మంచిర్యాల: ఆరుగురు సజీవ దహనం.. హత్యలా? ప్రమాదమా?

కాలిపోయిన ఇంట్లో పోలీసులు

ఫొటో సోర్స్, UGC

    • రచయిత, ప్రవీణ్ శుభం
    • హోదా, బీబీసీ కోసం

మంచిర్యాల జిల్లాలోని మందమర్రి మండలంలో ఆరుగురు సజీవదహనమైన కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి.

మంటల్లో కాలిపోయిన ఇంటికి సమీపంలో ఓ ఆటో నిలిపి ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ ఆటోలో పెట్రోలు తెచ్చినట్లుగా భావిస్తున్న రెండు క్యాన్లు కూడా లభించినట్లు పోలీసులు తెలిపారు.

వివాహేతర సంబంధం కోణం ఏమైనా ఉందా? ఆ కారణంగా జరిగిన హత్యలా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

పద్మ

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, పద్మ

అసలేం జరిగింది?

తెలంగాణలోని మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గుడిపల్లి వెంకటాపూర్‌లో శుక్రవారం అర్ధరాత్రి సుమారు 2 గంటల ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనం అయ్యారు.

మరణించిన వారిలో ఇద్దరు బాలికలు ఉన్నారు.

మందమర్రి పోలీసులు అందించిన వివరాల ప్రకారం...

రాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఇంట్లో నుంచి మంటలు రావడం చూసి చుట్టుపక్కల స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ఒక్కసారిగా మంటలు ఇల్లంతా వ్యాపించడంతో అందులో నిద్రిస్తున్న ఆరుగురు వ్యక్తులు మంటల్లో కాలిపోయారు.

అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు.

మృతుల్లో ఇంటి యజమాని మాసు శివయ్య(50), ఆయన భార్య పద్మ అలియాస్ రాజ్యలక్ష్మి, కూతురు వరుస అయ్యే సమీప బంధువు మౌనిక(35), ఆమె కూతుళ్లు హిమబిందు(2), స్వీటీ(4)లతో పాటు శాంతయ్య అనే సింగరేణి కార్మికుడు ఉన్నారు.

మౌనిక
ఫొటో క్యాప్షన్, మౌనిక

శివయ్య, పద్మల ఇంట్లో శాంతయ్య ఎందుకు ఉన్నారు?

శివయ భార్య పద్మకు శాంతయ్యకు సంబంధం ఉన్నట్లు మందమర్రి ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ రావ్ తెలిపారు.

‘తెల్లవారుజామున ఒంటి గంట ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేదా బయటి నుంచి ఇంటికి ఎవరైనా నిప్పు పెట్టారా అనేది తేలాల్సి ఉంది. దర్యాప్తు కొనసాగుతోంది.

గూనపెంకులు, కలపతో నిర్మించిన ఇల్లు కావడంతో మంటలు త్వరగా వ్యాపించాయి. షార్ట్ సర్క్యూట్ లేదా ఇంట్లో దీపాల వల్ల మంటలు అంటుకున్నాయా అన్న కోణంలోనూ విచారిస్తున్నాం.

ఇంటి యజమాని శివయ్య కు పాత పగలు లేవని ప్రాథమికంగా తేలింది. విచారణ కొనసాగుతోంది’ అని మందమర్రి ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ రావ్ బీబీసీకి తెలిపారు.

శివయ్య భార్య పద్మకు, శాంతయ్యకు కొన్ని సంవత్సరాలుగా వివాహేతర సంబంధం ఉంది. .కొంతకాలంగా శాంతయ్య పద్మ కుటుంబంతోనే ఉంటున్నారు అని ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ రావు తెలిపారు.

‘శాంతయ్య భార్యకు శివయ్య కుటుంబానికి నేరుగా అయితే ఎటువంటి గొడవలు లేవు. కానీ పద్మతో ఉన్న సంబంధం వల్ల శాంతయ్యకు ఆయన భార్యకు గొడవలు జరుగుతున్నాయి. శాంతయ్యను వెనక్కి తీసుకెళ్లాలని ఆయన భార్య ప్రయత్నిస్తోంది. ఈ కోణంలో కూడా విచారిస్తున్నాం’ అని ప్రమోద్ రావ్ చెప్పారు.

పెట్రోలు క్యాన్లు

ఫొటో సోర్స్, UGC

దగ్గర్లో పెట్రోలు క్యాన్లు

కాలిపోయిన ఇంటికి దగ్గర్లో ఆటో పార్క్ చేసి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. పెట్రోలు తెచ్చినట్లుగా చెబుతున్న రెండు క్యాన్లను ఆటోలో గుర్తించినట్లు వారు తెలిపారు.

ఈ ఘటన మీద మందమర్రి పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసారు.

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొండంపేటకు చెందిన మౌనిక గత మూడు రోజుల క్రితం తన పిన్ని ఇంటికి వచ్చింది. ఈ ప్రమాదంలో ఆమె, తన ఇద్దరు కూతుళ్లు సజీవ దహనమయ్యారు.

ప్రమాదంలో మరణించిన శాంతయ్య సింగరేణి కార్మికుడుగా పనిచేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)