గుర్తుందా శీతాకాలం మూవీ రివ్యూ: ప్రేమ జ్ఞాపకాల్ని తట్టి లేపే సినిమా
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
ప్రేమ ఓ అనుభూతి. మాటల్లో వర్ణించలేని అనుభూతి.
పదో తరగతిలో ఇంగ్లీషు బాగా మాట్లాడుతోందని ఓ అబ్బాయి ఓ అమ్మాయిని ప్రేమించి ఉంటాడు.
పాతికేళ్లకు అంతకంటే గొప్ప జ్ఞాపకం ఏముంటుంది? ఇంటర్లో.. బాగా నవ్వుతోందని ఓ అమ్మాయి వెంట ఓ అబ్బాయి పడి ఉంటాడు. యుక్తవయసులో నెమరేసుకోవడానికి అంతకంటే గొప్ప సంఘటనలు ఇంకెన్నుంటాయి..?
జీవితంలో అన్నీ అనుభవించేశాక.... వృద్ధాప్యం ఒంటికి చేరుకున్నాక... ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొంటే మనకంటూ మిగిలే కొన్ని అపురూపమైన క్షణాలు.. ప్రేమలో పడటాలు. మళ్లీ లేవడాలు. ఇవే ఉంటాయి.
అలాంటివన్నీ కట్టకట్టి మనముందుకు తీసుకొచ్చిన సినిమాలు కొన్ని ఉంటాయి. ఆటోగ్రాఫ్, ప్రేమమ్, 96 లాంటి సినిమాలన్నీ ఈ కోవకు చెందినవే. ఇప్పుడు ఈ జాబితాలో చేరడానికి మరో సినిమా వచ్చింది. అదే... `గుర్తుందా శీతాకాలం`.
కన్నడలో విజయవంతమైన `లవ్ మాక్ టైల్`ని తెలుగులో రీమేక్ చేశారు. మరి ఈ రీమేక్ వంటకం ఎంత వరకూ కుదిరింది? ప్రేమలోని అనుభూతుల్ని `శీతాకాలం` ఎంత రెట్టింపు చేసింది? ఇందులో ఉన్న లవ్ ఏమిటి?

ఫొటో సోర్స్, Satyadev/fb
ఒక్క మాటలో చెప్పాలంటే దేవ్ (సత్యదేవ్) కథ ఇది. తన జీవితంలోకి వచ్చిన అమ్మాయిలు, వాళ్లతో నడిపిన ప్రేమ కథలూ, ముచ్చట్లూ, విరహాలూ, సంతోషాల సమాహారం.
చిన్నప్పుడు ఓ సోడా బుడ్డీ అమ్మాయిని ప్రేమిస్తాడు. పెద్దయ్యాక కాలేజీలో ఇంకో అమ్మాయితో ప్రేమలో పడిపోతాడు. నాలుగేళ్ల తరవాత విడిపోతే దేవ్ జీవితంలోకి నిధి (తమన్నా) వస్తుంది. నిధిని దేవ్ ఎలా ప్రేమించాడు? రెండు ప్రేమకథలు విఫలం అయిన తరవాత కూడా దేవ్ మనసులో ప్రేమ పుట్టిందా? దేవ్, నిధి కలిశారా? చివరికి ఏమైంది? అనేది మిగిలిన కథ.
`గుర్తుందా శీతాకాలం` ఓ కవితాత్మక శీర్షిక. పేరులానే సినిమా, అందులోని ప్రేమకథలు, సన్నివేశాలు, సంఘటనలు ఇవన్నీ కవితాత్మకంగానే తీయాలని చూశారు దర్శక నిర్మాతలు.

