‘బేస్ ఎడిటింగ్’: నయం చేయడానికి వీల్లేని క్యాన్సర్‌ను తరిమేసిన కొత్త విప్లవాత్మక చికిత్స, 13 ఏళ్ల బాలికపై తొలి ప్రయోగం

అలిస్సా
    • రచయిత, జేమ్స్ గలాఘర్
    • హోదా, హెల్త్, సైన్స్ కరెస్పాండెంట్

ఒక టీనేజీ బాలిక నయం చేయడానికి వీల్లేని క్యాన్సర్‌ బారిన పడ్డారు. అయితే, ఒక కొత్త రకమైన ఔషధాన్ని మొదటిసారి వాడగానే ఆమె శరీరంలో నుంచి క్యాన్సర్ మటుమాయమైంది.

ఆ బాలిక పేరు అలిస్సా. ఆమెకు లుకేమియా క్యాన్సర్. అనేక రకాల చికిత్సలు చేసినప్పటికీ అవి విఫలమయ్యాయి.

అందుకే ఆమెకు చికిత్స అందిస్తోన్న గ్రేట్ ఆర్మాండ్ స్ట్రీట్ ఆసుపత్రి వైద్యులు కొత్త చికిత్సను ప్రయత్నించారు.

‘బేస్ ఎడిటింగ్’ అనే సాంకేతికను ఉపయోగించి కొత్త ఔషధాన్ని తయారు చేశారు.

దీన్ని వాడిన ఆరు నెలల తర్వాత ఆమెలో క్యాన్సర్ కణాలు కనిపించలేదు. అయితే, ఒకవేళ మళ్లీ వ్యాధి తిరగబెడుతుందేమో అనే అనుమానంతో ఆమెను వైద్యులు తరచుగా పర్యవేక్షిస్తున్నారు.

లీసెస్టర్‌కు చెందిన అలిస్సా వయస్సు 13 ఏళ్లు. గతేడాది మే నెలలో ఆమెకు ‘టి-సెల్ అక్యూట్ లింపోబ్లాస్టిక్ లుకేమియా’ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.

‘టి-సెల్స్’ అనేవి శరీరానికి సంరక్షకులుగా పనిచేయాలి. కానీ, అలిస్సా విషయంలో ఇవే ప్రమాదకరంగా మారాయి. నియంత్రణ లేకుండా ఆమె శరీరంలో ఇవి పెరుగుతున్నాయి.

ఆమెలో క్యాన్సర్ చాలా వేగంగా పెరుగుతోంది. కీమోథెరపీ, ఎముకమజ్జ మార్పిడి వంటి చికిత్సలు ఆమె శరీరంలో నుంచి ఈ క్యాన్సర్ కణాలను తుదముట్టించలేకపోయాయి.

ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్ల ముందు రెండే అవకాశాలు ఉన్నాయి. 1. ప్రయోగాత్మక ఔషధాలు వాడటం, 2. చనిపోయేవరకు అలిస్సాను వీలైనంత వరకు సంతోషంగా ఉంచడం.

‘‘నేను చనిపోయి ఉండేదాన్ని’’ అని అలిస్సా అన్నారు.

ఆమె తల్లి కియోనా మాట్లాడుతూ… ‘‘గతేడాది ఈ సమయానికి క్రిస్మస్ అంటేనే భయం వేసింది. నా కూతురితో కలిసి జరుపుకునే క్రిస్మస్ ఇదే చివరిది అవుతుందని అనుకున్నా. జనవరి నెలలో ఆమె 13వ పుట్టినరోజు వస్తుంది’’ అని చెబుతూ ఆమె కన్నీరు పెట్టారు.

కీమోథెరపీకి ముందు అలిస్సా

ఫొటో సోర్స్, FAMILY PHOTO

ఫొటో క్యాప్షన్, కీమోథెరపీకి ముందు అలిస్సా

తర్వాత ఏమి జరిగిందో ఎవరూ ఊహించలేరు. జన్యుశాస్త్రంలో వచ్చిన అద్భుతమైన పురోగతి ద్వారానే ఇది సాధ్యమైంది.

గ్రేట్ ఆర్మాండ్ స్ట్రీట్ వైద్యుల బృందం, ‘బేస్ ఎడిటింగ్’ అని పిలిచే సాంకేతికతను ఉపయోగించారు. ఆరేళ్ల క్రితం ఈ సాంకేతికను తయారు చేశారు.

మానవ డీఎన్‌ఏలోని న్యూక్లిక్ యాసిడ్‌లో ఉండే న్యూక్లోబేస్‌లు మన జీవనాధారం. ఈ న్యూక్లోబేస్‌లు నాలుగు రకాలు. అవి 1. అడినైన్, 2. సైటోసిన్, 3. గ్వానైన్, 4. థైమిన్. ఈ బేస్‌ల ద్వారానే మనలో జెనెటిక్ కోడ్‌ నిర్మితమవుతుంది.

