ఆ మతాధికారికి 20మందికి పైగా భార్యలు, అందులో 9మంది మైనర్లు: ఎఫ్‌బీఐ అఫిడవిట్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, లారా గోజీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
అమెరికాలో తనకు తాను ప్రవక్తగా ప్రకటించుకున్న శామ్యూల్ రాపిలీ బేట్‌మాన్ అనే మతాధికారికి 20 మందికంటే ఎక్కువ భార్యలు ఉన్నారని, వారిలో కొందరు 18 ఏళ్లలోపున్న మైనర్లని ఎఫ్‌బీఐ సంచలన విషయం బయటపెట్టింది.
46 ఏళ్ల బేట్‌మాన్, తన భార్యలతో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడం దేవుని చిత్తమని పేర్కొన్నట్లు ఎఫ్‌బీఐ తెలిపింది. ఆయనపై సెప్టెంబర్‌లోనే అభియోగాలు నమోదయ్యాయి.
''లైంగిక కార్యకలాపాల కోసం పిల్లలను రాష్ట్రాల సరిహద్దులు దాటించిన’’ కేసులో ఆధారాలు దొరక్కుండా ఆయన రికార్డులను ధ్వంసం చేసినట్లు ఎఫ్‌బీఐ గత శుక్రవారం సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది.
మార్మన్ చర్చి నుంచి విడిపోయిన ఫండమెంటలిస్ట్ చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లేటర్-డే సెయింట్స్ (ఎఫ్‌ఎల్‌డీఎస్ చర్చి) శాఖలో బేట్‌మాన్ ఒకప్పుడు సభ్యుడు .
తర్వాత ఆయన సొంతంగా ఒక గ్రూప్‌ను తయారుచేసుకున్నారు.
‘‘భార్యలు, పిల్లలను సమర్పించుకున్న మగ భక్తులు’’
బేట్‌మాన్‌కు మగ భక్తులు ఆర్థికంగా సాయం చేస్తుంటారని, వారి పిల్లలు, భార్యలను ఆయనకు భార్యలుగా సమర్పించుకున్నారని ఎఫ్‌బీఐ ఆరోపించింది..
తనను ప్రవక్తగా పరిగణించని అనుచరులను బేట్‌మాన్ శిక్షించాడని కూడా ఎఫ్‌బీఐ తెలిపింది.
ఆగస్ట్‌లో 11 నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్సు గల ముగ్గురు బాలికలను బేట్‌మాన్ ట్రేలర్‌లోకి లాక్కెళుతుండగా ఆయన్ను అరెస్టు చేశారు.
ఆయన బెయిల్ బాండ్ సమర్పించినా, రికార్డులను ధ్వసం చేయడం, న్యాయ ప్రక్రియను అడ్డుకోవడం లాంటి ప్రయత్నాలు చేయడంతో ఆయన మళ్లీ అరెస్టయ్యారు.
గ్రూప్ హోమ్‌లోని బాలికలను తప్పించబోయిన భార్యలు..
ఎఫ్‌బీఐ అఫిడవిట్ ప్రకారం..ఈ ఏడాది బేట్‌మాన్ కేర్ నుంచి 9 మంది బాలికలను అరిజోనా చైల్డ్ సర్వీసెస్ విభాగం రక్షించి గ్రూప్ హోమ్స్‌కి తరలించింది. కానీ, నవంబర్‌లో వారిలో 8 మంది బాలికలు పారిపోయారు.
అయితే, ఓ వాహనంలో వారిని వాషింగ్టన్ అధికారులు గుర్తించారు. బేట్‌మాన్ భార్య నడుపుతున్న ఆ వాహనాన్ని గుర్తించి, ట్రాక్ చేశారు. మహిళా డ్రైవర్, మరో ఇద్దరు బేట్‌మాన్ భార్యలపై అధికారులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు.
ఆ డ్రైవర్ మాట్లాడుతూ..తను 18 ఏళ్లలోపు వయస్సులోనే బేట్‌మాన్‌కు భార్యను అయ్యానని తెలిపారు.
18 ఏళ్లు నిండిన తర్వాత ఏడు నెలలకే ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చినట్లు ఎఫ్‌బీఐ తన అఫిడవిట్‌లో పేర్కొంది.
అయితే ఆ తొమ్మిది మందిలో ఒక్కరు కూడా బేట్‌మాన్ తమపై లైంగిక దాడికి పాల్పడినట్లు చెప్పలేదని ఎఫ్‌బీఐ తెలిపింది.
పత్రికలతో మాత్రం తాము అతనితో చాలా సన్నిహితంగా మెలిగినట్లు వారు పేర్కొన్నారని ఎఫ్‌బీఐ వెల్లడించింది.
ఎఫ్‌ఎల్‌డీఎస్ చర్చిని విద్వేషాలను రెచ్చగొట్టే గ్రూప్‌గా సదరన్ లా పావర్టీ సెంటర్ గుర్తించింది.
2011లో ఓ ఎఫ్‌ఎల్‌డీఎస్ నాయకుడు తాను వివాహం చేసుకున్న ఇద్దరు మైనర్ బాలికలను లైంగికంగా వేధించినందుకు జీవిత ఖైదును అనుభవిస్తున్నాడు.
ఇవి కూడా చదవండి:
- భారత్, పాకిస్తాన్ యుద్ధం 1971 - ఘాజీ: విశాఖలో అప్పుడు రాత్రి పూట ఒక్క దీపం కూడా వెలగలేదు
- మీరు తాగే నీటిలో రకాలు ఎన్ని.. ఆర్వో, వాటర్ ఫిల్టర్ల నీళ్లను తాగితే ఏమవుతుంది
- మ్యూచువల్ ఫండ్స్‌లో మదుపు చేయడం మంచిదా? లేక హోం లోన్, కార్ లోన్ తీసుకోవడం ఉత్తమమా?
- బాబ్రీ మసీదు విధ్వంసానికి ఒక రోజు ముందు 'రిహార్సల్స్' ఎలా జరిగాయంటే..
















