రివ్యూ: వినోదాల వేటలో విఫలమైన 'వాంటెడ్ పండుగాడ్'

ఫొటో సోర్స్, @UnitedKProdctns
అనుభవం చాలా గొప్పది. సినిమా పరిశ్రమకూ అక్కరకొచ్చేది అనుభవమే. ఏ సమయంలో ఎలాంటి సినిమా చేయాలి? ఎవరితో తీయాలి? అనే లెక్కలు అనుభవపూర్వకంగా తెలిసొస్తాయి.
ఈ విషయంలో కె.రాఘవేంద్రరావు దిట్ట. వంద సినిమాలు తీసిన ఘనత ఆయనది. కమర్షియల్ సినిమాకు కేరాఫ్ అడ్రస్ ఆయనే.
వాణిజ్య హంగులు మేళవించి జనరంజకమైన సినిమాని ఎలా అందించాలి? అనే విషయంలో ఆరితేరిపోయారు. ఆయన నేరుగా మెగాఫోన్ పట్టకపోయినా, దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కించిన 'పెళ్లి సందD' బాక్సాఫీసు దగ్గర మంచి లాభాల్ని చవి చూసింది. దాంతో.. దర్శకేంద్రుడు ఇంకా ట్రెండ్‌లోనే ఉన్నారన్న సంగతి అర్థమైంది.
ఇప్పుడు ఆయన నిర్మాణ సారథ్యంలో రూపొందించిన 'వాంటెడ్ పండుగాడ్' వచ్చింది. చిత్రసీమలోని ప్రముఖ హాస్య నటుల్ని అందరినీ ఒకే చోట చేర్చిన సినిమా ఇది. కె.రాఘవేంద్రరావు పేరు పోస్టర్‌పై ఉండడంతో ఫోకస్ ఏర్పడింది. మరి ఈ సినిమా ఎలా ఉంది..? రాఘవైంద్ర రావు స్టైల్‌కి, ఆయన మేకింగ్‌కీ ఏమైనా మ్యాచ్ అయ్యిందా?
పాండు అలియాస్ పండు (సునీల్) చర్లపల్లి జైలు నుంచి తప్పించుకొని... హైదరాబాద్ శివార్లలోని అటవీ ప్రాంతంలో దాక్కుంటాడు. పండుని పట్టుకున్నవాళ్లకు కోటి రూపాయలు అంటూ.. ప్రభుత్వం నజనారా ప్రకటిస్తుంది. దాంతో కొంతమంది పండుగాడ్ని పట్టుకొని, ఆ కోటి దక్కించుకోవడానికి అడవిలోకి ఎంటర్ అవుతారు.
వాళ్లలో ఒకొక్కరిదీ ఒక్కో కథ. పండుగాడిని పట్టుకోవడానికి వచ్చిందెవరు? వాళ్లకు కోటి రూపాయలతో అవసరం ఏమొచ్చింది? వీళ్లలో పండు ఎవరికి దొరికాడు? అనేది క్లుప్తంగా `వాంటెడ్ పండుగాడ్` కథ.
జనార్థన మహర్షి కథకుడిగా సుపరిచితుడు. వినోదాత్మక కథలు అందించడంలో ఆయన సుప్రసిద్ధుడు. ఆయన రాసిన కథ ఇది.
మాటల రచయితగా మంచి పంచ్ ఉన్న పెన్నుగా పేరు తెచ్చుకొన్న శ్రీధర్ సీపాన ఈ చిత్రానికి దర్శకుడు. కామెడీ తెరకెక్కించడంలో... రాఘవేంద్రరావు మార్క్ ఏమిటో అందరికీ తెలిసిందే. దానికి తోడు.. సునీల్ నుంచి సుధీర్ వరకూ మనకు తెలిసిన కామెడీ గ్యాంగ్ అంతా ఈ సినిమాలో ఉన్నారు. దాంతో.. థియేటర్లో ప్రేక్షకుల పొట్టచెక్కలు అవ్వడం ఖాయం అనుకొనే టికెట్ కొంటారు ఎవరైనా..! అయితే ఆ అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయాడు పండుగాడు.

ఫొటో సోర్స్, @UnitedKProdctns
తెర నిండా కామెడీ ఆర్టిస్టులు ఉంటే సరిపోదు. వాళ్లతో నవ్వించగలిగే సత్తా... స్క్రిప్టుకి ఉండాలి. అది లేకపోతే ఎవరూ ఏం చేయలేరు. మంచి టైమింగ్ ఉన్న నటుడు దొరికితే... పావలా సీను కూడా రూపాయిలా మెరిసిపోతుంది. కనీసం `పావలా` స్టామినా అయినా డైలాగుల్లోనో సన్నివేశంలోనో కనిపించాలి కదా. అది కూడా మిస్సయి.. మిస్‌ఫైర్ అయిన సినిమా ఇది.
