వహాయ: ఐదో భార్య పేరుతో సెక్స్ బానిసలుగా బాలికలు.. ప్రభుత్వం నిషేధించేవరకు పోరాడిన మహిళ

వహాయా

హడిజటౌ మణి కరోవు. ఆమెను 12 ఏళ్ల వయసున్నప్పుడే ఓ గిరిజన నాయకుడికి ఐదవ భార్యగా విక్రయించేశారు.

ఒక దశాబ్దం పాటు ఆమె బానిసగా గడిపారు. ఆ తరువాత ఆమెపై భర్త దావా కూడా వేశారు.

చిన్న వయసులోనే విక్రయానికి గురైన ఆమె కోర్టులో పోరాడి గెలిచారు. న్యాయం కోసం ఆమె చేసిన పోరాటమే నైజర్‌లో వహాయ (ఐదవ భార్య) ఆచారం నిషేధించడానికి తోడ్పడింది.

"ఇది భయంకరమైన జీవితం. నాకు ఎలాంటి హక్కులు లేవు, విశ్రాంతి తీసుకోవద్దు, ఆహారం తీసుకోవద్దు, నా సొంత జీవితం కూడా కాదు" అని ఆమె దక్షిణ నైజర్‌లో బీబీసీ 100 వుమెన్‌కి చెప్పారు.

వహాయా

ఇస్లాంలో ఐదవ భార్య పద్దతి ఉందా?

వహాయ అనేది ఆ ప్రాంతంలో బానిసత్వానికి ప్రతిరూపం.

సంపన్న పురుషులు యువతులను కొనుగోలు చేస్తారు. ఇస్లాం చట్టం ప్రకారం గరిష్ఠంగా నలుగురు భార్యలే ఉండాలి.

అయితే ఆ నిబంధన నుంచి తప్పించుకోవడానికి వారిని 200 డాలర్లు(సుమారు రూ. 16,500)తో కొనుగోలు చేసి ఇంటి పని చేయించుకుంటూ వారితో శృంగారం చేస్తూ ఐదో భార్యలుగా (వహాయ) చేసుకుంటారు. 

మణిని 1996లో విక్రయించారు. ఆమె 11 సంవత్సరాలు బానిసగా గడిపారు.

కానీ, ఆమె కష్టాలు అక్కడితో ముగియలేదు. 2005లో విముక్తి పొంది నచ్చిన వ్యక్తిని పెళ్లాడారు.

మాజీ భర్త (యజమాని) ఆమె మీద దావా వేశాడు. తాను కొనుగోలు చేయగా ఆమె మరొకరిని వివాహం చేసుకుందని కేసు వేశాడు.

మణి గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెకు కోర్టు శిక్ష విధించడంతో జైలుకు వెళ్లారు.

చివరికి ఒక దశాబ్దం తర్వాత ఆమెపై మోపిన నేరారోపణను కోర్టు కొట్టివేసింది. ఆమెది కీలకమైన కేసు.

చట్టవిరుద్ధంగా కొనసాగుతున్న బానిసత్వాన్ని రూపుమాపడానికి నిరంతర ప్రయత్నాలు కొనసాగాయి.

మణి ఇపుడు దక్షిణ తహౌవా ప్రాంతంలోని జోంగో కగాగి పట్టణంలో ఉంటున్నారు.

తోటి మహిళలు బానిసత్వం నుంచి తప్పించుకోవడానిక, తమ హక్కులను అర్థం చేసుకోవడానికి ఆమె ప్రచారం చేస్తున్నారు.

ఏటా బీబీసీ విడుదల చేసే 100 మంది ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తిదాయకమైన, ప్రభావవంతమైన మహిళల జాబితాలో చోటు దక్కించుకున్న వారిలో మణి ఒకరు.

‘బీబీసీ 100 ఉమెన్’ ప్రారంభమై పదేళ్లు కావొస్తున్న సందర్భంగా పురోగతిని ఈ ఏడాది జాబితా గౌరవిస్తోంది. నైజర్‌లో చట్టం మార్చడంలో మణి కేసు కీలక పాత్ర పోషించింది.

