భారత్ ప్రపంచానికి నాయకత్వం వహించవచ్చు అని రష్యా ఎందుకు అంటోంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, దీపక్ మండల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
బహుళ ధృవాలుగా ఎదుగుతున్న ప్రపంచంలో భారతదేశం అతి ముఖ్యమైన ధృవం అని, బహుళ ధృవ ప్రపంచాన్ని నిర్మించడంలో కేంద్రంగా ఉందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అన్నారు.
వివిధ రకాల సమస్యలను పరిష్కరించడంలో భారతదేశానికి అపారమైన దౌత్య అనుభవం ఉందని అన్నారు.
"ఆర్థికాభివృద్ధి పరంగా అగ్రగామి దేశాల్లో భారతదేశం ఒకటి. బహుశా భారత్ ఇప్పటికే లీడర్ అయిపోయి ఉండవచ్చు" అని కూడా అన్నారు.
సెర్గీ లావ్రోవ్, ప్రిమకోవ్ రీడింగ్స్ ఇంటర్నేషనల్ ఫోరమ్‌లో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.
అంతకుముందు, లావ్రోవ్ యుక్రెయిన్-రష్యా యుద్ధంపై భారత్ వైఖరి సమతుల్యంగా ఉందని చెబుతూ భారత విదేశాంగ విధానాన్ని ప్రశంసించారు.
పశ్చిమ దేశాలు ప్రపంచ ఆధిపత్యాన్ని వదులుకోవడానికి ఇష్టపడట్లేదని, బహుళ ధృవ వ్యవస్థ వాస్తవికతను అంగీకరించాడనికి సిద్ధంగా లేవని లావ్రోవ్ అన్నారు.
"కొత్త శక్తులుగా ఎదుగుతున్న దేశాలు అమెరికా నేతృత్వంలోని పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేవన్నది స్పష్టం. అందుకే, పాశ్చాత్య దేశాలు ఈ వ్యవస్థను కొనసాగించేందుకు మరింత బలంగా పోరాడుతున్నాయి. అయిదు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ అలవాటును వదులుకోవడానికి సిద్ధంగా లేవు" అని ఆయన అన్నారు.
"ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభత్వం పొందేందుకు జర్మనీ, జపాన్‌లతో పాటు భారత్, బ్రెజిల్ దేశాలు కూడా పోటీపడుతున్నాయి. బహుళ ధృవ వ్యవస్థకు ఇదే సంకేతం. భారత్, బ్రెజిల్‌లకు సభ్యతం ఇవ్వడం వలన అదనపు విలువ ఉంటుంది. కానీ, జర్మనీ, జపాన్‌లకు శాశ్వత సభ్యత్వం ఇవ్వడంలో ఏ విలువ లేదు" అని లావ్రోవ్ అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
ప్రిమకోవ్ ఎవరు? ఆయన చెప్పిన బహుళ ధృవ వ్యవస్థ సిద్ధాంతం ఏమిటి?
యెవ్‌గెనీ ప్రిమకోవ్ రష్యాలో ప్రముఖ రాజకీయవేత్త, దౌత్యవేత్త. 1998 నుంచి 1999 వరకు రష్యా ప్రధాన మంత్రిగా వ్యవహరించారు. అంతకుముందు రష్యా విదేశాంగ మంత్రిగా ఉన్నారు.
1996లో విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు, రష్యా, భారత్, చైనా కూటమి ఆధారంగా బహుళ ధృవ ప్రపంచ క్రమాన్ని నిర్మించవచ్చని రష్యా ప్రభుత్వానికి సూచించారు.
రెండో ప్రపంచ యుద్ధం తరువాాత అమెరికా ఏర్పరచిన ఏకధృవ ప్రపంచ క్రమానికి ఇది ప్రత్యామ్నాయమని అన్నారు.
రష్యా తన విదేశాంగ విధానాన్ని మార్చుకుని భారత్, చైనాలతో స్నేహాన్ని బలోపేతం చేసుకోవాలని సూచించారు.
బహుళ ధ్రువ ప్రపంచ క్రమంలో, పశ్చిమ దేశాలను అనుసరించకుండా స్వతంత్ర మార్గంలో నడవాలనుకునే దేశాలకు రష్యా, చైనా, భారత్ కూటమి కొంత రక్షణను అందించగలదని ఆయన అభిప్రాయపడ్డారు.
