కళాపురం సినిమా రివ్యూ: పేరులో ఉన్న కళ... సినిమాలో ఉందా?

ఫొటో సోర్స్, facebook/Karuna Kumar
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
అందుబాటులో ఉన్న వనరుల్ని వాడుకొని - ఉన్నంతలోనే అత్యుత్తమ వినోదం అందించాలని కొంత మంది దర్శకులు ప్రయత్నిస్తుంటారు. అందులో విజయం సాధిస్తుంటారు కూడా. అలాంటి దర్శకుడు `పలాస`తో దొరికాడు. ఆ సినిమాకి ముందు కరుణ కుమార్ అంటే పెద్దగా తెలీదు. ఆ ఒక్క సినిమాతో అందరి దృష్టిలో పడ్డాడు. ఓ సీరియస్ కథ, `రా` లొకేషన్లలో, సిన్సియర్‌గా చెప్పగలడన్న పేరు తెచ్చుకొన్నాడు.
`శ్రీదేవి సోడా సెంటర్` వచ్చేసరికి ఆయనకు స్టార్లు తోడయ్యారు. ఆ సినిమా అంతగా ఆడలేదు గానీ, కరుణ కుమార్ మార్క్ కనిపించింది.
ఇప్పుడు మళ్లీ `పలాస` దారిలోనే అంతా కొత్తవాళ్లతో, తనకున్న పరిమితుల్లో ఓ సినిమా చేశాడు. అదే... `కళాపురం`. - ఇక్కడ అందరూ కళాకారులే అనేది ట్యాగ్ లైన్! మరి పేరులో ఉన్న కళ సినిమాలో కనిపించిందా, కరుణ కుమార్ తనదైన మార్క్ చూపించాడా?
కుమార్ (సత్యం రాజేష్)కి దర్శకుడు అవ్వడమే లక్ష్యం. కథలు రాసుకొని నిర్మాతల చుట్టూ తిరుగుతుంటాడు. ఎక్కడా పని అవ్వదు. ఇందు అనే అమ్మాయిని చాలా గాఢంగా ప్రేమిస్తాడు. తను కూడా కుమార్‌కి దూరం అయిపోతుంది. సినిమా అవకాశాలు రాక, ప్రేమించిన అమ్మాయికి దూరమై మళ్లీ తన ఊరు వెళ్లిపోవాలనుకుంటున్న తరుణంలో.. అప్పారావు అనే నిర్మాత తగులుతాడు. `నీతో సినిమా చేస్తా` అనే మాటిస్తాడు. కానీ ఒకే ఒక్క కండిషన్ పెడతాడు. అదేంటి? ఆ తరవాత కుమార్ జీవితం ఎలా మారిపోయింది..? తీసిన సినిమా హిట్టయ్యిందా లేదా? అనేది మిగిలిన కథ.
పోస్టర్, టైటిల్, ట్రైలర్.. ఇవన్నీ చూడగానే ఇది సినిమా నేపథ్యంలో సాగే కథ అని తెలిసిపోతుంది. ఇది సినిమా తీయాలనుకొనే కొంతమంది కథ. సినిమా నేపథ్యంగా చాలా సినిమాలొచ్చాయి. అన్నింట్లోనూ ఉన్న స్ట్రగుల్స్ ఈ సినిమాలోనూ కనిపిస్తుంటాయి. నిర్మాతలపై సెటైర్లు, దర్శకులు కథల్ని వండి వార్చే విధానం, కాస్ట్యూమ్స్ తయారు చేసేవారి క్రేజీ ఐడియాలు, పాటలు పుట్టడం వెనుక చేసే కసరత్తు, ఆఖరికి రివ్యూలు రాసేవాళ్ల ముచ్చట్లూ.. ఇవన్నీ కలిపితే - కళాపురం.

ఫొటో సోర్స్, facebook/Karuna Kumar
కుమార్ సినిమా తీయడం కోసం పడే కష్టాల దగ్గర్నుంచి సినిమా మొదలవుతుంది. ఇందుతో లవ్ ట్రాక్ కాస్త సుదీర్ఘంగా సాగిందనిపిస్తుంది. ఈ కథకు ఆ ట్రాక్ ఎంత వరకూ అవసరం అనేది దర్శకుడు కాస్త ఆలోచించుకుంటే బాగుంటుంది. అయితే... బస్‌స్టాప్ దగ్గర ఇందు - కుమార్‌ల మధ్య సాగిన వాదన, ప్రేమ గురించీ, జీవితంలో సర్దుకుపోవడంలో ఉన్న అవసరం గురించీ, ముఖ్యంగా అమ్మాయిల దృష్టిలో అబ్బాయిలకు ఉన్న స్థానం గురించి కొన్ని విలువైన మాటలే చెప్పగలిగాడు దర్శకుడు. బహుశా.. ఈ సన్నివేశ లక్ష్యం కూడా అదే కావొచ్చు.
