'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' రివ్యూ: 'ప్రేక్షకులు చాలా మంచోళ్లు. చెత్త సినిమాలోనూ మంచే వెదుక్కొంటారు'

ఫొటో సోర్స్, Mythri Movie Makers/fb
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
కొన్ని కొన్ని పేర్లు పోస్టర్‌పై కనిపిస్తే ఓ రకమైన నమ్మకం. హీరో, హీరోయిన్లతో సంబంధం లేదు... కచ్చితంగా ఎంటర్‌టైన్ అవ్వగలం అనే భరోసా. అలాంటి పేరును కావాల్సినంత సంపాదించుకున్న దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ.
అష్టాచమ్మా, సమ్మెహనం, అమీతుమీ.. ఇలా క్లీన్ అండ్ గ్రీన్ చిత్రాలకు ఆయన పెట్టింది పేరు. ఇంద్రగంటి సినిమాల్లో భారీ స్టార్లు ఉండరు. పేరు మోసిన టెక్నీషియన్లు ఉండరు. సాంకేతిక విన్యాసాలు కనిపించవు. కేవలం ఓ చిన్న కథ. దాని చుట్టూ సున్నితమైన వినోదం, అందమైన పాటలు, అర్థవంతమైన మాటలు ఇవే కనిపిస్తాయి. మినిమం గ్యారెంటీకి... గ్యారెంటీ ఇచ్చేయొచ్చు.
ముఖ్యంగా క్లాస్ ప్రేక్షకులు ఇంద్రగంటి సినిమాలపై బాగా నమ్మకం పెట్టుకుంటారు. అందుకే.. ఇప్పుడు 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాపై కూడా అంచనాలు ఏర్పడ్డాయి.
ఇంద్రగంటి మోహనకృష్ణకు కలిసొచ్చిన హీరో సుధీర్ బాబు. లక్కీ స్టార్ పేరు తెచ్చుకున్న కృతిశెట్టి ఆయనకు తోడవ్వడంతో ఈ సినిమాపై మరింత ఫోకస్ పడింది. ఇంతకీ ఈ అమ్మాయి ఎలా ఉంది? ఈ అమ్మాయి గురించి తెలుసుకోవాల్సిన విషయాలేంటి?
నవీన్ (సుధీర్ బాబు) వరుసగా ఆరు హిట్లు తన ఖాతాలో వేసుకున్న పక్కా కమర్షియల్ దర్శకుడు. ఓ అందమైన యువరాణి చుట్టూ తిరిగే కథ రాసి... అందులో ఓ కొత్తమ్మాయిని హీరోయిన్‌గా ఎంచుకోవాలని చూస్తుంటాడు.
తనకి అనుకోకుండా ఓ పాత కాలం నాటి రీల్ దొరుకుతుంది. అందులో ఓ అందమైన అమ్మాయి కనిపిస్తుంది. తనే అలేఖ్య (కృతి శెట్టి).

ఫొటో సోర్స్, Mythri movie makers/fb
తనకేమో సినిమాలంటే అస్సలు ఇష్టం ఉండదు. తనకే కాదు, తన ఫ్యామిలీలో ఎవ్వరికీ సినిమాలపై మంచి అభిప్రాయం ఉండదు. మరి, అలేఖ్యని ఒప్పించి నవీన్ సినిమా తీయగలిగాడా? లేదా? అనేదే మిగిలిన సినిమా.
సినిమాలో సినిమా కథ ఇది. ఓ దర్శకుడు సినిమా తీయాలనుకోవడం, అందుకోసం కథానాయికని అన్వేషిస్తూ సాగించిన ప్రయాణంలో కథానాయిక పరిచయం కావడం, వారిద్దరి మధ్య స్నేహం చిగురించడం, కొన్ని మలుపులు, కొంత ఎమోషన్, చివరికి శుభం కార్డు వేసుకోవడం, ఇదే కథ. ఈ కథ ట్రైలర్ చూసినా సినిమా అర్థమైపోతుంది.
