100 రోజుల భారత్ జోడో యాత్ర: రాహుల్ గాంధీపై జోకులు తగ్గడానికి ఈ యాత్రే కారణమా? ప్రజలు మారిపోతున్నారా?

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, RAHUL GANDHI / FB

    • రచయిత, ఇక్బాల్ అహ్మద్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

రాహుల్ గాంధీ ప్రస్తుతం రాజస్తాన్‌లో ఉన్నారు. భారత్ జోడో యాత్రకు 100 రోజులు పూర్తయిన సందర్భంగా జైపూర్‌లో రాహుల్ గాంధీ విలేకరుల సమావేశం నిర్వహిస్తారని, అలాగే సాయంత్రం ఆల్బర్ట్ హాల్‌లో ‘భారత్ జోడో కాన్సర్ట్’ ఉంటుందని కాంగ్రెస్ మీడియా ఇన్‌చార్జి జైరామ్ రమేశ్ గురువారం మీడియాకు చెప్పారు.

ఆయన తెలిపిన దాని ప్రకారం, ఈ కార్యక్రమంలో గాయని సునిధి చౌహాన్ కూడా పాల్గొంటారు. హిమాచల్ ప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుక్సూ, తన ఎమ్మెల్యేలు అందరితో కలిసి జైపూర్‌లో భారత్ జోడో యాత్రలో నడవనున్నారు.

తమిళనాడులోని కన్యాకుమారి నుంచి సెప్టెంబర్ 7వ తేదీన రాహుల్ గాంధీ ఈ భారత్ జోడో యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర అనేక రాష్ట్రాల మీదుగా ఇప్పుడు రాజస్తాన్‌కు చేరుకుంది. దాదాపు 3,750 కి.మీ యాత్ర తర్వాత ఫిబ్రవరిలో కశ్మీర్‌కు చేరుకున్న తర్వాత ఈ యాత్ర ముగుస్తుంది.

రాహుల్ గాంధీ చేస్తోన్న ఈ యాత్రలో సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన ప్రజలు భాగస్వాములు అవుతున్నారు.

సినిమా రంగానికి చెందిన స్వరా భాస్కర్, పూజా భట్, రియా సేన్, ఆనంద్ పట్వర్ధన్ యాత్రలో పాల్గొన్నారు. సామాజిక కార్యకర్త అరుణా రాయ్‌తో పాటు తెలంగాణలో రోహిత్ వేముల తల్లి కూడా యాత్రలో రాహుల్‌తో కలిసి నడిచారు.

శివసేనకు చెందిన ఆదిత్య ఠాక్రే, మహాత్మగాంధీ మునిమనవడు తుషార్ గాంధీలతో పాటు క్రీడా రంగానికి చెందిన పలువురు కూడా ఇప్పటి వరకు యాత్రలో పాల్గొన్నారు.

స్టాండప్ కమెడియన్ కుణాల్ కామ్రా కూడా రాహుల్ గాంధీతో కలిసి యాత్ర చేశారు. ఇప్పటివరకు రాహుల్ గాంధీతో కలిసి యాత్రలో పాల్గొన్న వారందరిలో ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురాజ్ రాజన్ గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది.

రఘురామ్ రాజన్ బుధవారం రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్‌లో రాహుల్‌తో కలిసి నడిచారు. తర్వాత భేటీ అయిన వీరిద్దరూ ఆర్థిక అసమానతలు వంటి ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అనేక అంశాలపై చర్చించారు. బీజేపీ ఈ సమావేశంపై విమర్శలు చేసింది.

భారత్ జోడో యాత్ర

ఫొటో సోర్స్, BHARAT JODO/ FB

ఫొటో క్యాప్షన్, భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి నడుస్తోన్న ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్

బీజేపీ స్పందన

బీజేపీ విదేశీ వ్యవహారాల చీఫ్ విజయ్ చౌథావాలా ట్వీట్ చేస్తూ, ‘‘ఆర్‌బీఐ మాజీ చీఫ్ ఒకరు ప్రభుత్వాన్ని నడిపారు. దేశం పదేళ్లు నష్టపోయింది. భారత్ మరోసారి ఇలాంటి తప్పును పునరావృతం చేయదు. మోదీకి కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నారు.

