ఇండియాలో టీనేజ్ సెక్స్ ఎందుకు నేరం? ‘సమ్మతి తెలిపే వయసు’ను తగ్గించాలని కొందరు జడ్జిలు ఎందుకు అంటున్నారు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గీతా పాండే
- హోదా, బీబీసీ న్యూస్, దిల్లీ
చిన్నారులపై లైంగిక దాడుల సమస్యను పరిష్కరించే ప్రయత్నాల్లో భాగంగా భారతదేశంలో దశాబ్దం కిందట కొత్తగా ఒక కఠిన చట్టాన్ని అమలులోకి తెచ్చారు.
అయితే.. లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ - పోక్సో) చట్టం కింద 18 ఏళ్లు నిండని చిన్నారుల లైంగిక కార్యలపాలన్నీ నేరాలుగానే పరిగణిస్తారు.
దీంతో పరస్పర సమ్మతితో లైంగిక సంబంధాల్లో ఉన్న చాలా మంది టీనేజీ బాలురు చట్టం దృష్టిలో నేరస్తులవుతున్నారు.
ఈ నేపథ్యంలో ‘సమ్మతి తెలిపే వయసు’ను పునఃసమీక్షించాలని, టీనేజర్ల సెక్స్ సంబంధాలను నేరాలుగా పరిగణించరాదని డిమాండ్లు పెరుగుతున్నాయి.
కొన్నేళ్ల కిందట దిల్లీలో నేరాలు అధికంగా ఉన్న ఒక ప్రాంతంలో మహిళల భద్రతను పెంపొందించటానికి పోలీసు విభాగం మహిళా బీట్ కానిస్టేబుళ్లను నియమించింది.
ఆ అంశంపై నేను కథనం రాసే క్రమంలో ఒక 16 ఏళ్ల బాలిక వద్దకు నన్ను తీసుకెళ్లారు.
‘‘ఆమె అత్యాచార బాధితురాలు’’ అంటూ ఆ బాలికను ఒక మహిళా పోలీసు నాకు పరిచయం చేశారు.
నేను ఆ బాలిను ఆమె కథ ఏమిటో చెప్పాలని అడగాను. ఆమె తనపై అత్యాచారం జరగలేదన్నారు.
‘‘మే అప్నీ మర్జీ సే గయీ థీ (నేను నా ఇష్టపూర్వకంగానే అతడితో వెళ్లాను)’’ అని ఆ బాలిక చెప్పారు.
అంతలోనే ఆ బాలిక మీద ఆమె తల్లి కేకలు వేయటం మొదలుపెట్టారు. అక్కడున్న మహిళా పోలీస్ నన్ను తొందరపెట్టి బయటకు తీసుకొచ్చేశారు.
ఆ బాలిక తల్లిదండ్రులు తమ పొరుగున నివసించే ఒక టీనేజీ బాలుడి మీద కేసు పెట్టారని, అతడిని అరెస్ట్ చేశామని, రేప్ కేసులో అతడిని విచారించటం జరుగుతుందని ఆ పోలీస్ కానిస్టేబుల్ తెలిపారు.
ఆ బాలిక సంబంధం పరస్పర సమ్మతితో ఉన్న సంబంధంగానే కనిపిస్తోందని ఆమె అంగీకరించారు.
కానీ బాలిక వయసు రీత్యా కేసు నమోదు చేయటం తప్ప పోలీసులకు వేరే దారి లేదని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
భారతదేశంలో ప్రతి ఏటా ఇలాంటి కేసులు - టీనేజీ బాలికల లైంగిక సంబంధాలకు అత్యాచారాల పేరుపెట్టి నమోదు చేస్తున్న కేసులు వేల సంఖ్యలో ఉన్నాయి.
చిన్నారులపై లైంగిక దాడులు తీవ్రంగా ఉన్నందున పోక్సో వంటి కఠిన చట్టం అవసరమైంది. 2007 నాటి ఒక ప్రభుత్వ అధ్యయనం ప్రకారం.. 53 శాతం మంది చిన్నారులు తాము ఏదో ఒక రూపంలో లైంగిక వేధింపులను ఎదుర్కొన్నట్లు చెప్పారు.
