‘కళ్లకు గంతలు కట్టి రహస్య ప్రాంతంలోని అండర్ గ్రౌండ్‌లోకి తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారు’

బంగ్లాదేశ్ జర్నలిస్ట్ షఫీకుల్ ఇస్లామ్ కాజోల్
ఫొటో క్యాప్షన్, బంగ్లాదేశ్ జర్నలిస్ట్ షఫీకుల్ ఇస్లామ్ కాజోల్
    • రచయిత, రజిని వైద్యనాథన్
    • హోదా, దక్షిణాసియా ప్రతినిధి

‘‘నన్ను ‘జూ’లోని జంతువులా చూశారు. నా కళ్లకు గంతలు కట్టారు. కేవలం తినే సమయంలో మాత్రమే నా చేతుల సంకెళ్లను తీసేవారు.’’

బంగ్లాదేశ్ జర్నలిస్ట్ షఫీకుల్ ఇస్లామ్ కాజోల్ చెప్పిన మాటలు ఇవి. ఆయనను అందరూ కాజోల్ అని పిలుస్తారు. తనను 53 రోజుల పాటు అండర్‌గ్రౌండ్ సెల్‌లో ఉంచి చిత్రహింసలు పెట్టారని ఆయన వెల్లడించారు.

‘‘కొన్నిసార్లు నన్ను ఇంటరాగేషన్‌కు తీసుకెళ్లేముందు కొట్టేవారు. అది ఎంత బాధాకరమో నేను మాటల్లో చెప్పలేను.

నేను రాసిన కథనాల గురించి నన్ను అడిగేవారు. చాలా నరకాన్ని చూడాల్సి వచ్చింది. దాని గురించి మాట్లాడాలంటే కూడా కష్టంగా ఉంది’’ అని ఆయన చెప్పుకొచ్చారు.

కాజోల్ చెప్పిన మాటలను బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించలేకపోయింది. ఇలా వివరంగా తన కథను కాజోల్ చెప్పడం ఇదే తొలిసారి.

‘‘ఈ దేశంలో మానవ హక్కులు లేవు. నేను నిరంతరం భయంలో బతుకుతున్నా’’ అని 54 ఏళ్ల షఫీకుల్ చెప్పారు. ఒక రహస్య ప్రదేశం నుంచి ఆయన మాతో మాట్లాడారు.

రాజధాని ఢాకాలో ప్రతిపక్ష బంగ్లాదేశ్ జాతీయ పార్టీ (బీఎన్‌పీ) సభ్యులతో భద్రతా దళాల ఘర్షణ జరిగిన వారంలోనే కాజోల్ మాతో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు.

అవామీ లీగ్ పార్టీతో పాటు ప్రధానమంత్రి షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలంతా వీధుల్లోకి రావాలని బీఎన్‌పీ పిలుపునిస్తోంది.

వారి ప్రధాన ఆందోళనల్లో స్వేచ్ఛాపూరిత, న్యాయపరంగా ఎన్నికల నిర్వహణ, జీవన వ్యయం పెరుగుదలపై ఆందోళనలు, మానవ హక్కుల ఉల్లంఘన నివేదికలు ఉన్నాయి.

ప్రతిపక్ష అధికారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసమ్మతిని అణిచివేసేందుకు ఇది ప్రత్యక్ష ప్రయత్నమని విమర్శకులు అంటున్నారు.

భావ ప్రకటన స్వేచ్ఛను అణిచివేస్తోందనే ఆరోపణలను బంగ్లాదేశ్ ప్రభుత్వం కొట్టి పారేసింది.