బీజేపీ, మొదటి నుంచి ఈ యాత్రను వ్యతిరేకిస్తోంది.

బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా గురువారం తెలంగాణలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ రాహుల్ గాంధీ చేస్తున్నది ‘భారత్ జోడో యాత్ర’ కాదు అది ‘భారత్ తోడో యాత్ర’ అని వ్యాఖ్యానించారు.

‘‘ఇది ఒక ప్రాయశ్చిత్త యాత్ర. ఎందుకంటే రాహుల్ గాంధీ పూర్వీకులు భారత్‌ను విచ్ఛిన్నం చేయడానికి ఏ అవకాశాన్ని వదల్లేదు’’ అని ఆయన అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

ఒకవైపు బీజేపీ, ఈ యాత్రను ‘భారత్ తోడో యాత్ర’గా అభివర్ణిస్తుంటే, మరోవైపు సమాజంలోని వివిధ వర్గాల ప్రజలు ఈ యాత్రలో భాగం అవుతున్నారు.

అయితే, రాహుల్ గాంధీ ఇప్పటివరకు చేసిన ఈ ప్రయాణాన్ని ఎలా అంచనా వేయాలనేది ఇప్పుడు పెద్ద సవాలు.

రాహుల్ గాంధీ యాత్ర చేస్తోన్న సమయంలోనే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, దిల్లీ ఎంసీడీ ఎన్నికలు, లోక్‌సభలో ఒక స్థానంతో పాటు 5 రాష్ట్రాల్లోని 6 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి.

గుజరాత్‌లో బీజేపీ మునుపటి కంటే అతిపెద్ద విజయాన్ని నమోదు చేయగా, కాంగ్రెస్ పరిస్థితి దీనికి భిన్నంగా తయారైంది. అక్కడ కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారి ఘోర పరాజయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.

హిమాచల్ ప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ విజయవంతమైంది. కానీ, దిల్లీ ఎంసీడీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత చెత్త ప్రదర్శనను కనబరిచింది. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది.

భారత్ జోడో యాత్ర

ఫొటో సోర్స్, BHARAT JODO/ FB

ఫొటో క్యాప్షన్, పలువురు సినీ ప్రముఖులు కూడా భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు

భారత్ జోడో యాత్ర ఉద్దేశం

తాజాగా జరిగిన ఎన్నికల ఫలితాలను రాహుల్ గాంధీ యాత్రతో ముడిపెట్టి చూడాలా? ఈ ప్రశ్నకు గురువారం విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ మీడియా ఇన్‌చార్జి జైరామ్ రమేశ్ సమాధానం ఇచ్చారు.

భారత్ జోడో యాత్ర అంటే ‘‘ఎన్నికలు గెలిచే’’ లేదా ‘‘ఎన్నికల్లో గెలిపించే యాత్ర’’ కాదు అని ఆయన అన్నారు.

కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం, దాన్ని పునరుద్ధరించడం అనేది ఈ యాత్ర ఉద్దేశాల్లో ఒకటి అని ఆయన చెప్పారు.

‘‘మోదీ ప్రభుత్వం ఉద్దేశాలు, విధానాల వల్ల ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. సమాజంలో చీలికలు వస్తున్నాయి. రాజకీయ నియంతృత్వం ఒక సాధారణ అంశంగా మారింది’’ అని అన్నారు.

రాహుల్ గాంధీ చేస్తోన్న భారత్ జోడో యాత్ర అసలు ఉద్దేశం ఈ మూడు అంశాలను భారత ప్రజలకు అర్థమయ్యేలా చేయడం అని ఆయన సూచనప్రాయంగా వివరించారు.

అయితే, కాంగ్రెస్ నిర్దేశించుకున్న ఈ ఉద్దేశాల ప్రకారమే యాత్రను మూల్యాంకనం చేస్తే రాహుల్ గాంధీ ఇప్పటివరకు ఈ యాత్ర ద్వారా ఏం సాధించారు? ఏం పోగొట్టుకున్నారు? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.

దీని గురించి ప్రముఖ జర్నలిస్ట్ రాధికా రామసేషన్ మాట్లాడారు.