కోర్టు తీర్పులు, మణి ప్రచారాలు విస్తృతంగా ఉన్నప్పటికీ గ్లోబల్ స్లేవరీ ఇండెక్స్ గణాంకాల ప్రకారం నైజర్‌లో నేటికీ 1,30,000 మంది కంటే ఎక్కువ బానిసలు ఉన్నట్లు తేలింది.

వహాయా
ఫొటో క్యాప్షన్, 24 ఏళ్ల హడిజటౌ (చేతిలో పాప ఉన్న మహిళ) 2008లో కోర్టు విచారణకు హాజరయ్యారు

ఆ బానిసత్వంలోకి మణి ఎలా వెళ్లారు?

నైజర్‌లోని ధనవంతులు ఐదవ భార్యలను బానిసలుగా మార్చారు.

అంతేకాకుండా సదకా అనే మరో పద్దతి ప్రకారం కూడా వారిని బహుమతులుగా పొందుతారు. అయితే వహాయ, సదకా రెండూ కూడా మహిళలను సెక్స్ కోసమే అన్నట్లుగా పరిగణిస్తాయి.

ఈ ఐదవ భార్యలు అంటే యజమానికి సెక్స్ బానిసలు. మిగతా నలుగురు భార్యలను ఇస్లామిక్ చట్టాలకు అనుగుణంగా వివాహం చేసుకుంటారు.

ఐదో భార్యలు మానసిక, శారీరక, లైంగిక వేధింపులకు గురవుతారు. వారికి ఆహారం, ఇతర ప్రాథమిక అవసరాలు అందవు.

ఇంటి పనులు, పశువుల సంరక్షణ, పంటలను పండించడం వంటి పనులు చేయిస్తారు. నైజర్‌లో హడిజాటౌ మణి-కరోవును కొనుగోలు చేసి సరిహద్దు దాటి నైజీరియాకు తీసుకెళ్లిన తర్వాత జీవితం ఇది.

తనను, మరో ఏడుగురు మహిళలు, ఇతర బాలికలను ఒకేసారి కొనుగోలు చేసినందుకు ఆ గిరిజన నాయకుడికి "మంచి బేరం వచ్చింది" అని ఆమె చెప్పారు.

మణి, ఆమె తల్లిదండ్రులకు అనుమతి లేకుండానే ఈ లావాదేవీ జరిగింది. ఈ బానిసత్వం నుంచి ఆమె చాలా సందర్భాల్లో పారిపోవాలని ప్రయత్నం చేశారు.

అయితే ఆమె ప్రతీసారి పట్టుబడటం జరిగింది. తిరిగి నైజీరియాకు ఆమెను తీసుకొచ్చేశారు. అనంతరం కఠిన శిక్షలు విధించేవారు మణికి.

''నాతో ఇష్టం వచ్చినట్లు చేయగలనని, మేకలను కొన్నట్లే నన్ను కొన్నానని ఆయన చెప్పాడు'' అని మణి గుర్తుచేసుకున్నారు.

ఆమెపై అత్యాచారం జరిగింది. యజమాని పిల్లలనూ భరించాల్సి వచ్చేది.

వహాయా

ఫొటో సోర్స్, Timidria

ఫొటో క్యాప్షన్, మణి చేసిన కృషికి గానూ 2009లో ఆమెకు ‘విమెన్ ఆఫ్ కరేజ్’ అవార్డు దక్కింది

ఈ పద్దతులను ఎవరైనా నిషేధించారా?

బానిస వ్యాపారం ఇంకా ఉన్న అట్లాంటిక్ సమీప దేశాలలో నైజర్ ఒకటి.

బానిసత్వంలో భాగంగా ఈ ఆఫ్రికన్ ప్రజలను పశ్చిమ యూరప్, అమెరికాలకు బలవంతంగా రవాణా చేసేవారు.

