వేలమంది మహిళలకు గర్భ నిరోధక సాధనాలను అమర్చారు, అయితే వాళ్లకు తెలియకుండా...

- రచయిత, ఇలయిన్ జంగ్
- హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్
గ్రీన్‌లాండ్‌లో వేల మంది మహిళలకు వారికి తెలియకుండానే గర్భనిరోధక పరికరాలను అమర్చారు. గ్రీన్‌లాండ్ మూలవాసుల జనాభాను కట్టడిచేసేందుకు 1960, 70లలో డెన్మార్క్ తీసుకొచ్చిన కుటుంబ నియంత్రణ విధానాల్లో భాగంగా వీరికి ఆపరేషన్లు చేశారు. ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ బాధిత మహిళల్లో 12 ఏళ్ల పిల్లలు కూడా ఉన్నారు.
‘‘కాయిల్ క్యాంపెయిన్’’గా పిలుస్తున్న ఈ ఆపరేషన్ విధానంపై స్వతంత్ర దర్యాప్తు చేపడుతున్నట్లు డెన్మార్క్ ప్రభుత్వం ప్రకటించింది.
ఇటీవల కూడా ఇలా తమకు తెలియకుండానే ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను చేశారని చెబుతున్న బాధిత మహిళలతో బీబీసీ మాట్లాడింది.

బేబియానేకు 21 ఏళ్ల వయసున్నప్పుడు ఆమె తన గర్భాశయంలో ‘‘గర్భనిరోధక కాయిల్’’ను ఏర్పాటుచేసుకోవాలని హాస్పిటల్‌కు వెళ్లారు. అయితే, తన గర్భాశయంలో ఇప్పటికే ఒక కాయిల్ అమర్చిన విషయాన్ని అప్పుడే ఆమె తెలుసుకున్నారు.
‘‘ఆ రోజు నా కళ్ల నుంచి నీరు కారాయి. అసలు నా గర్భాశయంలోకి ఆ కాయిల్ ఎలా వచ్చిందో నాకు తెలియదు. అసలు ఇది ఎలా సాధ్యం’’అని ఆమె అన్నారు.
2000 మొదట్లో తనకు 16 ఏళ్ల వయసున్నప్పుడు అబార్షన్ చేయించుకునేందుకు ఆమె ఆసుపత్రికి వెళ్లారు. బహుశా అప్పుడే తన కడుపులో ఆ కాయిల్ పెట్టి ఉండొచ్చని ఆమె భావిస్తున్నారు.
ఆ తర్వాత నాలుగేళ్లలో తనకు విపరీతమైన కడపు నొప్పి వచ్చింది. ఒక్కోసారి ఈ కడుపు నొప్పి వల్ల ఆమె మెట్లు కూడా ఎక్కలేకపోయేవారు.
‘‘నేను చాలాసార్లు ఆసుపత్రికి వెళ్లాను. కానీ, అసలు ఏం జరుగుతోందో అక్కడి వైద్యులు చెప్పేవారు కాదు. పీరియడ్స్ సమయంలో ఈ నొప్పి మరింత ఎక్కువగా ఉండేది. పీరియడ్స్ లేనప్పుడు కూడా నొప్పి విపరీతంగా వచ్చేది’’అని ఆమె చెప్పారు.
ఒక సమయంలో ఆమె గర్భం దాల్చేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ, ఏడాది గడిచినా ఆమెకు గర్భం రాలేదు.
‘‘పీరియడ్స్ వచ్చిన ప్రతిసారీ నేను నొప్పితో ఏడ్చేదాన్ని’’అని ఆమె వివరించారు.

పిల్లలు పుట్టే అవకాశం పెరగాలంటే కొంత కాలంపాటు కడుపులో కాయిల్ అమర్చుకోవాలని ఆమెకు స్నేహితులు సూచించారు. దీంతో ఆమె పిల్లలు కోసం చేసే ప్రయత్నాలకు కాస్త విరామం ఇవ్వాలని భావించారు.
