు తెలిపింది. ప్రజలు ఫ్లిప్‌కార్ట్ లాగానే ఈ యాప్‌లో కూడా షాపింగ్ చేయవచ్చు.
వాలెంటైన్స్ వీక్‌లో ఇప్పటివరకు యాప్‌లో ట్రాఫిక్ ఒకటిన్నర రెట్లు పెరిగిందని కంపెనీ తెలిపింది. పువ్వులు, ఉంగరాలు, కాంబో టీ-షర్టులు, బొమ్మలు మరియు ఫ్యాషన్ ఉపకరణాలు వాలెంటైన్ వారంలో ఈ యాప్ నుండి అత్యధికంగా కొనుగోలవుతున్నట్లు తెలుస్తోంది.
ఇక, మరో ఆన్ లైన్ దిగ్గజం అమెజాన్ కూడా వినియోగదారులను ఆకట్టుకునేందుకు 'వన్ స్టాప్ డెస్టినేషన్' పేరుతో చాక్లెట్‌లు, లిప్‌స్టిక్స్, స్మార్ట్‌ఫోన్ల నుండి తాజా పువ్వుల వరకు రకరకాల కానుకలను విక్రయిస్తోంది.

ఇవి కూడా చదవండి:
- IPL-2022 వేలం: హైదరాబాద్ ప్లేయర్ ఠాకూర్ తిలక్ వర్మకు రూ. 1.7 కోట్ల బంపర్ ఆఫర్
- షేక్ రషీద్: టీమిండియాను చాంపియన్‌గా నిలిపిన 17 ఏళ్ల తెలుగు కుర్రాడి కథ
- ఆ గిరిజన గ్రామానికి వెళ్లిన వారంతా మళ్లీ పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు?
- చరిత్రలోనే ‘అత్యంత సుదీర్ఘ యుద్ధం’: మొదలై 70 ఏళ్లు దాటినా ఇంకా ఎందుకు సమాప్తం కాలేదు?
- ‘గంటకు 417 కిలోమీటర్ల స్పీడుతో కారు నడిపాడు..’ ఆ తర్వాత ఏమైందంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














