అరుణాచల్ ప్రదేశ్: కివీ పండ్ల నుంచి వైన్ తయారీ

సులా వైన్

ఫొటో సోర్స్, SULA

    • రచయిత, ప్రతీ గుప్తా, బెన్ మోరిస్
    • హోదా, బీబీసీ న్యూస్

వైన్ తాగే అలవాటు లేని, అసలు వైన్‌ తయారీకి అనువైన ద్రాక్షను పెంచే వాతావరణంలేని దేశంలో వైన్ పరిశ్రమను అభివృద్ధి చేయడానికి ఏం చేయాలి?

దీని కోసం భారత్‌లో కొంతమంది కొత్తకొత్త పరిష్కారాలతో ముందుకువచ్చారు. ద్రాక్ష పండే సీజన్‌లో మార్పులతో మొదలుపెట్టి, ద్రాక్షకు బదులుగా కివీ పళ్లను వాడటం, క్యాన్‌లలో వైన్‌ను ప్యాక్ చేయడం ఇలా చాలా పరిష్కారాలు వారు కనిపెట్టారు.

‘‘1997లో మేం వైన్ తయారీ మొదలుపెట్టినప్పుడు ఇక్కడ ఎవరికీ వైన్ అంటే ఏమిటో పెద్దగా తెలియదు’’అని సులా వైన్‌యార్డ్స్ స్థాపకుడు రాజీవ్ సామంత్ చెప్పారు.

‘‘భారత్‌లో లిక్కర్ షాపులను వైన్ షాపులుగా పిలుస్తారు. అంటే ఇక్కడ చాలా మందికి వైన్ అంటే లిక్కరే’’అని ఆయన చెప్పారు.

ఇది కేవలం బ్రాండింగ్ సమస్య మాత్రమే కాదు. సులా వైన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వీరు చాలా అవరోధాలను అధిగమించాల్సి వచ్చింది.

ద్రాక్ష పళ్ల నుంచి వైన్ తయారుచేయడానికి ప్రభుత్వం నుంచి లైసెన్సు తీసుకోవడానికి సామంత్‌కు రెండేళ్లు పట్టింది. ఆ తర్వాత మద్యం ప్రియులను ఆయన ఆకర్షించాలి. నిజానికి అప్పటికి వైన్‌పై ప్రజల్లో అంత ఆసక్తి ఉండేదికాదు.

సులా వైన్

ఫొటో సోర్స్, SULA

వాతావరణం కూడా సమస్యే..

వాతావరణం కూడా వైన్ అవరోధంగా ఉండేది. సులా ప్రధాన తయారీ కేంద్రం మహారాష్ట్రలోని నాసిక్‌లో ఏర్పాటుచేశారు. ఇది ఉష్ణమండల ప్రాంతం. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఇక్కడి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వెళ్తుంటాయి.

‘‘వాతావరణం అనేది మొదట్నుంచీ ఒక సవాల్ లాంటిదే. ఎప్పటికీ ఆ సవాల్ అలానే ఉంటుంది’’అని సామంత్ చెప్పారు.

ప్రపంచంలోని వైన్ తయారుచేసే ప్రాంతాలకు పూర్తి విరుద్ధమైన కాలాల్లో ద్రాక్ష పళ్లను పండించడం సులా మొదలుపెట్టింది. అంటే ఇక్కడ శీతాకాలంలో ద్రాక్ష పళ్లను సాగుచేస్తారు. శీతాకాలం చివర్లో పంట కోతకు వస్తుంది.

టెక్నాలజీ కూడా ఈ సమస్యను పరిష్కరించేందుకు కొంతవరకు సాయం చేసింది. వైన్‌ను స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలో రిఫ్రిజిరేట్ చేసేందుకు ప్రయత్నించిన తొలి భారత వైన్‌యార్డ్ సులా వైన్స్.