అయితే, కాయిల్ అమర్చుకునేందుకు ఆసుపత్రికి వెళ్లినప్పుడే ఆమెకు అసలు విషయం తెలిసింది.
వెంటనే కడుపులోని ఆ కాయిల్‌ను ఆపరేషన్‌తో ఆమె తీయించేశారు. ఆ తర్వాత కొన్ని నెలలకే ఆమె గర్భం వచ్చింది.
ఇలాంటి అనుభవమే మీరా(పేరు మార్చాం)కు తాజాగా ఎదురైంది. 2019లో వైద్య పరీక్షలు చేయించుకుంటున్నప్పుడే ఆమె కడుపులో కాయిల్ ఉందని వైద్యులు చెప్పారు.
‘‘ఒక్కసారి నేను షాక్‌కు గురయ్యాను’’అని ఆమె చెప్పారు.
2018లో ఆమెకు గర్భాశయ శస్త్రచికిత్స నిర్వహించారు. బహుశా అప్పుడే ఆ కాయిల్‌ను తన గర్భాశయంలో అమర్చి ఉండొచ్చని ఆమె చెప్పారు.
ఆ ఆపరేషన్ తర్వాత ఏడాదిపాటు ఆమెకు విపరీతమైన నొప్పి వచ్చేది. ఇలా జరగడం సాధారణమేనని డాక్టర్ ఆమెకు చెప్పేవారు. అయితే, వైద్య పరీక్షల్లో తన గర్భాశయంలో కాయిల్ ఉన్నట్లు ఆమె తెలుసుకున్నారు.
ఇప్పుడు మీరా వయసు 45 ఏళ్లు. ఆ కాయిల్ వల్ల ఆమె గర్భాశయానికి గాయమైనట్లు వైద్యులు ఆమెకు చెప్పారు.
కాయిల్ వల్ల తన గర్భాశయానికి తీవ్ర గాయాలు కావడంతో.. పూర్తిగా గర్భాశయాన్నే ఆమె తీయించేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
కానీ, ఆ ఆపరేషన్ విజయవంతం కాలేదు. మరోవైపు సెక్స్ చేయడం కూడా ఆమె తగ్గించేశారు. సెక్స్ చేస్తున్న ప్రతీసారీ ఆమెకు విపరీతమైన నొప్పి వచ్చేది. రక్తస్రావం కూడా అయ్యేది.

కాయిల్ ఒక్కటే కాదు...
గ్రీన్‌లాండ్ మహిళల్లో తమకు తెలియకుండానే జనాభాను కట్టడి చేసేందుకు ఇలాంటి చాలా గర్భనిరోధక సాధనాలను అమర్చారు.
2011లో అబార్షన్ తర్వాత కళ్లు తెరచి చూసినప్పుడు తన చేతిలో ఏదో అమర్చినట్లు అన్నిటా (పేరు మార్చాం)కు అనిపించింది. పైగా అక్కడ ఆమెకు ఒక కట్టు కూడా కట్టి ఉంది. ఏం జరిగిందని ఆమె అక్కడున్న డెన్మార్క్ వైద్యుడిని అడిగారు. అప్పుడే అది ఒక గర్భ నిరోధక సాధనం అని ఆమెకు ఆ వైద్యుడు వెల్లడించారు. అది చాలా చిన్న ప్లాస్టిక్ రాడ్ అని, చర్మం కింద దాన్ని సురక్షితంగా అమర్చామని తెలిపారు.
ఇది తనకు నాలుగో గర్భస్రావం కాబట్టి, ఆ ప్లాస్టిక్ రాడ్ అమర్చాల్సి వచ్చిందని ఆమెకు వైద్యుడు తెలిపారు.
‘‘అది చాలా దారుణం. ఆయన అన్ని హద్దులనూ దాటినట్లుగా అనిపించింది. నా హక్కులను ఆయన పూర్తిగా ఉల్లంఘించారు’’అని 31 ఏళ్ల అన్నిటా వివరించారు.
