మాండోస్ తుపాను: “ఒక్కసారిగా వచ్చిన నీళ్లు మా పొలాలపై పడ్డాయి.. ఇసుక మేటలు వేశాయి”

ఫొటో సోర్స్, BBC/TULASI PRASAD REDDY
- రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
- హోదా, బీబీసీ కోసం
ఉమ్మడి నెల్లూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో మాండోస్ తుపాను ప్రభావం మెల్లమెల్లగా తగ్గుతోంది. మంగళవారం వరకూ సన్నగా వర్షం పడినా, ఆ తర్వాత ఆ జల్లులు కూడా ఆగిపోయాయి.
అయితే తుపాను శాంతించినా.. దాని వల్ల కలిగిన నష్టం మాత్రం రైతులను బాధ పెడుతూనే ఉంది. వరసగా మూడు రోజులపాటు కురిసిన భారీ వర్షాల వల్ల ఆంధ్రప్రదేశ్ దక్షిణ భాగంలో వేల ఎకరాల పంటకు నష్టం జరిగింది.
ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ప్రకాశం జిల్లాలో 11,153 హెక్టార్లలో, చిత్తూరు జిల్లాలో 287 హెక్టార్లు, తిరుపతి జిల్లాలో 3310 హెక్టార్లు, వైఎస్సార్ కడప జిల్లాలో 6222 హెక్టార్లు, అన్నమయ్య జిల్లాలో 188 హెక్టార్లలో మొత్తం 21,161 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి.
ఈ జిల్లాల్లో మొత్తం 3,274 హెక్టార్లలో ఉద్యాన పంటలకు కూడా నష్టం జరిగింది. డిసెంబర్ 10న తిరుపతి జిల్లాలో అత్యధికంగా 147.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

ఫొటో సోర్స్, BBC/TULASI PRASAD REDDY
తిరుపతిలో అత్యధికంగా..
మాండోస్ తుపాను వల్ల తిరుపతి జిల్లాలో నష్టం అత్యధికంగా ఉంది.
రెండు ఎకరాల్లో వరి నాట్లు వేశానని, భారీ వర్షాలకు అదంతా కొట్టుకుపోయిందని తిరుపతి జిల్లా గూడూరు మండలం గిరిపాళెంకు చెందిన రైతు శివకుమార్ వాపోయారు.
‘‘మా పంచాయతీలో దాదాపు 1,000 ఎకరాల్లో వరి సాగు కోసం దుక్కి దున్ని నారు సిద్ధం చేశాం. అయితే అకాల వర్షంతో దున్నిన దుక్కంతా పాడైపోయింది. ఎగువ నుంచి ఒక్కసారిగా వచ్చిన నీళ్లు, మా పొలాలపై పడడంతో ఇక్కడంతా ఇసుక మేటలు వేశాయి. ఒక్కో ఎకరంపై దాదాపు 10 వేల రూపాయలు ఖర్చు పెట్టాం. అదంతా ఇప్పుడు నష్టపోయినట్టే”అని ఆయన బీబీసీతో చెప్పారు.
పంటలకు అధికారులు బీమా చేయిస్తారని, అయితే చెల్లింపు మాత్రం నామమాత్రంగా చేస్తారని శివకుమార్ విచారం వ్యక్తంచేశారు.
“అకాల వర్షాలు వచ్చిన ప్రతిసారీ పంట కొట్టుకుపోతుంటుంది. గత సంవత్సరంలో కూడా ఇలాగే నాట్లు వేశాక కొట్టుకుపోయాయి. అంతా అయిన తర్వాత ప్రభుత్వం 80 శాతం విత్తనాలు ఇచ్చింది. వాటిని ఏంచేయాలో తెలియక దంచుకుని తిన్నాము. అధికారులు ఇప్పటివరకు మా పంటల వైపు వచ్చింది ఎప్పుడూ లేదు’’అని ఆయన అన్నారు.
అయితే, మాండోస్ వల్ల కురిసిన వర్షాలకు ప్రస్తుతం తమ నిమ్మచెట్లకు ఎలాంటి నష్టం లేదని, ఇకమీద వర్షం పడితే మాత్రం నష్టపోతామని కలువాయి మండలం పర్లకొండపల్లి నిమ్మరైతు నాగరత్నయ్య చెప్పారు. నిమ్మచెట్లకు ఎప్పుడూ కోత ఉంటుంది కాబట్టి, అవి రాలిపోతాయని ఆయన బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, BBC/TULASI PRASAD REDDY
4500 ఎకరాల్లో..
ప్రాథమిక పరిశీలన అనంతరం తిరుపతి జిల్లాలో సుమారు 4500 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని తిరుపతి కలెక్టర్ వెంకట రమణారెడ్డి బీబీసీతో చెప్పారు.