ఫటెల్లీ వైన్స్

ఫొటో సోర్స్, FRATELLI

‘‘మంచి ట్రాపికల్ వైన్ తయారుచేయాలంటే, దాన్ని అతిశీతల ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేయాలి. ఇది కాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారామే. కానీ, దీని వల్ల నాణ్యత పెరుగుతుంది’’అని సామంత్ వివరించారు.

అయితే, ఈ ప్రయత్నం వారికి విజయాన్ని తెచ్చిపెట్టింది. నేడు సులా సంస్థలో దాదాపు వెయ్యి మంది సిబ్బంది పనిచేస్తున్నారు. సంస్థ వార్షిక విక్రయాలు రూ.500 కోట్ల (62 మిలియన్ డాలర్లు) వరకు జరుగుతున్నాయి.

ఇటీవల సంస్థ తమ తొలి షేర్లను కూడా అమ్మకానికి పెట్టింది. మొత్తంగా మార్కెట్ నుంచి దాదాపు 1000 కోట్ల రూపాయలను సమీకరించింది.

ఏటా నాసిక్‌లో సంస్థ వైన్‌యార్డ్‌ను చూసేందుకు లక్షల మంది ప్రజలు వస్తుంటారు.

ప్రస్తుతం భారత్‌లో ఇలాంటి వైన్ తయారుచేసే పరిశ్రమలు దాదాపు 110 వరకు ఉన్నాయి. వైన్‌తోపాటు ఫ్రూట్ వైన్‌ కూడా ఇక్కడ తయారుచేస్తుంటారు.

వీడియో క్యాప్షన్, ఖర్జూర కల్లు: చెట్టు మీంచి కుండ దించక ముందే అడ్వాన్సులు ఇస్తున్నారు

విదేశీ సంస్థల భాగస్వామ్యంతో

భారత్‌లో మూడో అతిపెద్ద వైన్ తయారీ సంస్థ ఇలా విదేశీ సంస్థ భాగస్వామ్యంతోనే ముందుకు వచ్చింది.

2006లో ఇటలీకి చెందిన సిస్సీ బ్రదర్స్.. మహారాష్ట్రకు చెందిన మోహితే పాటిల్ బ్రదర్స్ (అర్జున్, రంజిత్), దిల్లీకి చెందిన సెఖ్రీ బ్రదర్స్ (కపిల్, గౌరవ్) కలిసి ఈ సంస్థను ఏర్పాటుచేశారు. ఈ సంస్థ ఫ్రటెల్లి వైన్స్‌గా పెట్టారు.

‘‘ఇక్కడ వైన్ తయారీ సంప్రదాయ పద్ధతుల్లో నిబంధనలు అనుసరించి ఉండదు. ఈ స్టైల్ చాలా కొత్తగా ఉంటుంది. ఇక్కడ చాలా ప్రయోగాలు చేస్తుంటాం. టెక్నాలజీ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంటుంది’’అని ఫ్రటెల్లి వైన్స్‌కు చెందిన జయంత్ భారతి చెప్పారు.

క్యాన్‌లో తాము అందిస్తున్న కొత్త వైన్.. యువతను బాగా ఆకట్టుకునే అవకాశముందని ఆయన వివరించారు.

ఇలాంటి ఆవిష్కరణలు విజయవంతం అవుతాయని ఆయన చెబుతున్నారు.

‘‘దేశంలో పట్టణ జనాభా పెరుగుతోంది. వైన్ తాగడం అనేది సంస్కృతిలో భాగంగా మారుతోంది. మరోవైపు ఇక్కడి వైన్‌లో నాణ్యత కూడా పెరుగుతోంది. ఫలితంగా ప్రపంచ వైన్ మ్యాప్‌లో త్వరలో భారత్‌కు ప్రత్యేక గుర్తింపు దక్కుతుంది’’అని ఆయన అన్నారు.

భారత్‌లోని వాతావరణం ద్రాక్షకు అనుకూలంగా ఉండకపోవడంతో, ఇతర పళ్లతో వైన్ తయారీపై కొన్ని సంస్థలు దృష్టిపెడుతున్నాయి.

