పెళ్లిలో భార్యకు గాడిదను గిఫ్ట్‌గా ఇచ్చిన వరుడు, సోషల్ మీడియాలో చర్చ

అజ్లాన్ షా

ఫొటో సోర్స్, AZLAN SHAH

ఫొటో క్యాప్షన్, అజ్లాన్ షా, తన భార్యకు గాడిదను బహుమతిగా ఇచ్చారు

‘‘గాడిద పిల్లలంటే వారిశాకు చాలా ఇష్టమనే సంగతి నాకు ఎప్పటినుంచో తెలుసు. అందుకే నా తరఫున వివాహ కానుక ఇదే’’ ఇవి అజ్లాన్ షా చెప్పిన మాటలు. వారిశా ఆయన భార్య పేరు.

అజ్లాన్ షా గురించి ఇప్పుడు పాకిస్తాన్ సోషల్ మీడియాలో చాలా చర్చ జరుగుతోంది.

పెళ్లిలో తన భార్యకు బహుమతిగా ఒక గాడిద పిల్లను ఇచ్చినట్లు ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో అజ్లాన్ షా పేర్కొన్నారు.

తనకు కాబోయే భార్యకు ఈ ప్రత్యేకమైన బహుమతిని ఇచ్చే సమయంలో తీసిన ఫొటోలు, వీడియోలను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

పెళ్లిలో తన వధువుకు ఈ బహుమతిని ఇస్తూ అజ్లాన్ ఇలా అన్నారు.

‘‘బహుమతిగా ఈ గాడిదను ఎందుకు ఎంచుకున్నావు అనే నా భార్య అడిగితే ...ఒకటేమో అదంటే నీకు ఇష్టం, రెండోది గాడిద అనేది ప్రపంచంలోనే అత్యంత కష్టపడే, అత్యంత ప్రేమగా ఉండే జంతువు అని చెబుతా.’’

అజ్లాన్ మాటలు విన్న వధువు వారిశా ...‘‘నేను, దీన్ని కేవలం గాడిదలా చూడటం లేదు ’’ అని అన్నారు.

ఈ బహుమతి గురించి అజ్లాన్ మరింత వివరించారు.

‘‘నాకు జంతువులు అంటే చాలా ఇష్టం. జనాలు ఏమైనా అనుకోనివ్వండి నాకు మాత్రం గాడిద అంటే విపరీతమైన ప్రేమ. వారిశాకు ఇదే నా బహుమతి’’ అని చెప్పారు.

తర్వాత ఆయన నవ్వుతూ ‘‘దయచేసి దీన్ని ఎగతాళి చేయొద్దు. ఇంకో మాట! నేను ఈ గాడిద పిల్లను దాని తల్లి నుంచి వేరు చేయలేదు. తల్లి కూడా ఈ పిల్ల గాడిదతోనే ఉంది’’ అని అన్నారు.

అజ్లాన్ షా

ఫొటో సోర్స్, AZLAN SHAH

‘సాధారణ అమ్మాయిలు నాతో ఉండలేరు’

వారిశా జంతు ప్రేమికురాలు అనే కారణంతోనే ఆమెను వివాహం చేసుకున్నట్లు బీబీసీతో మాట్లాడుతూ అజ్లాన్ షా అన్నారు.

‘‘వారిశా జంతువులను ప్రేమిస్తుంది. అందుకే తనతో నా వివాహం జరిగింది. నేను కొన్నిసార్లు పాములతో, మరికొన్నిసార్లు బల్లి, మొసళ్లతో ఉంటాను. మామూలు అమ్మాయిలు నాతో కలిసి బతకడం చాలా కష్టం. తనకు గాడిద పిల్లలంటే చాలా ఇష్టమని వారిశా ఒకసారి నాతో చెప్పింది. నాకు ఆ మాట గుర్తుంది. ఇంకో విషయం ఏంటంటే మా అమ్మకు కూడా గాడిద పిల్లలంటే ఇష్టం’’ అని ఆయన వివరించారు.

ధోబీ ఘాట్ నుంచి గాడిదతో పాటు దాని పిల్లను 30 వేల రూపాయలకు కొనుగోలు చేసినట్లు అజ్లాన్ షా తెలిపారు.

‘‘ఇప్పుడు వాటికి గాడిద చాకిరీ చేయాల్సిన అవసరం లేదు. మా పొలంలో అవి సంతోషంగా జీవిస్తాయి. అక్కడే తింటూ, తిరుగుతూ మాతో కలిసి ఆడుకుంటాయి’’ అని ఆయన అన్నారు.

తను చేసిన పనిని కొందరు ప్రశంసిస్తున్నారని ఆయన చెప్పారు. ‘‘గాడిదను బహుమతిగా ఇచ్చి కొత్త పని చేశావంటూ కొందరు నన్ను పొగుడుతున్నారు. కానీ, ఇందులో కొత్తేముంది? గాడిద కూడా ఒక జంతువే కదా.

