తైవాన్: ఇక్కడి యువతీ యువకులు వీధి పోరాటాలు, తుపాకుల వాడకంలో ఎందుకు ట్రైనింగ్ తీసుకుంటున్నారు?

- రచయిత, రూపెర్ట్ వింగ్‌ఫీల్డ్ హేయ్స్
- హోదా, బీబీసీ న్యూస్
నేను తైవాన్‌లో ఉన్నానని తెలిసిన కొందరు స్నేహితులు ఆందోళనతో మెసేజ్‌లు పెడుతున్నారు. ‘‘నీ దగ్గర తూటాల నుంచి రక్షణ కల్పించే జాకెట్ ఉందా? మీ హోటల్‌లో బాంబ్ షెల్టర్ ఉందా?’’అని అడుగుతున్నారు.
చైనా ప్రభుత్వ మీడియా నుంచి, ముఖ్యంగా గ్లోబల్ టైమ్స్‌లో వస్తున్న తీవ్రమైన హెచ్చరికలను అందరూ చూస్తున్నారు. అమెరికా స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్ పర్యటనతో పరిస్థితులు తీవ్రంగా మారతాయని చైనా పదేపదే హెచ్చరిస్తోంది.
మరోవైపు అమెరికాలోని చైనా మేధావులు కూడా నాన్సీ పెలోసీ పర్యటనను ‘‘బాధ్యతారహిత చర్య’’గా చెబుతున్నారు. ఈ పర్యటనతో చైనాను అమెరికా పరోక్షంగా కవ్వించిందని వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే, తైవాన్‌లో ఈ పర్యటనను ఎలా చూస్తున్నారు?
ఫ్రెడ్డీ లిమ్ ఒకప్పుడు సింగర్. ఇప్పుడు ఆయన తైవాన్‌లోని అధికార పార్టీ ఎంపీ. నాన్సీ పెలోసి పర్యటనపై ఆయన బీబీసీతో మాట్లాడారు.

ఫొటో సోర్స్, Handout
‘‘నాన్సీ పెలోసి లాంటి హైలెవల్ రాజకీయ నాయకులకు మేం ఎప్పుడూ ఆహ్వానం పలుకుతానే ఉంటాం. ఇది చాలా ముఖ్యం. దీన్ని చైనాను రెచ్చగొట్టే చర్యగా చూడకూడదు. మిగతా దేశాల్లానే ఒక స్నేహితుడికి స్వాగతం పలుకుతున్నట్లు చూడాలి’’అని ఆయన బీబీసీతో చెప్పారు.
లిమ్ చెబుతున్న మాటలతో తైవాలోని అన్ని పార్టీలు ఏకీభవిస్తున్నాయి.
‘‘తైవాన్‌కు పెలోసి వచ్చినప్పుడు.. అమెరికా కూడా మరో అడుగు ముందుకు వేసి తైవాన్‌కు, ఇక్కడి ప్రజాస్వామ్యానికి మరింత మద్దతు ప్రకటించొచ్చు’’అని ప్రతిపక్షమైన కేఎంటీ పార్టీకి చెందిన చార్లెస్ చెన్ అన్నారు. అధ్యక్షుడి అధికార ప్రతినిధిగా ఆయన పనిచేశారు.
అమెరికాలో మూడో అత్యంత కీలకమైన రాజకీయ నాయకురాలైన నాన్సీ పెలోసి పర్యటనకు తైవాన్‌లో చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. ఇలాంటి పర్యటనలు మరిన్ని జరగాలని తైవాన్ కోరుకుంటోంది.

ఈ ద్వీపాన్ని అవసరమైతే బల ప్రయోగంతో చైనా తమ భూభాగంలో కలిపేసుకునేందుకు ప్రయత్నిస్తుందనే ఆందోళనలు ఇటీవల కాలంలో మరింత ఎక్కువయ్యాయి. ఎందుకంటే చైనా సైన్యంతో పోల్చినప్పుడు తైవాన్ సైన్యం ఏ విధంగానూ పోటీ పడలేదు.
