Call Centre: కాల్ సెంటర్ ఉద్యోగుల ఇండియన్ ఇంగ్లీష్‌ను అమెరికన్ ఇంగ్లీష్‌గా మార్చే స్టార్టప్.. ఈ టెక్నాలజీ జాతి వివక్ష నుంచి రక్షిస్తుందా లేదా?

కాల్ సెంటర్

ఫొటో సోర్స్, Getty Images

కాల్ సెంటర్‌లో పనిచేసే ఉద్యోగుల యాక్సెంట్‌ను వారు మాట్లాడుతున్న సమయంలోనే అప్పటికప్పుడు మార్చగలిగే సాంకేతికతను ఓ స్టార్టప్ కంపెనీ అభివృద్ధి చేసింది.

కాల్‌సెంటర్‌లో పనిచేసేవారు మాట్లాడే యాస ఆధారంగా వారిపై అభిప్రాయాలు ఏర్పరుచుకుని జాతి విద్వేషంతో దూషణలకు దిగడాన్ని తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుందని దీన్ని అభివృద్ధి చేసిన 'సనాస్' సంస్థ 'బీబీసీ'కి చెప్పింది.

అయితే, కొందరు విమర్శకులు మాత్రం ఈ ప్రయత్నాన్ని తప్పు పడుతున్నారు. ఇది భాషావైవిధ్యాన్ని దెబ్బతీస్తుందని అంటున్నారు.

కాల్‌సెంటర్ ఏజెంట్లలో ఎక్కువగా దక్షిణార్థ గోళ దేశాలకు చెందినవారు ఉంటారని, వారందరి యాక్సెంట్‌ను శ్వేత జాతీయుల యాక్సెంట్‌లా మార్చేందుకు 'సనాస్' ప్రయత్నిస్తోందని వార్తావెబ్‌సైట్ 'ఎస్‌ఎఫ్‌గేట్' ఆరోపించింది.

2022 జూన్ నుంచి ఇప్పటివరకు 'సనాస్'కు 3.2 కోట్ల డాలర్ల (రూ. 255 కోట్లకు పైగా) నిధులు వచ్చాయి. సనాస్ తాను అభివృద్ధి చేస్తున్న ఈ సాంకేతికను 'యాక్సెంట్ ట్రాన్స్‌లేషన్ టూల్'గా చెబుతోంది.

సనాస్ వెబ్‌సైట్‌లో 'డెమొ' సెక్షన్‌లో 'హియర్ ది మేజిక్' పేరుతో ఒక రికార్డింగ్ ప్లే చేసి వినే ఏర్పాటు చేసింది. అందులో దక్షిణాసియాకు చెందిన ఒక కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ మాట్లాడిన మాటలున్నాయి. అక్కడే ఉన్న మరో బటన్ క్లిక్ చేస్తే ఆ మాటలే అమెరికన్ యాక్సెంట్‌లో వినిపిస్తాయి.

call centre

ఫొటో సోర్స్, Getty Images

కాల్‌సెంటర్‌లలో పనిచేసేవారు ఏ దేశస్థులనే అంశంతో సంబంధం లేకుండా అందరి మాటలనూ అమెరికన్‌లు, శ్వేత జాతీయుల మాటల్లా మార్చేందుకు సనాస్ ప్రయత్నిస్తోందని వార్తావెబ్‌సైట్ 'ఎస్‌ఎఫ్‌గేట్' తన కథనంలో ఆరోపించింది.

అయితే, సనాస్ సహవ్యవస్థాపకుడు 'శరత్ కేశవ నారాయణ' మాత్రం ఇలాంటి ఆరోపణలను తిప్పికొడుతున్నారు. 'బీబీసీ టెక్ టెంట్' ప్రోగ్రామ్‌లో మాట్లాడిన ఆయన.. సనాస్ వ్యవస్థాపకులు నలుగురూ అమెరికాకు వలస వచ్చినవారేనని, సంస్థ ఉద్యోగులలో 90 శాతం మంది తమలా వలస వచ్చినవారేనని చెప్పారు.

సనాస్ వ్యవస్థాపకులలో ఒకరి స్నేహితుడి అనుభవం ఈ టూల్‌కు కొంతవరకు స్ఫూర్తినిచ్చిందని శరత్ చెప్పారు.

ఆ స్నేహితుడు స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సిస్టమ్స్ ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న సమయంలో నికరాగువాలోని తన తల్లిదండ్రులను చూసుకునేందుకు వెళ్లాల్సివచ్చింది.

ఆ సమయంలో ఒక కాల్‌సెంటర్‌లో టెక్నికల్ సపోర్ట్ ఉద్యోగంలో చేరారు. కానీ, మూణ్ణెళ్లకే ఆ ఉద్యోగం పోయింది. అందుకు కారణం... ఆయన యాక్సెంట్ అమెరికన్ యాక్సెంట్‌ కాకపోవడమేనని శరత్ చెప్పారు.

కాల్ సెంటర్ ఉద్యోగులు కొందరు తమ యాక్సెంట్ కారణంగా వివక్ష, దూషణ ఎదుర్కొంటుంటారని... దాన్ని నివారించడమే ధ్యేయంగా ఈ టూల్ డెవలప్ చేశామని స్వయంగా కాల్ సెంటర్‌లో పనిచేసిన అనుభవం ఉన్న శరత్ చెప్పారు.