అయితే.. ఈ చట్టంలో, సెక్స్‌కు సమ్మతి తెలిపే వయసును సైతం 16 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు పెంచారు. దీంతో కోట్లాది మంది యవ్వనదశలోని టీనేజర్లు సెక్స్‌లో పాల్గొన్నట్లయితే నేరస్తులుగా మారిపోతున్నారు.
భారతదేశంలో 25.30 కోట్ల మందికి పైగా టీనేజర్లు ఉన్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధిక సంఖ్య.
పెళ్లికి ముందు సెక్స్ అనేది సంప్రదాయంగా నిషిద్ధమైనా కూడా.. వీరిలో చాలా మంది లైంగికంగా క్రియాశీలంగా ఉన్నట్లు పలు సర్వేలు చెప్తున్నాయి.
ఇటీవలి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్ఎస్-5) ప్రకారం.. 39 శాతం మంది మహిళలు తమకు 18 ఏళ్ల వయసు రాకముందు సెక్స్‌లో పాల్గొన్నామని చెప్పారు.
అలాగే 25 నుంచి 49 ఏళ్ల మధ్య వయసున్న మహిళల్లో 10 శాతం మంది.. తమకు 15 ఏళ్ల వయసు రాకముందే సెక్స్‌లో పాల్గొన్నట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో సెక్స్‌కు సమ్మతి తెలిపే వయసును ప్రపంచంలోని చాలా దేశాల్లో ఉన్న తరహాలోనే 16 ఏళ్లకు తగ్గించాలని డిమాండ్లు పెరుగుతున్నాయి.
బాలికల లైంగికతను నియంత్రించటానికి, సంబంధాలు పెట్టుకోకుండా వారిని భయపెట్టటానికి.. వారి తల్లిదండ్రులు తరచుగా నేర న్యాయ వ్యవస్థను ఉపయోగించుకుంటున్నారని బాలల హక్కుల కార్యకర్తలు చెప్తున్నారు. ముఖ్యంగా కులాంతర, మతాంతర సంబంధాల్లో ఈ చట్టాన్ని, వ్యవస్థను వాడుకోవటం ఎక్కువగా ఉందన్నారు.
పరస్పర అంగీకార లైంగిక కార్యకలాపాన్ని నేరంగా పరిగణించటం వల్ల.. జీవితాలు నాశనామవుతున్నాయని, ఇప్పటికే కేసుల భారం విపరీతంగా ఉన్న న్యాయవ్యవస్థ మీద మరింత భారం పెరుగుతోందని వారు అంటున్నారు.
ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఈ సమస్యకు సంబంధించిన గణాంకాలు, సమాచారం అందుబాటులోకి వచ్చింది.
ఎన్‌ఫోల్డ్ ప్రొయాక్టివ్ హెల్త్ ట్రస్ట్ అనే బాలల హక్కుల స్వచ్ఛంద సంస్థకు చెందిన పరిశోధకులు.. మూడు రాష్ట్రాల్లో – పశ్చిమ బెంగాల్, అస్సాం, మహారాష్ట్రల్లో - 2016 నుంచి 2020 మధ్య ఇచ్చిన 7,064 పోక్సో కోర్టు తీర్పులను అధ్యయనం చేసింది. ఆ సంస్థ నివేదికను ఈ వారం ఆరంభంలో విడుదల చేశారు. మొత్తం పరిశీలించిన కేసుల్లో దాదాపు సగం కేసులు 16 ఏళ్ల నుంచి 18 ఏళ్ల మధ్య వయసు బాలికలకు సంబంధించినవి.
మొత్తం కేసుల్లో 1,715 కేసులు - అంటే ప్రతి నాలుగు కేసుల్లో ఒకటి - ‘శృంగార’ వర్గీకరణలోకి వస్తాయని ఆ నివేదిక గుర్తించింది.
ఈ సంఖ్యలను మొత్తం భారతదేశానికి వర్తింపజేస్తే.. ఇలాంటి కేసుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని ఆ నివేదిక చెప్తోంది. దేశంలో ఏటా నమోదవుతున్న పోక్సో కేసుల్లో.. వేలాది కేసుల్లో నేరాలకు పాల్పడ్డవారిని ‘‘స్నేహితులుగా, ఆన్‌లైన్ స్నేహితులుగా, పెళ్లి పేరుతో సహజీవనం చేస్తున్న వారిగా’’ పేర్కొంటున్నారని ఈ నివేదిక వెల్లడించింది.

