చైనా: 'షీ జిన్‌పింగ్ దిగిపో' అంటూ తొలిసారిగా నిరసన బాట పట్టిన చైనా నవతరం... ఆ దేశంలో అసలేం జరుగుతోంది?

చైనా నిరసనలు

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, ఫ్రాన్సిస్ మావో
    • హోదా, బీబీసీ న్యూస్

చైనాలో గత వారంలో ఒక కొత్త తరం ఆవిర్భవించింది. చాలా మంది తమ జీవితంలో తొలిసారిగా బహిరంగ నిరసనల్లో పాల్గొంటున్నారు.

దాదాపు మూడేళ్లుగా అమలులో ఉన్న జీరో-కోవిడ్ విధానం నుంచి తమకు విముక్తి కావాలని వారు వీధుల్లోకి చేరి డిమాండ్ చేస్తున్నారు.

షాంఘై నిరసనలు మొదట అలజడి లేకుండానే సాగాయి. షిన్‌జియాంగ్ ప్రాంతంలో ఒక అపార్ట్‌మెంట్‌ అగ్నిప్రమాదంలో చనిపోయిన మృతులకు నివాళులు అర్పించటానికి వారు గుమిగూడారు. కోవిడ్ ఆంక్షల వల్ల.. ఆ ప్రమాద బాధితులు మంటల నుంచి తప్పించుకోలేకపోయారని చాలా మంది భావిస్తున్నారు.

దీంతో భారీ పోలీసు బందోబస్తు మధ్య వారు సంతాపం తెలిపారు. నిరసనగా తెల్లకాగితాలను ప్రదర్శించారు. పూలు పెట్టి మౌనం పాటించారు.

ఆ తర్వాత కొందరు నినాదాలు మొదలు పెట్టారు: ‘‘స్వేచ్ఛ! మాకు స్వేచ్ఛ కావాలి! లాక్‌డౌన్లు తొలగించాలి!’’

రాత్రి ముదురుతున్న కొద్దీ ఆ గుంపు ఇంకా పెద్దగా పెరుగుతూ పోయింది. వారి స్వరం కూడా హెచ్చింది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 03:00 గంటల సమయంలో వారు మరో నినాదం అందుకున్నారు: ‘‘షి జిన్‌పింగ్ దిగిపో! షి జిన్‌పింగ్ దిగిపో!’’

చైనా నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

ఇరవైల వయసులో ఉన్న ఒక యువకుడు.. తన గదిలో నుంచి ఈ సమూహం నినాదాలు వినగానే తాను కూడా రోడ్డు మీదకు పరుగున వెళ్లానని చెప్పాడు.

‘‘చాలా మంది జనం ఆన్‌లైన్‌లో ఆగ్రహంగా ఉండటం చూశాను. కానీ ఎప్పుడూ ఏ ఒక్కరూ రోడ్డు మీద నిరసన తెలుపలేదు’’ అని అతడు బీబీసీతో అన్నాడు.

ఇవి చరిత్రాత్మక ఘటనలని అతడు భావించాడు. వాటిని రికార్డ్ చేయటానికి తనతో పాటు కెమెరా కూడా తెచ్చాడు. ‘‘చాలా మంది జనం కనిపించారు. పోలీసులు, విద్యార్థులు, వృద్ధులు, విదేశీయులు.. చాలా మంది ఉన్నారు. వాళ్లకి వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయి. కానీ వాళ్లు కనీసం గెంతెత్తి మాట్లాడుతున్నారు’’ అని ఆ యువకుడు పేర్కొన్నాడు.

‘‘ఆ సమావేశం అర్థవంతంగా ఉంది. ఇది నాకు ఒక అపురూపమైన జ్ఞాపకం’’ అని చెప్పాడు.

ఆ నిరసనకారుల బృందంలో చివర నిలుచున్న ఒక యువతి.. ఈ నిరసన ఉద్విగ్నంగా అనిపించిందని చెప్పారు. ‘‘నా జీవితంలో చైనాలో ఇలాంటిది ఎన్నడూ చూడలేదు’’ అని ఆమె బీబీసీతో పేర్కొన్నారు.

