పేగు క్యాన్సర్ గుర్తించడమెలా, దీని లక్షణాలు ఎలా ఉంటాయి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఫిలిప్పా రాక్స్బి
- హోదా, హెల్త్ రిపోర్టర్, బీబీసీ
డేమ్ డెబోరా జేమ్స్ 40 ఏళ్ల వయసులోనే పేగు క్యాన్సర్‌తో చనిపోయారు. తనకు పేగు క్యాన్సర్ బయటపడిన తర్వాత.. దీనిపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఆమె పలు కార్యక్రమాలు చేపట్టారు. ఈ అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ప్రతి ఒక్కరూ తమ మలాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలని ప్రజలకు సూచించే వారు.
ప్రముఖ అమెరికన్ నటి కిరిస్టీ ఆలే కూడా ఈ క్యాన్సర్‌తోనే మరణించారు. ఆలస్యంగా ఈ క్యాన్సర్‌ను గుర్తించడంతో.. కిరిస్టీ ప్రాణాలు కోల్పోయారు.
ఇంతకీ, కొలోన్ క్యాన్సర్ లేదా పేగు క్యాన్సర్ అంటే ఏమిటి? దీన్ని ముందస్తుగా గుర్తించడమెలా? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం..
పేగు క్యాన్సర్ ఉన్నట్లు తెలుసుకోవడమెలా..?
మీరు ఇలా చెక్ చేసుకోవాలి...
- తగిన కారణం లేకుండానే మీ మలంలో రక్తం పడుతుండటం. ఆ రక్తం ఎరుపు రంగులో లేదా ముదురు రంగులో ఉంటుంది.
- మీ మల విసర్జన కూడా మారిపోతుంది. ఎక్కువ సార్లు టాయిలెట్‌కు వెళ్లాల్సి రావచ్చు. మలబద్ధకంగా ఉండటం లేదా విరోచనలు కావచ్చు.
- పొట్ట కింద భాగంలో నొప్పిగా ఉంటుంది. మీ పొట్ట నిండుగా, ఉబ్బరంగా ఉన్నట్లు అనిపిస్తుంది.
ఇతర లక్షణాలు:
- బరువు కోల్పోతూ ఉంటారు
- మల విసర్జన తర్వాత కూడా మీ కడుపు ఖాళీ అయినట్లు అనిపించదు. భారంగా అనిపిస్తుంది.
- చాలా అలసటగా లేదా మగతగా ఉంటుంది.
అయితే, ఈ లక్షణాలన్ని ఉన్నంత మాత్రాన పెద్ద పేగు క్యాన్సర్ వచ్చినట్లు కాదు. ఒకవేళ ఈ లక్షణాలు మూడు వారాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు కొనసాగితేే, మీరు తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి.
వారు మీ లక్షణాలను బట్టి వెంటనే చెక్ చేస్తారు. క్యాన్సర్లను ప్రాథమిక దశలో గుర్తించడం వల్ల, వీటికి చికిత్స అందించడం కూడా తేలికవుతుంది.
మలాన్ని ఎలా చెక్ చేసుకోవాలి?
- మీరు మల విసర్జనకు వెళ్లినప్పుడు, మలం ఎలా వస్తుందో చెక్ చేసుకుంటూ ఉండటం మంచిది. దీని గురించి మాట్లాడేందుకు అసలు మొహమాటపడకండి.
- మీ మలంలో రక్తం ఏమైనా వస్తుందా? అలాగే రక్తస్రావం ఏమైనా అవుతుందా? అన్నది కూడా పరీక్షించుకోవాలి.
- పైల్స్ ఉన్నప్పుడు కూడా మోషన్‌కి వెళ్లేటప్పుడు ముదురు ఎరుపు రంగులో రక్తం పడుతూ ఉంటుంది. కానీ, ఇది పెద్ద పేగు క్యాన్సర్‌కు కూడా కారణమవ్వొచ్చు.
- మలానికి వెళ్లినప్పుడు మీ కడుపులో నుంచి ఎరుపు రంగులో లేదా నల్లటి రక్తం పడుతూ ఉంటే, మీరు ఆందోళన చెందాల్సిన అవసరం ఉన్నట్లే.