లావ్రోవ్, ప్రిమకోవ్ సిద్ధాంతాన్ని బలపరిచారు. ఆయన ఆలోచన BRICSగా రూపాంతరం చెందిందని, RIC ఇప్పటికీ నడుస్తోందన్న సంగతి చాలా కొద్దిమందికి తెలుసునని, ఈ పొత్తు ఆధారంగానే మూడు దేశాల విదేశాంగ మంత్రులు తరచూ సమావేశమవుతున్నారని లావ్రోవ్ అన్నారు.

ఫొటో సోర్స్, EPA
ఎందుకు భారత్‌ను ఇంత పొగుడుతున్నారు?
ఎందుకు లావ్రోవ్ భారత్‌ను ఇంత ప్రశంసిస్తున్నారు, దీనికి కారణం ఏమిటి?
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో జర్మనీ, జపాన్‌లకు బదులుగా భారత్, బ్రెజిల్‌లను శాశ్వత సభ్యులుగా చేయాలని ఆయన ఎందుకు పట్టుబడుతున్నారు?
భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని, భవిష్యత్తులో అది ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థగా ఎదగగలదని ఎందుకు చెప్తున్నారు?
వీటికి సమాధానాలు తెలుసుకోవడం కోసం జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో రష్యన్ అండ్ సెంట్రల్ ఆసియన్ స్టడీస్ ప్రొఫెసర్ సంజయ్ కుమార్ పాండేతో మాట్లాడాం.
భారత విదేశాంగ విధానాన్ని రష్యా ప్రశంసించడం ఇది మొదటిసారి కాదని ఆయన అన్నారు.
"1955-56, 1971 ఒప్పందాల నుంచి సోవియట్ యూనియన్, భారతదేశాన్ని చాలా ముఖ్యమైన దేశాల జాబితాలో చేర్చింది. అలీన విధానం ఏర్పడినప్పుడు కూడా, సోవియట్ యూనియన్ దానిని గుర్తించింది. అలీన దేశాలకు స్వతంత్ర విదేశాంగ విధానం ఉందని, సోవియట్ యూనియన్ వారితో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని విశ్వసించింది. అలీన దేశాలు భారతదేశంతో సంబంధాలను మెరుగుపరచుకోవాలని నొక్కి చెప్పింది.
లియోనిడ్ ఇలియిచ్ కాలంలో సోవియట్ యూనియన్ భారతదేశంతో ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంది. 1990వ దశకంలో రష్యా కొంతవరకు పశ్చిమ దేశాల వైపు మొగ్గినప్పటికీ, 1996లో ప్రిమాకోవ్ రష్యా, భారతదేశం, చైనా కూటమి గురించి గట్టిగా మాట్లాడారు" అని ప్రొఫెసర్ సంజయ్ కుమార్ పాండే అన్నారు.

ఫొటో సోర్స్, ANI
భారతదేశానికి స్వతంత్ర విదేశాంగ విధానం ఉందా?
RIC గురించి లావ్రోవ్ ఇప్పుడు ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నారు?
"2014లో మొదటిసారిగా రష్యా క్రిమియాపై దాడి చేసినప్పుడు భారత్ దానిని సమర్థించలేదు, ఖండించలేదు. క్రిమియాలో రష్యాకు భద్రతా సమస్యలు, కొన్ని ప్రయోజనాలు ఉండవచ్చని భారత్ పేర్కొంది. అప్పట్లో క్రిమియా అయినా, ఇప్పుడు యుక్రెయిన్ అయినా, భారత్ విధానం పశ్చిమ దేశ విధానాలకు భిన్నంగా ఉన్నట్టు రష్యా భావిస్తోంది.
భారత్ రష్యాకు మద్దతివ్వలేదు, కానీ పాశ్చాత్య దేశాల భాష, విధించిన ఆంక్షలపై స్పందిస్తూ, సమస్య ఈ విధంగా పరిష్కారం కాదని చెప్పింది. భారత ప్రధ్యాని మోదీ, రష్యా అధ్యక్షుడితో మాట్లాడినప్పుడు, ఇది యుద్ధానికి సమయం కాదని స్పష్టంగా చెప్పారు. కానీ, ఐక్యరాజ్యసమితిలో రష్యాకు వ్యతిరేకంగా పాశ్చాత్య దేశాల ఖండనను భారతదేశం సమర్థించలేదు.