ఫొటో సోర్స్, Satyadev/fb
దేవ్‌కి ఓ ప్రయాణంలో దివ్య (మేఘా ఆకాష్) పరిచయం అవుతుంది. అక్కడి నుంచి కథ మొదలవుతుంది. దివ్యకి దేవ్ తన ప్రేమకథలు చెబుతూ ఉంటాడు. ముందు స్కూల్ డేస్ ప్రేమకథ తెరపైకి వస్తుంది. కాలేజీలో అడుగుపెట్టాక అమ్మూ లవ్ లో పడిపోతాడు దేవ్. అమ్మూ తో లవ్ స్టోరీ చాలా సరదాగా సాగిపోతుంది.
తొంభైల నాటి మధుర జ్ఞాపకాల్లోకి ప్రేక్షకుల్ని లాక్కెళ్లిపోతుంది. అప్పట్లో... మిస్డ్ కాల్స్ ఇచ్చుకోవడాలూ, ఫోన్ చేస్తే రూపాయి అయిపోతుందని లెక్కలేసుకోవడాలూ, ఫ్రీ మెసేజీల కోసం రాత్రి పన్నెండు గంటల వరకూ ఎదురు చూడటాలూ ఇవన్నీ ఈ కథలో కనిపిస్తాయి.
ఒక్కసారిగా రెట్రో లైఫ్‌ని కళ్ల ముందుకు తీసుకొస్తుంది. దేవ్‌గా సత్య చేసే అల్లరి, అమ్మాయి కోసం పడే పాట్లూ ఇవన్నీ సరదాగా ఉంటాయి.
ఇంటర్వ్యూ సీన్‌లో సత్యదేవ్ చెప్పే సమాధానాలు నవ్విస్తాయి. దేవ్ జీవితంలోకి నిధి వచ్చేంత వరకూ కథ ఒకలా సాగుతుంది. అప్పటి వరకూ దేవ్ టీనేజ్ కుర్రాడిగానే కనిపిస్తాడు. నిధి వచ్చాక తన ప్రేమలో ఓ పరిపక్వత వస్తుంది. ఒకే సినిమాలో మూడు రకాల గ్రాఫ్‌లు ఉన్న ప్రేమికుడిగా కనిపించడం సత్యదేవ్‌కి ఓ టాస్క్. దాన్ని బాగా హ్యాండిల్ చేశాడనుకోవాలి.

ఫొటో సోర్స్, satyadev/twitter
ప్రతీ ప్రేమకథకూ ఓ ప్రారంభం, మధ్యస్తం, ముగింపూ ఉంటాయి. ఇందులో మూడు ప్రేమకథలున్నాయి. మూడూ.. ఇదే ఫార్మాట్‌లో సాగుతాయి. కొన్ని కొన్ని కథలు, సంఘటనలు.. ఆటోగ్రాఫ్, ప్రేమమ్ లాంటి సినిమాల్ని గుర్తు చేస్తాయి. కొన్ని మూమెంట్స్ చాలా రొటీన్‌గా అనిపించినా ప్రేమలో కొన్నిసార్లు రొటీన్ కూడా చూడ ముచ్చటగా ఉంటుంది.
అలాంటి సీన్లు కూడా కొన్ని ఉన్నాయి. ఈ కథలో మిగిలిన ప్రేమ కథల కంటే దేవ్, నిధిల ప్రేమ కథకే ప్రాధాన్యత ఉంది. ఈ కథ ఆత్మ అక్కడే ఉంది. ద్వితీయార్థం మొత్తం దేవ్ - నిధిల కథే. ఇక్కడ దర్శకుడు కొన్ని ఫ్రెష్ సీన్లు రాసుకోవాల్సింది. గుర్తుంచుకోదగిన మూమెంట్స్‌కి చోటు ఇవ్వాల్సింది. తొలి రెండు కథల్ని అందమైన జ్ఞాపకాలుగా మార్చిన దర్శకుడు.. కీలకమైన మూడో కథకు వచ్చేసరికి ఎక్కువగా రొటీన్ సీన్లపై ఆధారపడ్డాడు.
పైగా దేవ్ - నిధిలది ప్రేమ కథ కాదు. అదో భార్యాభర్తల అనుబంధం. సినిమా ఇంకాసేపట్లో ముగుస్తుందనగా.. `గీతాంజలి` లా టర్న్ తీసుకొంటుంది. విషాద సన్నివేశాలు, బాధలు, కన్నీళ్లు, సెంటిమెంట్ వీటిని చివరి 20 నిమిషాల్లో దట్టించడానికి ప్రయత్నించాడు దర్శకుడు.

ఫొటో సోర్స్, screengrab
ఇది కూడా ఓల్డ్ స్కూల్ ఆఫ్ డ్రామానే. దేవ్ - నిధిల మధ్య ఎడబాటుని ప్రేక్షకుడు ఫీల్ అవ్వాలంటే వాళ్ల మధ్య ప్రేమని చాలా శక్తిమంతంగా చూపించగలగాలి. అది జరగలేదు.
దేవ్ - అమ్ము విడిపోతున్నప్పుడు కూడా ఇంతే. అమ్మూలో లెక్కలు వేసుకొని ప్రేమించే గుణం ఎప్పుడైతే చూపించారో.. అక్కడే ఆ లవ్ ట్రాక్‌కి డిస్కనెక్ట్ అయిపోతాడు ప్రేక్షకుడు.
పతాక సన్నివేశాలు కూడా భారంగా సాగుతాయి. తొలి సగంలో ఉన్న జోష్, రెండో సగంలో కనిపించకపోవడం, మూడో ప్రేమకథ మరీ విషాదాంతంగా మారడం మన ప్రేక్షకులు ఎంత వరకూ రిసీవ్ చేసుకొంటారో చూడాలి.
లవ్ మాక్ టైల్‌ని యధావిధిగా తెలుగులో తర్జుమా చేయడానికి చూసింది చిత్ర బృందం. నటీనటులు, లొకేషన్లు మారాయి అంతే. మాతృకలో ఉన్న ఫీల్‌ని తీసుకురావడానికి ఎవరి వంతు ప్రయత్నాలు వాళ్లు చేశారు.