గత వారం తైవాన్ ఐదు రోజులపాటు పెద్దయెత్తున సైనిక విన్యాసాలు కూడా నిర్వహిచింది. సైన్యాన్ని ఆధునికీకరించామని చెప్పేందుకు తైవాన్ దీని ద్వారా ప్రయత్నించింది.
అయితే, చైనా సైన్యం ముందు తైవాన్ అసలు నిలబడలేదని నిపుణులు అంటున్నారు. తైవాన్ యుద్ధ ట్యాంకులు, ఫిరంగులు, యుద్ధ విమానాలన్నీ పాతవని, మరోవైపు యుద్ధ నౌకలు, క్షిపణుల్లోనూ ఆధునిక రాడార్ వ్యవస్థలు లేవని, జలాంతర్గాములు కూడా కొత్తవి లేవని చెబుతున్నారు.
యుద్ధానికి దిగితే కచ్చితంగా చైనా విజయం సాధిస్తుంది. అయితే, చైనా దాడి ఎలా మొదలుపెడుతుంది?
చైనా ఒక అవకాశం కోసం ఎదురుచూస్తోంది. తైవాన్ అధికారికంగా స్వాతంత్రాన్ని ప్రకటించుకంటే రెడ్‌లైన్‌ను దాటినట్లుగా చైనా పరిగణిస్తుందనే వాదనలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, EPA
అయితే, ప్రస్తుత అధ్యక్షురాలు సాయ్ ఇంగ్ వెన్ ప్రభుత్వం, ఆమె డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (డీపీపీ) ఆ హద్దులకు చివర్లో ఉందని చెన్ అంటున్నారు.
‘‘తైవాన్ స్వతంత్రంగా మారుతుందని అనుమానం వచ్చిన వెంటనే చైనా దాడి చేస్తుంది. ఒక మంచి అవకాశం కోసం ఎదురుచూస్తోంది’’అని ఆయన అన్నారు.
‘‘వచ్చే ఎన్నికల్లో డీపీపీ అభ్యర్థి గెలిస్తే, చైనా వెంటనే ఒక నిర్ణయం తీసుకోవచ్చు. తైవాన్ స్వతంత్రంగా మారకముందే, దాడిని మొదలుపెట్టొచ్చు’’అని ఆయన వ్యాఖ్యానించారు.
అయితే, అధికారంలోకి వచ్చేందుకు చెన్ పార్టీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉండొచ్చు. ఆయన వ్యాఖ్యలు దేశంలోని రెండు రాజకీయ పార్టీల మధ్య విభేదాలను స్పష్టం చేస్తున్నాయి.
ప్రస్తుత పరిస్థితిని మార్చేలా ఎలాంటి చర్యలూ తీసుకోబోమని కేఎంటీ.. చైనాకు హామీ ఇస్తోంది. అయితే, ఫ్రెడ్డీ లిమ్ లాంటి డీపీపీ నాయకులు ఈ వ్యూహం పనిచేయదని, తైవాన్‌ను రక్షించుకునేందుకు చర్యలు అవసరమని చెబుతున్నారు.
‘‘చైనాను బుజ్జగించేందుకు దశాబ్దాల నుంచి ప్రయత్నిస్తున్నాం. ఎప్పుడూ అలానే ఉండిపోలేం’’అని ఆయన అంటున్నారు.
యుక్రెయిన్ యుద్ధం తర్వాత..
తైవాన్‌పై యుక్రెయిన్ యుద్ధం చాలా ప్రభావాన్ని చూపిందని లిమ్ అంటున్నారు.
‘‘యుక్రెయిన్ యుద్ధం తర్వాత.. ఆత్మ రక్షణ సామర్థ్యం పెంచుకోవాలని తైవాన్ ప్రజలు కోరుకుంటున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ముఖ్యంగా దేశాన్ని ఎలాగైనా రక్షించుకోవాలని యువతరం భావిస్తున్నారు’’అని లిమ్ చెప్పారు.