‘‘వరి పంట నాలుగు వేల ఎకరాల్లో దెబ్బతింది. వరి నర్సరీ 250 ఎకరాల్లో దెబ్బంది. 260 ఎకరాల్లో కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. చేపల చెరువులు 18 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. ప్రాణ నష్టం జరగలేదు. 29 పశువులు మృతి చెందాయి. ప్రధానంగా శ్రీకాళహస్తి, గూడూరు, సత్యవేడు ప్రాంతాల్లో ఎక్కువగా పంటలు దెబ్బతిన్నాయి’’అని ఆయన వివరించారు.
‘‘తిరుపతి డివిజన్‌లో పంట నష్టం తక్కువే. పశువుల నష్ట పరిహారం కోసం పశు సంవర్థక శాఖ నివేదిక రూపొందిస్తుంది. ఒరిజినల్ సర్వే పూర్తయిన అయిన తర్వాత.. తర్వాత పంట వేసేలోపు నష్టపోయిన రైతులకు డబ్బులు ఇస్తాం. ఏ సీజన్‌కు ఆ సీజన్‌లోనే ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తున్నాము. నర్సరీస్ పెట్టి నష్టపోయిన రైతులకు వెంటనే 80% సబ్సిడీతో విత్తనాలు అందిస్తాం. వారు మళ్ళీ విత్తనాలు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మిగిలిన వాటికి పంట నష్టం అందిస్తాం’’అని కలెక్టర్ చెప్పారు.

ఫొటో సోర్స్, BBC/TULASI PRASAD REDDY
నెల్లూరులో..
ఈ వర్షాలకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కూడా నష్టం తీవ్రంగా ఉంది. చాలా ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగిపొర్లడంతో చెరువులు తెగాయి. 500 హెక్టార్లలో వరి నారు నాశనమైంది. రబీ సీజన్‌లో పంట నాటడానికి సిద్ధమవుతున్న రైతులకు ఇది భారీ నష్టాలను మిగిల్చింది.
తుపాను వల్ల అకాల వర్షాలకు ఒక్క ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే సుమారుగా 30వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతిందని రైతు సంఘాల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కోటిరెడ్డి బీబీసీతో చెప్పారు.
‘‘జిల్లాలో సుమారుగా ఆరు నుంచి ఏడు లక్షల హెక్టార్లలో సాగు చేస్తారు. మెట్ట ప్రాంతాల్లో పెసరు, మినుము, కందులు వేస్తారు. అది పూత దశలో ఉండటంతో పూత రాలిపోతుంది. దానివల్ల సుమారు 15 వేల హెక్టార్లలో ఈ మూడు పంటలు దెబ్బతిన్నాయి. వరి నారు దశలో ఉంది కాబట్టి పెద్ద నష్టంలేదు. సూళ్లూరు పేట, వెంకటగిరి లాంటి ప్రాంతాల్లో పంట కోతకు వచ్చే దశలో ఉంది. అక్కడ పంటలు దెబ్బతిన్నాయి. నారుమళ్లన్నీ మునిగిపోయాయి. 15 రోజుల లోపు నారు మడులు పూర్తిగా నాశనమయ్యాయి’’అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, BBC/TULASI PRASAD REDDY
సబ్సిడీపై విత్తనాలు..
నెల్లూరు జిల్లాలో నష్టపోయిన రైతులకు ఈ శీతాకాలంలోనే మళ్లీ నారు పోసేందుకు రైతు భరోసా కేంద్రాల ద్వారా 80 శాతం సబ్సిడీతో విత్తనాలు సరఫరా చేస్తామని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు బీబీసీతో చెప్పారు.
‘‘నిజానికి ఈ వర్షం మనకు లాభదాయకమే. ఈ సీజన్‌కు అవసరమైన నీరు ఉంటుంది. అయితే అక్కడక్కడ కొంత మేరకు పంటకు నష్టం జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. పంట నష్టం జరిగిన చోట ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తాం. కోతకు వచ్చిన మినుములు, శనగ పంట దెబ్బతింది. అది కూడా 300 ఎకరాల విస్తీర్ణం మేరకే. మిగిలిన రెండు వేల ఎకరాల్లో వరి పంటకునష్టం జరిగింది’’అని అన్నారు.
పంట నష్టాన్ని అంచనా వేస్తున్నామని కలెక్టర్ చెప్పారు. మొత్తం 800 హెక్టార్లలో నష్టం జరిగిందని, వాటికి ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తామమని తెలిపారు.
