అమ్మ ఒడి: పిల్లలను బడికి పంపి రూ.15 వేలు పొందడం ఎలా?

ఫొటో సోర్స్, iStock
- రచయిత, ఎ.కిశోర్ బాబు
- హోదా, బీబీసీ కోసం
ఇంట్లో బడి ఈడుకొచ్చిన బిడ్డ ఉంటే, ఆ బిడ్డను దగ్గర్లోని బడిలో చేర్చితే చాలు, ఆ బిడ్డ తల్లికి బ్యాంకు ఖాతాలో ఏటా 15వేల రూపాయల డబ్బు జమ చేసే పథకం ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతోందని మీకు తెలుసా?
ఈ పథకం ద్వారా రాష్ట్రంలో దాదాపు 43 లక్షల మందికిపైగా పేద విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు.
పథకం అమలుకు ప్రభుత్వం రూ.6,455 కోట్లు కేటాయించి విద్యార్థుల తల్లుల ఖాతాలో సొమ్ము జత చేస్తోంది.
అసలు అమ్మ ఒడి పథకం అంటే ఏమిటి? లబ్ధిదారులను ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు? తదితర వివరాలను పూర్తీగా తెలుసుకుందాం.
ఏమిటీ అమ్మ ఒడి?
పేదరికంతో తమ బిడ్డలను చదివించే స్థోమత లేక తమ బిడ్డలను విద్యకు దూరం చేస్తున్న తల్లులకు ఆర్థిక ఆసరా కల్పించి, పేద పిల్లలకు చదువుకునే అవకాశం కల్పించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఈ అమ్మ ఒడి.
2020 జనవరి 9వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు.
పేద కుటుంబాలకు చెందిన బాలలు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకం అమలు చేస్తోంది.

