రంగరంగ వైభవంగా రివ్యూ: 'కొత్తగా లేదేంటి? కొత్తగా లేదేంటి?'

ఫొటో సోర్స్, @SVCCofficial
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
ఎలాంటి కథ చెబుతున్నాం అనేది ఎంత ప్రధానమో, ఆ కథని ఎలా చెబుతున్నాం? ఎవరి కోసం తీస్తున్నాం? అనేదీ అంతే ముఖ్యం. కొత్త కథలు ప్రతిసారీ పుట్టవు. పాత కథను కొత్తగా చెప్పాల్సిందే. కానీ పాలిష్ చేసి చెప్పాలి. పాత కథనే కొత్తగా చెప్పి ప్రేక్షకులను మెప్పించిన సినిమాలు చాలానే ఉన్నాయి.
కొత్త కథను అర్థమయ్యేలా, కనెక్ట్ అయ్యేలా తీస్తే ఆడియన్స్ నీరాజనాలు పలుకుతారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఏ కథని ఎలా చెప్పాలో తెలిసుండడం చాలా ముఖ్యం అని!
కొత్త దర్శకులు చాలా వరకు కొత్త ఆలోచనలతోనే కథలు అల్లుకొంటారు. అది కుదరని పక్షంలో.. కొత్త తరహా సన్నివేశాలతో సమాయత్తం అవుతారు. గిరీశాయ కూడా తెలుగు వరకూ కొత్త దర్శకుడే!
ఉప్పెనతో తొలి అడుగులోనే సూపర్ హిట్ అందుకున్న వైష్ణవ్ కోసం కథ సిద్ధం చేశాడంటే రాతలో, కనీసం తీతలో కొత్తదనం ఉంటుందని ఆశించడం సాధారణమే.
మరి.. ఈ కాంబినేషన్‌లో వచ్చిన 'రంగ రంగ వైభవంగా' ఎలా ఉంది? కథ ఎలా ఉంది? కథలో, దాన్ని తీర్చిదిద్దిన విధానంలో కొత్త విషయాలు, అబ్బుర పరిచే అంశాలూ ఏమైనా ఉన్నాయా?

ఫొటో సోర్స్, facebook/SVCC
ఇగో గోల
రాముడు (ప్రభు) చంటి (నరేష్) ఇద్దరూ ప్రాణమిత్రులు. ఒకటే మాట.. ఒకటే బాట. చంటి కొడుకు రిషి (వైష్ణవ్‌తేజ్). రాముడు కూతురు రాధ (కేతిక శర్మ). ఒకే రోజు, ఒకే సమయంలో పుడతారు. చిన్నప్పటి నుంచీ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. అయితే ఓ చిన్న గొడవ వల్ల విడిపోతారు.
అక్కడి నుంచి ఇద్దరి మధ్య ఇగో మొదలవుతుంది. 'సారీ' చెప్పేంత వరకూ మాట్లాడను అని ఇద్దరికిద్దరు భీష్మించుకొని కూర్చుంటారు. ఒకర్ని ఒకరు ఆట పట్టించుకుంటుంటారు. అయితే వాళ్ల మధ్య ప్రేమ, స్నేహం అన్నీ ఉంటాయి. కళ్లతో మాట్లాడుకుంటారు. కొట్టుకుంటారు, తిట్టుకుంటారు.
వీళ్లు ఇలానే ఉన్నారా, మధ్యలో మారారా? ముందు ఎవరు ఎవరికి సారీ చెప్పారు? ఆ తరవాత ఏం జరిగింది? రాముడు, చంటి అపురూపమైన స్నేహానికి ఏమైనా అడ్డుగోడలు ఏర్పడ్డాయా? ఇదంతా మిగిలిన కథ.
''కొత్తగా లేదేంటి? కొత్తగా లేదేంటి?'' అనే ఓ పాట ఉంది ఈ సినిమాలో. సినిమా మొదలైన చాలా సేపటికి గానీ ఆ పాట రాదు. కాకపోతే.. ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకుడు మాత్రం ముందు నుంచీ.. 'ఈ సినిమా కొత్తగా లేదేంటి?' అని మధన పడుతూనే ఉంటాడు.