కుమార్ ని అప్పారావు అనే నిర్మాత కలవడం దగ్గర్నుంచి అసలు కథ మొదలవుతుంది. అప్పారావు ఓ గాంబ్లర్ అని ముందే చెప్పేసి... ఆ పాత్రపై ఆసక్తిని పెంచాడు దర్శకుడు. చిత్రసీమలో ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా? అనిపించేలా ఆ పాత్రని మలిచాడు. కుమార్.. కళాపురం వెళ్లడంతో అసలు కథ మొదలవుతుంది. అక్కడ రకరకాల వ్యక్తులు, వాళ్ల క్యారెక్టర్లు, వాళ్లతో కుమార్ సినిమా తీయాలనుకోవడం ఇవన్నీ ఆసక్తికరమైన అంశాలే. ఇంట్రవెల్ కి ఓ లాక్ పడిపోతుంది. ఇక అక్కడ్నుంచి కథ మరో మలుపు తీసుకోవాలి.
కానీ.. ద్వితీయార్థం ఓపెన్ అయ్యాక కూడా.. కథలో కొత్త తరహా టర్న్‌లు కనిపించవు. సినిమా తీసే ప్రోసెస్‌లో జరిగే ఘట్టాలు సరదాగా చూపించడానికి ప్రయత్నించాడు దర్శకుడు. కాకపోతే.. అనుకొన్నంత వినోదం రాలేదు. బహుశా.. ఆ తరహా సీన్లు ఇది వరకు చాలా సినిమాల్లో చూసినందువల్ల కావొచ్చు. కాకపోతే మధ్యమధ్యలో చాలా సెటైర్లు వేశాడు దర్శకుడు. ముఖ్యంగా.... ట్రాఫిక్ కానిస్టేబుల్స్‌పై. ఈమధ్య ప్రతీ ట్రాఫిక్ కానిస్టేబుల్ చేతిలో ఓ కెమెరా కనిపిస్తోంది. ఆ విషయాన్ని కూడా వ్యంగ్య ధోరణిలో చెప్పే ప్రయత్నం చేశాడు. పాము పగబట్టే సీన్ సినిమాటిక్‌గా చూపించడం బాగుంది. సన్నివేశాల్ని కామెడీ రూపంలో మలుస్తున్నా.. అని దర్శకుడు అనుకొన్నాడు గానీ, కామెడీ పెద్దగా పండలేదు. పెదాలపై చిన్న స్మైల్ అయితే ఉంటుంది. కానీ బయటకు వచ్చి మరీ గుర్తుపెట్టుకొని నవ్వుకొనే సీన్లు ఒక్కటీ పడలేదు.

ఫొటో సోర్స్, facebook/Karuna Kumar
కళాపురం గ్రామం అనేది ఓ క్యారెక్టర్. అక్కడ కొన్ని వింతైన పాత్రలున్నాయి. కానీ.. వినోదం పండించడానికి అవి సరిపోలేదు. ఇది వరకు వంశీ ఇలాంటి ప్రయత్నాలు చేసేవారు. ఓ ఊరు తీసుకొని, ఆ ఊరి నిండా చిత్రవిచిత్రమైన పాత్రలు పెట్టి - వాటి మధ్య ఫన్ పండించేవారు. కరుణకుమార్ స్ఫూర్తి కూడా అదే కావొచ్చు. సినిమా ఇంకో పది నిమిషాల్లో ముగుస్తుందనగా ఓ ట్విస్టు వస్తుంది. కచ్చితంగా అది ఊహించని మలుపే. `కథేంటి? ఇలాంటి టర్న్ తీసుకొంది` అనిపిస్తుంది. ఈ కథని తీసింది ఆ ట్విస్టుని నమ్మకొనే అనే సంగతీ అర్థమవుతుంది. కాకపోతే.. అది కూడా సినిమాటిక్ లిబర్టీలానే అనిపిస్తుంది. ఆ ట్విస్టు లేకపోతే గనుక.. కళాపురం మరీ సాదా సీదా వ్యవహారంలా తయారయ్యేది. చివర్లో ట్విస్టు ఇచ్చి - ఓకే అనిపించారంతే.