రీటా

ఫొటో సోర్స్, TAGE RITA

ఫొటో క్యాప్షన్, రీటా

పరిష్కారం ఇలా..

అరుణాచల్ ప్రదేశ్‌లోని వాతావరణం కివీ, పియర్స్, పీచ్, ప్లమ్‌ పళ్లకు అనువుగా ఉంటుంది. అయితే, ఇక్కడ మార్కెటింగ్, రవాణా, నిల్వ సదుపాయాలు లేవు. దీంతో చాలా పళ్లు పాడైపోతున్నాయి.

ఈ సమస్యను పరిష్కరించాలని 2017లో టేజ్ రీటా భావించారు. అప్పుడే ఆమె కివీ నుంచి వైన్ చేయడంపై దృష్టిపెట్టారు. ఇక్కడ లోయలో కివీ విస్తృతంగా పండుతుంది.

నారా ఆబా బ్రాండ్ పేరుతో పిలిచే ఈ కివీ వైన్‌లో ఆల్కహాల్ శాతం 13 వరకు ఉంటుంది. ఇది భారత్‌లో తొలి ఆర్గానిక్ కివీ వైన్.

‘‘ఇక్కడ రైతుల నుంచి పళ్లను సేకరించడంతో వ్యవసాయాన్ని ప్రోత్సహించినట్లు అవుతుంది. వీటి ద్వారా వైన్ తయారు చేయడంతో ఈ పళ్లలోని ఆరోగ్యాన్ని అందించే లక్షణాలను కూడా వైన్‌లో కలిపినట్లు అవుతుంది’’అని రీటా చెప్పారు. ఇక్కడ వైన్ తయారీతో స్థానిక ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని ఆమె వివరించారు.

‘‘ఈ ఉత్పత్తులను విక్రయించడం ద్వారా స్థానిక రైతులకు మేలు జరుగుతోంది. దీని వల్ల ఇక్కడి యువతకు కూడా ఉపాధి లభిస్తోంది’’అని ఆమె చెప్పారు.

కివీలను కూడా ద్రాక్షపళ్ల తరహాలోనే పండిస్తారు. బాగా పండిన పళ్ల నుంచి జ్యూస్ సేకరించి, పులియబెడతారు. వైన్ తయారీకి దాదాపు మూడు నుంచి నెలల సమయం పడుతుంది. కొన్ని పానీయాలను మరో నాలుగైదు నెలలు అదనంగా పులియబెడతారు.

నారా అబ్బా

ఫొటో సోర్స్, NAARA AABA

ఏడాదికి దాదాపు 50,000 బాటిళ్ల వైన్‌ను నారా అబ్బా తయారుచేస్తుంది. పీచ్, ప్లమ్, పియర్స్ నుంచి ఇక్కడ వైన్ తయారుచేస్తారు.

‘‘పళ్లు చాలా వేగంగా కోతకు వస్తాయి. పైగా వీటి బరువు తక్కువగా, తీపిగా ఉంటాయి. కొత్తగా తాగడం మొదలుపెట్టేవారికి ఇవి హాయిగా అనిపిస్తాయి’’అని రీటా చెప్పారు.

‘‘వైన్ విషయంలో సమాజంలో ఒకప్పుడు కనిపించే సంప్రదాయాలు, కట్టుబాట్లు నెమ్మదిగా తొలగిపోతున్నాయి’’అని ఇండియన్ వైన్ అకాడమీ వ్యవస్థాపకుడు సుభాష్ అరోరా అన్నారు.

‘‘అయితే, వైన్‌లో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడం కొంచెం కష్టమే. ఎందుకంటే ఇక్కడ వాతావరణం అనుకూలంగా ఉండదు. అందుకే అద్భుతమైన వైన్‌ ఇక్కడ తయారుచేయడం సాధ్యం కాకపోవచ్చు. కానీ, ఇక్కడ తయారుచేసిన వైన్ కూడా ప్రజలకు నచ్చుతోంది’’అని ఆయన వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)