ఫొటో సోర్స్, FACEBOOK/YS JAGAN MOHAN REDDY
ఎందుకీ పథకం?
భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంత్సరాలు గడిచినా ఇప్పటికీ 14 శాతం మంది పేద పిల్లలు బడికి దూరంగా ఉంటున్నారనేది ఒక బాధాకరమైన వాస్తవం.
5 సంవత్సరాల వయసు వచ్చినా మన దేశంలో పేదరికం వల్ల చాలా మంది చిన్నారులు బడికి దూరంగా ఉంటూ పేదరికంలో మగ్గిపోతున్నారు.
అలాంటి వారి శాతం ఇప్పటికీ 14 శాతం ఉందని యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్టు అధ్యయన నివేదికను కేంద్ర ప్రభుత్వం తన ఆర్థిక సర్వేలో ఉటంకించింది.
పేదరికం, కార్పొరేట్ విద్య ఖరీదు కావడం, ప్రభుత్వ పాఠశాలలు దూరంగా ఉండటం, తదితర కారణాలతో ఈ చిన్నారులంతా చదువుకు దూరమవుతున్నారు.
ఇలా పేదరికంతో తమ బిడ్డలను చదివించుకునే స్థోమత లేని కుటుంబాలకు ఆసరగా నిలిచి వారి పిల్లలను బడిబాట పట్టించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకమే అమ్మ ఒడి.
ఎంత డబ్బులు ఇస్తారు?
ఈ పథకం ద్వారా ఇంట్లో బడి ఈడుకొచ్చిన బిడ్డను బడిలో చేర్పిస్తే చాలు, ఆ బిడ్డ ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ విద్య పూర్తయ్యేవరకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం 15వేల రూపాయలను ఆ బిడ్డ తల్లి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది.
డబ్బులు ఎప్పుడు వేస్తారు?
పథకంలో అర్హులైన విద్యార్థుల తల్లులకు ప్రతి సంవత్సరం జనవరి నెలలో ప్రభుత్వం ఈ సొమ్మును వారి బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో జమ చేస్తుంది
ఈ డబ్బులను బిడ్డ చదువు కోసం ఉపయోగించుకుని తమకు నచ్చిన పాఠశాలలో చదివించుకుంటారనేది ప్రభుత్వ ఉద్దేశం.
దీని వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో కూడా విద్యార్థుల చేరిక గణనీయంగా పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
అనుకున్నట్లుగానే ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరిక గణనీయంగా పెరిగి ప్రభుత్వ ఆశలు ఫలించే సూచనలు కనిపిస్తున్నాయి.
2020 జనవరి నెలలో ప్రారంభించిన ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో 44 లక్షల మంది తల్లులు లబ్ధి పొందుతున్నారు.
ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు, ఇంటర్మీడియెట్ కళాశాలన్నిటికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
పథకానికి ఎవరు అర్హులు?
పేద కుటుంబాలకు చెందిన వారు, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారు. అనాథలు, వీధి బాలలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో బడిలో చదువుకునేవారు అందరూ ఈ పథకానికి అర్హులే.
పథకంలో లబ్ధి పొందాలంటే నిబంధనలేమిటి?
- ఈ పథకం పొందాలనుకునే బిడ్డ తల్లి దారిద్య్ర రేఖకు దిగువన ఉండాలి.
- రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన తెల్ల రేషన్ కార్డుదారులై ఉండాలి.
- తల్లికి తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలి.
- ఆ తల్లి పేరిట ఏదైనా జాతీయ బ్యాంకు లేదా పోస్టాఫీసులో సేవింగ్స్ ఖాతా తప్పనిసరిగా ఉండాలి. దాన్ని ఆధార్‌తో అనుసంధానం చేసుకుని ఉండాలి.
- ఒకటవ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థి ఆధార్ వివరాలను కూడా పొందుపరచాలి.
ఆదాయ పరిమితి ఎంత ఉండాలి?
- ఈ పథకం లబ్ధి పొందాలనుకునే విద్యార్థి కుటుంబ ఆదాయ పరిమితి కూడా సవరించారు.
- గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షికాదాయం రూ.10వేలకు మించకూడదు.
- పట్టణ ప్రాంతాల్లో వార్షికాదాయం 12వేలకు మించరాదు.
- కుటుంబానికి 3 ఎకరాలకు మించి భూమి ఉండకూడదు.
- నెలకు 300 యూనిట్లకు పైన విద్యుత్తు వినియోగించే కుటుంబాలకు పథకం వర్తించదు.
- కుటుంబంలో నాలుగు చక్రాల వాహనం, కారు, బస్సు, టాక్సీలాంటివి ఉన్నా పథకం వర్తించదు.
- ఆదాయపు పన్ను చెల్లిస్తున్నవారు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఉద్యోగుల పిల్లలు ఈ పథకానికి అర్హులు కారు.
పథకం పొందాలంటే ఏమేమీ పత్రాలు పొందుపర్చాలి
- కుటుంబానికి ఇచ్చే తెల్ల రేషన్ కార్డు
- తల్లి పేరిట ఆధార్‌కు అనుసంధానం చేసిన బ్యాంకు ఖాతా వివరాలు
- తల్లి, విద్యార్థి ఇద్దరి ఆధార్ కార్డులు
- గుర్తింపు కార్డు
- నివాస గుర్తింపు పత్రం