థియేటర్ వరకు వెళ్లాలనుకునేవారి కోసం కొన్ని ట్విస్టులు ఉన్నాయి. అవి తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
నవీన్ ఇంట్రడక్షన్‌తో కథ మొదలవుతుంది. సినిమా వాళ్లకు, ముఖ్యంగా హిట్టు సినిమా తీసిన దర్శకుడికి ఉండే క్రేజ్, సినిమా వాళ్ల స్ట్రాటజీలు, వాళ్లకుండే భయాలు, కాంబినేషన్ గోలలూ ఇవన్నీ తొలి సన్నివేశాలతోనే చూపించేశారు.
నవీన్‌కు ఓ రీల్ దొరకడంతో కథకు మంచి టేకాఫ్ దొరికింది. అక్కడి నుంచి నవీన్, అలేఖ్యల మధ్య ట్రాక్ మొదలవుతుంది. ఇంద్రగంటి బలం సున్నితమైన వినోదం. అది ఈ సినిమాలోని తొలి సన్నివేశాల్లో కనిపిస్తుంది కూడా.
వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ మధ్య నడిచే సన్నివేశాల్లో చాలా వరకు సినిమాలపై సెటైర్లే కనిపిస్తాయి. అలేఖ్య కథలోకి ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో.. అప్పటి నుంచి సినిమా మరో దారి తీసుకుంటుంది. కొన్ని ఎమోషన్ సీన్లు, ఓ ఆసక్తికరమైన మలుపుతో ఇంటర్వెల్ కార్డు పడుతుంది.

ఫొటో సోర్స్, Mythri movie makers/fb
విశ్రాంతి తరవాత కీలకమైన ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. ఈ ఫ్లాష్ బ్యాక్‌లో హీరోయిన్‌కీ, ఆమె కుటుంబానికీ సినిమాలన్నా, సినిమావాళ్లన్నా ఎందుకు పడదు? అనే విషయం తెలుస్తుంది.
అయితే ఆ గతం అంత గొప్పగా లేదు. చాలా రొటీన్‌గా ఉంది. మెలోడ్రామా కూడా బలవంతంగా ఇరికించినట్టే అనిపిస్తుంది.
అలేఖ్యని ఒప్పించి సినిమా తీయడానికి నవీన్ ఓ కథ చెబుతాడు. అది కూడా అంతే. పెద్ద ఎఫెక్టివ్‌గా అనిపించదు. హీరో, హీరోయిన్ల ఫ్లాష్ బ్యాక్‌లు రెండూ ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వకపోతే.. అసలు కథలో ఎమోషన్‌ని ఎలా అర్థం చేసుకుంటారు?
అసలు ఈ సినిమా తీయాల్సిన అవసరం నవీన్‌కు, ఈ సినిమాలో నటించాల్సిన ఆవశ్యకత అలేఖ్యకు ఎంత వరకూ ఉన్నాయో బలంగా చెప్పలేకపోయారు. ఇంద్రగంటి ఎమోషన్‌ని బాగా పండిస్తాడు. కానీ ఈ సినిమాలో ఎమోషన్ సన్నివేశాలెందుకో కామెడీగా మారిపోయాయి. కథలో సంఘర్షణ లేనప్పుడే ఇలాంటి తప్పులు జరుగుతుంటాయి.
ఇంద్రగంటి క్లాస్ టచ్ ఉన్న దర్శకుడు. కమర్షియాలిటీ కోసం ప్రత్యేకంగా ఏం చేయడు. కానీ ఈ సినిమాలో మాత్రం పనిగట్టుకొని ఐటెమ్ సాంగ్ ఇరికించాడు. కథకు అవసరం లేని పాటే.. అని ఓ హింట్ కూడా ఇచ్చి తన చేతులు దులుపుకొనే ప్రయత్నం చేసినా, ఇంద్రగంటి లాంటి ప్రతిభావంతుడైన దర్శకుడికి ఈ అవసరం లేదనిపిస్తుంది.
పతాక సన్నివేశాల్లో సహజత్వం ఎక్కడా కనిపించదు. ''మనం సినిమాని తీస్తాం అనుకొంటాం. కానీ కొన్నిసార్లు సినిమానే మనల్ని తీస్తుంది'' అని డైలాగ్ బాగున్నా - అది అవసరమైన చోట పడకుండా, దాన్ని కూడా కావాలని ఇరికించినట్టే కనిపిస్తుంది.