‘‘ఇది ఊరటగా అనిపించింది. మేం ఎంతో కాలంగా చెప్పదలచుకున్నదాన్ని చెప్పటానికి.. చివరికి మేమంతా కలిసి, ఒకచోట చేరాం’’ అన్నారు.

చైనా నిరసనలు

ఫొటో సోర్స్, Reuters

జీరో కోవిడ్ విధానం తన జీవితంలో అత్యుత్తమ సంవత్సరాలను కొల్లగొట్టిందని ఆ యవతి నిరసించారు. ఆమె తరం జీవనోపాధాలు, అవకాశాలు, ఆదాయాలు, విద్య, ప్రయాణాలను కోల్పోయింది. కొన్నిసార్లు నెలల తరబడి లాక్‌డౌన్లలో చిక్కుకుపోయి కుటుంబాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. జీవితానికి సంబంధించిన ప్రణాళికలను వాయిదా వేసుకోవటమో రద్దు చేసుకోవటమో తప్పలేదు.

‘‘మేం ఆగ్రహంగా ఉన్నాం. బాధగా ఉన్నాం. నిస్సహాయంగా ఉన్నాం’’ అని ఆమె చెప్పారు.

ఆ వారాంతంలో దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఇటువంటి నినాదాలు వినిపించాయి. బీజింగ్‌లోని త్సింఘువా యూనివర్సిటీలో కొందరు విద్యార్థులు.. తాము ఆన్‌లైన్‌లో వీక్షించిన ఈ నిరసనలతో స్ఫూర్తి పొంది సమావేశమయ్యారు.

ఆ సమావేశంలో ఒక యువతి వేగంగా, నిర్భయంగా గద్గద స్వరంతో కన్నీళ్లతో లౌడ్‌స్పీకర్‌లో మాట్లాడుతున్న వీడియో వైరల్‌గా మారింది. ‘‘భయం వద్దు.. మాట్లాడు’’ అని ఆ సమూహం ఆమెను ఊరడించింది.

‘‘మన గౌరవం పోతుందనే భయంతో మనం గొంతెత్తి మాట్లాడకపోతే మన ప్రజలు మనపట్ల నిరాశకు గురవుతారని నేను భావిస్తున్నా. అది త్సింఘువా యూనివర్సిటీ విద్యార్థిగా నన్ను జీవితాంతం చింతించేలా చేస్తుంది’’ అని ఆమె వణుకుతున్న గొంతుతో చెప్పారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు. YouTube ఈ సమాచారంలో ప్రకటనలు ఉండొచ్చు.

పోస్ట్ of YouTube ముగిసింది

తెలిసి చేస్తున్నారా... తెలియకా?

కొన్ని దశాబ్దాల్లో కనిపించని ఈ రాజకీయ ప్రదర్శనలు.. వయసులో పెద్దవాళ్లయిన పరిశీలకులకు 1989 నాటి తియానాన్మెన్ స్క్వేర్ నిరసనలను గుర్తుకు తెచ్చాయి. మరింత స్వేచ్ఛాయుత చైనా కావాలని డిమాండ్ చేస్తూ జరిగిన ఆ నిరసనలకు కూడా విద్యార్థులే సారథ్యం వహించారు.

కానీ.. ఆ నిరసనలు ఎలా ముగిశాయనేది తెలియనందువల్ల ఈ తరంలో ఉద్రేకం కనిపిస్తోందని కొందరు అంటున్నారు. తియానాన్మెన్ స్క్వేర్ నిరసనలను చైనా హింసాత్మకంగా రక్తపాతంతో అణచివేసింది.

‘‘యుక్తవయసు ఆదర్శవాదం, బాధాకరమైన జ్ఞాపకాల భారం లేని నిర్భీతి కలగలిసి.. ఈ యువత వీధుల్లోకి వచ్చి తమ హక్కుల కోసం డిమాండ్ చేస్తున్నారు’’ అని ‘హ్యూమన్ రైట్స్ వాచ్‌’కు చెందిన చైనా పరిశోధకుడు యాకియు వాంగ్ పేర్కొన్నారు.