ఫొటో సోర్స్, Getty Images
‘‘కౌమార దశలో పూర్తిగా సహజమైన లైంగిక కార్యకలాపాన్ని నేరంగా పరిగణించటాన్ని చూస్తే.. చట్టం వాస్తవానికి దూరంగా ఉన్నట్లు కనిపిస్తుంది’’ అని ఎన్‌ఫోల్డ్ ప్రధాన పరిశోధకురాలు స్వాగత రాహా బీబీసీతో చెప్పారు.
పోక్సో కింద నమోదైన కేసుల్లో అత్యధిక కేసులు.. బాలికలు ఇంటి నుంచి తాము ఇష్టపడిన బాలురతో వెళ్లిపోయినపుడో, బాలికలు గర్భం ధరించినట్లు బయటపడ్డటప్పుడో వారి తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ ఫిర్యాదు చేయటంతో నమోదైన కేసులేనని ఆ నివేదిక చెప్తోంది. ఆ ఫిర్యాదుల్లో పోలీసులు అత్యాచారం, లైంగిక దాడి, లైంగిక వేధింపులు, అపహరణ అభియోగాలు నమోదు చేస్తున్నారు.
‘‘ఆ జంట నేర న్యాయ వ్యవస్థలో చిక్కుకుపోతుంది. ఇలా నేరపూరితం చేయటం వల్ల ఆ బాలిక, ఆ బాలుడు ఇద్దరూ ‘విపరీత పర్యవసానాల’ను ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని స్వాగత రాహా పేర్కొన్నారు.
‘‘బాలికలను సిగ్గుతో చితికిపోయేలా చేస్తారు. అవమానిస్తారు. నిందమోపుతారు. వారు తమ తల్లిదండ్రుల ఇంటికి వెళ్లటానికి నిరాకరిస్తే.. వారిని బాలికల వసతి గృహాల్లో ఉంచుతారు. బాలురను చట్టంతో ఘర్షణపడే చిన్నారులుగా కానీ, నిందితులుగా కానీ పరిగణిస్తారు. దీర్ఘ కాలాల పాటు పరిశీలన గృహాల్లో కానీ, జైళ్లలో కానీ బంధిస్తారు’’ అని ఆమె వివరించారు.
‘‘నిందితులు దర్యాప్తును, నిర్బంధాన్ని, విచారణను ఎదుర్కోవాల్సి వస్తుంది. కేసులో వారు దోషులగా నిర్ధారితులైనట్లయితే 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకూ జైలు శిక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని చెప్పారు.
అయితే.. ఈ విషయంలో ఒక ఊరట ఏమిటంటే.. స్వాగత రాహా, ఆమె బృందం అధ్యయనం చేసిన 1,715 కేసుల్లో అత్యధిక కేసుల్లో నిందితులుగా ఉన్నవారిని నిర్దోషులుగా విడిచిపెట్టారు.
‘‘రొమాంటిక్ కేసుల్లో నిర్దోషులుగా విడిచిపెట్టటం సాధారణం. మొత్తం 1,715 కేసుల్లో 1,609 కేసులను అంటే 93.8 శాతం కేసులను కొట్టివేశారు. దోషులుగా నిర్ధారించింది అరుదైన కేసుల్లోనే. కేవలం 106 కేసుల్లో అంటే 6.2 శాతం కేసుల్లోనే దోషులుగా నిర్ధారించారు’’ అని ఆ నివేదిక వివరించింది.
కేసుల్లో దోషులుగా నిర్ధారణ ఇంత తక్కువగా ఉండటానికి కారణం.. 87.9 శాతం కేసుల్లో బాలికలు తాము నిందితులతో ప్రేమలో ఉన్నామని అంగీకరించటం. అలాగే 81.5 శాతం కేసుల్లో బాలికలు తమ భాగస్వామికి వ్యతిరేకంగా నేరారోపణలేవీ చేయలేదు. ఇంకొన్ని కేసుల్లో బాలికలు తమ మీద తమ కుటుంబం ఒత్తిడి చేసిందని చెప్పారు.
