చైనాను ‘ప్రపంచ శక్తి’గా మలచిన మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ మృతి

ఫొటో సోర్స్, Reuters
చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ బుధవారం మరణించారు. ఆయన వయసు 96 సంవత్సరాలు.
జియాంగ్ జెమిన్.. చైనాలో హింసాత్మక తియానాన్మెన్ స్క్వేర్ నిరసనల అనంతరం 1993లో అధ్యక్ష పదవి చేపట్టారు. దాదాపు 20 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు.
చైనాను అంతర్జాతీయంగా బలమైన ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దటంలో కీలక పాత్ర పోషించారు.
ఆయన బుధవారం మధ్యాహ్నం షాంఘై నగరంలో కన్నుమూసినట్లు ప్రభుత్వ మీడియా సంస్థ షిన్‌హువా తెలిపింది.
ఇటీవలి శతాబ్దాల చైనా చరిత్రలో అత్యంత ప్రముఖుల్లో ఒకరు జియాంగ్ జెమిన్. చైనా ఆర్థికవ్యవస్థ భారీ స్థాయిలో తలుపులు తెరిచి విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం పలికిన కాలంలో, చైనా అత్యంత వేగవంతమైన వృద్ధిని సాధించిన కాలంలో ఆయన దేశాధ్యక్షుడిగా ఉన్నారు.

ఫొటో సోర్స్, Reuters
దాదాపు ఒకటిన్నర శతాబ్దం పాటు బ్రిటిష్ ఆధీనంలో ఉన్న హాంగ్ కాంగ్‌ను 1997లో చైనాకు తిరిగి అప్పగించటాన్ని జియాంగ్ జెమిన్ శాంతియుతంగా కొనసాగేలా చూశారు.
అయితే.. 1999లో ఫాలున్ గాంగ్ మతస్తుల మీద బలప్రయోగంతో విరుచుకుపడి విమర్శలపాలయ్యారు.
1989లో బీజింగ్‌లోని తియానాన్మెన్ స్క్వేర్‌లో పెద్ద ఎత్తున చెలరేగిన నిరసనలను చైనా హింసాత్మకంగా అణచివేసింది. ఆ ఘటనతో అంతర్జాతీయంగా చైనా వెలివేతకు గురైన సమయంలో జియాంగ్ జెమిన్ అధికారంలోకి వచ్చారు.
తియానాన్మెన్ స్క్వేర్ నిరసనలు, హింసాత్మక అణచివేత ఘటనతో చైనా కమ్యూనిస్టు పార్టీ అగ్రస్థాయిలో పిడివాద ప్రగతి వ్యతిరేకులకు, సంస్కరణవాదులకు మధ్య అధికారం కోసం సంఘర్షణ సాగింది.
ఆ క్రమంలో అప్పటివరకూ కష్టపడి పనిచేసే అధికారిగా గుర్తింపు పొందిన జియాంగ్ జెమిన్ దేశానికి అధ్యక్షుడయ్యారు. పిడివాదులు, ఉదారవాదుల మధ్య సయోధ్య సాధిస్తారని, ఇరువర్గాలను ఐక్యం చేస్తారనే ఉద్దేశంతో మధ్యేమార్గంగా ఆయనను ఎంపిక చేశారు.

ఫొటో సోర్స్, Reuters
ఆయన నాయకత్వంలో చైనా తిరుగులేని ఆర్థికవ్యవస్థగా రూపొందింది. అధికారం మీద కమ్యూనిస్టు పార్టీ పట్టు మరింతగా బిగిసింది. ప్రపంచ అగ్ర రాజ్యాల సరసన చైనా చోటు సంపాదించుకుంది.
ఆయన సారథ్యంలో చైనా 2001లో ప్రపంచ వాణిజ్య సంస్థలోకి ప్రవేశించింది. చైనా ఆర్థిక వ్యవస్థను అంతర్జాతీయ సమాజంతో కలిపింది. 2008లో బీజింగ్ ఒలింపిక్స్ నిర్వహించింది.
కానీ దేశంలో రాజకీయ సంస్కరణలను పక్కన పెట్టేశారు. కమ్యూనిస్టు పార్టీకి ముప్పుగా భావించి.. ఫాలున్ గాంగ్ మత తెగను హింసాత్మకంగా అణచివేశారు.
పార్టీలో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవటం మీద కూడా జియాంగ్ దృష్టి పెట్టారు. పార్టీని ఆధునికీకరించే ఉద్దేశంతో తనదైన ‘మూడు ప్రాతినిధ్యాల’ సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చారు.
ఆయన అధికారంలో ఉన్న కాలంలో అమెరికాతో సంబంధాలను బలోపేతం చేసుకోవటానికి ప్రయత్నించారు. పలుమార్లు అమెరికాలో పర్యటించారు. అమెరికా మీద 9-11 దాడుల అనంతరం ఆ దేశం ప్రకటించిన ‘ఉగ్రవాదంపై యుద్ధం’లో సహకారం అందిస్తామని నాటి అమెరికా అధ్యక్షుడు జార్జి డబ్ల్యు బుష్‌కు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
జియాంగ్ జెమిన్ వ్యక్తిత్వం కూడా అట్టహాసంగా కనిపించని చైనా అధ్యక్షులకు విరుద్ధంగా వర్ణభరితంగా ఉండేది. ఒక ప్రపంచ సదస్సులో ఎల్విస్ ప్రెస్లీ గీతాన్ని కూనిరాగం తీయటం చాలా మందికి గుర్తుండిపోతుంది. అలాగే హవాయి సముద్ర తీరంలో ఈతకు కూడా వెళ్లారు.
జియాంగ్ జెమిన్ 2002లో పార్టీ అధ్యక్ష పదవిని, 2003లో దేశాధ్యక్ష పదవిని హు జింటావోకు అప్పగించి అధికారం నుంచి దిగిపోయారు. 1949 విప్లవం తర్వాత రక్తపాతం లేకుండా నాయకత్వ మార్పు జరగటం అదే తొలిసారి.
ఆయన చివరిసారిగా 2019 అక్టోబర్‌లో బహిరంగ కార్యక్రమంలో కనిపించారు. ఆ ఏడాది పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా 70వ వ్యవస్థాపక వార్షికోత్సవం సందర్భంగా తియానాన్మెన్ స్క్వేర్‌లో జరిగిన సైనిక కవాతును ఇతర మాజీ నేతలతో కలిసి వీక్షించారు.
ఆయన పెద్ద కళ్లజోడును చాలా మంది చైనీయులు అభిమానంగా కారికేచర్లు గీసేవారు. అవి కప్పలాగా కనిపిస్తాయనేవారు. యువ అభిమానులు తాము ‘కప్ప ఆరాధకులం’ అని చెప్పుకుంటారు.
ఇవి కూడా చదవండి:
- ‘నా భార్య నగ్న ఫోటోలు అప్పులోళ్ల దగ్గరకు ఎలా వెళ్లాయి’
- సెక్స్ సరోగేట్స్: గాయపడిన సైనికులకు వారు ఎలా సాయం చేస్తున్నారు... దీనిపై అభ్యంతరాలు ఎందుకు?
- లచిత్ బార్పుకన్: అర్ధరాత్రి దెయ్యాల్లా మొఘల్ సైన్యం మీదకు విరుచుకుపడిన అహోం యోధుల సాహస గాథ
- కాంతారా: అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా మీద అసంతృప్తి ఎందుకు
- విప్ప సారా: బ్రిటిషర్లు నిషేధించిన ఈ భారతీయ మద్యం అంతర్జాతీయంగా ఆదరణ పొందగలదా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