ఢాకాలో ఈ వారం ప్రారంభంలో ప్రతిపక్ష కార్యకర్తలను చెదరగొట్టడానికి బంగ్లాదేశ్ పోలీసులు టియర్ గ్యాస్ వాడారు

ఫొటో సోర్స్, REHMAN ASAD/AFP

ఫొటో క్యాప్షన్, ఢాకాలో ఈ వారం ప్రారంభంలో ప్రతిపక్ష కార్యకర్తలను చెదరగొట్టడానికి బంగ్లాదేశ్ పోలీసులు టియర్ గ్యాస్ వాడారు

బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ మంత్రి అబ్దుల్ మోమెన్, బీబీసీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘‘చట్ట విరుద్దంగా నిరసనకారులు గుమిగూడుతున్నారు. పాకిస్తాన్‌తో యుద్ధం అనంతరం 1971లో ప్రజాస్వామ్యం, మానవహక్కులు, చట్టాన్ని స్థాపించడమే లక్ష్యంగా మా దేశం ఏర్పడింది’’ అని అన్నారు. భావప్రకటన స్వేచ్ఛను అణిచివేస్తున్నారనే ఆరోపణలను ఆయన తోసి పుచ్చారు.

2020 మార్చిలో కాజోల్ కనిపించకుండా పోయినప్పుడు, అతని గురించి ఆందోళన వ్యక్తం చేసిన సంస్థలలో ఐక్యరాజ్య సమితి కూడా ఉంది.

‘‘షఫీకుల్ ఇస్లామ్ కాజోల్ వంటి పరిశోధనాత్మక జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకోవడం వంటివి చూస్తే స్వేచ్ఛ, స్వతంత్ర మీడియా పట్ల బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతపై తీవ్రమైన ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి’’ అని ఐక్యరాజ్యసమితి ఒక ప్రకటనలో పేర్కొంది.

తాను అదృశ్యం కావడానికి ముందు రోజు కాజోల్ ఒక వార్తా కథనాన్ని ప్రచురించారు. ఒక సెక్స్ ట్రాఫికింగ్ కుంభకోణంలో రాజకీయ నాయకుల ప్రమేయంపై ఉన్న ఆరోపణలను ఆ కథనంలో వివరించారు.

ఇది ప్రచురితమైన వెంటనే అధికార అవామీ లీగ్ పార్టీకి చెందిన సభ్యుడొకరు కాజోల్‌పై, ఆ కథనంతో సంబంధమున్న ఇతరులపై కేసు పెట్టారని బీబీసీతో కాజోల్ న్యాయవాది చెప్పారు.

తర్వాతి రోజు తన కుమారుడిని పాఠశాల నుంచి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మోటార్‌బైక్‌పై ఆఫీసుకు వెళ్తుండగా 8 నుంచి 10 మంది బైకులపై తనను వెంబడించారని కాజోల్ తెలిపారు.

తనను ఒక మినీ వ్యాన్‌లోకి తోసేసి, అండర్‌గ్రౌండ్ సెల్‌కి తీసుకెళ్లినట్లు ఆయన చెప్పారు.

అదృశ్యమైన వ్యక్తుల కుటుంబ సభ్యులు
ఫొటో క్యాప్షన్, కనిపించకుండా పోయిన తమ వారి ఫొటోలతో కుటుంబ సభ్యులు

ఒక కుర్చీకి కట్టేశారని ఆయన తెలిపారు. ‘‘విచారణ సమయంలో ఆ కుంభకోణం గురించి ఎందుకు రాశావని నన్ను అడిగారు. దాదాపు 5 నుంచి 6 గంటల పాటు ఇలా విచారించారు. అదొక భయంకరమైన అనుభవం’’ అని ఆయన గుర్తు చేసుకున్నారు.

కొంతమంది అమ్మాయిల ఫొటోలను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వారిని వేధింపులకు గురిచేసినందుకు కాజోల్‌ను అరెస్ట్ చేసినట్లు బంగ్లాదేశ్ హోం మంత్రి ఒక ప్రకటనలో బీబీసీతో చెప్పారు.

‘‘ఆ అమ్మాయిలు, షఫీకుల్ ఇస్లామ్ కాజోల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పుడు కాజోల్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. చట్ట ప్రకారం మరుసటి రోజు అతనిని కోర్టులో హజరుపరిచారు’’ అని మంత్రి వ్యాఖ్యానించారు.

కాజోల్‌ను 50 రోజులకు పైగా అండర్‌గ్రౌండ్‌ సెల్‌లో ఉంచారనే దాన్ని మంత్రి ఖండించారు.