చైనా నిరసనలు

ఫొటో సోర్స్, Reuters

ఈ నిరసనకారులు నిలబడరని ఇంకొందరు వాదిస్తున్నారు. చైనా వ్యవస్థకు, దాని నిబంధనలకు తాము ఎంతగా అనుగుణంగా మారిపోయామనే విషయాన్ని వీరి యుక్తవయసు వీరికి తెలియకుండా చేస్తోందని.. ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీలో రాజకీయశాస్త్ర పరిశోధకుడు వెన్-టి సంగ్ అభిప్రాయపడ్డారు.

ఈ యువత వ్యూహాత్మకంగా తెలివైన వారని ఆయన పేర్కొన్నారు. నేటి యువ నిరసనకారులు ‘‘చైనా ఇప్పటివరకూ చూసిన అత్యంత విద్యావంతులైన తరం’’ అంటారాయన.

‘‘వారికి దాటగూడని గీతలేమిటో తెలుసు. ఆ గీతలు దాటకుండానే ముందుకు పోవాలని వారు ప్రయత్నిస్తున్నారు’’ అని విశ్లేషించారు.

షాంఘైలో నిరసనకారులు షి జిన్‌పింగ్‌ను తొలగించాలని నినాదాలు చేశారు. కానీ దాదాపు మిగతా నిరసన ప్రదర్శనలన్నిటిలోనూ మరీ రాజకీయమైనవని వారు భయపడిన డిమాండ్లను అదిమివేశారు.

నిందించే రాతలేవీ లేని తెల్లకాగితం వారి చిహ్నంగా మారింది. జీరో కోవిడ్ విధానాన్ని తొలగించాలన్న డిమాండ్లను ఆపాలని పోలీసులు వారికి చెప్పినపుడు.. వారు వ్యంగ్యంగా స్పందించారు. మరిన్ని కోవిడ్ పరీక్షలు, మరిన్ని ఆంక్షలు కావాలని నినాదాలు చేశారు.

చైనా నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

‘‘చైనా ప్రభుత్వం తమ మీద చేయగల ఆరోపణలను తగ్గించగటానికి వాళ్లు ముందస్తు ఆలోచనలతో అన్ని అంశాల్లోనూ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారో చూడండి’’ అని వెన్-టి సంగ్ చెప్పారు.

ఈ నిరసనకారులు.. తమ సందేశాన్ని పక్కదోవ పట్టించే స్వరాల పట్ల కూడా అప్రమత్తంగా ఉన్నారు.

బీజింగ్‌లో ఒక వ్యక్తి ‘విదేశీ శక్తుల ప్రభావం’ గురించి హెచ్చరించినపుడు.. మిగతావాళ్లు ‘‘విదేశీ శక్తులు అంటే మీ అర్థం.. మార్క్స్, ఏంగెల్స్ అనా? లేదంటే స్టాలిన్ గురించి, లెనిన్ గురించి చెప్తున్నారా?’’ అని కేకలు వేశారు.

మార్క్సిజం తమ మార్గనిర్దేశక సిద్ధాంతమని చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఉటంకిస్తోంది.

‘‘జిన్‌జియాంగ్‌లో మంటలు పెట్టింది విదేశీ శక్తులా? గ్విఝోలో బస్సును పల్టీకొట్టించింది విదేశీ శక్తులా?’’ అని కూడా బీజింగ్ నిరసనకారుల బృందం ప్రశ్నించింది.

‘‘ఈ రాత్రి ప్రతి ఒక్కరినీ ఇక్కడికి తీసుకొచ్చింది విదేశీ శక్తులా?’’ అని ఒక వ్యక్తి గట్టిగా అరవగా.. ‘‘కాదు’’ అని నిరసనకారుల బృందం పెద్ద స్వరంతో నినదించింది.

