Cancer Killing Virus: ట్రయల్ దశలోనే రోగుల్లో క్యాన్సర్‌ను మాయం చేసిన కొత్త మందు

క్యాన్సర్ కిల్లింగ్ వైరస్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మిషెల్ రాబర్ట్స్
    • హోదా, డిజిటల్ హెల్త్ ఎడిటర్

ఒక కొత్త రకమైన క్యాన్సర్‌ థెరపీ, ట్రయల్స్‌లో మంచి ఫలితాలను కనబర్చుతోందని యూకే శాస్త్రవేత్తలు చెప్పారు. హానికారక క్యాన్సర్ కణాలను నాశనం చేయడానికి ఒక సాధారణ వైరస్‌ను ఈ థెరపీలో వాడుతారు.

ఈ కొత్త థెరపీ వల్ల ఒక రోగికి క్యాన్సర్ పూర్తిగా మాయం కాగా, మరికొందరిలో క్యాన్సర్ కణితులు తగ్గిపోయాయి.

హెర్పస్ సింప్లెక్స్ అనే డ్రగ్‌ను క్యాన్సర్ ట్యూమర్లను నాశనం చేసే విధంగా మార్పు చేశారు.

దీనిపై మరింత అధ్యయనం చేయాల్సి ఉంది. అడ్వాన్స్‌డ్ క్యాన్సర్‌లతో బాధపడే వ్యక్తులకు ఈ ఇంజెక్షన్‌తో జీవన కాలం పెంచవచ్చని నిపుణులు అంటున్నారు.

రాయల్ మర్స్‌డన్ ఎన్‌హెచ్‌ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్‌లో 'ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్' నిర్వహిస్తోన్న మొదటి దశ సేఫ్టీ ట్రయల్స్‌లో పాల్గొన్న రోగులలో పశ్చిమ లండన్‌కు చెందిన 39 ఏళ్ల వికోవ్‌స్కీ ఒకరు. ఆయన ఒక బిల్డర్.

2017లో వికోవ్‌స్కీకి సాలివరీ గ్లాండ్స్ (లాలాజల గ్రంథులు) క్యాన్సర్ నిర్ధరణ అయింది. శస్త్రచికిత్సతో పాటు ఇతర చికిత్సలు తీసుకున్నప్పటికీ ఆయన క్యాన్సర్ కణితి పెరగడం ఆగలేదు.

''క్యాన్సర్ తగ్గడానికి నాకు చేయాల్సిన చికిత్సలన్నీ చేశామని చెప్పారు. అయినా ఎలాంటి ఉపయోగం లేదు. చికిత్సలు పనిచేయడం మానేశాయి. నేను చాలా కలత చెందాను. అప్పుడే ఈ ట్రయల్‌లో పాల్గొన్నాను. ఇలాంటి అవకాశం నాకు ఇవ్వడం అసలు నమ్మశక్యంగా లేదు.

వికోవ్‌స్కీ

ఫొటో సోర్స్, KRZYSZTOF WOJKOWSKI

ఫొటో క్యాప్షన్, వికోవ్‌స్కీ

నేను అయిదు వారాల పాటు ఇంజెక్షన్లు తీసుకున్నా. ప్రతి రెండు వారాలకు ఒకసారి ఇంజెక్షన్ చేశారు. దీంతో నాకు క్యాన్సర్ పూర్తిగా తగ్గిపోయింది. రెండేళ్లుగా నేను క్యాన్సర్ లేకుండా జీవిస్తున్నా'' అని ఆయన చెప్పారు.

స్వల్ప కాల వైరస్ థెరపీ, ఆయనలో క్యాన్సర్‌ను పూర్తిగా తగ్గించినట్లు అనిపించింది. హెర్పస్ వైరస్‌ను ప్రత్యేకంగా సవరించి క్యాన్సర్‌ను నిర్మూలించేలా తయారు చేశారు.

నేరుగా క్యాన్సర్ కణితికే ఈ ఇంజెక్షన్లు ఇస్తారు. ఇది రెండు రకాలుగా క్యాన్సర్ కణాలపై దాడి చేస్తుంది. 1. క్యాన్సర్ కణాల్లోకి చొచ్చుకెల్లి వాటిని బద్ధలు చేయడం. 2. రోగ నిరోధక శక్తిని ప్రేరేపించడం.

ట్రయల్లో భాగంగా 40 మంది రోగులకు చికిత్సను అందించారు. ఇందులో కొందరికీ 'ఆర్‌పీ 2' అని పిలిచే వైరస్ ఇంజెక్షన్‌ను ఇచ్చారు. మిగతావారికి 'నివాల్యుమాబ్' అనే క్యాన్సర్ డ్రగ్‌ను అందించారు.