నిర్దోషులుగా విడుదల చేస్తున్నే కేసుల రేటు ఎక్కువగా ఉండటం.. ‘రొమాంటిక్’ కేసుల విషయంలో విచారణ కోర్టులు మృదువుగా వ్యవహరిస్తాయని చూపుతోంది. గత కొన్నేళ్లుగా భారత ఉన్నత న్యాయవ్యవస్థ సైతం.. కిశోర యువత మధ్య లేదా కిశోర యువతతో సమ్మతితో కూడిన సెక్స్‌ను నేరంగా పరిగణించటం ఆందోళనకరమైన విషయమని హెచ్చరించింది.
ఒక టీనేజర్‌ను దోషిగా నిర్ధారించటాన్ని రద్దు చేస్తూ 2019లో మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.పార్తిబన్.. ‘‘మైనర్ల మధ్య సంబంధం లేదా మైనర్లతో కిశోర యువత సంబంధాలు అసహజం కాదు, జీవసంబంధమైన సహజ ఆకర్షణ’’ అని పేర్కొన్నారు. సెక్స్‌కు సమ్మతి వయసును పునఃసమీక్షించాలని సిఫారసు చేశారు.
ఇటీవల భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనుంజయ్ చంద్రచూడ్ కూడా ఇదే విషయం మాట్లాడారు. సమ్మతి తెలిపే వయసు మీద పునరాలోచించాలని పార్లమెంటుకు పిలుపునిచ్చారు.
కిశోర యువత సెక్స్‌ను నేరంగా పరిగణించరాదంటూ భారతదేశం మీద యూనిసెఫ్ సైతం ఒత్తిడి తెస్తోంది. యూనిసెఫ్‌లోని భారత చిన్నారుల సంరక్షణ విభాగాధిపతి సోల్‌డాడ్ హిరేరో బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘చిన్నారులకు తమ వ్యక్తిగత సంబంధాల్లో కూడా రక్షణ, సమగ్రత, గౌరవం, పాలుపంచుకునే హక్కు ఉంది’’ అని చెప్పారు.
‘‘అభివృద్ధి చెందుతున్న వారి స్వయం ప్రతిపత్తి విషయంలో రక్షణకు, గౌరవానికి మధ్య సంతులనం సాధించాల్సిన అవసరం ఉంది. చిన్నారుల హక్కుల మీద ఐక్యరాజ్యసమితి కమిటీ ఈ విషయాన్ని బలంగా చెప్పింది’’ అని ఆయన తెలిపారు.
‘‘కిశోర యువతలో ‘రొమాంటిక్’ కేసులను భిన్నంగా పరిగణించాల్సిన అవసరం ఉందని, ఈ చట్టాన్ని పార్లమెంటు పునఃసమీక్షించి తీరాలని న్యాయ వ్యవస్థ, నేర న్యాయ వ్యవస్థ గుర్తిస్తోంది’’ అని స్వాగత రాహా పేర్కొన్నారు.
‘‘పరస్పర సమ్మతితో కూడి కిశోర యువత సెక్స్‌ను నేరంగా పరిగణించటాన్ని రద్దు చేయాలని మేం కోరుతున్నాం. భారతదేశానికి అనువుగా ఉండే నమూనాలను మనం పరిశీలించవచ్చు. కానీ కిశోర యువత లైంగికత అనేది సాధారణమని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది’’ అని ఆమె చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్‌కు సిద్ధంగా ఉంటాయా?
- మసాయి ఒలింపిక్స్: సింహాలను వేటాడే వీరులు ఆడే ఆటలు
- గుండెపోటు వచ్చే అరగంట ముందు శరీరంలో ఏం జరుగుతుంది, ఏ లక్షణాలు కనిపిస్తాయి?
- మహిళల్లో హార్మోన్లు ఎందుకు గతి తప్పుతాయి, ఇది మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందా?
- హోప్ ఐలాండ్: ఏపీలోని ఏకైక సముద్ర దీవిని చూశారా? అక్కడ 118 కుటుంబాలు ఎలా బతుకుతున్నాయి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

















