ఆరుగురు భార్యలు, 54 మంది పిల్లలు.. ట్రక్ నడుపుతూ అందరినీ పోషించిన 75 ఏళ్ల అబ్దుల్ మజీద్ మృతి

- రచయిత, మొహమ్మద్ కాజీమ్
- హోదా, బీబీసీ ఉర్దూ
పాకిస్తాన్‌లో 54 మంది పిల్లలను కనడం ద్వారా వార్తల్లో నిలిచిన అబ్దుల్ మజీద్ బుధవారం మరణించారు.
గుండె సంబంధిత వ్యాధితో తన తండ్రి మరణించినట్లు అబ్దుల్ మజీద్ కుమారుడు షాహ్ వలీ మంగళ్ బీబీసీకి తెలిపారు.
75ఏళ్ల అబ్దుల్ మజీద్ డ్రైవర్‌గా పని చేసేవారు.
అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లో ఉండే బలూచిస్తాన్‌లోని నొషకీ జిల్లాలో అబ్దుల్ మజీద్ కుటుంబం నివసిస్తోంది.
2017 జనాభా లెక్కల సందర్భంగా తొలిసారి అబ్దుల్ మజీద్‌తోపాటు ఆయన కుటుంబం వార్తల్లోకి వచ్చింది.
అబ్దుల్ మజీద్‌కు 18 ఏళ్ల వయసులో తొలి వివాహమైంది. ఆయన మొత్తం మీద ఆరు సార్లు పెళ్లి చేసుకున్నారు. వీరిలో ఇద్దరు భార్యలు చనిపోయారు. ఆయనకు మొత్తం 54 మంది పిల్లలు. వీరిలో 12 మంది చనిపోయారు.
ప్రస్తుతం ఉన్న 42 మంది పిల్లల్లో 22 మంది అబ్బాయిలు, 20 మంది అమ్మాయిలు ఉన్నారు.
2017కు ముందు అత్యధిక మంది పిల్లలు ఉన్న వ్యక్తిగా జాన్ మొహ్మద్ ఖిల్జీ గురించి చెప్పుకునేవారు. తనకు 36 మంది పిల్లలు ఉన్నట్లు ఆయన చెప్పేవారు.

పిల్లల అవసరాలను తీర్చడానికి తమ తండ్రి తన చివరి శ్వాస వరకు కష్టపడి పని చేసినట్లు అబ్దుల్ మజీద్ కుమారుడు షాహ్ వలీ అన్నారు.
‘54 మంది పిల్లలను పెంచడం అంత సులభం కాదు. అందుకోసం మా నాన్న జీవితాంతం కష్టపడ్డారు. మా చదువుల కోసం, ఆలనా పాలన కోసం ఆయన అనేక పనులు చేసేవారు.
మా నాన్నకు ఒక ట్రక్కు ఉండేది. ఆయనకు వయసు పైబడినా మా ఇల్లు గడవడం కోసం చివరకు వరకు దాన్ని నడుపుతూనే ఉన్నారు. ఆయన విశ్రాంతి తీసుకోగా నేను ఎప్పుడూ చూడలేదు.
మాలో కొందరు డిగ్రీలు పూర్తి చేశారు. కొందరు మెట్రిక్యులేషన్ పాస్ అయ్యారు. కానీ మాకు సరైన ఉద్యోగాలు దొరకలేదు. అందువల్లే మా నాన్నకు మంచి వైద్యం అందేలా పెద్ద ఆసుపత్రులకు తీసుకు వెళ్లలేక పోయాం.
పాకిస్తాన్‌లోని ఇతర ప్రాంతాల్లో మాలాంటి పెద్దపెద్ద కుటుంబాలకు ప్రభుత్వం సాయం చేస్తోందని విన్నాం. కానీ మేం చాలా కష్టాల్లో ఉన్నప్పటికీ మాకు ఇంత వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు.
ఈ ఏడాది వచ్చిన వరదల వల్ల మా ఇల్లు ధ్వంసమైంది. మళ్లీ ఇల్లు కట్టుకునే డబ్బు మా దగ్గర లేదు. వరదల్లో ధ్వంసమైన ఇళ్లను తిరిగి కట్టేందుకు ఇంత వరకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
ఇప్పుడు ఇల్లు లేక పోవడం వల్ల మేమంతా ఇబ్బందులు పడుతున్నాం’ అని షాహ్ వలీ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
- ‘‘ఎన్నికల్లో పోటీ చేయనివ్వలేదు , అందుకే సొంతంగా రాజ్యం స్థాపించుకున్నా’’ అంటున్న కింగ్ పీటర్ ది ఫస్ట్ ఎవరు?
- మహిళల్లో హార్మోన్లు ఎందుకు గతి తప్పుతాయి, ఇది మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందా?
- గుజరాత్ ఎన్నికల్లో ముస్లింలు బీజేపీకే ఓటు వేశారా, ఈ వాదనల్లో నిజమెంత?
- మన్నెగూడ కిడ్నాప్: సినిమా తరహాలో అమ్మాయి కిడ్నాప్.. ఏమిటీ కేసు, ఎవరేమన్నారు?
- ఇషాన్ కిషన్: ‘అతనొక భయం తెలియని ఆటగాడు’... విరాట్ కోహ్లీ ఈ మాట ఎందుకన్నాడు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














