'ఇట్లు.. మారేడుమిల్లి ప్ర‌జానీకం' రివ్యూ: స‌మాజంలో జ‌రుగుతున్న వాస్త‌వ ప‌రిస్థితుల్ని నిజాయితీగా చెప్పిన కథ

ఇట్లు... మారేడుమిల్లి ప్ర‌జానీకంలో అల్లరి నరేష్

ఫొటో సోర్స్, @ZeeStudios_

    • రచయిత, సాహితి
    • హోదా, బీబీసీ కోసం

క‌నీస స‌దుపాయాలు లేని గ్రామాలు ఈ దేశంలో కోకొల్ల‌లున్నాయి. విద్య‌, వైద్యం, తాగునీరు.. ఇలాంటి క‌నీస హ‌క్కుల్ని సైతం పోరాడి సాధించుకొంటున్న ప్ర‌జ‌లు ఇంకా మ‌న మ‌ధ్యే ఉన్నారు. నేటికీ చీక‌ట్లో మ‌గ్గిపోతున్న ఊర్లు ఉన్నాయి. వాటిలో ఒక ఊరి క‌థని ‘ఇట్లు మారేడుమిల్లి ప్ర‌జానీకం’ సినిమాగా చెప్పాల‌నుకొన్న ద‌ర్శ‌క నిర్మాత‌ల్ని ముందుగా అభినందించాలి.

ఈ క‌థలో కొంత ఫిక్ష‌న్ ఉండొచ్చు. కొంత డ్రామా జోడించి ఉండవచ్చు. కొన్ని సినిమాటిక్ లిబ‌ర్టీస్ తీసుకొని ఉండొచ్చు. కానీ, స్థూలంగా చెబితే నిజాలు ఉన్నాయి. ఆ నిజాలేంటో ఒక్క‌సారి తెలుసుకొనే ప్ర‌య‌త్నం చేస్తే...

అభివృద్ధికి ఆమ‌డ దూరంలో ఉన్న గిరిజ‌న గ్రామం మారేడుమిల్లి. అక్క‌డికి ఎన్నిక‌ల అధికారిగా వెళ్తాడు శ్రీ‌పాద శ్రీ‌నివాస్ (అల్ల‌రి న‌రేష్‌). త‌నో తెలుగు టీచ‌ర్‌. నిజాయ‌తీగ‌ల వ్య‌క్తి. అవ‌త‌లివారికి ఆప‌ద వ‌స్తోందంటే త‌ను అడ్డుగా నిల‌బ‌డ‌తాడు.

మారేడుమిల్లి ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వం ప‌ట్ల‌, ఉద్యోగుల ప‌ట్ల‌, ఎన్నిక‌ల ప‌ట్ల నిరాసక్త‌త ఉంటుంది. వాళ్లంతా ఎన్నిక‌ల్ని బ‌హిష్క‌రిస్తారు. ఎందుకంటే.. మారేడుమిల్లి నిండా స‌మ‌స్య‌లే. అక్క‌డ స్కూల్ లేదు. ఆసుప‌త్రి లేదు. ఏరు దాట‌డానికి వంతెన లేదు.

ఏళ్ల త‌ర‌బ‌డి ప్ర‌భుత్వాధికారుల చుట్టూ తిరిగి తిరిగి అల‌సిపోయిన జీవితాలు వాళ్ల‌వి. అందుకే.. ఎన్నిక‌ల వ్య‌వ‌స్థ‌పై అంత వ్య‌తిరేక‌త‌. అయితే మారేడిమిల్లిలో వంద శాతం ఓటింగ్ సంపాదించాల‌న్న మిష‌న్‌ శ్రీ‌నివాస్‌ది. అక్క‌డి వ్య‌తిరేక‌త‌ని భ‌రించిన శ్రీ‌నివాస్‌.. మెల్ల‌గా ఆ ప్ర‌జల్లో మార్పు తీసుకొస్తాడు. అక్క‌డ వంద శాతం ఓటింగ్ కూడా జ‌రుగుతుంది.