నేను ఇలా చేయడం వల్ల జనాలంతా నన్ను వింతగా చూస్తారని, నాపై మీమ్స్ తయారు చేస్తారని నాకు తెలుసు. కానీ, నా భార్యను ఆశ్చర్యపరచాలి అనుకున్నా. పెళ్లి రోజున నేను గాడిదను తీసుకొని వస్తానని కనీసం ఆమె ఊహించి కూడా ఉండదు.

నేనొక ప్రత్యేకమైన వ్యక్తిననే సంగతి నా స్నేహితులు, కుటుంబ సభ్యులకు తెలుసు. మేం మెహందీ కార్యక్రమాన్ని సఫారీ పార్క్‌లో ఏనుగులతో కలిసి జరుపుకున్నాం’’ అని అన్నారు.

‘‘నా హృదయపూర్వకంగా ఈ బహుమతిని ఇస్తున్నా. ఇది నాకు చాలా ఇష్టమైన జంతువు. దయచేసి దీని గురించి ఎగతాళి చేయొద్దు’’ అని బహుమతి ఇచ్చే సమయంలో చెప్పినట్లు అజ్లాన్ షా తెలిపారు.

గాడిద

ఫొటో సోర్స్, Getty Images

ప్రస్తుతం తన ఫోన్‌ను సైలెంట్‌లో ఉంచానని ఆయన చెప్పారు. ‘‘ఇప్పుడు నేను నా ఫోన్‌ను సైలెంట్‌లో పెట్టాను. ఎవరి కామెంట్లూ చదవడం లేదు. నా జీవితాన్ని నేను ఆస్వాదిస్తున్నా.

ఎవరైనా సోషల్ మీడియాలో నన్ను గాడిద అని పిలిస్తే దాన్ని నేను దాన్ని ప్రశంసగానే స్వీకరిస్తా. ఎందుకంటే గాడిద చాలా కష్టపడే, అమాయకమైన, అందరికీ ఉపయోగపడే జంతువు.

గాడిద పిల్ల చాలా ముద్దుగా ఉంది. దాన్ని ప్రేమించకుండా ఎవరూ ఉండలేరు.

ప్రపంచంలో గారాబంగా పెరగనున్న తొలి గాడిద ఇదే అవుతుంది. దీన్ని అన్ని గాడిదల తరహాలో చూడబోనని నా బేగం కూడా అంటోంది.

మా పెళ్లి తర్వాత మేం దత్తత తీసుకున్న తొలి బిడ్డ ఇది. దీనికి ఏం పేరు పెట్టాలి అని ఆలోచిస్తున్నాం.

దానికి ‘మఫిన్’ అని పేరు పెడదామని నా భార్య అంటోంది. దేశీ పేరు అయితే బాగుంటుందని నేను ఆమెకు చెబుతున్నా. ప్రస్తుతానికైతే పేరు మీద చర్చలు జరుగుతున్నాయి’’ అని ఆయన వివరించారు.

సోషల్ మీడియా

ఫొటో సోర్స్, RABIAKHAN_01

సోషల్ మీడియాలో జోకులు

తను ఇచ్చిన బహుమతి గురించి ఎగతాళి, జోకులు చేయొద్దని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియోలో అజ్లాన్ షా విజ్ఞప్తి చేశారు.

అయితే, అజ్లాన్ షా ఇచ్చిన ఈ అరుదైన కానుక గురించి సోషల్ మీడియాలో కొందరు పొగుడుతుండగా, ఎగతాళి చేసేవారు కూడా చాలామంది ఉన్నారు.

‘‘ఎలాగూ భార్యలకు తమ భర్తలు గాడిదల్లాగే కనిపిస్తారు. ఇంత కష్టపడాల్సిన అవసరం ఏంటి? మరో రెండు నెలలు వేచి చూస్తే సరిపోయేది’’ అని ఒక యూజర్ రాసుకొచ్చారు.

అజ్లాన్ షా ఇచ్చిన బహుమతి గురించి కహ్‌కషా అనే మరో యూజర్‌ స్పందిస్తూ ‘‘ఒకవేళ అజ్లాన్ షా బహుమతిగా గాడిదను ఇవ్వాలనుకుంటే పెళ్లిరోజు కాకుండా మరో రోజు ఇవ్వాల్సింది’’ అని సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు.

అయితే, చాలామంది అమ్మాయిలు, అజ్లాన్ షా ఇచ్చిన ఈ బహుమతి గురించి ప్రశంసించారు.

‘‘ఇప్పటివరకు నేను చూసిన పోస్టుల్లో ఇదే నాకు అత్యంత నచ్చినది. దయచేసి విద్వేషపూరిత కామెంట్లను పట్టించుకోవద్దు. దేవుడు మీ ఇద్దరిని చల్లగా చూస్తాడు’’ అని రబీయా ఖాన్ అనే యూజర్ వ్యాఖ్యానించారు.

వీడియో క్యాప్షన్, భార్యను మోస్తూ తిరుమల మెట్లెక్కిన భర్త, ఈ వీడియోపై దంపతులు ఏమన్నారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)