జెనెటిక్ కోడ్‌లోని ఒక నిర్ణీత భాగంలో మార్పులు చేసేందుకు ‘బేస్ ఎడిటింగ్’ సాంకేతికత ఉపయోగపడుతుంది. ఈ సాంకేతికత ద్వారా ఒక న్యూక్లోబేస్‌ పరమాణు నిర్మాణాన్ని మార్చి, దాన్ని మరో బేస్‌గా మార్చవచ్చు. దాని జన్యు సూచనల్లో కూడా మార్పులు చేసేందుకు ఇది అనుమతిస్తుంది.

అలిస్సా శరీరంలోని క్యాన్సర్ కణాలను వేటాడి, వాటిని చంపేసే సామర్థ్యం ఉన్న కొత్త రకమైన ‘టి-సెల్’ కణాలను తయారు చేయడానికి పెద్ద సంఖ్యలోని వైద్యులు, శాస్త్రవేత్తల బృందం ఈ సాంకేతికతను ఉపయోగించింది.

అలిస్సా

ఫొటో సోర్స్, FAMILY PHOTO

ఫొటో క్యాప్షన్, క్యాన్సర్ వల్ల జుట్టు ఎలాగైనా రాలిపోతుందని తెలుసుకున్న తర్వాత అలిస్సా తన జట్టును విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు

దాత నుంచి సేకరించిన ఆరోగ్యకరమైన ‘టి-సెల్’ కణాలను సవరించారు.

‘టి-సెల్’ కణాల పనితీరు ప్రక్రియను తొలి బేస్ ఎడిట్ నిర్వీర్యం చేసింది. అందువల్ల క్యాన్సర్ కణాలు, అలిస్సా శరీరంపై ఎదురుదాడి చేయలేవు.

రెండో బేస్ ఎడిట్, టి-సెల్స్‌పై ఉండే ‘సీడీ7’ అని పిలిచే కెమికల్ మార్కింగ్‌ను తొలిగించింది.

మూడో బేస్ ఎడిట్‌ అనేది కీమోథెరపీ ఔషధం వల్ల శరీరంలోని ఆరోగ్యకర కణాలు చనిపోకుండా నిరోధించింది.

చివరి దశ జన్యుసవరణలో... సీడీ7 మార్కింగ్ ఉన్న ప్రతీదాన్ని వేటాడేలా టి-సెల్ కణాలను తయారు చేశారు. ఇలా చేయడం వల్ల ఆమె శరీరంలోని క్యాన్సర్ కణాలతో సహా అన్ని టి-సెల్ కణాలు నాశనం అవుతాయి. అందుకే రెండో బేస్ ఎడిటింగ్‌లో కణాలపై ఈ కెమికల్ మార్కింగ్‌ను తొలిగించారు.

ఒకవేళ ఈ చికిత్స పనిచేస్తే, రెండోసారి ఎముకమజ్జ మార్పిడి చేస్తే అలిస్సా శరీరంలోని టి-సెల్స్‌తో సహా రోగనిరోధక వ్యవస్థ పునర్నిర్మాణం అవుతుంది.

అలిస్సా

ఫొటో సోర్స్, GREAT ORMOND STREET HOSPITAL

ఫొటో క్యాప్షన్, గ్రేట్ అర్మాండో స్ట్రీట్ ఆసుపత్రిలో 2002 మే నెలలో అలిస్సాకు థెరపీ చేస్తోన్న సీనియర్ రీసెర్చ్ నర్స్ జాన్ చౌ

వైద్యులు ఈ ప్రక్రియ గురించి అలిస్సా కుటుంబానికి వివరించినప్పుడు ఇది సాధ్యమయ్యే చికిత్సేనా అని వారు ఆలోచనలో పడ్డారు.

కానీ ఈ ప్రయోగాత్మక చికిత్స తీసుకోవాలని అలిస్సా ఈ ఏడాది మే నెలలో నిర్ణయించుకున్నారు.

‘‘ఈ సాంకేతికత ద్వారా చికిత్స పొందిన తొలి రోగి ఆమె’’ అని గ్రేట్ ఆర్మాండ్ స్ట్రీట్ , యూసీఎల్ ప్రొఫెసర్ వసీమ్ ఖాసిమ్ అన్నారు.

ఈ కొత్త సాంకేతికతలో తయారు చేసిన కణాలు, అలిస్సా శరీరంలోని క్యాన్సర్ కణాలతో పాటు ఆరోగ్యకరమైన కణాలపై కూడా దాడి చేయడంతో ఆమె బలహీనంగా మారారు.