‘‘దాన్ని వెంటనే తొలగించాలని నేను డిమాండ్ చేశాను. కానీ, దానికి ఆయన వద్దు అన్నారు. వెంటనే నేను కట్టు తీసేశాను. లోపలున్న ఆ ప్లాస్టిక్ రాడ్‌ను కూడా తీసేస్తానని బెదిరించాను. వెంటనే నేనే తీస్తానని ఆయన అన్నారు’’అని ఆమె చెప్పారు.
28 ఏళ్ల సారాకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆపరేషన్ తర్వాత కళ్లు తెరచి చూసినప్పుడు షాక్‌కు గురయ్యే విషయం ఆమెకు తెలిసింది.
2014లో గర్భస్రావం తర్వాత ఆమెకు మత్తుమందు ఇచ్చారు. అప్పుడే ఆమెకు గర్భ నిరోధక సాధనాల్లో ఒకటైన డెపో ప్రొవెరాను ఒక డెన్మార్క్ నర్సు ఆమెకు సూదిమందు రూపంలో ఇచ్చారు.
‘‘అదేమిటో అసలు నాకు తెలియలేదు. నీకు దాన్ని ఎక్కస్తున్నామని నర్సు కనీసం నన్ను అడగలేదు’’అని ఆమె బీబీసీకి చెప్పారు. ఆ తర్వాత ప్రతి మూడు నెలలకు ఒకసారి దీన్ని ఎక్కించుకోవడానికి ఆసుపత్రికి రావాలని నర్సు ఆమెకు సూచించారు.
కనీసం ఆ ఔషధం పేరేమిటో కూడా తనకు వెల్లడించలేదని ఆమె చెప్పారు. ఒకసారి రసీదులో ఆ ఔషధం పేరును చూసి ఆమె ఆన్‌లైన్‌లో వెతికారు. అప్పుడే దాని గురించి ఆమెకు తెలిసింది.
అయితే, ఆ తర్వాత కొన్ని సంవత్సరాలపాటు ఆ ఔషధాన్ని ఆమె తీసుకున్నారు. ఆ తర్వాత పిల్లలను కనాలని ఆమె నిర్ణయం తీసుకున్నారు. కానీ, గర్భం రావడానికి ఆమె ఏళ్ల సమయం పట్టింది.
‘‘డెపో ప్రొవేరాతో దాదాపు 12 నెలల వరకు రుతుచక్రం ప్రభావితం అవుతుందని నర్సు లేదా వైద్యులు నాకు చెప్పలేదు’’అని ఆమె చెప్పారు.
సెప్టెంబరులో ఇలాంటి కేసులపై విచారణ చేపట్టాలని డెన్మార్క్, గ్రీన్‌లాండ్ అంగీకరించాయి. 1991 వరకు గ్రీన్‌లాండ్ ఆరోగ్య విభాగం డెన్మార్క్ నియంత్రణలో ఉండేది. ఆ సమయంలో ఏం జరిగింది అనే అంశంపై ఆ దర్యాప్తు చేపట్టాలని ఆదేశాలు జారీచేశారు.
అయితే, మేం మాట్లాడిన మహిళల్లో చాలా మంది తాజాగానే తమకు ఇలాంటి గర్భ నిరోధక సాధనాలు అమర్చారని చెబుతున్నారు.
‘‘ఆ దర్యాప్తు కేవలం 1991 ముందు పరిణామాలతో ఆగిపోకూడదు. ఎందుకంటే ఇలాంటి కేసులు ప్రస్తుతం కూడా వెలుగు చూస్తున్నాయి’’అని బేబియానే చెప్పారు.
ఇలా తమకు తెలియకుండానే ఆపరేషన్లు జరిగిన మరికొంత మంది మహిళలు కూడా తనకు తెలుసని మీరా వివరించారు.
ఈ అంశంపై గ్రీన్‌లాండ్ ఆరోగ్య మంత్రి మీమీ కార్ల్‌సెన్‌తో బీబీసీ మాట్లాడింది. తమకు తెలియకుండానే ఇలా గర్భ నిరోధక సాధనాలు అమర్చిన తాజా కేసుల గురించి తనకు తెలియదని ఆమె చెప్పారు.
