రోహింజ్యాలు: భారత్‌లో శరణార్థులకు ఎలాంటి చట్టాలు ఉన్నాయి... రోహింజ్యాల విషయంలో తాజా వివాదం ఏంటి?

రోహింజ్యా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఖుష్బూ సంధు, మెరిల్ సెబాస్టియన్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

రోహింజ్యాలకు దేశ రాజధానిలో ఇళ్లు, భద్రత కల్పించే ఆలోచనల్లో ఉన్నామని ఇటీవల ఒక మంత్రి చేసిన ప్రకటనను భారత ప్రభుత్వం ఖండించింది. దాంతో, భారతదేశంలో శరణార్థుల విధానం (రెఫ్యుజీ పాలసీ) మళ్లీ చర్చల్లోకి వచ్చింది.

గృహ, పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పూరీ బుధవారం ఒక ట్వీట్‌లో, "రోహింజ్యాలను దిల్లీలోని బక్కర్‌వాలా ప్రాంతంలోని ఈడబ్ల్యూఎస్ ఫ్లాట్‌లకు తరలించనున్నామని", వారికి "ప్రాథమిక సౌకర్యాలు కల్పిస్తామని" పేర్కొన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ఆయన ట్వీట్ వెలువడిన కొన్ని గంటల్లోనే, భారత ప్రభుత్వం స్పందిస్తూ, "శరణార్థులు దేశాన్ని విడిచివెళ్లేవరకు నిర్బంధ శిబిరాల్లోనే ఆశ్రయం పొందుతారని" స్పష్టం చేసింది.

రోహింజ్యా ముస్లింలను మియన్మార్‌లోని చాలా మంది బౌద్ధులు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా తరలివచ్చిన వలసదారులుగా పరిగణిస్తారు.

సొంత దేశంలో వేధింపులకు తట్టుకోలేక, వారంతా 1970లలోనే భారతదేశానికి రావడం మొదలుపెట్టారు. ఇప్పుడు, దేశంలోని చాలా ప్రాంతాల్లో వాళ్లు వ్యాపించి ఉన్నారు. కొందరు దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారు.

2017 ఆగస్టులో మియన్మార్ ఆర్మీ తిరుగుబాటు కారణంగా లక్షలాది రోహింజ్యాలు ఆ దేశం విడిచి పారిపోయారు.

హ్యూమన్ రైట్స్ వాచ్ అంచనా ప్రకారం, భారతదేశంలో దాదాపు 40,000 మంది రోహింజ్యాలు ఉన్నారు. వారిలో కనీసం 20 వేల మంది ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్‌లో తమ పేరు నమోదు చేసుకున్నారు.

కాగా, భారతదేశం శరణార్థులకు ఆశ్రయం ఇవ్వడానికి బదులు, వారిని దేశం నుంచి బయటకు పంపే ప్రయత్నాలు చేస్తోందని హక్కుల సంఘాలు విమర్శిస్తున్నాయి.

అయితే, రోహింజ్యాలకు గృహ వసతి కల్పించాలన్న హర్దీప్ సింగ్ పూరీ ప్రతిపాదన "పూర్తిగా సరైనది" అని సీనియర్ న్యాయవాది కాలిన్ గోన్సాల్వేస్ బీబీసీతో అన్నారు.

"రోహింజ్యాలను నిర్బంధ శిబిరాల్లో ఉంచలేం. ఎందుకంటే వాళ్లేం నేరం చేయలేదు. సొంత దేశంలో హింస నుంచి తప్పించుకోవడానికి పారిపోయి ఇక్కడకు వస్తారు" అని ఆయన అన్నారు.

రోహింజ్యా

ఫొటో సోర్స్, Getty Images

భారతదేశం శరణార్థులతో ఎలా వ్యవహరిస్తుంది?

భారతదేశంలో శరణార్థులకు సంబంధించి ఒక జాతీయ విధానం లేదా చట్టం లేదు.

అయితే, మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తన ట్వీట్‌లో, "భారతదేశం, ఐక్యరాజ్య సమితి (యూఎన్) రెఫ్యూజీ కన్వెన్షన్ 1951ని గౌరవిస్తుంది, అనుసరిస్తుంది. జాతి, మతంతో సంబంధం లేకుండా శరణార్థులందరికీ ఆశ్రయం కల్పిస్తుంది" అని రాశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

కాగా, 1951 యూఎన్ కన్వెన్షన్ లేదా 1967 ప్రోటోకాల్ వంటి అంతర్జాతీయ చట్టాలపై భారతదేశం సంతకం చేయలేదు. 1967 ప్రోటోకాల్.. శరణార్థులకు ఆశ్రయం పొందే హక్కులను రక్షిస్తుంది. అలాగే, వారికి ప్రాణహాని ఉన్న దేశాలకు తిరిగి పంపకుండా అడ్డుకుంటుంది.