బంగ్లాదేశ్‌లో రహస్య నిర్బంధ స్థావరాల ఉనికికి సంబంధించిన సాక్ష్యాలను విన్నామని హ్యుమన్ రైట్స్ వాచ్ చెప్పింది. ప్రభుత్వం వీటిపై దర్యాప్తు చేయాలని, ఇప్పటికీ ఎవరైనా బందీగా ఉంటే వారిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరింది.

నెల రోజుల తర్వాత భారత్‌కు సమీపంలోని ఒక పొలంలో తనను పడేసినట్లు ఆయన చెప్పారు. అప్పుడు కూడా చేతులు కట్టేసి, కళ్లకు గంతలు కట్టారని కాజోల్ తెలిపారు.

అక్కడ తనను సరిహద్దు అధికారులు అదుపులోకి తీసుకొని జైలులో పెట్టినట్లు చెప్పారు. 237 రోజులు జైలులో గడిపారు. 13 అప్పీళ్ల తర్వాత 2020 డిసెంబర్‌లో బెయిల్ మీద విడుదల అయ్యారు.

వీడియో క్యాప్షన్, గతేడాది జరిగిన దారుణాలను మళ్లీ జరగనివ్వబోమంటున్న స్థానికులు

జైలులో ఉన్నప్పుడు ఆయనపై బంగ్లాదేశ్ డిజిటల్ సెక్యూరిటీ చట్టం (డీఎస్‌ఏ) కింద పరువు నష్టం అభియోగాలు మోపారు.

ఈ చట్టం చాలా క్రూరమైనదని, ఆన్‌లైన్‌లో ఏరకమైన అసమ్మతి తెలిపినా దాన్ని నేరంగా పరిగణిస్తుందని విమర్శకులు అంటున్నారు. ఫేస్‌బుక్ పోస్ట్‌ను కూడా నేరంగా పరిగణించే అవకాశం ఉందని చెబుతున్నారు.

2018లో ఈ చట్టం వచ్చినప్పటి నుంచి వేలాది మందిపై ఈ చట్ట ప్రకారం అభియోగాలు మోపారు.

కాజోల్ ఎదుర్కొన్న కఠినపరీక్షలు, ప్రభుత్వంపై విమర్శలను నిశ్శబ్ధంగా అణిచివేయడానికి భద్రతా బలగాలు ఉపయోగించే విలక్షణమైన వ్యూహాలని మానవ హక్కుల సంస్థలు వ్యాఖ్యానించాయి.

బంగ్లాదేశ్ మానవ హక్కుల సంఘాల ప్రకారం, 2009 నుంచి బంగ్లాదేశ్ భద్రతా బలగాల చేతుల్లో దాదాపు 600 మంది బాధితులుగా మారారు.

2022 ఆగస్టులో ప్రచురితమైన ఐక్యరాజ్య సమితి వర్కింగ్ గ్రూప్ నివేదిక ప్రకారం, ఇలా బలగాల చేతుల్లో అదృశ్యమైన వారిలో 72 మంది బాధితులు ఇంకా కనిపించడం లేదు.

ఐక్యరాజ్యసమితి నివేదికలోని బాధితుల సంఖ్యను విదేశాంగ మంత్రి మోమెన్ తోసిపుచ్చారు. రాజకీయ ప్రేరేపితమైన కొన్ని వర్గాల నుంచి యూఎన్‌కు ఈ సమాచారం వెళ్లి ఉంటుందని ఆయన అన్నారు.

అయితే, అదృశ్యమైన తమ వారు తిరిగి వస్తారని కుటుంబసభ్యులు ఎదురుచూస్తున్నారు. తాము నిజాలే చెబుతున్నామని వారు అంటున్నారు.

సాజిదుల్ ఇస్లామ్ షుమాన్
ఫొటో క్యాప్షన్, తొమ్మిదేళ్లుగా సాజిదుల్ ఇస్లామ్ షుమాన్ కనిపించడం లేదు

సాజిదుల్ ఇస్లామ్ షుమాన్, ప్రతిపక్ష బంగ్లాదేశ్ జాతీయ పార్టీ (బీఎన్‌పీ)కి స్థానిక పార్టీ ఆర్గనైజర్‌గా పనిచేసేవారు. ఆయన చివరిసారిగా 2013 డిసెంబర్‌లో కనిపించారు.