ఎందుకంటే.. ఈ తరహా కథలు ఇది వరకు చాలాసార్లు వచ్చేశాయి. రెండు కుటుంబాలు, పక్క పక్కనే ఇళ్లు, వాళ్లిద్దరూ స్నేహితులు కావడం, వాళ్ల పిల్లలు కొట్టుకుంటూ తిట్టుకుంటూ పెరగడం, మధ్యలో ప్రేమలో పడిపోవడం.. ఇలాంటి కథలతోనే ఎన్నో సినిమాలొచ్చాయి. వాటిలో క్లాసిక్స్ కూడా ఉన్నాయి.
'రంగ రంగ' తొలి సన్నివేశం నుంచే పాత సినిమాల ఛాయలు తగులుతూ ఉంటాయి. నిన్నే పెళ్లాడతా, నువ్వే కావాలి, ఖుషి... ఇలా బోలెడన్ని రిఫరెన్సులు కనిపిస్తాయి. హీరో, హీరోయిన్‌లు కొట్టుకుంటూ తిట్టుకొంటూ ఒకరిపై మరొకరు పైచేయి సాధించాలనుకోవడం ఇవన్నీ పార్టు పార్టులుగా చూస్తుంటే బాగానే ఉందనిపిస్తుంది. కాకపోతే ఏ సన్నివేశంలోనూ ఫ్రెష్‌నెస్ కనిపించదు.
అర్థరాత్రి రోడ్డు మీద ఫైట్ సీన్ కమర్షియల్‌గా బాగానే ఉన్నా - లెంగ్త్ ఎక్కువైపోయింది. ఈ తరహా ఫైట్ సీన్ కూడా చాలా సినిమాల్లో చూసేశాం కూడా. ఇంట్రవెల్ బ్యాంగ్‌తో సంఘర్షణ మొదలవుతుంది. అయితే.. అది కూడా బలవంతంగా తెచ్చి ఇరికించినట్టే ఉంటుంది. ఇక అక్కడ్నంచి అన్నీ ఇలాంటి అతికింపులే.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
చూసిందే చూస్తున్నామా?
ఏ సన్నివేశం అయినా కథలోంచి, పాత్రల్లోంచి పుట్టుకుని రావాలి. అయితే ఈ సినిమాలో మాత్రం సీన్ కోసం మరో సీన్ పుట్టుకొస్తుంది. తరవాతి సీన్ ఇది కాబట్టి, ముందు ఇలాంటి సీన్ ఒకటి రాసుకోవాలి.. అనే కొలతలతో దర్శకుడు ఆయా సన్నివేశాల్ని అల్లుకొన్నట్టు అనిపిస్తుంది. సన్నివేశాలు ఒకదాని తరవాత మరోటి వచ్చి పడిపోతుంటాయి. కానీ ఆ సన్నివేశం లేకపోవడం వల్ల కథకొచ్చే నష్టం ఏమీ ఉండదు. లాభమూ కనిపించదు.
సినిమా అంటే ఓ రెండు గంటల పాటు తీయాలి కాబట్టి.. ఆ సమయాన్ని ఏదోలా నడపాలి కాబట్టి, ఇందులో కావల్సినంత మంది ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి.. అలా సీన్లు రాసుకుంటూ వెళ్లిపోయారా అనే సందేహం కలుగుతుంది.
ఉదాహరణకు అరకులో డాక్టర్ల టూర్. అక్కడ సత్య అనే హాస్య నటుడ్ని తీసుకొచ్చి శ్రీను వైట్ల సినిమాలోలా తాగుబోతు కామెడీ క్రియేట్ చేయడానికి చూశారు. అది కేవలం అతికించిన సీనే అని అర్థమైపోతుంటుంది. అందుకే ఆ సీన్‌లో సత్య విరగబడి నవ్వించడానికి ప్రయత్నిస్తున్నా.. పాత శ్రీను వైట్ల సినిమాలు, అందులోని తాగుడు సీన్లు గుర్తొచ్చేస్తుంటాయి.
