చైనా కోట్ల మందిని పేదరికం నుంచి బయట పడేసిందా? గణాంకాలు ఏం చెబుతున్నాయి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జాక్ గుడ్‌మన్
- హోదా, బీబీసీ రియాలిటీ చెక్
10 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకురావాలని 2012లో తాను అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుకున్న లక్ష్యం నెరవేరిందని చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ ఇటీవల ప్రకటించారు.
తమ దేశంలోని 10 కోట్ల మంది పేదరికం నుంచి విముక్తులయ్యారని ఆయన వెల్లడించారు. కానీ చైనా ప్రభుత్వం చేసిన ప్రకటన నిజమేనా ?
ఈ అంశాన్ని పరిశీలించడానికి ప్రపంచ పేదరికంపై ప్రపంచ బ్యాంకు రూపొందించిన నివేదికను, చైనా ఇచ్చిన డేటాతో పోల్చి చూశాం.

ఫొటో సోర్స్, GETTY IMAGES
పేదరికాన్ని ఎలా కొలుస్తారు?
గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి రోజువారి ఆదాయం 2.30 డాలర్ల(రూ.169.05) కన్నా తక్కువ ఉంటే వారిని పేదవారిగా చైనా ప్రభుత్వం గుర్తిస్తుంది. జీవన ప్రమాణాలు, విద్య, వైద్య సౌకర్యాల ఆధారంగా 2010లో దీన్ని నిర్ణయించారు.
చైనా ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి రాష్ట్రాలు (ప్రావిన్సులు) పోటీపడ్డాయి. ఉదాహరణకు జియాంగ్సు అనే రాష్ట్రాన్నే తీసుకుంటే, తమ ప్రాంతంలోని 8 కోట్ల మంది జనాభాలో ప్రస్తుతం కేవలం17 మంది మాత్రమే పేదలని వెల్లడించింది.
పేదరికాన్ని గుర్తించడానికి రోజువారి ఆదాయం 1.90 డాలర్లు(రూ.139.65)గా వరల్డ్ బ్యాంక్ గుర్తించగా, చైనా దానికన్నా కాస్త ఎక్కువ ఆదాయాన్నే పేదరికానికి ప్రమాణంగా నిర్ధరించింది

ఫొటో సోర్స్, GETTY IMAGES
ప్రపంచ బ్యాంక్ డేటా
వరల్డ్ బ్యాంక్ నిర్ధరించిన ప్రమాణాన్నే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు పాటిస్తున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 1990ల నాటికి చైనాలోని 75 కోట్ల మంది అంటే ఆ దేశంలోని మూడింట రెండువంతుల జనాభా పేదరికంలో ఉంది.
2012 నాటికి ఇది 9 కోట్లకు, 2016 నాటికి 72 లక్షలకు పడిపోయిందని ప్రపంచ బ్యాంక్ డేటా సూచిస్తోంది. దీనిని బట్టి 2016 నాటికి చైనా తన లక్ష్యానికి చేరువగా ఉంది.
అయితే, ప్రపంచ బ్యాంకు వద్ద తాజా గణాంకాలు లేకపోయినప్పటికీ, ట్రెండ్ మాత్రం చైనా ప్రకటించుకున్న డేటాకు చేరువగా ఉంది.
ఇదే సమయంలో వియాత్నాం కూడా చైనా మాదిరిగానే పేదరికం నుంచి బైటపడింది. ఇక ఇండియాలో 2011 నాటికి 22% మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు. అంటే వీరి రోజువారి ఆదాయం ఇప్పటి కరెన్సీ లెక్కల్లో రోజు రూ.139.64.
ఇక బ్రెజిల్‌లో 4.4% మంది రోజుకు 1.90 డాలర్లకన్నా ఎక్కువ సంపాదించలేని వారు ఉన్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
చైనా వృద్ధిలో వేగం
ఆర్ధిక వృద్ధిని నిలకడగా కొనసాగించడం ద్వారా పేదరికంపై యుద్ధంలో చైనా విజయం సాధించగలిగింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధిపై దృష్టిపెట్టడం కలిసొచ్చింది.
కొత్త పట్టాణాల నిర్మాణమేకాక, గ్రామీణ ప్రాంతాల్లో కొత్త కాలనీలను నిర్మించారు.
అయితే, ఇంట్లో ఉండాలా, పనికెళ్లాలా అన్నది నిర్ణయించుకునే స్వేచ్ఛ చైనాలో ప్రజలకు లేదని విమర్శకులు అంటారు. మరోవైపు కమ్యూనిస్టు విధానాలకు ఏమాత్రం పక్కకు జరగొద్దన్న పట్టుదల ఆ దేశంలో గ్రామీణ ప్రాంతాల వెనకబాటుకు ఒక కారణమని విమర్శకులు చెబుతారు.
" గత 40 ఏళ్లలో చాలా మార్పులు వచ్చాయి. అందులో సందేహం లేదు" అన్నారు ఆర్ధిక వేత్త డేవిడ్ రెనీ.
ఈ విజయంలో ప్రభుత్వం పాత్రకన్నా ప్రజల పాత్రే ఎక్కువని రెనీ అన్నారు. " ప్రజలు తమ శ్రమశక్తితో ఈ అభివృద్ధిని సాధించారు. మావో రూపొందించిన పనికిమాలిన ఆర్ధిక విధానాలను పక్కనబెట్టి వారు క్యాపిటలిజం వైపు మొగ్గు చూపారు" అన్నారాయన.