- మీరు మోషన్‌కి వెళ్లే విధానం కూడా మారిపోతుంది. సాధారణం కంటే ఎక్కువసార్లు మల విసర్జనకు వెళ్లాల్సి ఉంటుంది. తీవ్ర విరోచనాలు అవుతూ ఉంటాయి.
- లేదా మీ కడుపులోని వ్యర్థాలు పూర్తిగా బయటికి వెళ్లడం లేదని మీరు భావించినప్పుడు, వెళ్లాల్సినంత వెళ్లడం లేదని అనుకున్నప్పుడు కూడా మీరు ఆందోళన చెందాల్సిన విషయమే.
- మీరు డాక్టర్‌ను సంప్రదించడానికి ముందు, మీకు ఎలాంటి లక్షణాలు ఉంటున్నాయో వాటిన్నంటిన్ని ఒక దగ్గర రాసుకోవాలని, దీని వల్ల చెకప్ సమయంలో ఏవీ మర్చిపోకుండా ఉంటారని పెద్ద పేగు క్యాన్సర్ యూకే ప్రతిపాదిస్తుంది.
- చాలా మంది కడుపులో వివిధ రకాల సమస్యలతో డాక్టర్లను సంప్రదిస్తూ ఉంటారు. మీలో ఎలాంటి మార్పులు వచ్చాయి లేదా రక్తస్రావంలో వచ్చిన మార్పులేంటి ? మలంలో రక్తం ఎలా పడుతుంది వంటి వివరాలను పూర్తిగా తెలియజేయాలి. వీటి ద్వారా వారు అసలు కారణమేంటన్నది గుర్తిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
పేగు క్యాన్సర్‌కు కారణాలేంటి?
- అయితే ఈ క్యాన్సర్‌కు అసలు కారణాలేంటన్నది ఎవరికీ తెలియదు.
- వయసు పైబడుతున్న సమయంలో, ఈ క్యాన్సర్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలా కేసుల్లో 50 ఏళ్లు పైబడిన వారే ఈ క్యాన్సర్‌కు గురవుతున్నారు.
- రెడ్ మీట్, ప్రాసెస్డ్ మీట్ ఎక్కువగా తినడం వల్ల కూడా ఈ క్యాన్సర్ రావొచ్చు.
- సిగరెట్లు తాగడం వల్ల ఎన్నో రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదముంది
- ఆల్కాహాల్‌ని ఎక్కువగా తాగడం వల్ల కూడా దీని బారిన పడవచ్చు.
- బాగా బరువు పెరగడం లేదా ఊబకాయం ఉంటే ఈ క్యాన్సర్‌కి గురికావొచ్చు.
- మీ కడుపులో క్యాన్సర్ పాలిప్స్ ఉండటంతో ట్యూమర్లు పెరుగుతాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఈ క్యాన్సర్ వంశపారపర్యంగా వస్తుందా?
చాలా కేసుల్లో పెద్ద పేగు క్యాన్సర్ వంశపారపర్యంగా రావడం లేదు. కానీ, ఎవరైనా మీ సన్నిహిత బంధువుల్లో 50 ఏళ్ల లోపున ఈ క్యాన్సర్‌కు గురైతే ఆ విషయం మీరు డాక్టర్‌కి చెప్పాలి.
లించ్ సిండ్రోమ్ వంటి కొన్ని జెనటిక్ కండీషన్లలో పేగు క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే, దీన్ని తగ్గించవచ్చు. ఈ క్యాన్సర్ ఏ దశలో ఉందో ముందస్తుగా డాక్టర్లు తెలుసుకోగలిగితే.. ఈ క్యాన్సర్‌ని నయం చేయొచ్చు.
ఆరోగ్యకరమైన జీవన విధానాలను అనుసరించడం ద్వారా సగానికి పైగా పేగు క్యానర్లను ప్రజలు తగ్గించుకోవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు.