వీటి ఫలితాలను ఫ్రాన్స్‌లో జరిగిన మెడికల్ కాన్ఫరెన్స్‌లో ప్రదర్శించారు. అవేంటంటే..

  • తొమ్మిది మంది రోగుల్లో ముగ్గురికి ఆర్‌పీ 2 ఇంజెక్షన్ ఇచ్చారు. ఆ ముగ్గురిలో వికోవ్‌స్కీ కూడా ఉన్నారు. వీరి క్యాన్సర్ ట్యూమర్లు తగ్గిపోయాయి.
  • ముప్పై మందిలో ఏడుగురికి ఈ రెండు చికిత్సలు అందజేశారు. వారికి కూడా ప్రయోజనం కలిగింది.
  • అలసట వంటి తేలికపాటి దుష్ప్రభావాలు కలిగాయి.
వీడియో క్యాప్షన్, పొగ తాగని వారికీ ఊపిరితిత్తుల క్యానర్స్ వస్తోంది ఎందుకు?

ఈ చికిత్స ఫలితాలు నిజంగా ఆకట్టుకుంటున్నాయని ప్రముఖ పరిశోధకుడు ప్రొఫెసర్ కెవిన్ హ్యారింగ్‌టన్, బీబీసీతో అన్నారు. అధునాతన క్యాన్సర్లయిన గులెట్ (అన్నవాహిక), అరుదైన రకమైన కంటి క్యాన్సర్ల విషయంలో కూడా ఈ చికిత్స మంచి ఫలితాలను ఇస్తుందని కెవిన్ వ్యాఖ్యానించారు.

''క్లినికల్ ట్రయల్స్ తొలి దశల్లోనే ఇలాంటి మంచి ఫలితాలు కనిపించడం చాలా అరుదు. ఈ చికిత్స ఎంత సురక్షితమైనదో తెలుసుకోవడమే లక్ష్యంగా ట్రయల్స్ నిర్వహించాం. చాలా అధునాతన క్యాన్సర్ల బారిన పడిన వారిని, చికిత్సలు పనిచేయడం మానేసిన వారిపై ఈ పరీక్షలు జరిపాం'' అని కెవిన్ వివరించారు.

క్యాన్సర్‌పై పోరాటానికి ఒక వైరస్‌ను శాస్త్రవేత్తలు ఉపయోగించడం ఇదే మొదటిసారి కాదు. కొన్నేళ్ల క్రితమే చర్మ క్యాన్సర్ చికిత్స కోసం 'టి-వెక్' అనే జలుబు వైరస్ ఆధారిత థెరపీని ఎన్‌హెచ్‌ఎస్ ఆమోదించింది.

'టి-వెక్' కంటే 'ఆర్‌పీ 2' ప్రభావవంతమైనదని ప్రొఫెసర్ హ్యారింగ్టన్ అన్నారు.

''ఈ వైరస్‌లో మరింత సవరణలు జరిగాయి. కాబట్టి దీన్ని ఎప్పుడైతే క్యాన్సర్ కణాల్లోకి పంపిస్తామో, అప్పుడు మరింత శక్తిమంతంగా వాటిని అణిచివేస్తుంది'' అని చెప్పారు.

ఈ ప్రోత్సాహకరమైన ఫలితాలు, క్యాన్సర్ చికిత్స గతులను మార్చగలవని యూకే క్యాన్సర్ రీసెర్చ్‌కు చెందిన డాక్టర్ మరినే బేకర్ అన్నారు.

''క్యాన్సర్ చికిత్సలో వైరస్‌లు ఉపయోగపడతాయని 100 ఏళ్ల క్రితమే శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కానీ, వాటిని సురక్షితంగా, ప్రభావవంతంగా ఉపయోగించడమే సవాలుగా నిలిచింది.

కొత్త వైరల్ థెరపీ ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఇది ఎంత బాగా పనిచేస్తుందో తెలుసుకోవడానికి మరిన్ని అధ్యయనాలు చేయాలి. ఇలాంటి వైరస్ థెరపీలు, క్యాన్సర్‌ను నిర్మూలించే టూల్‌కిట్లలో ఒక భాగంగా మారవచ్చు'' అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

వీడియో క్యాప్షన్, రొమ్ము క్యాన్సర్ సోకిన తర్వాత బిడ్డకు జన్మనివ్వొచ్చా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)