ఫొటో సోర్స్, Getty Images
రైతు రాజ్యాన్ని పారిశ్రామిక రాజ్యంగా మార్చాలన్న 1950ల నాటి మావో విధానాలు ముఖ్యంగా 1958లోఆయన ప్రారంభించిన గ్రేట్ లీప్ ఫార్వర్డ్ రైతులను బలవంతంగా శ్రామిక వర్గాలుగా మార్చిందని, దీనివల్ల చాలామంది గ్రామీణ ప్రాంత ప్రజలు ఆకలితో మరణించారని రెనీ అన్నారు.
పేదరిక నిర్మూలనకు చైనా తీవ్రప్రయత్నాలు చేసిన మాట నిజమే. కానీ అవి ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా ? అన్నది ఇక్కడ ఇంకొక ప్రశ్న. ఉన్నత, మధ్యతరగతి ఆదాయం ఉన్న దేశాలకు దారిద్ర్యరేఖ పరిధిని వరల్డ్ బ్యాంక్ అధికంగా నిర్ధారించింది.
రోజువారి ఆదాయం 5.50 డాలర్ల(రూ.404.25) కు పైగా ఉన్నవారినే దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నవారిగా పేర్కొంది. చైనా ఉన్నత, మధ్య తరగతి ఆదాయం కలిగిన దేశమని వరల్డ్ బ్యాంక్ చెబుతోంది.
ఈ ప్రమాణాల ప్రకారం చైనా జనాభాలోని పావువంతు మంది పేదరికంలో ఉన్నట్లు లెక్క.
దేశంలోని 60 కోట్ల మంది ప్రజల నెలవారీ ఆదాయం 1000 యువాన్(154 డాలర్లు)లకు మించదని చైనా ప్రధాని లీ కెకియాంగ్ గత ఏడాది ప్రకటించారు. ఈ ఆదాయంతో పట్టణాల్లో ఇల్లు అద్దెకు తీసుకోవడం కూడా సాధ్యం కాదని ఆయన చెప్పారు.
ఏది ఏమైనా పేదరికాన్ని నిర్మూలించడానికి గత కొన్ని దశాబ్దాలుగా చైనా ప్రభుత్వం కఠిన చర్యలను తీసుకున్నదని మాత్రం చెప్పవచ్చు.
ఇవి కూడా చదవండి:
- బంగ్లాదేశ్ నుంచి వచ్చి నిజామాబాద్‌లో దొంగ పాస్‌పోర్టులు తీస్తున్నారు... ఏంటీ దందా?
- మోటేరా స్టేడియం.. అపూర్వమైన ప్రపంచ రికార్డులకు వేదిక
- నరసరావుపేట అనూష హత్య: నిందితుడు పోలీసు కస్టడీలో ఉన్నాడా... పరారీలో ఉన్నాడా?
- సద్దాం హుస్సేన్ కూతురు రగద్: 'నా భర్తను మా నాన్నే చంపించారు'
- దేశద్రోహ చట్టం: అసమ్మతిని అణచివేయడానికి ప్రయోగిస్తున్న అస్త్రం
- గ్యాంగ్ రేప్ నిందితుడు పోలీసులకు దొరక్కుండా 22 ఏళ్లు ఎలా తప్పించుకు తిరిగాడు?
- మోదీ సర్కారు ప్రభుత్వ కంపెనీలను ఎందుకు అమ్మేస్తోంది...
- స్పెషల్ స్టేటస్, త్రీ క్యాపిటల్స్: ఆంధ్రప్రదేశ్‌లో ఈ లిక్కర్ బ్రాండ్లు నిజంగానే ఉన్నాయా?
- సియాచిన్: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన యుద్ధ క్షేత్రం
- హిట్లర్ కోసం విషం రుచిచూసే మహిళల కథ
- జ్యోతిషాన్ని నమ్మే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది... ఎందుకు?
- ఘట్కేసర్ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య: తప్పెవరిది, అమ్మాయిలదా.. తల్లిదండ్రులదా.. సమాజానిదా? :అభిప్రాయం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