నవంబరులో రావాల్సిన వర్షాలు పడకపోవడంతో ఈసారీ వరి నాట్లు కాస్త ఆలస్యం అయ్యాయని కలెక్టర్ చక్రధర్ చెప్పారు. ఇప్పుడు తుపాను వర్షాలకు అవి దెబ్బతిన్నాయని వివరించారు.

ఫొటో సోర్స్, BBC/TULASI PRASAD REDDY
నీళ్లలోనే..
డెల్టా దిగువ ప్రాంతాల్లో వరి ధాన్యం నీళ్లలోనే ఉందని ఈస్ట్, వెస్ట్, కృష్ణ, గుంటూరు, కొల్లూరు ప్రాంతాల్లో వరి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఎన్టీఆర్ జిల్లా, గుంటపల్లికి చెందిన వేణుగోపాల్ అనే రైతు బీబీసీతో చెప్పారు. వేణుగోపాల్ రైతుసంఘాల సమాఖ్యలో కూడా పనిచేస్తున్నారు.
‘‘రైతులు ధరల కోసం రోడ్డుపైకొస్తే కేసులు పెడుతున్నారు. అసలు కొనుగోలు చేయడానికి గోనె సంచులు లేవు. 20 రోజుల నుంచి ధాన్యమంతా కళ్ళాల్లోనే ఉంది. ఒక ఎకరాలో 40 బస్తాలు పండితే అందులో మూడు నుంచి ఐదు బస్తాలు తేమ శాతం ఉందని తీసేస్తున్నారు. ఇది కాక క్వింటాకు 7 నుంచి 10 కేజీలు తరుగు పేరుతో తీసేస్తున్నారు. ధాన్యం అయితే నల్లగా రంగు మారుతుంది. దీంతో రైతులం నష్టపోతున్నాం. 10.5 ఎకరాల్లో వివిధ పంటలు వేశాను. రెండున్నర ఎకరా సొంత పొలం. మిగిలిన 6ఎకరాలు కౌలుకు తీసుకుని పంటలు వేశాను’’అని వేణుగోపాల్ బీబీసీతో చెప్పారు.
మిరప, మినుము, పత్తి, వరి పంటలు దెబ్బతిన్నాయని కృష్ణా జిల్లా మువ్వ మండలానికి చెందిన అనిల్ అనే రైతు బీబీసీతో చెప్పారు.
‘‘వరి రంగు మారి ధర తగ్గుతుంది. రైతు భరోసా కేంద్రాల్లో క్వింటా 1530 రూపాయలు ఉంది. అయితే ఇప్పుడు వంద రూపాయలు తగ్గించి అడుగుతున్నారు. రైతు భరోసా కేంద్రాల(ఆర్‌బీకే) ద్వారా కొనుగోలు చేయాలి. కానీ ఇంకా చేయలేదు. మినుముపై చాలా ప్రభావం పడింది. ఒక ఎకరానికి కోతకు వచ్చే సమయానికి 12వేలు ఖర్చు అవుతుంది. ఎకరాకు 3000 పెట్టి విత్తనాలు చల్లాం ఇప్పుడు అదంతా పోయింది. తిరిగి విత్తనాలు చల్లుకోవాలి. 6 ఎకరాలలో పండింస్తున్నాను. సొంతంగా రెండు ఎకరాలు ఉంటే నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని చేస్తున్నాను. అందులో మినుము, వరి వేశాను’’ అని ఆయన తెలిపారు.
తుపాను ప్రభావంతో నష్టపోయిన పంటలపై ఇప్పుడే అంచనా వేయలేమని, పూర్తి నివేదిక రావడానికి వారం 10 రోజులు పడుతుందని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి బీబీసీతో చెప్పారు. నివేదిక అందిన వెంటనే నష్టపోయిన రైతులకు సహాయం అందిస్తామని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- తండ్రి సమాధి వెతుకుతూ మలేసియా వరకు సాగిన భారతీయుడి ప్రయాణం
- కేరళలో ఫిల్మ్ ఫెస్టివల్‌కి ఈ ఇరాన్ మహిళా నిర్మాత జుట్టు కత్తిరించి పంపించారు ఎందుకు
- బంగ్లాదేశ్: షేక్ హసీనా గద్దె దిగాలంటూ నిరసనలు
- అరుణాచల్ ప్రదేశ్: 'చైనా సైన్యం వాస్తవాధీన రేఖ మీదకు వచ్చింది.. మన సైన్యం తిప్పికొట్టింది'
- సుప్రీంకోర్టులోనైనా ఉచితంగా వకీలును పెట్టుకుని వాదించడం ఎలా, ఉచిత న్యాయ సహాయం ఎలా పొందాలి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