వహాయ పద్దతి అక్కడ పాతుకుపోయింది. అయితే ఫ్రెంచ్ వలసవాదులు 20వ శతాబ్దం ప్రారంభంలో దీనిని నిషేధించారు. కానీ. నేరస్థులను విచారించకుండా వదిలేశారు.

 1960లో నైజర్ కొత్త రాజ్యాంగం ప్రకారం బానిసత్వం మరోసారి నిషేధించారు. కానీ ఆచరణలో పాటించలేదు.

2003లో వహాయాను నైజర్ ప్రభుత్వం అధికారికంగా శిక్షాస్మృతి కింద నేరంగా పరిగణించింది.

ఈ నిబంధన అనుసరించి మణికి స్వేచ్ఛా ధ్రువీకరణ పత్రం మంజూరు చేశారు.

2005లో ఆమె తన ఇద్దరు పిల్లలు, ఇద్దరు తోటి వహాయలతో కలిసి తిరిగి స్వేచ్ఛా వ్యక్తిగా జీవించడానికి బయటికొచ్చేశారు.

తను ఇష్టపడిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని వెళ్లిన ఏడాది తర్వాత తన మాజీ యజమాని (భర్త) మళ్లీ వచ్చాడు. ఆమె రెండో వివాహం చేసుకుందని దావా వేశారు.

భర్త ఉండగా మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు మణి అంగీకరించడంతో కోర్టు ఆమెకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అయితే ఈ తీర్పు 2019లో రద్దు చేశారు.

వహాయా

ప్రభుత్వంపైనే కేసు వేసిన మణి..

అయితే మణి నైజర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్ (ఎకోవాస్) న్యాయస్థానంలో కేసు వేశారు. అది ఓ కీలక తీర్పునకు దారితీసింది.

నైజర్ తన సొంత బానిసత్వ వ్యతిరేక చట్టాలను ఉల్లంఘించిందని ఈ కేసును విచారించిన న్యాయమూర్తులు అన్నారు.

ఆమెను బానిసగా మార్చిన వ్యక్తిని దోషిగా నిర్ధరించలేదని, ఆమెను రక్షించే చట్టపరమైన బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమైందని తీర్పు చెప్పారు.

ఆమెకు 20 వేల డాలర్లు(సుమారు రూ. 16.5 లక్షలు)ను నష్టపరిహారంగా నైజర్ ప్రభుత్వం చెల్లించింది.

మణికి న్యాయం కోసం చేసిన పోరాటంలో నైజర్ బానిసత్వ వ్యతిరేక సంస్థ టిమిడ్రియా, బ్రిటిష్ ఎన్జీవో యాంటీ-స్లేవరీ ఇంటర్నేషనల్ సంస్థలు సహాయం చేశాయి.

టిమిడ్రియా అసోసియేషన్ ప్రెసిడెంట్ అలీ బౌజౌ మాట్లాడుతూ.. మదౌవా-బౌజా, ఇల్లెలాలోని కొన్ని ప్రాంతాలలో బానిసత్వం ఇప్పటికీ ప్రబలంగా ఉందని ఈ ప్రాంతాన్ని వారు "ట్రయాంగిల్ ఆఫ్ షేమ్"గా అభివర్ణించారు.

"ట్రయాంగిల్ ఆఫ్ షేమ్"‌లో అన్ని గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ జనాభాలో సగానికి పైగా వహాయలు ఉన్నారు" అని స్పష్టం చేశారు.

కాగా, నైజర్‌లో బానిసత్వ వ్యతిరేక చట్టం కింద కొన్ని విచారణలు జరుగుతున్నాయి.

 2003 నుంచి 2022 మధ్యలో బానిసత్వానికి సంబంధించిన 114 ఫిర్యాదులు వచ్చాయని అలీ బౌజౌ అన్నారు.