కార్తీక దీపం సీరియల్ ఎపిసోడ్ కూడా అంతే. మహిళా ప్రేక్షకుల్ని కట్టిపడేసిన సీరియల్ కార్తీక దీపం. అందులోని డాక్టరు బాబును తెరపైకి తీసుకురావాల్సి వచ్చింది. సీరియల్స్ సినిమా వాళ్లని వాడుకోవడం కామన్. సినిమా వాళ్లే వెరైటీగా సీరియల్స్ స్టార్స్‌ని వాడుకుంటున్నారు. కథలో స్టామినా సరిపోక. ఇలాంటి ఎత్తుగడలు ఈ సినిమా నిండా కనిపిస్తాయి.
కథలో విషయం లేనప్పుడే జిమ్మిక్కులు ఎక్కువ చేస్తుంటారు. 'రంగ రంగ వైభవంగా'లోనూ ఇలాంటి జిమ్మిక్కులు, ట్రిక్కులు కావల్సినంత కనిపిస్తాయి.

ఫొటో సోర్స్, @SVCCofficial
మధ్యలో రాజకీయాల గోల ఒకటి. హీరోయిన్ అన్నయ్య అర్జున్ (నవీన్ చంద్ర)కి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ పెట్టడం వల్ల.. ఈ కథకు వచ్చిన ప్లస్ పాయింట్ ఏమీ లేదు. కేవలం కథ కోసం ఆ పాత్రని ఎటు కావాలంటే అటు మార్చుకుంటూ వెళ్లారు.
ఈ రోజుల్లో మితిమీరిన మెలోడ్రామాని చూడ్డానికి ప్రేక్షకులు ఎవరూ ఇష్టపడడం లేదు. అలాంటి సీన్లు రాస్తున్నా, తీస్తున్నా.. థియేటర్లోనే గోల పెట్టేస్తున్నారు. 'చాల్లేరా బాబూ...' అని అరుస్తున్నారు. ఈ విషయంలో దర్శకుడు కాస్త పరిణతి చూపించాల్సిన అవసరం ఉంది. ఇదివరకటిలా సెంటిమెంట్ సీన్లని బలవంతంగా రుద్దాలంటే కుదరదు. అలా చేస్తే ఆ సీన్ నుంచే సినిమా తప్పుడు దారిలో ప్రయాణించడం మొదలవుతుంది.
'రంగ రంగ వైభవంగా' లాంటి కథల్లో ఎమోషన్ చాలా అవసరం. అది కథలోంచి సహజంగా పుట్టుకురావాలి. బలవంతంగా రాబట్టాలంటే కుదరదు. గిరీశాయ చేసింది అదే. చెట్టుచాటు నుంచి చాటుగా మాటలు విని.. మనుషులు మారిపోవడం, 'నువ్వెంత గొప్పోడివిరా...' అంటూ భుజం మీద చేయి వేసి - హీరోని పొగడ్తల కార్యక్రమంలో ముంచెత్తడం.. ఇలాంటి సీన్లు తీస్తే చూసే రోజులు కావివి.
రాముడు, చంటి మధ్య స్నేహాన్ని బలంగా చూపించిన సన్నివేశం ఒక్కటీ లేదు. అలాంటప్పుడు వాళ్లు విడిపోతే ప్రేక్షకుడు ఎందుకు ఫీల్ అవుతాడు? మళ్లీ కలుసుకొంటే ఎందుకు ఆనందిస్తాడు? ఈ రెండు ఫ్యామిలీలూ విడిపోవడం, మళ్లీ కలుసుకోవడం ఈ కథకు చాలా ముఖ్యమైనప్పుడు, ఆయా సన్నివేశాల్ని దర్శకుడు చాలా పకడ్బందీగా రాసుకోవాల్సింది. కానీ అది జరగలేదు.