అంతా హ్యాపీ అనుకొంటున్న త‌రుణంలో.. బ్యాలెట్ బాక్సులు ప‌ట్టుకొని బ‌య‌ల్దేరిన ప్ర‌భుత్వాధికారుల బృందానికి అనూహ్య సంఘ‌ట‌న ఎదుర‌వుతుంది. అప్ప‌టి వ‌ర‌కూ శాంతంగా ఉన్న గూడెం ప్ర‌జ‌లు ఒక్క‌సారిగా తిరుగుబాటు చేస్తారు.

ఇదంతా ఎందుకు? మారేడుమిల్లిలో ఏం జ‌రుగుతోంది? అక్క‌డి ప్ర‌జ‌లు హ‌క్కుల్ని కాపాడుకోవ‌డానికి ఏం చేశారు? ప్ర‌భుత్వం ఎలా దిగి వ‌చ్చింది? ఇవ‌న్నీ తెలుసుకోవాలంటే ‘మారేడుమిల్లి ప్ర‌జానీకం’ చూడాల్సిందే.

ఇట్లు... మారేడుమిల్లి ప్ర‌జానీకం

ఫొటో సోర్స్, @HasyaMovies

నిత్యం చూసే విషయాలే...

‘‘ఓ దినప‌త్రిక‌లో వార్త‌ని చూసి ఈ క‌థ రాసుకున్నా’’ అని ద‌ర్శ‌కుడు చెప్పాడు. సో.. క‌థాప‌రంగా నేల విడిచి సాము చేసిన విష‌యం కాదు. జ‌రుగుతున్న వాస్త‌వం.

తెర‌పై మారేడుమిల్లి ప్ర‌జ‌లు ప‌డుతున్న బాధ‌ని చూస్తే అవేం మ‌న‌కు కొత్త‌గా అనిపించ‌వు. ఎందుకంటే టీవీల్లోనో, పేప‌ర్లలోనో నిత్యం చూసే విష‌యాలే. వాటినే కాస్త సినిమాటిక్ లిబ‌ర్టీ తీసుకొని చూపించారు. మారేడుమిల్లి ప్రాంతాన్ని, అక్క‌డి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌నీ క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించ‌డానికి ద‌ర్శ‌కుడు కాస్త స‌మ‌యం తీసుకొన్నాడు.

ఎల‌క్ష‌న్ల ప‌ట్ల వారి వైఖ‌రిని, వాళ్ల‌లో మార్పు తీసుకుని రావ‌డానికి క‌థానాయ‌కుడు చేసే ప్ర‌య‌త్నాల్నీ చూపించ‌డానికి రాసుకొన్న స‌న్నివేశాలు బాగున్నాయి. ముఖ్యంగా నీటి ప్ర‌వాహంలో కాన్పు చేయించే సీన్ హైలెట్ అని చెప్పొచ్చు. ఒక్క సీన్‌లోనే క‌థానాయ‌కుడి తెలివితేట‌ల్ని, గూడెం ప్ర‌జ‌ల బాధ‌ని, భ‌క్తినీ, ఓ ఆడ‌బిడ్డ క‌ష్టాన్నీ.. క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించారు.

ఇట్లు... మారేడుమిల్లి ప్ర‌జానీకం

ఫొటో సోర్స్, @HasyaMovies

తెలుగు – ఇంగ్లిష్ రన్నింగ్ కామెంట్రీ

మ‌ధ్య‌మ‌ధ్య‌లో తెలుగు - ఇంగ్లిష్ భాష‌ల మ‌ధ్య ఓ ర‌న్నింగ్ కామెంట్రీ న‌డుస్తుంటుంది. ‘52 అక్ష‌రాలున్న తెలుగు భాష ముందు 26 అక్ష‌రాలున్న ఇంగ్లిష్ చాలా చిన్న‌దే’ అనే మాట తెలుగు భాషాభిమానుల‌కు న‌చ్చుతుంది. తెలుగువాళ్ల‌కు గ‌ర్వంగా అనిపిస్తుంది.