పండుగాడుని ఇంటర్వ్యూ చేసి ప్రమోషన్ కొట్టేద్దామనుకొనే టీవీ ఛానల్ రిపోర్టరు (సుధీర్), పండుగాడుని పట్టుకొని, ఆ వచ్చిన డబ్బుల్ని మామకి ఇచ్చి, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొందానుకొనే అఖిలూ (వెన్నెల కిశోర్), పండుగాడిని అరెస్ట్ చేసి, ఎస్.ఐ అయిపోవాలనుకొనే బీటు కానిస్టేబులూ (సప్తగిరి), గ్రాండ్ ఫాదర్ ఏజులో.. గాడ్ ఫాదర్ అవ్వాలనుకొని అడవికి వచ్చిన డానూ (పృథ్వీ) ఇలా చాలా పాత్రల్ని రాసుకొన్నాడు దర్శకుడు.
ఆ పాత్రల నిండా పేరున్న ఆర్టిస్టుల్ని పేర్చుకుంటూ పోయాడు. కాకపోతే... వాళ్ల నుంచి నవ్వుల్ని రాబట్టుకోవడంలో విఫలం అయ్యాడు.
కథంతా అడవిలో సాగుతుంది. కాబట్టి లొకేషన్ల సమస్య లేదు. ఎక్కడ ఫ్రేమ్ పెట్టినా.. అడవే కనిపిస్తుంది. డేట్లు అందుబాటులో ఉన్న కమెడియన్లను తీసుకొచ్చి.. అడవి మధ్యలో నిలబెట్టి, `మీకు తోచిందేదో మాట్లాడుకోండి.. మేం షూట్ చేస్తాం` అనేసి కెమెరా ఆన్ చేశారమో అనిపిస్తుంది.
సరిగ్గా చదివితే స్క్రిప్టు దశలోనే పక్కన పెట్టేయాల్సిన కథ ఇది. దాన్ని వెండి తెరపై తీసుకొచ్చారంటే రాఘవేంద్రరావు అనుభవం అంతా ఏమైపోయిందా? అనే డౌటు కొడుతుంది. కొన్ని సీన్లు పేరడీ. ఇంకొన్ని స్ఫూఫ్. మరికొన్ని పాత సినిమాల ఛాయల్ని గుర్తు చేసేవి ఇలా ఎక్కడా ఒరిజినాలిటీ కనిపించలేదు.
టీవీలో డిబేట్లు ఎలా జరుగుతున్నాయో చెప్పడానికి ఓ ట్రాక్ పెట్టారు. ఎన్నాళ్లు ఇలాంటి ట్రాకుల్నే చూస్తూ కూర్చుంటాడు ప్రేక్షకుడు..? ఇలాంటి జోకులు జబర్‌దస్త్ లాంటి కామెడీ షోలో ఎన్ని చూళ్లేదు. అవే నయం ఒకటో రెండో పంచ్‌లు పడ్డాయి. ఇక్కడ అది కూడా లేదు.

ఫొటో సోర్స్, @UnitedKProdctns
బ్రహ్మానందం లాంటి సీరియర్ మోస్ట్ కమెడియన్‌కీ ఓ ట్రాకు పెట్టారు. ఆయనో పెద్ద డాక్టరు. పేషెంటొచ్చి...ఆయన టేబుల్ పై పడుకుంటుంది. `గుండెల్లో నొప్పి డాక్టర్` అంటూ చేయి గుండెలపై పెట్టి చూపిస్తే`నేరుగా అక్కడే పెట్టి చూపిస్తే ఎలా..` అంటూ ఓ ముతక జోకు పేలుస్తాడాయన. ఈ సినిమా స్థాయి ఏ పాటిదో ఇలాంటి సన్నివేశాలు చూస్తే అర్థమైపోతుంది.
పండుగాడిని పట్టుకోవడానికి అంతా ఒక్కో దారిలో బయల్దేరడం, ఒకొక్కరూ మరొకరికి ఎదురు పడడం, ఒకర్నొకరు మోసం చేసుకోవడం.. సినిమా అంతా ఇదే తంతు. తరవాత ఏం జరుగుతుంది? అనే ఆసక్తి గానీ, జరుగుతున్న విషయాన్ని ఆస్వాదించడం కానీ... సినిమా మొత్తం ఎక్కడా కనిపించదు.
వీళ్ల మధ్య మణిముత్యం (తనికెళ్ల భరణి) అంటూ మరో దర్శకుడి పాత్ర. తన ముసలి భార్య (ఆమని)ని హీరోయిన్ చేసి, ఓ సినిమా తీద్దామని ఆయనా అడవిలోకి వస్తాడు. ఆడవాళ్ల మేకప్పులపై.. సినిమా దర్శకులపై సెటైర్లు వేసుకోవడం తప్ప.. ఈ ట్రాకులోనూ విషయం ఉండదు.