ఫొటో సోర్స్, @SVCCofficial
పక్కింటి కుర్రాడు బాగున్నాడు
ఉప్పెనతో తొలి సినిమాకే సూపర్ హిట్టు కొట్టేశాడు వైష్ణవ్ తేజ్. ఆ సినిమాలో అన్ని రకాల ఎమోషన్లనూ పండించే అవకాశం వచ్చింది. ఈ సినిమాలో 'పక్కింటి కుర్రాడి'గా తన పాత్రకు తన వంతు న్యాయం చేశాడు. సరదా సీన్లలో మంచి ఈజ్‌తో నటిస్తున్నాడు. ఎమోషన్ సీన్ల వరకూ ఇంకాస్త ఇంప్రూవ్ అవ్వాలి.
కేతిక అందంగా ఉంది. సంప్రదాయ దుస్తుల్లో హుందాగా ఉంది. హీరో, హీరోయిన్ల కెమెస్ట్రీ బాగానే కుదిరింది. నరేష్, ప్రభు ఇద్దరూ సీనియర్ ఆర్టిస్టులే. పేపర్ మీద ఇద్దరి పాత్రలూ బలంగానే ఉండి ఉండొచ్చు. కానీ స్క్రీన్ మీద చాలా చోట్ల డమ్మీలుగానే కనిపిస్తారు.
నవీన్ చంద్ర పాత్రని దర్శకుడు ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటూ వెళ్లాడు. సత్య ఓ సీన్‌లో కనిపించి నవ్వించే ప్రయత్నం చేశాడు.
దేవిశ్రీ ప్రసాద్ పాటల్లో మెలోడీ ఎక్కువ పలికింది. తన ఆల్బమ్ అంటే ఓ ఫాస్ట్ బీట్ పాట తప్పకుండా ఉంటుంది. అది ఈ సినిమాలో మిస్ అయ్యింది. నేపథ్య సంగీతం విషయంలోనూ దేవీ అంతగా మనసు పెట్టినట్టు కనిపించలేదు.
వైజాగ్ అందాల్ని బాగానే చూపించాడు కెమెరామన్. నిర్మాణ విలువలూ బాగున్నాయి.
గిరీశాయ చాలా రొటీన్ కథని ఎంచుకొన్నాడు. ఇక్కడ సీన్లలో వైవిధ్యం చూపిస్తే సరిపోయేది. ఆ సన్నివేశాలు కూడా చాలా సినిమాలకు రెప్లికాలుగా నిలిచిపోతాయి. తొలి సగం.. కాస్త సరదాతో టైమ్ పాస్ అయిపోతుంది. కానీ ద్వితీయార్థంలో బలవంతంగా ఎమోషన్లు తెచ్చిపెట్టడానికి ప్రయత్నించారు. దాంతో దర్శకుడి ప్రయత్నం నెరవేరలేదు.
ప్రేక్షకులు కొత్త కథల్ని చెప్పకపోయినా పెద్దగా పట్టించుకోరు. కానీ.. పాత సినిమాని మళ్లీ అదే టోన్లో తీసి, మీరు మళ్లీ ఇదే చూడాలి అంటే మాత్రం నిర్మొహమాటంగా తిరస్కరిస్తారు. రంగ రంగ వైభవంగా విషయంలో అదే జరిగింది.
ఇవి కూడా చదవండి:
- ఒక సామాన్య మధ్యతరగతి ఇల్లాలిపై ధరల పెరుగుదల ప్రభావం ఎలా ఉంటుంది?
- ఏమిటీ ‘స్మోకింగ్ పనిష్మెంట్’ టెక్నిక్.. ఇలా చేస్తే సిగరెట్లు మానేయవచ్చా
- మీరు డార్క్ చాక్లెట్‌ను ఇష్టంగా తింటారా, అది ఆరోగ్యానికి నిజంగా మంచిదేనా?
- ప్రేమలో విఫలమయ్యారా? ఆ బాధ నుంచి కోలుకోవడం ఎలా
- నిరుద్యోగం పెరుగుతున్న వేళ, జీవనోపాధికి భరోసా ఇస్తున్న ‘గిగ్ వర్క్’
- వేలంలో కొన్న సూట్‌కేసులు, ఇంటికి తెచ్చి చూస్తే అందులో మానవ అవశేషాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














