‘‘ఎన్నికల్లో పోటీ చేయనివ్వలేదు , అందుకే సొంతంగా రాజ్యం స్థాపించుకున్నా’’ అంటున్న కింగ్ పీటర్ ది ఫస్ట్ ఎవరు?

- రచయిత, జెన్నీ హిల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తూర్పు జర్మనీ గ్రామీణ ప్రాంతాలలో కనిపించని సరిహద్దు ఒకటి ఉంటుంది. తొంగి చూస్తే చెట్ల పై నుంచి కోట బురుజులు కనిపిస్తాయి. ప్రవేశ ద్వారంపై పెద్ద బోర్డు కనిపిస్తుంది.
"మీరు కొత్త రాజ్యంలోకి ప్రవేశిస్తున్నారు."
"కొనికైష్ డాయిష్‌లాండ్" (జర్మనీ రాజ్యం).. ఒక స్వయం ప్రకటిత స్వతంత్ర రాజ్యం. దానికొక రాజు కూడా ఉన్నాడు.
పీటర్ ది ఫస్ట్.. ఆయనే ఈ రాజ్యానికి రాజు. తనను ఆ పేరుతోనే పిలవాలని కోరారు.
ఈ రాజ్యాన్ని స్థాపించి, పీటర్‌కు రాజుగా పట్టాభిషేకం జరిగి ఒక దశాబ్దం పైనే అవుతోంది.
కొనికైష్ డాయిష్‌లాండ్‌కు సొంత జెండా ఉంది. వారి డబ్బును వారే ముద్రించుకుంటారు. సొంత ఐడీ కార్డులు తయారుచేసుకున్నారు.
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత జర్మనీ సార్వభౌమత్వాన్ని, చట్టబద్ధతను గుర్తించనివారు ఆ దేశంలో చాలామంది ఉన్నారు.
ఇలాంటి కుట్ర సిద్ధాంతకర్తలు 21,000 మంది ఉంటారని ఆ దేశ నిఘా సంస్థలు అంచనా వేశాయి.
వీరిని జర్మనీలో 'రైష్‌బర్గర్' (రైష్ పౌరుడు) అంటారు. పీటర్ కూడా అలాంటివారిలో ఒకరు.
ఈవారం రైష్‌బర్గర్ పేరు మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. జర్మనీ పార్లమెంటు భవనం 'రైష్‌స్టాగ్'ను ఆక్రమించుకోవడానికి వ్యూహం పన్నుతున్నారన్న అనుమానంతో రైష్‌బర్గర్‌పై జరిపిన దాడులలో 25 మందిని జర్మనీ పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే, తనకు అలాంటి హింసాత్మక ఆలోచనలు ఏవీ లేవని కింగ్ పీటర్ చెబుతున్నారు.
కానీ, జర్మనీ దేశం (ప్రభుత్వం) "విధ్వంసకరమైనదని, జబ్బు పట్టినదని" పీటర్ భావిస్తున్నారు.
"ఈ నియంతృత్వ (ఫాసిస్ట్), సాతాను వ్యవస్థలో భాగం కావడం తనకు ఇష్టం లేదని" అన్నారు.
కింగ్ పీటర్‌కు సొంత టీవీ స్టూడియో ఉంది. త్వరలో ఒక టీవీ ఛానల్ ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు.

స్వతంత్ర రాజ్య స్థాపన
జర్మనీలో మేయర్‌గా, పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేయడానికి ప్రయత్నించి విఫలమైన తరువాత, కొత్త రాజ్యం స్థాపించడం తప్ప తనకు వేరే మార్గం దొరకలేదని పీటర్ చెప్పారు.
"అవినీతిపరులు, నేరస్థులు, అవసరానికి వాడుకునేవారు జర్మనీ వ్యవస్థలో పైకి ఎదుగుతారు. మంచివాళ్లు, నిజాయితీపరులు, ప్రపంచంలో మార్పు తీసుకురావాలని తపన పడేవాళ్లకు ఇక్కడ చోటు లేదు" అని కింగ్ పీటర్ అభిప్రాయపడ్డారు.
ఆయన అసలు పేరు పీటర్ ఫిట్జెక్. జర్మనీ చట్టానికి, పీటర్ కార్యకలాపాలకు పొత్తు కుదరదు.
అయితే, జర్మనీ పీటర్ రాజ్యాన్ని, దాని పత్రాలను గుర్తించదు. జర్మనీలో లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసినందుకు, తన సొంత ఆరోగ్య బీమా పథకాన్ని నడుపుతున్నందుకు ఆయనపై కేసులు ఉన్నాయి. తన రాజ్య ప్రజల సొమ్ము కాజేశారన్న ఆరోపణలతో పీటర్ కొన్నేళ్లు జైల్లో గడిపారు. కానీ, తరువాత ఆయనపై కేసు కొట్టివేశారు.
'కుట్ర సిద్ధాంతాలు'
పీటర్‌పై, ఆయన రాజ్యంపై రెండేళ్లుగా నిఘా పెట్టిన ఒక సంస్థ, దీనిని జర్మనీకి ముప్పుగా భావిస్తున్నట్టు తెలిపింది. కుట్ర సిద్ధాంతాలను, తీవ్రవాద భావజాలాన్ని ప్రజల మెదళ్లలోకి ఎక్కిస్తున్న వ్యవస్థగా పేర్కొంది.
జర్మనీలో ఇటీవల కాలంలో ఇలాంటి సిద్ధాంతాలు, భావజాలాలు విస్తరిస్తున్నాయి. కరోనా మహమ్మారి దీనికి ఆజ్యం పోసింది. కోవిడ్ కారణంగా పీటర్ రాజ్యానికి మద్దతు, సభ్యత్వం పెరిగిందని సమాచారం.
తన రాజ్యంలో 5,000 మందికి పైగా ప్రజలు ఉన్నారని పీటర్ చెబుతున్నారు. ఆయన తన రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. జర్మనీలో భూమిని కొనుగోలు చేసి, ప్రజలు జీవించేందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
రాజభవనం నుంచి 240 కిమీ దూరంలో ఉన్న అలాంటి ఒక ప్రాంతాన్ని మేం సందర్శించాం.
అది బర్వాల్దే గ్రామం. అందులో మరో పాత కోట ఉంది. బెర్లిన్ నుంచి దక్షిణ దిక్కుగా అరగంట డ్రైవింగ్ దూరంలో ఉంది ఈ గ్రామం. అక్కడ సుమారు 30 మంది నివసిస్తున్నారు.
కోట పాతబడిపోయింది. నిస్తేజంగా ఉంది. భవనానికి మరమత్తులు చేస్తున్నారు. పీటర్ రాజ్యంలో భాగమైనందుకు, బర్వాల్దేలో నివసిస్తున్నందుకు గర్వపడుతున్నామని అక్కడి ప్రజలు చెబుతున్నారు.