నెల రోజుల తర్వాత అలిస్సా కాస్త కోలుకున్నారు. రోగ నిరోధక శక్తి తిరిగి పెంపొందేలా ఆమెకు రెండోసారి ఎముక మజ్జ మార్పిడి చికిత్స చేశారు.

16 వారాల పాటు అలిస్సా ఆసుపత్రిలోనే ఉన్నారు.

అలిస్సా

మూడు నెలల తర్వాత ఆమె శరీరంలో మళ్లీ క్యాన్సర్ కణాల చిహ్నాలు కనిపించంతో అందరూ ఆందోళన చెందారు. కానీ, ఇటీవలి రెండు పరీక్షల్లో వచ్చిన రిపోర్టుల్లో ఎలాంటి క్యాన్సర్ కణాల ఉనికి కనిపించలేదు.

‘‘ప్రతీ చిన్న విషయాన్ని కూడా అభినందించడం నేర్చుకోండి. ఇప్పుడు నేను ఇలా ఉండటం చాలా సంతోషంగా ఉంది. వారికి ఎప్పుడూ రుణపడి ఉంటాను.

చాలా అద్భుతంగా అనిపిస్తోంది. ఈ అవకాశాన్ని నేను పొందగలిగాను. దానికి నేను కృతజ్ఞురాలిని. భవిష్యత్‌లో ఇతర చిన్నారులకు కూడా ఈ చికిత్స సహాయపడనుంది’’ అని అలిస్సా అన్నారు.

రాబోయే క్రిస్మస్ పండగను ఎలా జరుపుకోవాలి? తన ఆంటీ వివాహంలో తోడి పెళ్లి కూతురిగా ఎలా ముస్తాబు అవ్వాలి? బైక్‌పై తిరగడం, స్కూలుకు వెళ్లడం లాంటి సాధారణ అంశాలపై ఇప్పుడు అలిస్సా ఉత్సాహం చూపిస్తున్నారు.

క్యాన్సర్ మళ్లీ తిరిగి రాకూడదని కుటుంబ సభ్యులు ఆశిస్తున్నారు.

క్యాన్సర్‌కు మందు
ఫొటో క్యాప్షన్, ‘బేస్ ఎడిటింగ్’ థెరపీని అభివృద్ధి చేసిన బృందంలో ప్రొఫెసర్ వసీమ్ ఖాసిమ్ కూడా ఒకరు

‘‘అలిస్సాను చూసి మేం ఎంత గర్వపడుతున్నామో మాటల్లో చెప్పలేను. క్లిష్ట పరిస్థితుల్ని ఆమె ఎదుర్కొన్న తీరు అద్భుతం’’ అని అలిస్సా తండ్రి జేమ్స్ అన్నారు.

లుకేమియాతో బాధపడుతున్న చాలా మంది పిల్లలకు ప్రధాన చికిత్సలు పనిచేస్తాయి.

అయితే, ఈ చికిత్స ద్వారా సంవత్సరానికి 12 మంది వరకు ప్రయోజనం పొందవచ్చని భావిస్తున్నారు.

క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా ఈ ఔషధాన్ని ఇచ్చిన 10 మందిలో అలిస్సా తొలి వ్యక్తి.

గ్రేట్ ఆర్మాండ్ స్ట్రీట్ ఆసుపత్రిలోని బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ విభాగానికి చెందిన డాక్టర్ రాబర్ట్ చీసా మాట్లాడుతూ... ‘‘చాలా ఉత్సాహాన్ని కలిగిస్తోంది. ఇది వైద్య రంగంలో కొత్త అధ్యాయం. క్యాన్సర్‌తో పోరాడేలా రోగనిరోధక వ్యవస్థను తిరిగి రూపొందించడం చాలా ఆశావహంగా అనిపిస్తోంది’’ అని అన్నారు.

బేస్ ఎడిటింగ్ సాంకేతికత ఆవిష్కర్తలలో ఒకరైన డాక్టర్ డేవిడ్ లియు మాట్లాడుతూ సామర్థ్యం మేరకు ఈ సాంకేతికతను వినియోగించడం లేదని అన్నారు.

‘‘టెక్నాలజీని ఆవిష్కరించిన ఆరేళ్ల తర్వాత రోగులకు ఈ చికిత్సను అందిస్తున్నారు. ఇది చాలా విచిత్రంగా అనిపిస్తోంది.

బేస్ ఎడిటింగ్ చికిత్స ప్రయోజనాలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. మానవ జన్యు సవరణ ప్రక్రియలో భాగం కావడం సంతోషంగా ఉంది. జన్యువులను నియంత్రించే దిశంగా సైన్స్ రంగం కీలక అడుగులు వేస్తోంది’’ అని డేవిడ్ వ్యాఖ్యానించారు.

వీడియో క్యాప్షన్, పొగ తాగని వారికీ ఊపిరితిత్తుల క్యానర్స్ వస్తోంది ఎందుకు?

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)