అంటే ఎక్కువగా ఎక్సర్‌సైజు చేయడం, ఎక్కువ ఫైబర్ ఉన్నవి తింటూ, కొవ్వు తక్కువ ఉండేవి తినాలి. రోజుకి ఆరు నుంచి ఎనిమిది గ్లాస్‌ల నీటిని తాగుతూ ఉండాలి.
పేగు క్యాన్సర్ లక్షణాలు మీకు ఏమైనా కనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లడం, క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవడం మంచిది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రాథమిక దశలో గుర్తిస్తే నయం కావచ్చు
ప్రాథమిక దశలోనే పేగు క్యాన్సర్‌ను గుర్తించిన వారు, 90 శాతానికి మందికి పైగా అయిదు లేదా అంతకంటే ఎక్కువ ఏళ్లే బతకగలుగుతారు.
చివరి దశలో గుర్తించిన వారైతే 44 శాతం మంది మాత్రమే ఐదేళ్లు లేదా అంతకు మించిన ఏళ్లు బతికే అవకాశం ఉంటుంది.
బ్రిటన్‌లో గత 40 ఏళ్లలో పెద్ద పేగు క్యాన్సర్ వల్ల బతికే అవకాశాలు రెండింతలకు పైగా పెరిగాయి. సగానికి పైగా రోగులు 10 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలే బతుకుతున్నారు. 1970లో ఐదు మందిలో కేవలం ఒక్కరు మాత్రమే ఈ క్యాన్సర్ బారిని తట్టుకుని బతికే వారు.
చాలా క్యాన్సర్ల మాదిరిగానే, 15 నుంచి 40 ఏళ్ల వారిలో ఈ వ్యాధి నయమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వయసు పైబడిన వారిలో క్యాన్సర్ సోకే ప్రమాదం, చనిపోయే శాతం ఎక్కువగా ఉంటోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి?
ప్రాథమిక దశలో పేగు క్యాన్సర్‌ను గుర్తిస్తే, దాన్ని నయం చేయవచ్చు.
ఒక్కో వ్యక్తిని బట్టి దీనికి చికిత్సలు ఉన్నాయి. జెనెటిక్ పరీక్షలు చేయడానికి కూడా ఇప్పుడు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది.
ఏ దశలో క్యాన్సర్ ఉందో గుర్తిస్తే, దానికి తగ్గ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.
వాటిలో సర్జరీ, కీ మోథెరపీ, రేడియోథెరపీలో ఏదో ఒకటి కానీ, అవసరాన్ని బట్టి కలిపి కానీ చికిత్స చేస్తారు.
ఈ క్యాన్సర్ దశలు
స్టేజ్ 1 : ఇది చిన్నది, ఇతర భాగాలకు వ్యాపించదు.
స్టేజ్ 2 : ఇది పెద్దది, అయినా ఇతర భాగాలకు వ్యాపించదు.
స్టేజ్ 3 : లింఫ్ నోడ్స్ వంటి దగ్గర్లోని ఇతర కణజాలలకు కూడా ఈ క్యాన్సర్ కణాలు విస్తరిస్తాయి.
స్టేజ్ 4 : శరీరంలోని మరో అవయానికి వ్యాపించి, మరో ట్యూమర్‌ను క్రియేట్ చేస్తాయి.
ఇవి కూడా చదవండి:
- భార్యను కీలు బొమ్మగా మార్చేసే ఈ గ్యాస్‌లైటింగ్ ఏమిటి, దీన్ని మొదట్లోనే గుర్తించడం ఎలా?
- ఎలాన్ మస్క్: ట్విటర్ ఆఫీస్‌ను ‘హోటల్’గా మార్చిన కొత్త బాస్
- ఆంధ్రప్రదేశ్: జయహో బీసీ సభను అధికార పార్టీ ఎందుకు నిర్వహించింది, బీసీ కార్పోరేషన్లతో జరిగిన మేలు ఎంత ?
- సెక్స్ సరోగేట్స్: గాయపడిన సైనికులకు వారు ఎలా సాయం చేస్తున్నారు... దీనిపై అభ్యంతరాలు ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