'మా రాజ్యం, మా చట్టం'
ఇక్కడి ప్రజలు జర్మీనీకి టాక్స్ కట్టరు. పిల్లలను స్కూళ్లకు పంపరు. ఇదంతా జర్మనీలో చట్టవిరుద్ధం. కానీ, ఈ ప్రజలు తమ రాజ్యంలోని చట్టాన్నే పాటిస్తారు. అది కింగ్ పీటర్ నిర్దేశించిన చట్టం.
జర్మనీతో సంబంధం లేకుండా తమకు సొంత ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఉండాలని వారు భావిస్తున్నారు.
"రోజువారీ జీవితానికి కావలసినవన్నీ ఈ రాజ్యంలో దొరుకుతాయి. ఆహారం, పోషణ, సామాజిక భద్రత.. ఈ వ్యవస్థలన్నీ ఉన్నాయి" అని బెంజమిన్ చెప్పారు.
బెంజమిన్ ఇటీవలే తన కుటుంబంతో పాటు పీటర్ రాజ్యంలోకి మారారు. ప్రస్తుతం ఆయన ఆ రాజ్యం పీఆర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి స్థిరమైన గ్రీన్ కమ్యూనిటీని ఏర్పాటు చేయాలన్నదే వారి లక్ష్యం.
ఇక్కడి ప్రజలకు ఆధునిక వైద్యంపై నమ్మకం తక్కువ. వీరిలో ఎవరూ కోవిడ్ 19 వ్యాక్సీన్ తీసుకోలేదని బెంజమిన్ చెప్పారు. రైష్‌బర్గర్ సమూహానికి ఇది సాధారణ విషయమే.
మహమ్మారిని నియంత్రించడంలో జర్మనీ విఫలమైందని వీరిలో చాలామంది నిరసనలు తెలిపారు.
"నేటి కాలంలో తమ కోసం, తమ శ్రేయస్సు కోసం ఆలోచించేవాళ్లని కుట్ర సిద్ధాంతకర్తలని ముద్ర వేస్తున్నారు. కానీ, వీళ్లే రాత్రంతా మేల్కొని ప్రజల సమస్యలపై ఆలోచిస్తారు. తమ గురించే కాకుండా, సమాజం గురించి, రాజకీయాల గురించి కూడా ఆలోచిస్తారు" అని బెంజమిన్ అన్నారు.
ఈ రాజ్యం నుంచి బయటికొస్తే, జర్మనీలో ప్రజల అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి. పీటర్ రాజ్యంలో ప్రజలు జర్మనీలోని వనరులను వాడుకుంటున్నారు కాబట్టి, పన్ను కట్టాలని వీరు అభిప్రాయపడుతున్నారు.
ఈ రాజ్య ప్రజల ప్రభావం తమ పిల్లలపై పడుతుందని ఒక వ్యక్తి ఆందోళన వ్యక్తం చేశారు.
చాలాకాలం వరకు జర్మనీలో రైష్‌బర్గర్ అనేది ఒక జోక్‌గా ఉండేది. ఈమధ్యే, దాన్ని సీరియస్‌గా తీసుకోవడం జర్మనీ నేర్చుకుంటోంది.
ఇవి కూడా చదవండి:
- మహిళల్లో ఆవేశం బాగా పెరిగిందంటున్న సర్వేలు...ఏంటి కారణం?
- గుర్తుందా శీతాకాలం మూవీ రివ్యూ: ప్రేమ జ్ఞాపకాల్ని తట్టి లేపే సినిమా
- వేల మంది మహిళలకు గర్భ నిరోధక సాధనాలను అమర్చారు, అదీ వారికి ఏమాత్రం తెలియకుండా...
- ఆంధ్రప్రదేశ్: జయహో బీసీ సభను అధికార పార్టీ ఎందుకు నిర్వహించింది, బీసీ కార్పోరేషన్లతో జరిగిన మేలు ఎంత ?
- తెలంగాణ: పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎప్పుడు వస్తాయి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















