ఇరాన్: ‘నైతిక పోలీసు విభాగాన్ని’ రద్దు చేస్తున్నాం - మహిళల నిరసనల నేపథ్యంలో అటార్నీ జనరల్ ప్రకటన

మాషా అమీనీ ఫొటోను ప్రదర్శిస్తున్న నిరసనకారులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నైతిక పోలీసుల కస్టడీలో మాషా అమీనీ (ఫొటోలో ఉన్న యువతి) మరణంతో ఇరాన్‌లో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి
    • రచయిత, శియావాష్ అర్దాలన్, మారిటా మొలొనే
    • హోదా, బీబీసీ పర్షియన్

ఇరాన్‌లో ఇస్లామిక్ వస్త్రధారణ నియమావళిని అమలు చేసే బాధ్యతలు నిర్వర్తిస్తున్న నైతిక పోలీసు విభాగాన్ని రద్దు చేస్తున్నామని ఆ దేశ అటార్నీ జనరల్ మొహమ్మద్ జాఫర్ మోనటాజెరి చెప్పారు.

ఆయన ఆదివారం నాడు ఒక కార్యక్రమంలో చేసిన ఈ వ్యాఖ్యలను ఇతర వార్తా సంస్థలు ఇంకా నిర్ధారించాల్సి ఉంది.

ఇస్లామిక్ వస్త్రధారణ నిబంధనల ప్రకారం తలను కప్పుకోవాలనే కఠిన నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలతో నైతిక పోలీసులు అరెస్ట్ చేసిన మాషా అమానీ అనే యువతి వారి కస్టడీలో చనిపోవటంతో కొన్ని నెలలుగా దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు, నిరసనలు చెలరేగుతున్నాయి.

అటార్నీ జనరల్ మొంటాజెరి ఆదివారం ఒక మత సదస్సులో పాల్గొన్న సందర్భంలో.. నైతిక పోలీసు విభాగాన్ని రద్దు చేస్తున్నారా అని పలువురు ప్రశ్నించారు.

దీనికి ఆయన బదులిస్తూ.. ‘‘న్యాయ వ్యవస్థతో నైతిక పోలీసు విభాగానికి ఎలాంటి సంబంధం లేదు. ఆ విభాగాన్ని నెలకొల్పిన వారు దానిని మూసివేశారు’’ అని చెప్పారు.

వీడియో క్యాప్షన్, దేశవ్యాప్తంగా చెలరేగిన ఆందోళనల్లో 300 మందికిపైగా మరణించారని చెప్పిన ఐక్యరాజ్య సమితి

నైతిక పోలీసు దళం మీద నియంత్రణ దేశ అంతర్గత (హోం) వ్యవహారాల శాఖ చేతుల్లో ఉంటుంది. న్యాయవ్యవస్థ చేతుల్లో కాదు.

అలాగే.. మహిళలు హిజాబ్‌లు ధరించటం తప్పనిసరి అని చెబుతున్న చట్టాన్ని పరిశీలిస్తామని కూడా అటార్నీ జనరల్ మొంటాజెరి శనివారం నాడు ఇరాన్ పార్లమెంటుకు చెప్పారు.

ఒకవేళ నైతిక పోలీసు బలగాన్ని రద్దు చేసినప్పటికీ, దాని అర్థం, దశాబ్దాలుగా కొనసాగుతున్న ఇస్లామిక్ వస్త్రధారణ చట్టం మారుతుందని కాదు.

హిజాబ్ ధరించలేదన్న ఆరోపణతో టెహ్రాన్‌లో అదుపులోకి తీసుకున్న మాషా అమానీ (22).. మూడు రోజుల తర్వాత సెప్టెంబర్ 16వ తేదీన నైతిక పోలీసుల కస్టడీలో చనిపోయారు. అప్పటి నుంచీ దేశంలో మహిళల సారథ్యంలో భారీ ఎత్తున నిరసనలు చెలరేగుతున్నాయి.

