నాజీల క్యాంప్ గార్డుగా పని చేసి, వేల హత్యలకు బాధ్యుడైన 101 ఏళ్ళ వృద్ధుడికి అయిదేళ్ళ జైలు శిక్ష

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పాల్ కిర్బీ
- హోదా, బీబీసీ న్యూస్
అత్యంత వృద్ధుడైన నాజీ నేరస్థుడు జర్మనీ కోర్టులో విచారణను ఎదుర్కొన్నారు. ఆయన పేరు జోసెఫ్ ఎస్ అని గుర్తించారు. నాజీ కాన్సంట్రేషన్ క్యాంప్‌కు గార్డుగా పని చేసిన ఈ వ్యక్తి బెర్లిన్ సమీపంలోని శాసెన్‌హాసేన్ వద్ద 3,518 మంది ఖైదీల హత్యకు కారకుడని కోర్టు తేల్చి చెప్పింది.
సోవియట్ యుద్ధ ఖైదీలతో పాటు ఇంకా ఎంతో మందిని జైక్లోన్-బి గ్యాస్‌తో హతమార్చడంలో ఆయన ప్రమేయం ఉందని తేలడంతో కోర్టు ఆయనకు అయిదేళ్ళ జైలు శిక్ష విధించింది.
జోసెఫ్‌ను ఈ కేసు నుంచి విముక్తం చేయాలని ఆయన తరఫు లాయర్ వాదించారు. ఇప్పుడు ఆయన తన క్లయింటుకు పడిన శిక్షను పైకోర్టులో సవాలు చేయబోతున్నారు.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో శాసెన్‌హాసెన్ వద్ద జరిగిన మారణకాండలో వేలాది మంది చనిపోయారు. కొందరు ఆకలితో చనిపోతే, మరికొందరు వెట్టి చాకిరీకి బలయ్యారు. ప్రమాదకరమైన వైద్య పరీక్షలకు మరికొందరు బలయ్యారు. వేల మంది హత్యకు గురయ్యారు. అక్కడి జైలులో 2 లక్షలకు పైగా మందిని నిర్బంధించారు. యూదులు, రోమాలు, సింటీ (జిప్సీ)లతో పాటు రాజకీయ ఖైదీలు కూడా అందులో ఉన్నారు.
''నేను ఈ బోనులో ఎందుకు కూర్చున్నానో నాకు తెలియదు. నిజంగా నాకు దానితో ఎలాంటి సంబంధం లేదు'' అని బ్రాండెన్‌బర్గ్ ఆన్ డెర్ హావెల్‌లో తీర్పు సందర్భంగా జోసెఫ్ ఎస్ అన్నారు.
1942 నుంచి దాదాపు మూడేళ్ల పాటు నాజీ కాన్సంట్రేషన్ క్యాంప్‌లో ఆయన పనిచేసినట్లు కోర్టు నిర్ధారించిందని జడ్జి యుడో లెచ్‌టెర్‌మన్ అన్నారు.
''మీరు ఇష్టపూర్వకంగానే ఆ సామూహిక మారణకాండకు మద్దతు ఇచ్చారు'' అని జోసెఫ్‌ను ఉద్దేశించి యుడో వ్యాఖ్యానించారు.
2011లో నాజీ క్యాంపు గార్డులను విచారించడం సాధ్యమైంది. ఆ సమయంలో మాజీ ఎస్ఎస్ గార్డ్ జాన్ డెమ్‌జన్‌జుక్‌ను దోషిగా నిర్ధారించారు. ఈ తీర్పు, ఆనాటి మారణకాండతో సంబంధం ఉండి ఇంకా సజీవంగా ఉన్న వ్యక్తులను అన్వేషించేలా చేసింది.
నాలుగేళ్ల తర్వాత ''బుక్ కీపర్ ఆఫ్ ఆష్విజ్''గా పేరున్న ఆస్కార్ గ్రోనింగ్‌కు జైలు శిక్ష విధించారు.
కాన్సంట్రేషన్ క్యాంప్‌కు కార్యదర్శిగా పనిచేసిన 97 ఏళ్ల వ్యక్తి కూడా ప్రస్తుతం ఉత్తర జర్మనీలో విచారణను ఎదుర్కొంటున్నారు.
ఎస్‌ఎస్ గార్డ్ పత్రాల్లో జోసెఫ్ పేరు, వివరాలు ఉన్నప్పటికీ, తానెప్పుడూ క్యాంపులో పనిచేయలేదని పొలంలో ఒక లేబర్‌గా పనిచేశానని జోసెఫ్ చెప్పారు.
అయితే, జోసెఫ్ ఈ శిక్షను అనుభవించే అవకాశం లేదు. ఎందుకంటే ముందుగా ఆయన అప్పీల్‌ను అనుమతించాలా వద్దా అనే అంశంపై జర్మనీ అత్యున్నత న్యాయస్థానం తీర్పును ఇవ్వాల్సి ఉంటుంది. ఇది జరగడానికి చాలా నెలల సమయం పడుతుంది.
ఇవి కూడా చదవండి:
- అమెరికా-టెక్సస్: రోడ్డు పక్కన వదిలేసిన ట్రక్కులో 46 మృతదేహాలు... గాలీ, నీరూ లేక ఉక్కిరిబిక్కిరై చనిపోయారు
- చెస్ ఒలింపియాడ్ 2022: తమిళనాడులో రష్యా-యుక్రెయిన్ పోరు
- సెక్స్ అంటే అరబ్ కుర్రాళ్ళు ఎందుకు భయపడుతున్నారు, వయాగ్రాకు అక్కడ ఎందుకంత డిమాండ్?
- Instagram: మీ సెల్ఫీ వీడియో చూసి వయసెంతో గుర్తు పట్టేస్తుంది.
- యుక్రెయిన్‌లో దొంగిలిస్తున్న ఆహార ధాన్యాలను రష్యా ఎక్కడికి తీసుకెళ్తోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