పుష్ప, భీమ్లా నాయక్‌ల డైలాగులకు పేరడీలు, రాఘవేంద్రరావు పాత సినిమా పాటల ట్రాకులు మళ్లీ మళ్లీ వినిపించడాలూ... వాటి కోసమే ఈ సినిమా తీసిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమాల్లో లాజిక్కులు వెదక్కూడదంటారు. కామెడీ సినిమాల్లో అస్సలు కూడదు. లాజిక్ లెస్ గా సినిమా తీయడంలో ఇబ్బందేం లేదు. కానీ మీనింగ్ లెస్ గా మాత్రం సినిమాలు చేస్తే.. థియేటర్లో కూర్చున్న ప్రేక్షకులూ, తీసిన నిర్మాతలూ ఇబ్బంది పడడం ఖాయం.
ఈ సినిమాలో లాజిక్కుల మాట పక్కన పెడితే కనీసం కొన్ని సన్నివేశాల్లో కంటిన్యుటీ కూడా కనిపించదు. సన్నివేశాల్ని పేర్చుకుంటూ పోవడం తప్ప వాటికంటూ ఓ కథ ఉండదు. కొన్ని సన్నివేశాల్లో ఆర్టిస్టుల కాంబినేషన్ సీన్లు తీయాల్సిన చోట ఓ ఆర్టిస్టు లేకపోతే వాళ్ల డూపులతో లాగించేసినట్టు స్పష్టంగా కనిపిస్తోంది.
సునీల్, సుధీర్, తనికెళ్ల భరణి, పృథ్వీ, వెన్నెల కిశోర్, సప్తగిరి, శ్రీనివాసరెడ్డి... ఇలా పేరు మోసిన హాస్య నటులంతా ఈ సినిమాలో ఉన్నారు. వాళ్లు ఇది వరకు చాలా సినిమాల్లో ప్రేక్షకుల్ని విరగబడి నవ్వించారు. కానీ ఈ సినిమా మాత్రం మినహాయింపు ఇవ్వాలి. ఎందుకంటే వాళ్లెంత నవ్వించడానికి ప్రయత్నించినా ప్రేక్షకులకు నవ్వు రాదు. ఎందుకంటే.. రాసిన విధానంలోనే కామెడీ ఎక్కడా కనిపించదు.

ఫొటో సోర్స్, @UnitedKProdctns
సినిమాలో దాదాపుగా అందరివీ అతిథి పాత్రల్లాంటివే. సునీల్ సినిమా ప్రారంభంలో ఓసారి, ఇంటర్వెల్ లో మరోసారి, క్లైమాక్స్ లో ఓసారి కనిపిస్తాడంతే. మిగిలివాళ్లవి రెండు మూడు రోజుల కాల్షీట్లలో పూర్తి చేసి ఉంటారు. అనసూయకీ ఓ పాత్ర ఇచ్చారు. ఆమె ఓ పాటలోనూ డాన్స్ చేశారు. ఆమెతో పాటు మరో నలుగురు హీరోయిన్లు ఉన్నారు. వాళ్లంతా రెండు పాటలకు, ఫోన్లో మాట్లాడుకోవడానికే పరిమితం.
'అబ్బబ్బ.' పాట రాఘవేంద్రరావు స్టైల్ లో సాగింది. వినడానికీ బాగుంది. క్లైమాక్స్ లో వచ్చిన పాట చాలా సిల్లీగా అనిపిస్తుంది. నిర్మాణ పరంగా చూస్తే టీవీ సీరియల్సే చాలా క్వాలిటీ మేకింగ్ తో వస్తున్నాయనిపిస్తుంది. బిట్లు బిట్లుగా ఒకట్రెండు చోట్ల నవ్వుకోవడం, ఇంతమంది కమెడియన్లని ఒకే సినిమాలో చూశామన్న ఫీలింగ్ మినహాయిస్తే ఈ పండుగాడు ఏ విషయంలోనూ మెప్పించలేకపోయాడు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: ప్రభుత్వ వెబ్సైట్లను రెండు, మూడేళ్లుగా అప్డేట్ చేయడం లేదు, ఎందుకు?
- ఇండియా@75: స్వతంత్ర భారతదేశం సాధించిన అతి పెద్ద విజయం ఏమిటి? అతిపెద్ద సమస్య ఏమిటి? - ఎడిటర్స్ కామెంట్
- పీరియడ్ రోజుల చార్టులను ఈ అమ్మాయిలు ఇంటి తలుపులపై ఎందుకు పెడుతున్నారు?
- ఒక సామాన్య మధ్యతరగతి ఇల్లాలిపై ధరల పెరుగుదల ప్రభావం ఎలా ఉంటుంది?
- వాజ్‌పేయి మాటల్ని నెహ్రూ ఎందుకంత శ్రద్ధగా వినేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