చైనా నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

‘ఉదార జాతీయవాదులు’

కరోనా మహమ్మారికి ముందు యువ చైనీయులు తమ భవిష్యత్తు అవకాశాల విషయంలో చాలా వరకూ సంతృప్తిగానే ఉన్నారు. కానీ ఆ పరిస్థితిని కోవిడ్ మార్చేసింది.

‘‘నేను ప్రపంచ దేశాలకు ప్రయాణించలేను. నా కుటుంబాన్ని చూడలేను’’ అని షాంఘై నగరంలో కెమెరా పట్టుకుని నిరసన బృందంలో చేరిన యువకుడు బీబీసీతో చెప్పారు. గ్వాంఘ్జో నగరంలో నివసించే తన తల్లి క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, ఆమె గురించి తాను భయపడుతూ ఉంటానని ఆయన తెలిపారు.

‘‘మా అమ్మను చూడాలని ఉంది. చాలా కాలంగా చూడలేదు. అమ్మను తాకలేదు. ఆమెతో కలిసి భోజనం చేయలేదు’’ అని ఆ యువకుడు ఆవేదన చెందారు. ప్రస్తుత లాక్‌డౌన్ విధానాన్ని సాధ్యమైనంత త్వరగా తొలగిస్తారని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు.

ఆ రోజు తర్వాత అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు బీబీసీకి అనంతరం తెలిసింది.

షాంఘై నగరంలోని చాలా ప్రాంతాల్లో నగర అధికారులు బుధవారం నాడు కోవిడ్ ఆంక్షలను ఎత్తివేశారు.

బీబీసీతో మాట్లాడిన వారు కానీ, ఆన్‌లైన్‌లో కనిపించే వీడియోల్లో మాట్లాడిన వారు కానీ.. తమ దేశం పురోగమించాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు.

చైనా నిరసనలు

ఫొటో సోర్స్, Reuters

నిరసనల్లో ప్రజలు చైనా జాతీయగీతాన్ని పదే పదే ఆలపించారు. ప్రత్యేకించి.. ‘‘నిలబడు! నిలబడు! నిలబడు!’’ అంటూ దేశాన్ని కాపాడటానికి ప్రజలకు పిలుపునిచ్చే చోట కోరస్ బలంగా వినిపించింది.

‘‘ఈ తరంలో నిజంగా విభిన్నంగా కనిపించే అంశం.. వీరిలో భీకరమైన దేశభక్తి. చైనా బలమైన శక్తిగా ఎదిగిన శకంలో పెరిగిన వాళ్లు వీళ్లు’’ అని వెన్-టి సంగ్ పేర్కొన్నారు.

వీరిలో చాలా మంది.. వ్యవస్థను బలంగా నమ్ముతూ.. అది విఫలమైనపుడు బాధ్యత వహించాలని డిమాండ్ చేసే ‘ఉదారవాద జాతీయువాదుల’ని ఆయన అభివర్ణించారు.

‘‘ప్రభుత్వ అనుకూలత నుంచి ప్రభుత్వ వ్యతిరేకతకు సెంటిమెంట్ చాలా వేగంగా మారిపోవచ్చు’’ అన్నారాయన.

అయితే.. తమ నిరసనలు చట్టబద్ధమైనవేనని, చట్టానికి అనుగుణంగానే ఉన్నాయని నిరపించాలన్న సామూహిక ఆకాంక్ష ఈ నిరసనల్లో కనిపిస్తోంది.

త్సింఘువా క్యాంపస్ వీడియోలో.. సమస్యాత్మక శక్తులు ఈ నిరసనను దుర్వినియోగం చేసే అవకాశం ఉండొచ్చని ఒక వక్త ఆందోళనలు వెలిబుచ్చినపుడు.. ‘‘చట్టాన్ని ఉల్లంఘించేవాళ్లు ఎవరూ వద్దు! చట్టాన్ని ఉల్లంఘించే వాళ్లు ఎవరూ వద్దు!’’ అంటూ నిరసన బందం నినదించింది.

ఇవి కూడా చదవండి: