పిల్లల్ని కనండి ప్రోత్సహకాలు అందుకోండి.. అంటున్న జపాన్ సహా పలు ప్రపంచ దేశాలు
పిల్లల్ని కనండి.. డబ్బులిస్తాం అంటోంది జపాన్ ప్రభుత్వం. అక్కడి ప్రజలకు ఇదేం కొత్త విషయం కాదు. ఆ దేశంలో 1972 నుంచే చైల్డ్ బెన్‌ఫిట్ యాక్ట్ అమలులో ఉంది.
అప్పట్లో జననాల రేటు పెంచేందుకు జపాన్ చేసిన ఆలోచన ఇది. తర్వాత ఈ నజరానాను కొద్దికొద్దిగా పెంచుతూ వచ్చింది కూడా.. బిడ్డ పుట్టగానే ఇచ్చే 2 లక్షల 52 వేల 338 రూపాయలను ఇప్పుడు 3లక్షల 4వందలకు పెంచింది.
జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాతో గత వారం జరిపిన చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు జపాన్ శిశు సంక్షేమ శాఖ మంత్రి . ఈ పథకాన్ని 2023 నుంచి అమలు చేయనున్నట్లు జపాన్ మీడియా సంస్థలు చెబుతున్నాయి.
జపాన్ జనం ఏమంటున్నారు?
ఇలాంటి స్కీముల వల్ల జపాన్ జనాభా పెరుగుతుందా అంటే.. డౌటే. జపాన్‌లో ఒక డెలివరీ కోసం ఆ దేశ పౌరులు 2,88,000 రూపాయలు ఖర్చు చేస్తారు. అంటే ప్రభుత్వ అందిస్తున్న డబ్బులో డెలివరీ ఖర్చులు పోగా వారికి మిగిలేది కేవలం 12,400 రూపాయలు మాత్రమే.
2021లో జపాన్ ప్రభుత్వం నివేదిక ప్రకారం జననాల రేటు 10 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది. 2060 కల్లా ప్రతి10 మందిలో లో నలుగురు 65 ఏళ్లవారే ఉంటారనేది ఓ అంచనా.
జనాభా తగ్గడం అంటే వర్క్ ఫోర్స్ తగ్గిపోవడం, జీడీపీ పడిపోవడం, ఆర్థికంగా వెనకబడిపోవడం. అందుకే పిల్లల్ని కనడాన్ని ప్రోత్సహిస్తోంది టోక్యో నాయకత్వం.

ఫొటో సోర్స్, Getty Images
పిల్లల్ని కంటే నజరానా ఇస్తున్న మరికొన్ని దేశాలు
జపాన్ లాగే జర్మనీ , రష్యా , తైవాన్, యూరోపియన్ దేశాల్లోనూ జననాల రేటు తగ్గుతోంది. దీంతో కొన్ని దేశాలు జనాభా పెంచేందుకు కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని ఆయుధంగా మార్చుకుంటున్నాయి. ఈ దేశాలన్నీ బేబీ బోనస్ స్కీమ్ అమలు చేస్తున్నాయి.
కోవిడ్ కారణంగా సింగపూర్‌లోని చాలా జంటలు పిల్లల్ని వద్దనుకోవడంతో వారికి ఆర్థిక సాయం అందిస్తామని పిల్లల్ని కనాలంటూ ప్రోత్సహిస్తోంది అక్కడి ప్రభుత్వం. మొదటి బిడ్డకు 4 లక్షల 80 వేల రూపాయలు మూడో బిడ్డకు ఆరు లక్షల రూపాయల డబ్బును అందజేస్తోంది.
అంతేనా.... తల్లిదండ్రులకు కూడా చైల్డ్ డెవలప్‌మెంట్ బోనస్ కింద 3లక్షల 41 వేల రూపాయల వరకు ఇస్తోంది.
ఇవి కూడా చదవండి:
- వహాయ: ఐదో భార్య పేరుతో సెక్స్ బానిసలుగా బాలికలు.. ప్రభుత్వం నిషేధించేవరకు పోరాడిన మహిళ
- 100 రోజుల భారత్ జోడో యాత్ర: రాహుల్ గాంధీపై జోకులు తగ్గడానికి ఈ యాత్రే కారణమా? ప్రజలు మారిపోతున్నారా?
- చైనాలో మందుల కోసం ఎగబడుతున్న జనం.. అసలేం జరుగుతోంది?
- సౌత్ కొరియాలో జెండర్ ఈక్వాలిటీ మంత్రిత్వ శాఖను రద్దు.. అధ్యక్షుడి నిర్ణయంపై మహిళల ఆగ్రహం
- అవతార్ 2 రివ్యూ: ‘మన’ అనుకున్నది ఎవరైనా లాక్కుంటే ఏం చేస్తామో అదే అవతార్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