ఫొటో సోర్స్, Mythri movie makers/fb
సుధీర్ బాబు కథల ఎంపిక బాగుంటుంది. తన బలాబలాల్ని బేరీజు వేసుకొని మరీ సినిమాలు చేస్తుంటాడు. ఈసారి కథకి కాకుండా ఇంద్రగంటి మ్యాజిక్‌ని నమ్మి ఉంటాడు. కాబట్టి, ఇంద్రగంటి ఏం చెబితే అది చేసుకుంటూ పోయాడు. కొన్ని ఫ్రేముల్లో ఎమోషనల్‌గా తనెంత మంచి నటుడో చూపించే ప్రయత్నం చేశాడు.
కృతి శెట్టి అందాల తార. ఆ విషయంలో ఎవ్వరికీ అనుమానం లేదు. ఈసినిమాలో నటించడానికి కూడా స్కోప్ దొరికింది. అయితే `ఆ అమ్మాయి గురించి చెప్పాలి` అని అన్నప్పుడు.. ఆ అమ్మాయి గురించి ఏం చెబుతారా? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంటుంది. కానీ అంత బలం ఆ పాత్రలో కనిపించదు.
శ్రీకాంత్ అయ్యంగార్ ఎప్పుడూ మీటర్ దాటే నటిస్తుంటాడని ఓ విమర్శ వినిపిస్తుంటుంది. ఈసారి దానికి ఇంకొంచెం ఊతం దొరికినట్టు అయ్యింది. శ్రీకాంత్ అయ్యంగార్ నటించిన కొన్ని ఎమోషనల్ సీన్లు ప్రేక్షకులకు కామెడీగా అనిపిస్తాయి. అంటే, ఆ సన్నివేశంలో ఏమాత్రం బలం లేదన్నమాట. వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ కాస్త ఊరట.
ఇంద్రగంటి సినిమాల్లో మంచి పాటలుంటాయి. ఈమధ్య తన సినిమాలకు ఎక్కువగా పనిచేస్తున్న వివేక్ సాగర్ ఈ చిత్రానికీ సంభాషణలు అందించారు. అయితే, ఒక్కటంటే ఒక్క పాట కూడా గుర్తుండదు. నేపథ్య సంగీతంలో ఫీల్ ఉంది కానీ, ఆ ఫీల్ సన్నివేశాల్లో కనిపించదు. ఇంద్రగంటి చాలా సాదా సీదా కథ రాసుకున్నాడు. అయితే కథనంలో, మాటల్లో తన మ్యాజిక్ చూపించకపోవడం వల్ల ఈ కథ మరింత తేలిపోయింది.
''ప్రేక్షకులు చాలా మంచోళ్లు. చెత్త సినిమాలోనూ మంచే వెదుక్కొంటారు'' అనే డైలాగ్ ఉంది ఈ సినిమాలో. అది నూటికి నూరుపాళ్లూ నిజం. ఈ సినిమాలోనూ కొంత మంచి వెదుక్కొనే ప్రయత్నం చేస్తే... అక్కడక్కడ కొన్ని నవ్వులు, కృతి శెట్టి అందమైన క్లోజప్పులు కనిపిస్తాయేమో. అంతకు మించిన పాజిటివ్ విషయాలేం ఉండకపోవొచ్చు.
ఇవి కూడా చదవండి:
- లఖీంపుర్ ఖీరీలో దళిత బాలికల హత్య: 'నా బిడ్డలను ఎందుకు చంపారు, అందరినీ ఉరి తీయాలి' - తల్లి ఆవేదన
- స్మార్ట్‌ఫోన్‌ను పిల్లలకు ఏ వయసులో ఇవ్వాలి?
- ఆంధ్రప్రదేశ్: 16 ఊళ్ళు ఏకమై ప్రభుత్వం చేయలేనిది చేసి చూపించాయి
- క్వీన్ ఎలిజబెత్ 2: వెస్ట్మిన్స్టర్ హాల్‌కు క్వీన్ శవపేటిక ఊరేగింపు
- రోజర్ ఫెదరర్: 20 గ్రాండ్‌శ్లామ్ టైటిల్స్ గెలిచిన టెన్నిస్ దిగ్గజం క్రీడాయాత్ర ఎలా సాగిందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