సాధారణ ఎన్నికలకు కొన్ని వారాల ముందు, అవామీ లీగ్ ప్రభుత్వ బెదిరింపులకు భయపడి, తన కుటుంబ క్షేమం దృష్ట్యా ఆయన తాత్కాలికంగా ఇంటి నుంచి వెళ్లిపోయారు.

ఎలైట్ పారామిలిటరీ ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ (ఆర్‌ఏబీ)కి చెందిన భద్రతా దళాలు, సాజిదుల్‌ను చుట్టుముట్టి చేతులకు సంకెళ్లు వేసి, కళ్లకు గంతలు కట్టి తీసుకెళ్లారని సాక్షుల ద్వారా వారి కుటుంబానికి తెలిసింది.

ఈ ఘటనకు కొన్ని రోజుల క్రితమే ఆయన సోదరి సంజిదా, ఆయనను చూశారు. ఏడాది వయస్సున్న తన కూతురు అర్వాను చూడటానికి ఇంటికి వచ్చినప్పుడు సంజిదా ఆయనను చూశారు.

‘‘డిసెంబర్ కాబట్టి అప్పుడు చాలా చలిగా ఉంది. బయట చలిని తట్టుకోవడం కోసం లేత నీలిరంగు హుడీని నేను అతనికి ఇచ్చాను. అతనికి నేను ఇచ్చిన చివరి వస్తువు అదే’’ అని సంజిదా గుర్తు చేసుకున్నారు.

ఇప్పుడు అర్వాకు పదేళ్లు. తన తండ్రి ఫొటోను చూపించిన ప్రతీసారి దాన్ని ముద్దుపెట్టుకుంటూ డాడీ ఎప్పుడు వస్తారు అని అర్వా అడుగుతుందని సంజిదా చెప్పారు.

తమ లాగే ఇలా సోదరులను, భర్తలను, కుమారులను, తండ్రులను కోల్పోయిన మహిళల కోసం సంజిదా ఇప్పుడు మేయర్ డాక్ అనే సపోర్ట్ నెట్‌వర్క్‌ను నడుపుతున్నారు.

చాలా కుటుంబాలు తమ ఏకైక జీవనోపాధిని కోల్పోయాయి. తమ వారిని కోల్పోయామనే వ్యక్తిగత బాధతో పాటు పేదరికంతో వారు పోరాడుతున్నారు.

సాజిదుల్ ఇస్లామ్ షుమాన్
ఫొటో క్యాప్షన్, సాజిదుల్ ఇస్లామ్ షుమాన్ కుటుంబ సభ్యులు

న్యాయం కోరుతూ ఈ వారాంతంలో జరిగే ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో తాము కూడా పాల్గొంటామని సంజిదాతో సహా బాధిత కుటుంబాల వారు చెబుతున్నారు.

తమ కుటుంబ సభ్యులు కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్‌లో కేసులు పెట్టడానికి సంజిదాతో సహా చాలామంది ప్రయత్నించారు. కానీ, కేసులో ప్రభుత్వ భద్రతా బలగాల ప్రస్తావన రాకూడదంటూ పోలీసులు చెప్పడంతో వారు చేసేదేమీ లేక వెనుదిరిగారు.

ప్రస్తుతం 70వ పడిలో ఉన్న ఆమె తల్లి అనారోగ్యంతో ఉన్నారు. తన కుమారుడు కనిపించడం లేదంటూ ఆమె ప్రతీ వారం పోలీస్ స్టేషన్‌కు వెళ్లేవారు.

తమకు న్యాయం జరుగుతుందని వారు నమ్మకంగా ఉన్నారు.

‘‘అతనికి ఏం జరిగిందో మాకు తెలిసేంతవరకు ఆయన బతికున్నాడో లేదో మేం నిర్ణయించలేం’’

అదనపు రిపోర్టింగ్ అమీర్ పీర్జాదా

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)