‘‘ఈ యాత్ర ఉద్దేశం ఏమిటనేది నన్ను కొంత గందరగోళానికి గురి చేసింది. రాహుల్ గాంధీ ఒక తత్వవేత్త కాదు, ఒక మత గురువు కాదు. రాహుల్ గాంధీ పూర్తిగా ఒక రాజకీయ నాయకుడు. కాబట్టి ఆయనను రాజకీయాల నుంచి వేరు చేసి చూడలేం.

యాత్ర సందర్భంగా ప్రజలు రాహుల్‌తో కలిసి రావడం స్పష్టంగా కనిపిస్తోంది. కానీ, రాజకీయ పరంగా చూస్తే ఆయన ఇప్పటివరకు ఏం సాధించారో చెప్పడం కష్టం’’ అని ఆమె అన్నారు.

భారత్ జోడో యాత్ర

  • తమిళనాడులోని కన్యాకుమారిలో సెప్టెంబర్ 7న ప్రారంభం
  • తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల మీదుగా యాత్ర సాగింది
  • ప్రస్తుతం రాజస్తాన్‌ మీదుగా జరుగుతోంది
  • హరియాణా, ఉత్తరప్రదేశ్, దిల్లీ, పంజాబ్, జమ్మూకశ్మీర్‌ల గుండా సాగనుంది
  • యాత్రలో చాలామంది ప్రముఖులు భాగమయ్యారు
  • బహుశా ఫిబ్రవరిలో యాత్ర ముగుస్తుంది
భారత్ జోడో యాత్ర

ఫొటో సోర్స్, BHARAT JODO/ FB

ఫొటో క్యాప్షన్, భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో నటుడు సుశాంత్ సింగ్

కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా మారింది

రాధికా రామసేషన్ ప్రకారం, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ మనుగడలో ఉంది, కొన్ని రాష్ట్రాల్లో బలహీనంగా, మరికొన్ని రాష్ట్రాల్లో కనుమరుగు అయింది.

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. అక్కడ సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వర్గాలు రెండూ కలిసి పనిచేశాయి. అక్కడ రాహుల్ గాంధీ యాత్ర చాలా విజయవంతమైంది.

మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ వెనుకబడింది. కానీ, అయినప్పటికీ రాహుల్ గాంధీ పర్యటన సమయంలో కాంగ్రెస్ పార్టీ బలంగా కనిపించింది.

రాజస్తాన్ విషయానికొస్తే అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ యాత్ర కోసం ప్రజలను సమీకరించడంలో కీలక పాత్ర పోషించారు.

‘‘కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా మారిందనడానికి వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలు అసలు పరీక్షగా మారనున్నాయి. కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ సహా మొత్తం 13 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి’’ అని రాధిక చెప్పారు.

భారత్ జోడో యాత్ర

ఫొటో సోర్స్, Getty Images

ఆర్థిక అసమానతలు ఒక తీవ్రమైన సమస్య అని రాధిక అన్నారు. గుజరాత్ ఎన్నికల సమయంలో తాను అక్కడికి వెళ్లినప్పుడు అక్కడి ప్రజల్లో ఇది చర్చనీయాంశమైందని ఆమె చెప్పారు. అయితే, ఇది ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపలేదని అన్నారు.

ఆమె ప్రకారం ద్రవ్యోల్బణం, నిరుద్యోగం అనేవి ప్రజలు ఎదుర్కొంటున్న అసలు సమస్యలు. రాహుల్ గాంధీ ఈ సమస్యలపై తన గొంతు వినిపిస్తే 2024 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రయోజనం కలుగుతుంది.

గత కొన్నేళ్లలో సమాజంలో చీలిక పెరిగిందన్నది నిజమే అని ఆమె అన్నారు. అయితే, ఈ విషయంలో బీజేపీ చాలా విజయవంతమైందని, రాహుల్ గాంధీ మాటలు ప్రజలను ప్రభావితం చేయట్లేదని ఆమె అభిప్రాయపడ్డారు.