‘‘ఎవరైనా వైద్యులు వ్యక్తిగతంగా ఇలాంటి ఆపరేషన్లు చేస్తున్నారేమో.. అవి అనైతికం. వీటిని కట్టడి చేసేందుకు మేం చర్యలు తీసుకుంటాం’’అని ఆమె చెప్పారు.
బీబీసీ పరిశోధనలో వెలుగుచూసిన అంశాలను జాతీయ ఆరోగ్య బోర్డు, చీఫ్ మెడికల్ ఆఫీసర్‌లకు పంపిస్తానని ఆమె అన్నారు. ఇలాంటి కేసులు మొత్తం ఎన్ని ఉన్నాయో దర్యాప్తు చేపట్టాలని ఆదేశాలు ఇస్తామన్నారు.
1975లో డెన్మార్క్ కాయిల్ కాంపెయిన్‌కు బాధితులుగా మారిన మహిళల్లో నాజా లిబెత్ కూడా ఒకరు. ఆమెకు తెలియకుండానే ఆమె గర్భాశయంలో ఆ కాయిల్‌ను అమర్చారు.
‘‘అప్పటికి నా వయసు 13 ఏళ్లు. ఆపరేషన్ తర్వాత నా కడుపులో కత్తితో పొడిచినట్లు అనిపించింది’’అని ఆమె చెప్పారు.
‘‘ఆ నొప్పిని ఎప్పటికీ నేను మర్చిపోలేను. ఏళ్లపాటు నేను ఆ నొప్పిని భరించాను’’అని ఆమె చెప్పారు.
‘‘లిప్పీస్ లూప్’’గా పిలిచే ఐయూడీని అప్పట్లో ఎక్కువగా మహిళలకు అమర్చేవారు. సాధారణంగా అప్పటికే పిల్లలు పుట్టిన మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లలో భాగంగా ఆ సాధనాన్ని అమర్చేవారు. కానీ, గ్రీన్‌లాండ్‌లో 12 ఏళ్ల బాలికలకు కూడా దాన్ని అమర్చారు.
‘‘ఒక చిన్న గర్భద్వారంలో ఆ సాధనాన్ని అమర్చినప్పుడు వచ్చే నొప్పి ఎంత ఉంటుందో అసలు చెప్పలేం’’అని గైనకాలజిస్టు అవియేజా సీగ్స్‌టాడ్ చెప్పారు.
‘‘లిప్పీస్ లూప్’’ను బాలికలకు అమర్చేటప్పుడు చాలా దుష్ప్రభావాలు ఉంటాయి. విపరీతమైన బ్లీడింగ్, ఇన్ఫెక్షన్లు, తీవ్రమైన నొప్పి, పిల్లలు పుట్టకపోవడం లాంటి సమస్యలు ఎదురవుతాయి.
1990 మధ్యలో పిల్లలు పుట్టడంలేదని తమ దగ్గరకు వచ్చిన మహిళల్లో తాము లిప్పీస్ లూప్ అమర్చినట్లు గుర్తించామని అవియేజా వివరించారు.
‘‘అలాంటివి గర్భాశయంలో ఉన్నట్లు వారికి తెలియదు. పది నుంచి 15 ఏళ్లపాటు పిల్లల కోసం ప్రయత్నించిన తర్వాత వారు మా దగ్గరకు వచ్చేవారు’’అని ఆమె చెప్పారు.
నాజా ట్రామా థెరపిస్టుగా పనిచేస్తున్నారు. ఇలాంటి కాయిల్స్ ఏర్పాటుచేయడం వల్ల కొందరు తీవ్ర మానసిక వేదనకు గురవుతారని ఆమె చెప్పారు.
‘‘అలా వేదనను అనుభవించిన వారిలో నేనూ ఒకరిని’’అని ఆమె అన్నారు.
‘‘ఆ విషయాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టం. మనం దాన్ని మర్చిపోవాలి’’అని ఆమె వివరించారు.