ఇలా శరణార్థుల విషయంలో ఒక విధానం లేకపోవడం వలన, అధికారంలో ఏ పార్టీ ఉన్నా, యధేచ్ఛగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంటుందని నిపుణులు అంటున్నారు.

యునైటెడ్ నేషన్స్ హై కమీషనర్ ఫర్ రెఫ్యూజీస్ (యూఎన్‌హెచ్‌సీఆర్) ప్రకారం, శరణార్థులు ప్రధానంగా భారతదేశంలోని పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వారిలో 46 శాతం మహిళలు, బాలికలు కాగా, 36 శాతం పిల్లలు ఉన్నారు.

భారత్‌కు వచ్చే శరణార్థుల వద్ద ఎలాంటి పత్రాలు ఉండవు కాబట్టి, వారికి "ఆరోగ్యం, విద్య, ఉపాధి వంటి ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో ఉండవు" అని అని ’రైట్స్ అండ్ రిస్క్ అనాలిసిస్ గ్రూప్’ డైరెక్టర్ సుహాస్ చక్మా అన్నారు.

భారత ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన శరణార్థులు విద్య, వైద్యం, ఉపాధి, శిబిరాల్లో ఆవాసం పొందవచ్చు.

అయితే, యుఎన్‌హెచ్‌ఆర్‌సీలో నమోదు చేసుకున్న వారికి దైనందిన జీవితంలో రక్షణ లభించదని, ప్రభుత్వం నుంచి నివాస అనుమతులు పొందడం కష్టమని మానవ హక్కుల న్యాయవాది నందితా హక్సర్ ఈ సంవత్సరం ప్రారంభంలో చెప్పారు.

వీడియో క్యాప్షన్, ‘చనిపోయిన వాళ్లను మా కళ్లెదుటే సముద్రంలో పారేశారు’

రెఫ్యూజీలతో వ్యవహారంపై చట్టం ఏం చెబుతోంది?

శరణార్థులకు ఆశ్రయం ఇచ్చే ఎలాంటి విధానం భారతదేశంలో లేదని, వీసా లేకుండా దేశంలోకి ప్రవేశించే వారిని విదేశీయుల చట్టం లేదా ఇండియన్ పాస్‌పోర్ట్ చట్టం ప్రకారం అక్రమ వలసదారులుగా పరిగణిస్తారని చక్మా చెప్పారు.

వాళ్లకు వర్తించే చట్టాలు రెండే.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు, ఆర్టికల్ 14 ప్రకారం అధికార దుర్వినియోగం నుంచి రక్షణ.

2019లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) ఆమోదించింది. ఇది వారికి క్షమాభిక్షను అందిస్తుంది. అలాగే, పొరుగున ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ అఫ్గానిస్తాన్ వంటి దేశాల నుంచి వచ్చే ముస్లిమేతర "అక్రమ వలసదారుల"కు భారతీయ పౌరసత్వం లభించే మార్గాన్ని సులభతరం చేస్తుంది.

అయితే, ఈ చట్ట సవరణపై దేశవ్యాప్తంగా అభ్యంతరాలు వెలువడ్డాయి. ఈ చట్టం, రాజ్యాంగం కల్పించిన లౌకిక విలువలకు విరుద్ధంగా ఉందని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ముస్లిం సంఘాలు ఆరోపించాయి.

రోహింజ్యా

ఫొటో సోర్స్, Getty Images

వివిధ శరణార్థుల పట్ల వ్యవహారించే తీరు

దేశంలో శరణార్థులకు ఒక ప్రత్యేక చట్టం లేనందున అందరి పట్ల ఒకేలాంటి వ్యవహారం ఉండదు.

"రాష్ట్ర, జాతీయ ప్రభుత్వాల భౌగోళిక రాజకీయాలు, రాజకీయ ఆలోచనల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారు" అని మిస్టర్ చక్మా అన్నారు.

1971లో బంగ్లాదేశ్ స్వతంత్ర పోరాటానికి భారతదేశం మద్దతు ఇచ్చింది. అక్కడి నుంచి వచ్చిన వేలాది శరణార్థులకు ఆశ్రయం కల్పించింది.

తమిళనాడు ప్రభుత్వం శ్రీలంక తమిళ శరణార్థులకు భత్యం అందిస్తుందని, ఉద్యోగాలు పొందేందుకు అనుమతిస్తుందని జర్నలిస్ట్ నిరుపమ సుబ్రమణియన్ చెప్పారు.

2009లో శ్రీలంకలో అంతర్యుద్ధం ముగిసిన తరువాత, తమిళ శరణార్థులు యూఎన్‌హెచ్‌సీఆర్ వంటి ఏజెన్సీలను సంప్రదించి, వెనక్కి తిరిగి వెళ్లాలనుకుంటున్నారో, లేదో నిర్ణయించుకోవచ్చు.

1959లో టిబెట్‌లో చైనా వ్యతిరేక తిరుగుబాటు విఫలమైన తరువాత, అక్కడి నుంచి పారిపోయి వచ్చిన దలైలామాకు భారతదేశం ఆశ్రయం కల్పించింది. అలాగే, ఎన్నో ఏళ్లుగా టిబెటన్ శరణార్థులకు మద్దతు ఇస్తున్నది.

