షాలిని చౌహాన్: మెడికల్ కాలేజ్‌లో ర్యాగింగ్ బయటపెట్టడానికి స్టూడెంట్ వేషంలో 3 నెలలు రహస్య ఆపరేషన్ చేపట్టిన లేడీ కానిస్టేబుల్

ఫొటో సోర్స్, SAMEER KHAN/ BBC
- రచయిత, సమీర్ ఖాన్
- హోదా, బీబీసీ హిందీ కోసం, ఇండోర్
గత రెండు రోజులుగా ఇందోర్‌లో మహిళా కానిస్టేబుల్ షాలిని చౌహాన్ తెగువను మెచ్చుకోని వారు లేరు.
అంతటి ధైర్యసాహాసాలను ప్రదర్శించారు ఆమె. ర్యాగింగ్ కేసును ఛేదించేందుకు తాను ఒక విద్యార్థినిలా మారి, మూడు నెలల పాటు మెడికల్ కాలేజీలో గడిపారు.
విద్యార్థినిలా ఉంటూ రహస్యంగా ర్యాగింగ్ గ్యాంగ్‌లకు వ్యతిరేకంగా ఆధారాలను సేకరించారు.
ఇందోర్‌లోని సంయోగిత గంజ్ పోలీసు స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌గా పనిచేసే 24 ఏళ్ల షాలిని చౌహాన్ ఇదంతా చేశారు.
ఇందోర్‌లోని మహాత్మా గాంధీ మెడికల్ కాలేజీలో సీనియర్ విద్యార్థులు జూనియర్లను ర్యాగింగ్ చేస్తున్నారన్న వార్తలు తరచూ వినపడేవి.
కానీ, బాధితులు ఎవరూ ఫిర్యాదు చేయడం కానీ, సాక్ష్యం చెప్పడం కానీ చేయలేదు.
ఈ ఏడాది జులైలో విసుగెత్తిపోయిన ఒక విద్యార్థి దిల్లీ యాంటీ ర్యాగింగ్ హెల్ప్‌లైన్‌కి ఫోన్ చేసి కాలేజీ క్యాంపస్‌లో జరిగే ర్యాగింగ్‌పై ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా సంయోగిత గంజ్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
ఆ తర్వాత స్టేషన్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న తెహజీబ్ ఖాజీ ఈ కేసును విచారణ చేయడం ప్రారంభించారు.
‘‘అయితే విచారణ చేసే క్రమంలో, మేమెంత ప్రయత్నించినా కూడా ఎవరూ ముందుకు వచ్చి మాకు సాక్ష్యం చెప్పలేదు. వారికి వ్యతిరేకంగా మాకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. మేము ఇక ఈ కేసును అక్కడితో వదిలేయాలనుకున్నాం. కానీ, సమాజంలో జరుగుతున్న ర్యాగింగ్ లాంటి తప్పుడు విధానాలపై మాకు తీవ్ర ఆందోళన కలిగింది. ’’ అని తెహజీబ్ ఖాజీ అన్నారు.

ఫొటో సోర్స్, SAMEER KHAN/ BBC
క్యాంటీన్‌లో విద్యార్థులతో స్నేహం చేశా..
ఈ కేసును ఛేదించేందుకు వారి టీమ్‌లో ఉన్న పిన్న వయస్కురాలు షాలిని చౌహాన్‌ను కాలేజీ క్యాంపస్‌కు వెళ్లాలని ఖాజీ సూచించారు.
కాలేజీ విద్యార్థులతో కలిసిపోయి ఆధారాలు సేకరించాలని కోరారు. ఆ తర్వాత, సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో షాలిని ఇతర విద్యార్థుల మాదిరి కాలేజీకి వెళ్లడం ప్రారంభించారు.
కాలేజీకి వెళ్తున్నప్పటికీ, క్లాస్‌లకు హాజరుకాకుండా చాలా సమయం ఆమె క్యాంపస్ క్యాంటీన్‌లోనే గడిపేవారు.
‘‘నా గుర్తింపు బయటపడుతుందేమోనని నేను చాలా భయపడ్డాను. ఉద్యోగంలో చేరిన తర్వాత చేపట్టిన తొలి ఆపరేషన్ విఫలమవుతుందనుకున్నా. కానీ, సివిల్ డ్రెస్‌లో ప్రతి రోజూ కాలేజీకి వెళ్లేదాన్ని’’ అని బీబీసీ హిందీకి షాలిని చౌహాన్ తెలిపారు.
‘నేను కాలేజీ క్యాంటీన్‌లో కూర్చునే దాన్ని. అక్కడి వెళ్లి, విద్యార్థులతో మాట్లాడేదాన్ని. వారితో కలిసిపోయి, ర్యాగింగ్ చేస్తుందెవరు, వారి బారిన పడిందెవరో తెలుసుకునేందుకు ప్రయత్నించేదాన్ని.’’ అని షాలిని చౌహాన్ చెప్పారు.
ఇలా విద్యార్థులతో మాట్లాడే సమయంలో ఈ వివరాలన్ని ఎందుకని ఎవరైనా తనపై అనుమానం వ్యక్తం చేస్తే, వెంటనే టాపిక్ డైవర్ట్ చేసేదాన్నని షాలిని తెలిపారు.
కాలేజీలో గడిపిన సమయంలో కనీసం తాను ఒక్క క్లాస్‌కి కూడా హాజరు కాలేదు.
ఎవరైనా అడిగితే క్లాస్‌లు బంక్ కొడుతున్నట్టు వాళ్లకి చెప్పేదాన్నని షాలిని చెప్పారు.
‘‘తక్కువ సమయంలోనే, నేను చాలా మంది అబ్బాయిలు, అమ్మాయిలతో మాట్లాడాను. వారితో స్నేహం చేశాను. మెల్లమెల్లగా వారు ర్యాగింగ్‌కు సంబంధించిన సమాచారాన్ని నాతో పంచుకోవడం ప్రారంభించారు. ఈ విషయాలను నేను మా పోలీసు స్టేషన్‌లో ఖాజీ సార్‌కి చెప్పేదాన్ని’’ అని షాలిని తెలిపారు.