బీబీసీ ప్రతీ ఏడాది ప్రపంచంలోని 100 మంది స్ఫూర్తిమంతమైన, ప్రభావశీలురైన మహిళల పేర్లతో ‘బీబీసీ 100 విమెన్’ జాబితాను ప్రకటిస్తుంది. ఆ జాబితాలో నాజా కూడా ఉన్నారు.
ఫేస్‌బుక్ ద్వారా తనలాంటి మరికొంత మందిని ఆమె కలిశారు. వారి అనుభవాలను ఆమె తెలుసుకున్నారు. ఇలా దాదాపు 200 మందితో ఆమె మాట్లాడారు.
ప్రస్తుతం మహిళా హక్కుల కోసం ఆమె పోరాడుతున్నారు.
ఈ ఏడాది మొదట్లో ఈ గర్భనిరోధక సాధనాల కేసులపై ఒక డెన్మార్క్ వార్తా సంస్థ పాడ్‌కాస్ట్‌ను విడుదల చేసింది. అప్పుడే 1991 ముందునాటి పరిణామాలపై దర్యాప్తు చేపట్టాలని డెన్మార్క్ నిర్ణయించింది.
కాయిల్ క్యాంపెయిన్ పేరుతో ఆ పాడ్‌కాస్ట్‌ను ప్రచురించారు. 1966 నుంచి 1970ల మధ్య దాదాపు 4,500 మంది గ్రీన్‌లాండ్ మహిళలకు లిప్పీస్ లూప్ సాధనాలన అమర్చినట్లు దానిలో చెప్పారు. ఆ సమయంలో గ్రీన్‌లాండ్‌లో గర్భం దాల్చే వయసులో ఉన్న మొత్తం మహిళల సంఖ్య 9,000 మాత్రమే.
గ్రీన్‌లాండ్‌లో జనాభా నియంత్రణకు కళ్లెం వేయాలని, ఆరోగ్య సేవలను ఆధునికీకరించాలని 1950ల నుంచి డెన్మార్క్ ప్రణాళికలు రచించేది. టీనేజీలోని అమ్మాయిలు ఎక్కువగా గర్భం దాల్చడంపై డెన్మార్క్ అధికారులు అప్రమత్తంగా ఉండేవారు.
1970ల్లో జనాభా నియంత్రణకు తాము అనుసరిస్తున్న వ్యూహాలు ఫలించాయని డెన్మార్క్ అధికారులు చెప్పేవారు. మరోవైపు సంతానోత్పత్తి రేటు కూడా ఒక్కసారిగా పడిపోయింది. ఆ క్యాంపెయిన్ మొదలయిన ఎనిమిదేళ్ల తర్వాత అంటే 1974లో సంతానోత్పత్తి రేటు 7 నుంచి 2.3కు పడిపోయింది.
అసలు ఆ ప్రచారాన్ని ఎప్పుడు నిలిపివేశారో తన దగ్గర రికార్డులేమీ తమ దగ్గర లేవని డెన్మార్క్ తాత్కాలిక ఆరోగ్య మంత్రి మాగ్నస్ హ్యూనిక్ ఇటీవల చెప్పారు.
‘‘బహుశా ఆ తర్వాత దశాబ్దాల పాటు కూడా ఆ విధానాలను కొనసాస్తూ ఉండొచ్చని నాకు ఆందోళనగా అనిపిస్తోంది’’అని ఆయన బీబీసీతో చెప్పారు.
ఏళ్లపాటు నొప్పిని భరించిన తర్వాత 17 ఏళ్ల వయసులో నాజా ఆ గర్భనిరోధక సాధనాన్ని ఆపరేషన్ ద్వారా తీయించేసుకున్నారు.
ఇలా నొప్పి రావడంతో తన స్నేహితురాలు వోల్గా కూడా చాలాసార్లు హాస్పిటల్‌కు వెళ్లారని, అయితే, ఆ నొప్పి సాధారణమేనని వైద్యులు చెప్పేవారని నాజా వివరించారు.