2018లో వూహాన్‌లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో భారత ప్రధాని మోదీ సమావేశం (వూహాన్) తరువాత, భారత ప్రభుత్వ అధికారులు దలైలామా లేదా టిబెటన్ అధికారులు హాజరైన కార్యక్రమాలకు హాజరు కాకుండా ఉండడం మేలని భారత విదేశాంగ శాఖ సూచించింది.

అయితే, 2021లో లద్దాఖ్‌లో సరిహద్దుల వద్ద ఘర్షణలు చెలరేగడంతో భారత్, చైనాల మధ్య సంబంధాలు సన్నగిల్లాయి.

జనవరిలో, టిబెటన్ పార్లమెంట్-ఇన్-ఎక్సైల్ నిర్వహించిన కార్యక్రమానికి భారత ప్రభుత్వం మంత్రులు హాజరు కావడంపై చైనా ఆందోళన వ్యక్తం చేసినప్పుడు, వారి వ్యాఖ్యలు "అనుచితమని" కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

2017లో రోహింజ్యా శరణార్థులలో కొంతమందిని దేశం నుంచి బహిష్కరించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయంగా దుమారం రేపింది.

వారు శరణార్థులు కాదని, "అక్రమ వలసదారులు" అని అప్పటి హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నొక్కి చెప్పారు.

"హిందూ అతివాదులకు తమ పునాదులను శక్తివంతం చేసుకోవడానికి రోహింజ్యా సాకు దొరికిందని" విశ్లేషకుడు సుబీర్ భౌమిక్ ఆ సమయంలో బీబీసీతో చెప్పారు.

రోహింజ్యాలను ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాలకు పంపించడం ద్వారా అంతర్జాతీయ చట్టపరమైన బాధ్యతలను ఉల్లంఘించిందని, "శరణార్థుల రక్షణ హక్కును తీవ్రంగా ఉల్లంఘించిందని" జాతి వివక్షపై ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి టెండాయి అచియుమ్ అన్నారు.

శ్రీలంక తమిళ శరణార్థులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తమిళనాడు ప్రభుత్వం శ్రీలంక తమిళ శరణార్థులకు భత్యం అందిస్తుంది

'చట్టపరమైన విధానం అవసరం'

"ఇది జాతీయ భద్రతకు సంబంధించిన సమస్య అని ప్రభుత్వాలు తరచూ చెబుతూనే ఉన్నాయి" అని చక్మా అన్నారు.

కొన్ని సందర్భాల్లో, వారి వలన ఎటువంటి ముప్పు లేదని, వారిని వెనక్కి పంపడం వల్ల వారి జీవితాలు ప్రమాదంలో పడతాయని తేలినప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని వారిని దేశం వెలుపలకి పంపకుండా ఆపింది.

భారతదేశంలోకి ప్రవేశించిన శరణార్థులు తమ పేరును నమోదు చేసుకునేందుకు, తత్కాలీన, ఏకపక్ష నిర్ణయాల నుంచి రక్షణ పొందగలిగేలా ఒక చట్టపరమైన విధానం అవసరమని చక్మా అభిప్రాయపడ్డారు.

అయితే, దీనికి చట్టపరమైన పునాది ఇప్పటికే ఉందని, రాజ్యాంగం శరణార్థుల హక్కులను రక్షిస్తుందని హ్యూమన్ రైట్స్ లా నెట్‌వర్క్స్ వ్యవస్థాపకుడు, న్యాయవాది కాలిన్ గోన్సాల్వేస్ అన్నారు.

రోహింజ్యాలను సరిహద్దులకు ఆవల మియన్మార్‌కు నెట్టి, వాళ్ల ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితులు కల్పించడం, భారత రాజ్యాంగం ఇచ్చే జీవించే హక్కును ఉల్లంఘించడమేనని ఆయన అన్నారు.

"ప్రస్తుతం చాలా మంది రోహింజ్యా శరణార్థులను దేశం నుంచి బహిష్కరించకపోవడానికి కారణం, సుప్రీం కోర్టులో వరుస కేసులు ఉండడమే. ఈ విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని కోర్టు ప్రభుత్వానికి చెప్పింది" అని గోన్సాల్వేస్ బీబీసీకి తెలిపారు.

శరణార్థులను వెనక్కి పంపించకుండా ఉండడం అనేది ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కులో భాగమేనని అత్యున్నత న్యాయస్థానం 1996లో తీర్పునిచ్చింది.

ఇది దేశంలో ఉన్న అందరికీ వర్తిస్తుంది. "దేశ పౌరులైనా, కాకపోయినా ఈ తీర్పు అందరికీ వర్తిస్తుంది" అని గోన్సాల్వేస్ వివరించారు.

ప్రభుత్వం దీన్ని అమలు చేస్తే చాలని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)