ఫొటో సోర్స్, SAMEER KHAN/ BBC
మూడు నెలల్లోనే షాలిని చౌహాన్ ర్యాగింగ్ చేసే విద్యార్థులను గుర్తించారు.
వారికి సంబంధించిన ఆధారాలను సేకరించారు. ఈ సమయంలోనే, బాధిత విద్యార్థులతో కూడా షాలిని చౌహాన్ మాట్లాడారు. ‘‘ర్యాగింగ్ బాధిత విద్యార్థులెవరో మాకు తెలిసిన తర్వాత, ఆ విద్యార్థులను ఎలా ఒప్పించాలన్నది మాకు సవాలుగా నిలిచింది. ర్యాగింగ్ చేసే ఆకతాయిలను శిక్షించేలా విద్యార్థులు పోలీసుల ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పేలా వారిని ఒప్పించాల్సి వచ్చింది. ఆ విద్యార్థులకు మేము కౌన్సిలింగ్ ఇచ్చాం. ఆ తర్వాత సెక్షన్ 161 కింద వారి స్టేట్‌మెంట్‌లను రికార్డు చేసేందుకు వారు ఒప్పుకున్నారు.’’అని సంయోగిత పోలీసు స్టేషన్ ఇన్‌ఛార్జ్ తెహజీబ్ ఖాజీ అన్నారు.
షాలిని చౌహాన్‌ను చూస్తే అండర్ కవర్ మిషన్‌లో తాను ఈ ఆపరేషన్‌ను పూర్తి చేసిందని కనుగొనడం చాలా కష్టం.
అంతేకాక పోలీసు డిపార్ట్‌మెంట్‌లో తాను చేరి అప్పటికి తక్కువ ఏళ్లే. తన తండ్రి చనిపోయిన తర్వాత పోలీసు ఉద్యోగంలో చేరిన షాలిని చౌహాన్ గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేశారు.

ఫొటో సోర్స్, SAMEER KHAN/ BBC
11 మంది సీనియర్ల అరెస్ట్..
తన పోలీసు ఉద్యోగం కారణంతో, తాను ఈ కేసుకు మించి మరిన్ని విషయాలను పంచుకునేందుకు ఇష్టపడలేదు.
కానీ, ఈ అండర్ కవర్ మిషన్‌లో భాగంగా తాను రంగు రంగుల బట్టలు వేసుకెళ్లేదాన్నని తెలిపారు. ఇవి తనకు తన పాత కాలేజీ రోజులను గుర్తుకు చేశాయని చెప్పారు.
బాధిత విద్యార్థులకు న్యాయం దొరకడం చాలా సంతోషంగా ఉందని షాలిని అన్నారు.
షాలిని సేకరించిన సాక్ష్యాధారాలు, బాధిత విద్యార్థుల స్టేట్‌మెంట్ల ఆధారంగా, సంయోగిత గంజ్ స్టేషన్ పోలీసులు జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేస్తున్న 11 మంది సీనియర్లను అరెస్టు చేశారు.
‘‘ర్యాగింగ్‌తో సంబంధం ఉన్న విద్యార్థులను మూడు నెలల పాటు సస్పెండ్ చేస్తున్నాం. హాస్టల్స్‌లో ఉంటున్న విద్యార్థులను మేము మానిటర్ చేస్తాం. కానీ, క్యాంపస్‌కి వెలుపల నుంచి వచ్చే విద్యార్థులను, అద్దె ఇళ్లలో నివసించే విద్యార్థులను మేము మానిటర్ చేయడం లేదు. అందుకే ఈ సంఘటనలు జరిగాయి’’ అని మహాత్మా గాంధీ మెడికల్ కాలేజీ డీన్ సంజయ్ దీక్షిత్ తెలిపారు.
ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలని ఎప్పటికప్పుడు కాలేజీ విద్యార్థులను ఆదేశిస్తున్నట్టు సంజయ్ దీక్షిత్ చెప్పారు. ఒక కానిస్టేబుల్ విద్యార్థిగా కాలేజీ క్యాంపస్‌లో చేరడంపై స్పందించిన సంజయ్ దీక్షిత్, ఈ కేసు విచారణ విషయం తనకు తెలుసన్నారు. కానీ, ఒక మహిళా కానిస్టేబుల్ విద్యార్థినిగా వస్తుందని మాత్రం తనకు తెలియదన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఫిఫా ప్రపంచ కప్: పోర్చుగల్‌పై మొరాకో విజయాన్ని ఇస్లాంతో ముడిపెడుతున్నారు ఎందుకు?
- భారత్ ప్రపంచానికి నాయకత్వం వహించవచ్చు అని రష్యా ఎందుకు అంటోంది?
- పార్లమెంటుపై దాడికి 21 ఏళ్లు: మిలిటెంట్ల దాడి నుంచి భారత ప్రధాని, ఎంపీలు ఎలా బయటపడ్డారంటే
- అఫ్గాన్ మహిళల రహస్య కథలు: ‘కొన్ని కలలు కనడానికి, ఆలోచించడానికి కూడా మాకు అనుమతి ఉండదు’
- పని కోసం ఖతార్ వెళ్తే తిరిగి రావడం కష్టమా, పని మనుషుల జీవితాలు ఎలా ఉంటాయి