‘‘ఈరోజుకీ ప్రజల్లో నరేంద్ర మోదీపై అభిమానం చాలా ఎక్కువ స్థాయిలో ఉంది. నియంతృత్వ అంశం ప్రజల మనస్సుల్లోకి ఎక్కడం లేదు. మోదీ ఎమర్జెన్సీ అయితే విధించలేదు కదా, అలాంటప్పుడు నియంతృత్వం అని ఎలా చెబుతాం అని ప్రజలు అంటున్నారు’’ అని రాధిక వివరించారు.

భారత్ జోడో యాత్ర

ఫొటో సోర్స్, BHARAT JODO/ FB

2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యం

సీనియర్ జర్నలిస్ట్, ప్రస్తుతం దిల్లీలోని థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ (CPR)తో అనుబంధం కలిగి ఉన్న అసిమ్ అలీ ఈ యాత్ర గురించి మాట్లాడారు.

ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం బీజేపీ సిద్ధాంతానికి పూర్తిగా భిన్నమైన భావజాలాన్ని ప్రజల ముందు ఉంచడమే అని ఆయన అభిప్రాయపడ్డారు.

‘‘ఈ యాత్ర ద్వారా కాంగ్రెస్ తన సైద్ధాంతిక సంక్షోభాన్ని అధిగమించింది. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల సిద్ధాంతాలను పూర్తిగా వ్యతిరేకిస్తూ కనిపిస్తోంది’’ అని చెప్పారు.

ట్రిబ్యూన్ వార్తాపత్రికలో ప్రఖ్యాత రాజకీయ శాస్త్రవేత్త, ప్రొఫెసర్ జోయా హసన్ ఒక కథనం రాశారు. భారతదేశంలోని మెజారిటీవాదాన్ని ఎదుర్కోవడానికి… సామాజిక విభజన, అసహనానికి వ్యతిరేకంగా ప్రారంభమైన మొదటి తీవ్ర ప్రయత్నం ‘‘భారత్ జోడో యాత్ర’’ అని ఆమె ఆ ఆర్టికల్‌లో రాశారు.

అసిమ్ అలీ ప్రకారం, ఇప్పటి వరకు ఎన్నికల సమయంలో మాత్రమే భావజాలం గురించి మాట్లాడుతున్నారు. అలా కాకుండా బీజేపీ నిరంతరం ప్రస్తావించే లవ్ జిహాద్, గోహత్య వంటి అంశాలపై తరచుగా కాంగ్రెస్ స్పందించాల్సి ఉంది.

మీడియా, ఇతర సంస్థలపై పూర్తిగా నమ్మకం పోయిందని, అందుకే తానే నేరుగా ప్రజలతో మాట్లాడేందుకు ప్రజల వద్దకు వచ్చాననే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారు.

రాహుల్ గాంధీ ప్రస్తుతానికి ఏ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల గురించి ఆందోళన చెందడం లేదని, ఆయన దృష్టి అంతా 2024 సార్వత్రిక ఎన్నికలపైనే కేంద్రీకృతమై ఉందని ఆసిమ్ అలీ అన్నారు.

అయితే ఈ యాత్రకు ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ చెబుతోంది. దానికి అసిమ్ అలీ స్పందిస్తూ, అవినీతికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ యాత్ర చేసినప్పుడు, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ యాత్ర చేపట్టినప్పుడు కూడా ఇది ఎన్నికల యాత్ర కాదు అనే చెప్పారు. కానీ అది పూర్తిగా రాజకీయ యాత్ర అని అందరికీ తెలుసు.

భారత్ జోడో యాత్ర

ఫొటో సోర్స్, BHARAT JODO/ FB

రాహుల్ గాంధీ ఇమేజ్‌పై ఎలాంటి ప్రభావం పడింది?

ఈ పర్యటన వల్ల రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి లాభం జరిగిందనే ప్రశ్నకు ఆసిఫ్ అలీ సమాధానం చెప్పారు. ఈ యాత్ర అన్నింటికంటే ఎక్కువగా రాహుల్ గాంధీ వ్యక్తిగత ఇమేజ్‌పై ఎక్కువ ప్రభావం చూపిందని ఆయన అన్నారు.