అసలు ఆమెలో కాయిల్‌ను ఎప్పుడు గుర్తించారో సరిగ్గా తెలియదని, మొత్తానికి తనకు కూడా ఆ కాయిల్ తీసేశారని, కానీ, ఆమెకు ఆ తర్వాత కూడా పిల్లలు పుట్టలేదని నాజా చెప్పారు.
మొత్తానికి 2018లో తన గర్భసంచిని వోల్గా తీయించుకోవాల్సి వచ్చింది. కాయిల్ వల్ల తలెత్తిన సమస్యలే దీనికి కారణం.

మేం చూసిన కేసుల్లో అన్నింటికంటే ఆందోళ రేపేది సునానే కీల్సెన్ కేసు. ప్రస్తుతం ఆమె వయసు 75 ఏళ్లు.
రెండోసారి ఐదు నెలల గర్భంతో ఉన్నప్పుడు ఆమె పరీక్షల కోసం వైద్యుల దగ్గరకు వెళ్లారు. అయితే, కడుపులో బిడ్డకు సమస్యలు ఉన్నాయని, అబార్షన్ చేయాల్సి ఉంటుందని ఆమెకు ఓ వైద్యుడు సూచించారు.
సమస్యలు ఏమీలేవని వేరే పరీక్షల్లో తేలిందని, తను కూడా ఆరోగ్యంగా ఉన్నానని ఆమె ఆ వైద్యుడికి చెప్పారు.
అయినప్పటికీ ఆమెకు అబార్షన్ చేయడానికి ఇంజక్షన్‌లు ఇచ్చారు. దాదాపు 31 ఇంజక్షన్లు ఆమెకు ఇచ్చారు. అయితే కడుపులోని బిడ్డ మరణించలేదు. మొత్తంగా ఏడు నెలలకు ఆమె ప్రసూతి నొప్పులు మొదలయ్యాయి. పుట్టిన గంటలోనే ఆ బిడ్డ చనిపోయింది. అయితే, ఆ తర్వాత కొన్ని గంటలకే తన గర్భాశయంలో కాయిల్ పెట్టేందుకు నాలుగుసార్లు వైద్యులు ప్రయత్నించారు. మొత్తానికి ఆమె ఆ ఆపరేషన్‌ను అడ్డుకున్నారు.
చనిపోయిన బిడ్డ ఇంట్లో ఏడుస్తున్నట్లుగా ఆమెకు అనిపించేది.
‘‘ఆ బాధ నన్ను వెంటాడేది’’అని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.
ఇప్పటికైనా డెన్మార్క్ అధికారులు తనకు క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.
(ఫోటోలు, గ్రాఫిక్స్ కోసం ఇలైన్ జంగ్ సాయం అందించారు.)

బీబీసీ ప్రతీ ఏడాది ప్రపంచంలోని 100 మంది స్ఫూర్తిమంతమైన, ప్రభావశీలురైన మహిళల పేర్లతో ‘బీబీసీ 100 విమెన్’ జాబితాను ప్రకటించింది. ఆ సిరీస్‌లో భాగంగా ఈ కథనాన్ని అందిస్తున్నాం.
ఇవి కూడా చదవండి:
- భాగల్పూర్ మర్డర్ :‘‘మా అమ్మను గొడ్డలితో జంతువులకన్నా దారుణంగా నరికి చంపాడు’’
- చైనా: జీరో కోవిడ్ పాలసీకి సడలింపులు.. ఇక ‘కోవిడ్‌తో సహజీవనం’
- అఫ్గానిస్తాన్: అధికారంలోకి వచ్చాక తొలిసారి బహిరంగ మరణ శిక్ష అమలు చేసిన తాలిబాన్లు
- ఈ బీచ్‌లకు భార్యతోనే వెళ్లాలట.. లేదంటే ఏడాది జైలు
- గర్భం వచ్చిందని ఉద్యోగం నుంచి తీసేశారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


