గట్టోడికి గడ్డిపరక ఇచ్చినా గడ్డపారలా వాడుకుంటాడు - అనే డైలాగ్ ఈ సినిమాలో ఉంది. అది అక్షరాలా నిజం. సినిమా తీసేవాళ్లకూ అది వర్తిస్తుంది. ఎలాంటి కథ ఉంది? మనకు ఎలాంటి ఆర్టిస్టులు దొరికారు? అనేది కాదు. వాళ్లని ఉపయోగించుకొని ఎలాంటి సినిమా తీశామన్నదే ముఖ్యం అవుతుంటుంది. సత్యం రాజేష్, చిత్రం శీనులను మినహాయిస్తే దాదాపుగా అంతా కొత్తవారే. వాళ్లను బాగానే వాడుకొన్నాడు దర్శకుడు. ఎక్కడా కొత్త ఆర్టిస్టులతో చేసిన ప్రయత్నం అనిపించదు.
సత్యం రాజేష్ కామెడీ టైమింగ్ బాగుంటుంది. ఈ సినిమాలో తనది సీరియస్ పాత్ర. అలాంటి పాత్రలో రాజేష్‌ని దర్శకుడు ఎలా ఊహించాడో..? అప్పారావు నటన, ఆ పాత్రని డిజైన్ చేసిన విధానం బాగున్నాయి. ఊర్లో పాత్రలన్నీ పరిధి మేర చేశారు. హీరోయిన్లతో సహా.. అందరివీ చిన్న చిన్న పాత్రలే.
రచయితగా కరుణకుమార్ కి ఈ సారి బొటాబొటీ మార్కులే పడతాయి. అప్పల్రాజు, ఒక విచిత్రం, సినిమా బండి... ఈ కథలతో `కళాపురం`కి దగ్గర పోలికలు ఉంటాయి. వాటిలో లేనిదీ.. ఈ సినిమాలో ఉన్నదీ... క్లైమాక్స్ ట్విస్టు.
సినిమాపై ఇప్పటికే చాలా సెటైరికల్ సినిమాలు రావడం వల్ల.. కళాపురం ఏం కొత్తగా అనిపించదు. ఓ దర్శకుడి స్ట్రగుల్ చూపించాలా? ప్రేక్షకుల్ని నవ్వించాలా? అనేది తేల్చుకోక.. అటో కాలు, ఇటో కాలు వేశాడు దర్శకుడు.
మాటల్లో `గడ్డపార` డైలాగ్ ఒక్కటే గుర్తుంటుంది. కొన్ని సెటైర్లు పేలాయి. కళాపురం అనే ఊరే లేదు. దాన్ని దర్శకుడే సృష్టించాడు. దీనిని కూడా పలాస లానే పరిమిత వనరులతో తెరకెక్కించాడు దర్శకుడు. సినిమా మేకింగ్‌లో క్వాలిటీ చూపించగలిగాడు. ఈ విషయంలో తన పనితనం అభినందించాల్సిందే. కానీ ఓవరాల్‌గా చూస్తే కథ, కథనం ప్రేక్షకులను కట్టిపడేయలేకపోయాయి.
ఇవి కూడా చదవండి:
- అమెరికాలో 11 కోట్ల ఏళ్ళ నాటి డైనోసార్ల పాద ముద్రలు... కరవు వల్ల బయటపడిన అద్భుతం
- నరేంద్ర మోదీకి 2024 ఎన్నికల్లో పోటీ ఇచ్చేందుకు అరవింద్ కేజ్రీవాల్ సిద్ధంగా ఉన్నారా?
- 'పండిట్ జీ, మేం ఇప్పటివరకూ ఐదుగురిని చంపాం’ - రాజస్థాన్ మాజీ బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు వైరల్... కేసు నమోదు
- ఆండ్రాయిడ్ ఫోన్లపై డేటా ఖర్చులను తగ్గించుకోవడమెలా?
- 5 నెలల గర్భంతో ఉండగా అత్యాచారం చేశారు, మూడేళ్ల కూతురినీ చంపేశారు, 20 ఏళ్లకైనా ఆమెకు న్యాయం దొరికిందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