దీనికి ఉదాహరణగా ఆసిమ్ అలీ, కుణాల్ కామ్రాను ఉదాహరణగా చూపిస్తూ... ‘‘కామ్రా ఇంతకుముందు రాహుల్ గాంధీని బాగా ఎగతాళి చేసేవారు. అయితే ఇప్పుడు ఆయన యాత్రలో స్వయంగా పాల్గొనడం అనేది బీజేపీ, కాంగ్రెస్‌లను ఒకే తరహాలో చూసే నాగరిక సమాజం ఆలోచనలో వస్తోన్న మార్పుకు సంకేతంగా కనిపిస్తోంది’’ అని అన్నారు.

రాహుల్ గాంధీ గురించి మీడియా ఇప్పుడు చాలా తక్కువగా మాట్లాడుతోందని, ఇది రాహుల్ గాంధీ విజయమని చెప్పారు. ఇంతకుముందు రాహుల్ గాంధీ గురించి మీడియా చాలా విద్వేషంగా ఉండేదని అన్నారు.

తాను నిరుద్యోగులు, యువత, దళితులు, గిరిజనులు, పేదలు, రైతులు, ముస్లింలకు అండగా నిలుస్తున్నానని, 2024 ఎన్నికల్లో సరళమైన సైద్ధాంతిక రేఖను గీయడానికి ప్రయత్నిస్తున్నానని రాహుల్ గాంధీ ఇస్తోన్న సందేశం ఈ యాత్ర ద్వారా స్పష్టంగా తెలుస్తోంది.

'మోదీ ప్రభుత్వ హయాంలో భారతదేశంలోని కొన్ని ఎంపిక చేసిన వ్యాపార సంస్థలు మాత్రమే అన్ని ప్రయోజనాలను పొందుతున్నాయని, మిగిలిన సమాజంలోని వారు నష్టపోతున్నారని ప్రజలను నమ్మించేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారు. మోదీ ప్రభుత్వాన్ని, కొన్ని వ్యాపార సంస్థలను వ్యతిరేకిస్తున్నామని, వారి కారణంగా బాధపడుతున్నవారికి అండగా నిలిచేందుకే తాను ప్రయత్నిస్తున్నట్లు రాహుల్ గాంధీ ఈ పర్యటన ద్వారా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ’’

భారత్ జోడో యాత్ర

ఫొటో సోర్స్, BHARAT JODO/ FB

ఫొటో క్యాప్షన్, రాహుల్ గాంధీతో సినీ నిర్మాత ఆనంద్ పట్వర్ధన్

మీడియాలో భారత్ జోడో యాత్ర కవరేజీ

రాహుల్ గాంధీ యాత్రను మీడియా చాలా తక్కువగా కవర్ చేస్తోంది. ఈ కారణంగా రాహుల్ గాంధీ తన సందేశాన్ని ప్రజలకు చేరవేయడంలో ఎక్కువగా విజయవంతం కాలేకపోతున్నారు.

ప్రధాన మీడియాలో తక్కువ కవరేజీ కారణంగా కాంగ్రెస్, ఈ యాత్ర ప్రచారం కోసం ఎక్కువగా సోషల్ మీడియాపై ఆధారపడుతోంది.

సీఎస్‌డీఎస్ సంస్థ 2019లో చేసిన సర్వే ప్రకారం, భారత్‌లో 49 శాతం ప్రజలు టీవీ చానల్ ద్వారా వార్తలు తెలుసుకుంటారని, 10 శాతం మంది వార్తా పత్రికలు చదవడం ద్వారా, కేవలం 3 శాతం మాత్రమే సోషల్ మీడియాపై వార్తల కోసం ఆధారపడతారని అసిమ్ అలీ చెప్పారు.

ప్రస్తుతం రోజురోజుకీ సోషల్ మీడియాను ఉపయోగించే వారి సంఖ్య పెరుగుతుందనేది నిజం. అలాగే దళితులు, ఆదివాసీలు, ముస్లింలు కూడా ఎక్కువగా ఇంటర్నెట్‌ను వాడుతుండటం కాంగ్రెస్‌కు ముఖ్యంగా రాహుల్ గాంధీకి ఉపకరించే అంశం.

అయితే, భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ ఎంత విజయవంతం అయ్యాడనేది ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రమే తెలుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.

వీడియో క్యాప్షన్, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కంటైనర్ల కాన్వాయ్ ఎందుకు?

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)