అయితే, శరత్ వాదనను 'కలర్ ఇన్ టెక్' సంస్థ సహ వ్యవస్థాపకుడు ఆష్లే ఎయిన్‌స్లే దీనిపై స్పందిస్తూ.. 'రేసిస్ట్‌లకు నచ్చదని ప్రజల చర్మం రంగును తెల్లగా మార్చేస్తామా?' అని ప్రశ్నిస్తున్నారు.

ఇలాంటి టూల్స్ డెవలప్ చేయడం కంటే ప్రజల్లో సహనం అభివృద్ధి చేయడం అవసరం అన్నారు ఆష్లే.

వీడియో క్యాప్షన్, అమెరికాలో భారతీయులు కూడా జాతి వివక్ష ఎదుర్కొంటున్నారా?

సనాస్ ప్రయత్నాలు తప్పుడు దిశలో వెళ్తున్నాయని.. తమ సొంత యాక్సెంట్ మాట్లాడడం కాల్ సెంటర్ ఏజెంట్ల తప్పేమీ కాదని.. తప్పంతా అలాంటివారిని ఏమైనా అనొచ్చన్న భావనతో దుర్భాషలాడేవారిదేనని ఆష్లే అన్నారు.

రేసిజాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరాదని.. దానికి బదులు యాసభాషల్లో వైవిధ్యాన్ని సంతోషంగా ఆమోదించే దిశగా ప్రయత్నాలు తీవ్రం చేయాలని ఆష్లే అంటున్నారు.

అయితే, సాంకేతికత జాతివివక్షను ప్రేరేపిస్తుందా అన్న ప్రశ్నకు శరత్ సమాధానమిస్తూ... 'యాక్సెంట్‌ను వైవిధ్యాన్ని మరింతగా ఆమోదించేలా ప్రపంచం ఉండాల్సిందే' అన్నారు.

'కానీ, 45 ఏళ్లుగా కాల్ సెంటర్లు పనిచేస్తున్నాయి. ప్రతి రోజూ కాల్ సెంటర్ ఏజెంట్లు వివక్షకు గురవుతూనే ఉంటున్నారు' అని శరత్ చెబుతున్నారు.

కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్

ఫొటో సోర్స్, Getty Images

తాము రూపొందించిన టెక్నాలజీని ప్రస్తుతం సుమారు 1000 మంది ఉపయోగిస్తున్నారని... వారిలో ఎక్కువమంది ఫిలిప్పీన్స్, భారత్‌కు చెందినవారని శరత్ చెప్పారు.

కాల్ సెంటర్లలో పనిచేసేవారు అమెరికన్ యాక్సెంట్‌లో మాట్లాడాలని యాజమాన్యాలు కోరుకుంటాయని దిల్లీ కేంద్రంగా పనిచేసే బీబీసీ జర్నలిస్ట్ షాలూ యాదవ్ చెప్పారు. ఆమె విద్యార్థినిగా ఉన్నప్పుడు ఆదాయం కోసం మూడు కాల్ సెంటర్లలో పనిచేశారు. తాను కూడా అమెరికా యాక్సెంట్లో మాట్లాడాలని తాను పనిచేసిన కాల్ సెంటర్ యాజమాన్యం కోరుకుందని ఆమె చెప్పారు.

సనాస్ టూల్ వాడిన ఇద్దరితో షాలూ మాట్లాడారు. ఈ టూల్ మంచి ఆలోచన అని వారిద్దరూ ఆమెతో చెప్పారు. తమ యాక్సెంట్‌ను అర్థం చేసుకోలేని అమెరికన్‌లు తమను దూషించిన సందర్భాలున్నాయని వారు చెప్పారు.

వారిలో ఒకరు ... 'గ్రామర్, ప్రొనన్షియేషన్, స్లాంగ్ అన్నీ కరెక్టుగా ఉండేలా చూసుకోవడమే కష్టం. దానికి యాక్సెంట్ కూడా కలిస్తే మరింతగా ఒత్తిడి పెరుగుతుంది' అంటూ తమ ఇబ్బందులు చెప్పుకొచ్చారు.

అయితే, ఇప్పుడు కాల్ సెంటర్ రంగంలో అమెరికన్ యాక్సెంట్‌కి ప్రాధాన్యమివ్వడమనేది తగ్గిందని.. న్యూట్రల్ యాక్సెంట్ ఉంటే చాలనుకుంటున్నారని చెప్పారు.

యాక్సెంట్ ఒక అడ్డంకిగా ఉన్న ప్రతి చోటా కమ్యూనికేషన్ సులభం చేయడం ప్రధానంగా ఈ టెక్నాలజీ తీసుకొచ్చినట్లు సనాస్ చెబుతోంది.

కొరియా, అమెరికాలోఉన్న టీమ్‌లు.. నార్త్ ఇండియా, సౌత్ ఇండియాలో టీమ్‌ల మధ్య కమ్యూనికేషన్ సులభం చేసేలా కొన్ని సంస్థలు అంతర్గతంగా తమ టెక్నాలజీని పరీక్షిస్తున్నాయని శరత్ చెప్పారు.

వీడియో క్యాప్షన్, అల్గారిథమ్స్‌ అంటే ఏంటి? మనకు రోజూ ఎలా ఉపయోగపడుతున్నాయి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)