చైనా బెదిరింపుల మధ్య తైవాన్ జాతీయ దినోత్సవ వేడుకలు
చైనా బెదిరింపుల మధ్యనే తైవాన్ జాతీయ దినోత్సవం జరుపుకుంటోంది. గతంలో కన్నా ఇప్పుడు అత్యధిక మంది ప్రజలు తమను తాము తైవానీయులుగా చెప్పుకుంటున్నారని కొన్ని ఒపీనియన్ పోల్స్ సూచిస్తున్నాయి. వీళ్లంతా తైవాన్ ద్వీపంలో ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థ కొనసాగాలని, అదొక స్వేచ్ఛాయుత సమాజంగా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ తైవాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే లక్ష్యంతో - దాదాపు రెండు వేల తైవాన్ ఉత్పత్తుల దిగుమతులను నిషేధించింది చైనా. బీబీసీ ప్రతినిధి రూపర్ట్ వింగ్‌ఫీల్డ్ హేయిస్ అందిస్తోన్న రిపోర్ట్.
దక్షిణ తైవాన్‌లోని చెరువుల్లో బంగారం ఉంది. కానీ చూడటానికి అలా కనిపించదు.
సు గో ఝెన్ చెరువుల్లో గట్టిగా రెక్కలాడిస్తోన్న ఒక భారీ చేప పేరు గ్రూపర్. బీజింగ్, షాంఘై మార్కెట్లలో దీని విలువ రెండు వేల అమెరికన్ డాలర్ల వరకూ ఉంటుంది.
తైవాన్ నుంచి గ్రూపర్ చేపల్లో 80 శాతం చైనాకు ఎగుమతి అవుతాయి. ఇప్పుడు వాటి ఎగుమతి ఆగిపోయింది. బీజింగ్ దిగుమతులను నిలిపేసింది. దాని ప్రభావం తైవాన్‌పై తీవ్రంగా ఉంది. మరి ఈ వ్యూహం పనిచేస్తుందా?
మత్స్యకారుడు సు గువో ఝెన్ మాట్లాడుతూ.. ''నాలాంటి ముసలి మత్స్యకారులు ఆందోళనగా ఉన్నారు. కానీ నేటి తరం యువత దీనిని పెద్దగా పట్టించుకోవట్లేదు. ఒకవేళ చైనా మన చేపల్ని కొనకపోతే ప్రపంచంలోని ఇతర మార్కెట్లకు వీటిని పంపిద్దాం అంటున్నారు'' అని చెప్పారు.
అయితే చైనా బెదిరింపుల లక్ష్యం కేవలం తైవాన్ ఆర్థిక వ్యవస్థ మాత్రమే కాదు. అగస్టు నెల నుంచి తైవాన్ ద్వీపాన్ని బలవంతంగానైనా స్వాధీనం చేసుకుంటామనే బెదిరింపుల క్రమం కొనసాగుతోంది. తైవాన్ సంధిలో మిసైళ్ల టెస్ట్ ఫైరింగ్ చేస్తున్నారు.
అయితే, తైవాన్ ప్రజల్లో భయం ఉన్నప్పటికీ దానిని బయటకు చూపించట్లేదు.
ప్రస్తుతమిది ఎన్నికల సమయం. రాత్రి పూట నిర్వహించే ర్యాలీల్లో వేదికలపైన అభ్యర్థులు వోటర్లనుద్దేశించి ప్రసంగిస్తున్నారు.
చైనాలాగా కాకుండా తమను ఎవరు పాలించాలో నిర్ణయించుకునే హక్కు ఇక్కడి ప్రజలకుంది. ఈ హక్కును వదులుకోవడానికి తైవాన్ ప్రజలు సిద్ధంగా లేరు.
తైవాన్ తన ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల గర్వపడుతుంది. ప్రపంచంలో చైనా భాష మాట్లాడే మరే ప్రాంతంలోనూ ఇలాంటి పరిస్థితి కనిపించదు. అయితే షీ జిన్ పింగ్ బెదిరింపుల లక్ష్యం తైవాన్ ప్రజాస్వామ్యం ఒక్కటే కాదు... తైవాన్ ప్రజల స్వేచ్ఛ, హక్కులు, మొత్తంగా వాళ్ల జీవన విధానం కూడా.
దక్షిణ తైపేయి ప్రాంతంలోని తమ ఇంట్లో, మోతా, సీటీ దంపతులు తమ రెండేళ్ల కూతురు లించెన్‌తో ఆడుకుంటున్నారు.
మరోవైపు స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన మొట్టమొదటి ఆసియా దేశంగా నిలిచింది తైవాన్. త్వరలో తన రెండవ బిడ్డను కనబోతున్నారు సీటీ.
''సాధారణంగా అయితే, హోమోసెక్సువల్ అనేది దాచిపెట్టే విషయం. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు వచ్చింది. మేము స్వేచ్ఛగా బయట తిరుగుతున్నాం. మా ప్రభుత్వం మమ్నల్ని ఆమోదించింది. గుర్తించింది'' అని మోతా లిన్ అన్నారు.
ఇలాంటి జంటలు తైవాన్‌ను కాపాడుకోలేకపోతే ఎక్కువ నష్టపోతారు.
చైనాకు తైవాన్ కావాలంటే తమపైన దండయాత్ర చేయాల్సిందేనని, అదే జరిగితే తనలాంటి వారికి తైవాన్ వదిలి వెళ్లిపోవడం తప్ప మరో మార్గం ఉండదంటున్నారు సీటీ.
ఇవి కూడా చదవండి:
- క్రైమియా బ్రిడ్జిని ఎవరు, ఎలా పేల్చారు?
- పంజాబ్: ఖైదీలు తమ భాగస్వాములతో జైలులోనే ఏకాంతంగా గడపొచ్చు, లైంగికంగానూ కలవొచ్చు
- కీయెవ్ పై మిసైల్ దాడి ఆరంభమే, అసలు ఎపిసోడ్ ముందు ఉందంటూ రష్యా హెచ్చరిక
- ఊర్వశి రౌతేలా: ఈ సినీ నటి టీమిండియా వికెట్ కీపర్ వెంటపడుతున్నారా? ఈమె ఆస్ట్రేలియా వెళ్లడంపై ఆన్లైన్లో ట్రోలింగ్ ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)