వీటిలో 54 ప్రాసిక్యూషన్ సంబంధిత కేసులు, ఆరు కేసులు ఉన్నాయి (వీటిలో 4 కొట్టేశారు) అని చెప్పారు. 

వీడియో క్యాప్షన్, ఈ అమ్మాయిలిద్దరూ అందాల పోటీల విజేతలు, ఒకరినొకరు ఇష్టపడి పెళ్ళి చేసుకున్నారు

అయితే ఈ న్యాయ పోరాటంలో గెలుపు చాలా దూరంలో ఉంది.

బానిసత్వానికి సంబంధించిన నేరాలకు పాల్పడిన వారికి 10 నుంచి 30 సంవత్సరాల మధ్య జైలు శిక్ష విధించబడుతుంది.

అయితే ఇటీవలి కేసుల్లో ఇవి 10 సంవత్సరాలలోపు మాత్రమే ఉన్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి విస్తృత చర్యలు చేపట్టాలని నిపుణులు పిలుపునిచ్చారు.

వీటన్నింటి వెనకాల ఉన్న సంప్రదాయ చీఫ్‌లను, వారి అధికారాలను తొలగించాలని బౌజౌ సంస్థ సిఫార్సు చేసింది.

వహాయా.. ఇస్లామిక్ చట్టానికి అనుగుణంగా ఉందనే వాదనలపై సవాలు చేసే ప్రయత్నాలకు కూడా వారు చేతులు కలిపారు.

ఇపుడు బానిసత్వం ప్రపంచ సమస్యగా మారింది. 

యూనివర్శిటీ ఆఫ్ కేప్ టౌన్‌లోని లా విభాగం డీన్, సమకాలీన బానిసత్వంపై ఐక్యరాజ్యసమితి ట్రస్ట్ ఫండ్ చైర్‌పర్సన్ ప్రొఫెసర్ డాన్‌వుడ్ చిర్వా మాట్లాడుతూ.. బానిసత్వం ఇటీవలి కాలంలో పెరుగుతోంది.

వీడియో క్యాప్షన్, మెంటల్ హెల్త్ సెంటర్లో ప్రేమ, పెళ్ళి

కోవిడ్ -19 మహమ్మారి, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా మరింత దిగజారింది.

ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ అండ్ వాక్ ఫ్రీ 2022 నివేదికను ఆయన ఉటంకిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా 50 మిలియన్ల మంది వరకు బానిసలుగా బతుకుతున్నారని చెప్పారు.

వారిలో ఏడు మిలియన్ల మంది ఆఫ్రికాకు చెందిన వారేనని చిర్వా స్పష్టం చేశారు.

"బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాటం కష్టంగా మారింది.

ఎందుకంటే ఆఫ్రికన్ దేశాలు తమ అంతర్జాతీయ బాధ్యతలను నెరవేర్చినప్పటికీ, వారి వ్యక్తిగత భూభాగాల్లో వ్యతిరేకంగా చట్టం చేయవు" అని ప్రొఫెసర్ చిర్వా అభిప్రాయపడ్డారు.

 ప్రస్తుతం హడిజటౌ మణి ఏడాది నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్సు గల ఏడుగురు పిల్లల సంతోషకరమైన తల్లి.

ఆమె తన సొంత సోదరితో సహా చాలా మంది మహిళలకు బానిసత్వం నుంచి బయటపడటానికి, స్వేచ్ఛ, ఉత్తమ జీవితాలను గడపడానికి సాయం చేశారు.

"చట్టం ద్వారా రక్షించబడిన వారి స్వేచ్ఛల గురించి నేను ప్రత్యేకంగా ఈ మహిళలకు బోధిస్తాను" అని మణి అన్నారు.

"నాకు జరిగిన ఏ ఒక్క విషయానికి నేను చింతించడం లేదనేది సాధ్యపడదు . అయితే నా దుస్థితి ఈ ప్రపంచానికి వాహాయ సమస్యను ఎత్తి చూపింది." అని ఆమె స్పష్టంచేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)