వాన దేవుడికి తెలుగు ప‌ద్యాల్లో ఇచ్చే గౌర‌వం, ఇంగ్లీష్ థీర‌మ్స్‌లో చూపించే మ‌ర్యాద‌కు మ‌ధ్య తార‌త‌మ్యం బాగా చెప్పారు. తెలుగు భాష‌, తెలుగు సంస్కృతిలో వాన‌కు ఇచ్చే విలువ ఏమిటో తెలిసొచ్చే సంభాష‌ణ అది.

మ‌ధ్య‌లో ఓ ల‌వ్ ట్రాక్ కూడా ఉన్నా అది క‌థ‌కు అడ్డు కాలేదు. క‌థ‌ని విడిచి ఏ విష‌యం చెప్ప‌కూడ‌ద‌న్న నిబంధ‌న‌ని ద‌ర్శ‌కుడు బాగా పాటించాడ‌నిపిస్తుంది.

ఇంట్ర‌వెల్ బ్యాంగ్ ద్వితీయార్థం చూడాల‌న్న ఉత్సుక‌త‌ని కాస్త పెంచుతుంది. అయితే ఆ ట్విస్ట్ ఏమిటో సెకండాఫ్ ప్రారంభ‌మైన కాసేప‌టికే రివీల్ చేసేశాడు ద‌ర్శ‌కుడు.

క‌థంతా సింగిల్ పాయింట్ చుట్టూ తిర‌గ‌డం, త‌ర‌వాత ఏం జ‌రగ‌బోతోంది? అనే విష‌యం ప్రేక్ష‌కుల‌కు ముందే తెలిసిపోవ‌డం.. ఇవ‌న్నీ ప్ర‌తికూలాంశాలుగా మారాయి.

ర‌ఘుబాబుని దించి సెకండాఫ్‌లో కొంత వినోదాన్ని, కొంత డ్రామాని పండించాల‌నుకొన్నారు. ఆ ప్ర‌య‌త్నాలు పెద్ద‌గా ఫ‌లించ‌లేదు.

ఇట్లు... మారేడుమిల్లి ప్ర‌జానీకం

ఫొటో సోర్స్, @ZeeStudios_

పాత్రకు న్యాయం చేసిన నరేష్ నటన

నాంది నుంచి న‌రేష్ ప్ర‌యాణం కాస్త మారిన‌ట్టు క‌నిపిస్తోంది. న‌రేష్‌ ‘మారేడుమిల్లి..’ లాంటి క‌థ‌ని ఎంచుకోవ‌డానికి ‘నాంది’ ఇచ్చిన బూస్ట్ ఓ కార‌ణం కావొచ్చు. శ్రీ‌పాద శ్రీ‌నివాస్‌గా న‌రేష్ న‌ట‌న బాగుంది. ఓ తెలుగు టీచ‌ర్‌లా, నిజాయ‌తీ గ‌ల విద్యార్థిలా, ఓ సామాన్యుడిలా త‌న పాత్ర‌కు న్యాయం చేకూర్చాడు.

లక్ష్మి (ఆనందిని) పాత్ర‌ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. ఏడో త‌ర‌గ‌తి చ‌దివి గూడెం ప్ర‌జ‌ల కోసం ఎంత రిస్క్ అయినా చేయ‌డానికి సిద్ధ ప‌డే అమ్మాయి పాత్ర అది. క‌థానాయిక అనే ట్యాగ్ లైన్ ఉన్నా, లేకున్నా, అన్ని హంగులు ఇవ్వ‌కున్నా, ఆ పాత్ర త‌న వ్య‌క్తిత్వాన్ని నిలుపుకొంది.