పై కారణాల వల్ల, పాశ్చాత్య దేశాలకు భిన్నంగా భారత్ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరిస్తోందని రష్యాకు స్పష్టమయింది. బహుళ ధ్రువ వ్యవస్థకు భారత్ కేంద్రమని రష్యా చెప్పడానికి ఇదే కారణం" అని ప్రొఫెసర్ సంజయ్ కుమార్ పాండే అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, TWITTER/NARENDRAMOD
మోదీ ప్రభుత్వంలో విదేశాంగ విధానం
2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తరువాత భారత విదేశాంగ విధానం మలుపు తిరిగిందని, మరింత స్వతంత్రంగా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ అంశంపై విదేశీ, భద్రతా వ్యవహారాలను కవర్ చేసే ప్రముఖ జర్నలిస్టు నయనిమా బసుతో బీబీసీతో మాట్లాడింది.
"భారతదేశం మొదటి నుంచి స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించేందుకే ప్రయత్నించింది. ఇంతకుముందు ఈ విధానాన్ని అలీన విధానం (నాన్ అలైన్‌మెంట్) అని పిలిచేవారు. ఇప్పుడు ఇది వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి విధానంగా మారింది. ఇటీవల కాలంలో భారత విదేశాంగ విధానంలో కొంత మార్పు వచ్చింది. మోదీ ప్రభుత్వ హయాంలో భారత్ ఉద్దేశపూర్వకంగా అమెరికా వైపు మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తోంది. కానీ, నియమాల ఆధారంగా ప్రపంచ క్రమం ఉండాలన్న వైఖరికి కట్టుబడి ఉంది" అని నయనిమ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్, చైనాల మధ్య వివాదం
2014 నుంచి భారత్ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని ప్రోత్సహించడంలో విజయం సాధించిందా లేక దాన్ని అతిశయోక్తిగా ప్రదర్శించిందా అన్నది ప్రశ్న.
"మునుపటి ప్రభుత్వాలు కూడా చాలా వరకు స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించడానికే ప్రయత్నించాయి. అయితే క్రిమియా, ఆపై యుక్రెయిన్ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని మోదీ ప్రభుత్వం విదేశాంగ విధానంపై స్పష్టతనిచ్చింది.
భారత స్వతంత్ర విదేశాంగ విధానం అతిశయోక్తి కాదు. ఇందుకు ఉదాహరణలు ఉన్నాయి. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించినప్పటికీ, చాబహార్ ప్రాజెక్ట్‌లో భారత్ దానికి సహకరిస్తూనే ఉంది. 2016-17లో భారతదేశం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సభ్యత్వం తీసుకుంది. అయితే ఈ సంస్థపై చైనా ప్రభావం ఉంటుందని అనేకమంది భావిస్తారు. మరోవైపు, భారత్ క్వాడ్‌లో పాల్గొంది. దీన్ని పాశ్చాత్య దేశాలతో సహకారానికి ఉదాహరణగా పేర్కొనవచ్చు" అని ప్రొఫెసర్ సంజయ్ కుమార్ పాండే అన్నారు.
అయితే, భారత్‌కు చైనాతో ఉన్న వివాదాల మాటేమిటి? రష్యా, భారత్, చైనా కూటమిని ఇదెలా ప్రభావితం చేస్తుంది?
"సరిహద్దు వివాదం, వాణిజ్య సమస్యలకు సంబంధించి భారతదేశం, చైనాల మధ్య ఉద్రిక్తత ఉంది. కానీ, పర్యావరణం, అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలు వంటి పలు అంశాలలో రెండు దేశాల మధ్య సహకారం ఉంది" అని ప్రొఫెసర్ సంజయ్ కుమార్ పాండే అన్నారు.
భారత్, బ్రెజిల్‌లకు ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని లావ్రోవ్ అన్నారు. కానీ, ఇది రష్యా చేతిలో మాత్రమే ఉన్న పని కాదు. చైనా దీన్ని ఆపగలదని నయనిమా బసు అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘బేస్ ఎడిటింగ్’: నయం చేయడానికి వీల్లేని క్యాన్సర్‌ను తరిమేసిన కొత్త విప్లవాత్మక చికిత్స, 13 ఏళ్ల బాలికపై తొలి ప్రయోగం
- 974: ఏకంగా ఫుట్‌బాల్ స్టేడియాన్నే తరలించేస్తున్నారు
- డ్రైవర్ కొడుకు ముఖ్యమంత్రి అయ్యారు
- మహిళల్లో హార్మోన్లు ఎందుకు గతి తప్పుతాయి, ఇది మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందా?
- ‘‘ఎన్నికల్లో పోటీ చేయనివ్వలేదు , అందుకే సొంతంగా రాజ్యం స్థాపించుకున్నా’’ అంటున్న కింగ్ పీటర్ ది ఫస్ట్ ఎవరు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