గత వారం రాజధాని తైపీ నగర శివార్లలోని ఒక ఫ్యాక్టరీ దగ్గర 30 మంది యువకులు తుపాకీ వాడటం నేర్చుకుంటున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఇవి నిజమైన ఆయుధాలు కాదు. వీరికి మాక్స్ చియాంగ్ కంపెనీ శిక్షణ ఇస్తోంది.
‘‘గత ఫిబ్రవరి నుంచి శిక్షణ కోసం మా దగ్గరకు వస్తున్న వారి సంఖ్య 50 శాతానికిపైగా పెరిగింది. కొన్ని క్లాసుల్లో మహిళల వాటా కూడా 40 నుంచి 50 శాతం వరకు ఉంటుంది’’అని ఆయన చెప్పారు.
‘‘పెద్ద దేశాలు చిన్నచిన్న దేశాలపై దండయాత్రలు, దాడులు చేస్తాయని ప్రజలు నమ్ముతున్నారు. యుక్రెయిన్‌లో జరిగినదే ఇక్కడా జరుగుతుందని వారు భయపడుతున్నారు’’అని ఆయన అన్నారు. ఆ తుపాకుల ట్రైనింగ్‌కు పక్కనే స్ట్రీట్ ఫైటింగ్‌పైనా శిక్షణ ఇస్తున్నారు. రక్షణ జాకెట్లు, హెల్మెట్లు, రేడియో కమ్యూనికేషన్ గేర్లతో వీరు శిక్షణ తీసుకుంటున్నారు.
తుపాకుల వాడకంపై శిక్ష తీసుకుంటున్న వారిలో లీసా హ్యూ ఒకరు.
‘‘చైనాతో ఉద్రిక్తతలు యుద్ధానికి దారితీస్తే, నేను మా కుటుంబం కోసం, దేశం కోసం పోరాడతాను. అందుకే తుపాకీ వాడటం నేర్చుకుంటున్నాను’’అని ఆమె చెప్పారు.
‘‘నా లాంటి మహిళలు యుద్ధంలో ముందు వరుసలో ఉండకపోవచ్చు. కానీ, యుద్ధమే వస్తే, మేం ముందుకు వచ్చి మా ఇళ్లను కాపాడుకుంటాం’’అని ఆమె అన్నారు.
ఎందుకు తైవాన్ కోసం పోరాడటం అంత ముఖ్యంగా భావిస్తున్నారు? అని బీబీసీ ఆమెను ప్రశ్నించింది.
‘‘ఎందుకంటే మాకు స్వేచ్ఛ కావాలి. మేం ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నాం. ఇవి మా ప్రాథమిక హక్కులు. మా విలువల కోసం మేం పోరాడతాం’’అని ఆమె చెప్పారు.
‘‘చైనాలో ఎవరికీ హక్కులు ఉండవు. తైవాన్‌లో పుట్టడం నిజంగా నాకు గర్వకారణం’’అని ఆమె వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- క్యాసినో అంటే ఏంటి, అందులో ఏం చేస్తారు... చట్టాలు ఏం చెబుతున్నాయి?
- చైనా వార్నింగ్‌ను లెక్క చేయకుండా తైవాన్‌లో అడుగుపెట్టిన అమెరికా స్పీకర్ పెలోసీ
- ఈజిప్టులోని కంటి డాక్టర్ జిహాదీ ఎలా అయ్యాడు... లాడెన్‌కు కుడి భుజంగా ఎలా మారాడు?
- అంబానీ, అదానీ: 5జీ సేవలపై ఆధిపత్యం కోసం పోటీ పడుతున్న భారతీయ కుబేరులు
- విశాఖపట్నం: లైట్ హౌస్‌లు ఎలా పనిచేస్తాయి, వీటిని ఎందుకు ఏర్పాటు చేశారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