ఫొటో సోర్స్, Satyadev/fb
టైటిల్ కి తగ్గట్టు సినిమా అంతా కూల్‌గా ఉంది. లొకేషన్లు బాగున్నాయి. మధ్యమధ్యలో దేవ్ - దివ్యల సంభాషణలు కథకు లైవ్లీనెస్ తీసుకొచ్చాయి. పాటల్లో పెద్దగా గుర్తు పెట్టుకొనేవేం లేవు. టైటిల్ సాంగ్ ఒకటి ఆహ్లాదకరంగా సాగిపోతుంది.
లక్ష్మీ భూపాల అందించిన సంభాషణలు బాగున్నాయి. ముఖ్యంగా ప్రేమ గురించి ఆయన రాసిన మాటలు నచ్చుతాయి. `కన్‌ఫ్యూజ్‌లో పెళ్లి చేసుకొంటారు. లేదంటే పెళ్లయ్యాక కన్‌ఫ్యూజ్ అవుతారు.. ఏంటో అబ్బాయిలకు ఇదో శాపం` లాంటి డైలాగులు యువతరానికి నచ్చుతాయి. కెమెరా పనితనం, నేపథ్య సంగీతం... ఇవన్నీ ప్లస్ పాయింట్లు. సత్యదేవ్ మరోసారి నటుడిగా ఆకట్టుకుంటాడు. తను అల్లరి చిల్లరిగా ఉన్నప్పుడైతే ఇంకా బాగా నచ్చుతాడు. ఓ భర్తగా.. బాధ్యత తెలుసుకున్నప్పుడు తన నటనలో పరిపక్వత కనిపిస్తుంది. మేఘా ఆకాష్.. పక్కింటి అమ్మాయి పాత్రలో మెప్పించింది.
తమన్నాకి ఇది డిఫరెంట్ పాత్ర కావొచ్చు. కానీ, తమన్నానే చేయాల్సిన పాత్ర అయితే కాదు. ప్రియదర్శి మంచి ఫ్రెండు పాత్రలో అల్లుకుపోయాడు. సుహాసిని అతిథి పాత్రలో కనిపించారు.
చాలా ప్రేమకథా చిత్రాలు `గుర్తుందా శీతాకాలం` చూస్తున్నప్పుడు గుర్తొస్తుంటాయి. ప్రేమలో కొత్త కోణాలు వెతికి పట్టుకోవడం చాలా కష్టం.
కాకపోతే, పాత కథకు నగిషీలు చెక్కుతున్నప్పుడు సైతం అందులో మనదైన ముద్ర కనిపించాలి. ఆటోగ్రాఫ్, ప్రేమమ్, 96 కూడా రొటీన్ ప్రేమకథలే.
కానీ, అందులో ఇప్పటి వరకూ ఎవరూ చెప్పలేని ఓ ఫీల్ ఉంది. అది..`గుర్తుందా శీతాకాలంలో` ఉండుంటే ఇంకా బాగుండేది.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: జయహో బీసీ సభను అధికార పార్టీ ఎందుకు నిర్వహిస్తోంది, బీసీ కార్పోరేషన్లతో జరిగిన మేలు ఎంత ?
- విశాఖపట్నం: నీళ్ల డ్రమ్ములో మహిళ మృతదేహం, 18 నెలలుగా ఎవరికీ అనుమానం రాలేదు, అసలేం జరిగింది?
- వివాహేతర లైంగిక సంబంధాలను నిషేధిస్తూ చట్టం తెచ్చిన ఇండోనేసియా
- నోబెల్ ప్రైజ్ డిసీజ్: నోబెల్ అందుకున్న తర్వాత కొంతమంది శాస్త్రవేత్తల వింత ప్రవర్తనకు కారణం ఇదేనా?
- బీబీసీ 100 మంది మహిళలు 2022: ఈ ఏడాది జాబితాలో తెలుగు యువతి ఎవరు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