దేశమంతటా వ్యాపించిన ఈ ఆందోళనలను అధికార యంత్రాంగాలు ‘అల్లర్లు’ అని అభివర్ణిస్తున్నాయి.

ఇరాన్‌లో పేదరికం, నిరుద్యోగం, అసమానత, అన్యాయం, అవినీతిలతో ప్రజల్లో పేరుకుంటూ వచ్చిన అసంతృప్తి, ఆగ్రహం.. మాషా అమానీ మరణంతో కట్టలు తెచ్చుకుంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

‘ఇక్కడ జరుగుతున్నది విప్లవం’

నైతిక పోలీసు బలగాల రద్దు నిర్ణయం నిజమే అయితే.. అది కేవలం కంటి తుడుపు చర్యే అవుతుంది. నిరసనకారులు తమ హిజాబ్‌లను దహనం చేస్తూ నిర్వహిస్తున్న ఆందోళనలు ఆగటానికి ఆ చర్య సరిపోతుందని పరిశీలకులు భావించటం లేదు.

‘‘నైతిక పోలీసు విభాగాన్ని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినంత మాత్రాన నిరసనలు ఆగిపోతాయని కాదు. హిజాబ్ అనేది వ్యక్తిగతంగా ఎంచుకునే విషయమేనని ప్రభుత్వం చెప్పినా కూడా సరిపోదు’’ అని ఇరాన్ మహిళ ఒకరు బీబీసీ వరల్డ్ సర్వీస్ న్యూస్‌అవర్ కార్యక్రమంతో మాట్లాడుతూ చెప్పారు.

‘‘ఈ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఇరాన్‌కు భవిష్యత్ ఏమీ లేదని ప్రజలకు తెలుసు. ఇరాన్ సమాజంలోని విభిన్న వర్గాలకు చెందిన మరింత మంది జనం.. ఉదారవాదుల నుంచి సంప్రదాయవాదుల వరకూ చాలా మంది జనం మహిళలు మరిన్ని హక్కులను తిరిగి పొందటానికి మద్దతుగా బయటకు వస్తారు’’ అని ఆమె పేర్కొన్నారు.

వీడియో క్యాప్షన్, ఇరాన్‌లో మహిళలు ఈ అయిదు పనులు చేయడానికి వీల్లేదు

‘‘మా నిరసనకారులం ఇప్పుడిక హిజాబ్ గురించి ఏమాత్రం పట్టించుకోం. మేం గత 70 రోజులుగా హిజాబ్ లేకుండానే బయటకు వెళుతున్నాం’’ అని మరో మహిళ చెప్పారు.

‘‘ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఒక విప్లవం. హిజాబ్ దానికి ఆరంభం. నియంత అంతం, ప్రభుత్వ మార్పు తప్ప.. అంతకన్నా తక్కువది ఏదీ మాకు అవసరం లేదు’’ అని స్పష్టంచేశారు.

ఇరాన్‌లో 1979 నాటి ఇస్లామిక్ విప్లవం నాటి నుంచీ అనేక రకాల ‘నైతిక పోలీసు’ వ్యవస్థలు ఏర్పాటయ్యాయి. అయితే ఇప్పుడు ‘ఘస్ట్-ఎ ఎర్షాద్’ అని పిలుస్తున్న నైతిక పోలీసు విభాగం.. ఇరాన్‌లో ఇస్లామిక్ ప్రవర్తనా నియమావళిని అమలు చేసే బాధ్యతలను నిర్వర్తిస్తోంది.

ఈ నైతిక పోలీసులు.. వస్త్రధారణ నియామవళిని అమలు చేయటానికి 2006లో గస్తీలు ప్రారంభించారు. ఆ నియమావళి ప్రకారం మహిళలు పొడవాటి దుస్తులు ధరించటం తప్పనిసరి. షార్ట్స్, రిప్డ్ జీన్స్ సహా అనైతికం అని ఆ చట్టం కింద పరిగణించే ఇతర దుస్తులేవైనా ధరించటం నిషిద్ధం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)