సీరియ‌స్‌గా సాగే ఈక‌థ‌లో వినోదం పంచే బాధ్య‌త వెన్నెల కిషోర్ తీసుకున్నాడు. త‌న డైలాగుల‌తో, కామెడీ టైమింగ్‌తో న‌వ్వించాడు. గూడెం పెద్ద‌, కండా (శ్రీ‌తేజ) పాత్ర‌ల్ని కూడా స‌రిగానే వాడుకొన్నాడు ద‌ర్శ‌కుడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

ఆలోచింపజేసే సంభాషణలు

అబ్బూరి ర‌వి సంభాష‌ణ‌లు ఆక‌ట్టుకొంటాయి. ఆలోచ‌న‌లో ప‌డేస్తాయి. ‘త‌ప్పు చేసి శిక్ష ప‌డినా ఫ‌ర్వాలేదు. సాయం చేసిన వాళ్లు బాధ ప‌డ‌కూడ‌దు’, ‘అంద‌రం గొప్పోళ్లం అయిపోవాల‌ని చూస్తున్నాం. కానీ మ‌నిషిగా మారాల‌ని చూడ‌డం లేదు’ లాంటి సంభాష‌ణ‌లు బాగున్నాయి.

ప‌తాక స‌న్నివేశాల్లో న‌రేష్‌తో ప‌లికించిన సంభాష‌ణ‌లూ బాగున్నాయి. అవే ఈ క‌థ‌కు మూలాధారం. టీచ‌ర్‌కీ, క‌లెక్ట‌ర్‌కీ మ‌ధ్య తేడాని చెబుతూ.. ‘టీచ‌ర్స్‌ని గౌర‌వించుకోవ‌డానికి టీచ‌ర్స్ డే ఉంది. క‌లెక్ట‌ర్స్‌కి అలాంటి డే ఏమీ లేదు. క‌లెక్ట‌ర్ కంటే టీచ‌రే గొప్ప అని చెప్ప‌డానికి ఇంకేం కావాలి’ అని చెప్ప‌డం టీచ‌ర్స్ గ‌ర్వ‌ప‌డే విష‌యం.

కానీ కొన్ని చోట్ల బ‌ల‌వంతంగా ఇరికించిన‌ట్టు అనిపిస్తాయి. సందేశాల్లా సుదీర్ఘంగా సాగుతాయి. అయితే చెప్పేది మంచి విష‌య‌మే కాబ‌ట్టి కాస్త ఓపిక తెచ్చుకొని వినొచ్చు.

ప‌తాక స‌న్నివేశాలు కూడా లెంగ్తీగా ఉన్నాయి. సాంబ‌శివుడి రూపంలో తిరుబాటు చేయ‌డం, ‘మ‌నుషుల‌కు అర్థం కాని విష‌యం.. మృగాల‌కు తెలిసింది’ అని చెప్ప‌డం.. బాగున్నాయి. సాంబ‌శివుడు (ఎద్దు)ల పోరాటంలో గ్రాఫిక్స్ కాస్త నాసిర‌కంగా ఉన్నాయనిపిస్తుంది.

గట్స్ ఉండాలి...

విజువ‌ల్‌గా ఈ సినిమా బాగుంది. మారేడుమిల్లి ప్రాంతాన్ని చక్క‌గా చూపించారు. ఏది సెట్టో, ఏది రియ‌ల్ లొకేష‌నో అర్థం కాలేదు.

నేప‌థ్య సంగీతం బాగుంది. మూడు పాట‌ల‌కే ఆల్బ‌మ్ ప‌రిమితం చేశారు. ఇలాంటి క‌థ‌ల‌కు పాట‌లు అడ్డు గోడ వేస్తుంటాయి. కాబ‌ట్టి పాట‌ల్ని త‌గ్గించుకోవ‌డం మంచి ప‌నే.

కొన్ని క‌థ‌లు నిజాయ‌తీగా చెప్పాలి. అందులో క‌మ‌ర్షియల్ కోణాలు ఆలోచించ‌కూడ‌దు. అలాంటి క‌థ ఇది. స‌మాజంలో జ‌రుగుతున్న వాస్త‌వ ప‌రిస్థితుల్ని సినిమాటిక్ కోణంలో చెప్పారంతే. ద‌ర్శ‌కుడి ఆలోచ‌న బాగుంది. క‌మ‌ర్షియ‌ల్ కోణాల గురించి ఆలోచించ‌కుండా ఇలాంటి క‌థ‌పై పెట్టుబ‌డి పెట్టిన నిర్మాత‌కి గట్స్ ఉండాలి. ఆ ప్ర‌య‌త్నాన్ని అభినందించాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)