ఎలా ఎంపిక చేస్తారంటే?
ఈ పథకం కింద అర్హులైన వారిని ఎంపిక చేయడానికి ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన విధానాన్ని రూపొందించింది. దాని ప్రకారమే లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.
ముందుగా తల్లిదండ్రులు ఈ పథకం కింద తమ బిడ్డలను ఆయా పాఠశాలల్లో చేర్పించాలి.
బడిలో చేరిన విద్యార్థుల వివరాలతో కూడిన గణాంకాలను ఆ విద్యా సంస్థ అధిపతి ప్రభుత్వం నిర్దేశించిన నమూనా రూపంలో ప్రభుత్వానికి పంపుతారు.
ఎంతమంది విద్యార్థులు చేరారు, వారు ఏయే సామాజిక వర్గానికి చెందినవారు, దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఎవరు, ఏ తరగతి చదువుతున్నారు? తదితర వివరాలు ఇందులో ఉంటాయి.
ఈ వివరాలను అందుకున్న తర్వాత అధికారులు దీన్ని మదింపు వేసి, ఈ వివరాలను స్వయంగా క్షేత్ర స్థాయిలో పరిశీలించే బాధ్యతలను గ్రామ వలంటీర్లకు అప్పగిస్తారు.
వారు ఆయా ప్రాంతంలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమన్వయం చేసుకొని క్షేత్రస్థాయిలో ఈ డేటాను తనిఖీ చేసి వారు గుర్తించిన వివరాలతో కూడిన నివేదికను ఆ ప్రాంతంలోని మండల విద్యాశాఖాధికారికి అందజేస్తారు.
మండల విద్యాశాఖాధికారి ఈ వివరాలను పరిశీలించి వాటికి ఆమోద ముద్రవేసి పైఅధికారులకు నివేదిస్తారు.
ఇలా వచ్చిన డేటాను ప్రభుత్వం తాను నిర్దేశించుకున్న మార్గదర్శకాల మేరకు వివిధ దశల్లో వడపోత జరిపి నిజంగా అర్హులైన వారిని మాత్రమే ఎంపిక చేస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ, ఐటీ శాఖ, పౌరసరఫరాల శాఖ, రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖలు ఈ డేటా విశ్లేషణలో కీలకంగా పనిచేస్తాయి.
తుది జాబితా సిద్ధమైన తరువాత ఆ జాబితా ప్రకారం ప్రభుత్వం ఈ పథకం కింద డబ్బులు విడుదల చేస్తుంది.
అర్హులైన విద్యార్థుల తల్లులకు వారి సేవింగ్స్ ఖాతాలో ప్రతి ఏటా జనవరి నెలలో డబ్బులు జమ చేస్తుంది.

సామాజిక తనిఖీ ఉంటుందా?
ఈ పథకం కింద ఎంపికైన విద్యార్థులు, వారి తల్లుల వివరాలను ఆయా గ్రామాల్లోని గ్రామ సచివాలయలాల్లో ప్రదర్శిస్తారు. అక్కడ సామాజిక తనిఖీ చేస్తారు.
ఈ అర్హుల జాబితాపై ఎవరికైనా అభ్యంతరాలున్నా అధికారుల దృష్టికి తీసుకువచ్చే వీలుంటుంది.
లబ్ధిదారుల ఎంపికలో తప్పిదాలకు పాల్పడితే?
ఈ పథకం లబ్ధిదారుల ఎంపికలో ఎక్కడైనా అధికారులు తప్పిదాలకు పాల్పడితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది.
ఎక్కడా కూడా ఎలాంటి పొరబాట్లకు తావివ్వకుండా ఈ మొత్తం ప్రక్రియ పారదర్శకంగా అమలు చేస్తున్నారు.
ఈ పథకం అమలు, దీని కింద చదువుకుంటున్న విద్యార్థుల హాజరు, వారి ప్రతిభ తదితరాలను ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి క్రమానుగుణంగా నివేదికలు పంపుతారు.
బడి మధ్యలో మానేస్తే పథకం వర్తిస్తుందా?
వర్తించదు. ఈ పథకం కింద ఎంపికైన విద్యార్థులు ఏదైనా కారణాల చేత ఆ విద్యా సంవత్సరం మధ్యలో బడి మానేస్తే ఈ పథకానికి ఆ ఏడాది అనర్హులవుతారు.
ఈ ఏడాది చదువు మధ్యలో ఆపేసి, మరుసటి ఏడాది మళ్లీ బడిలో చేరి కొనసాగిస్తే పథకం వర్తిస్తుందా?
వర్తిస్తుంది. అయితే చదువు మధ్యలో ఆపేసిన విద్యా సంవత్సారానికి మాత్రం ఆ పథకం వర్తించదు.

ఫొటో సోర్స్, Getty Images
బడిలో హాజరు శాతం ఎంత ఉండాలి?
ఈ పథకం కింద ఎంపికైన విద్యార్థులకు బడిలో హాజరు తప్పనిసరి చేసింది ప్రభుత్వం. ఈ విద్యార్థులు కచ్చితంగా 75 శాతం హాజరు ఉండాలి. లేకుంటే ఈ పథకానికి ఆ ఏడాది అనర్హులవుతారు.
విద్యార్థులందరూ తప్పనిసరిగా బడికి వచ్చి వారు చదువుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిబంధనను చేర్చింది.
ట్యాబ్‌లూ ఇస్తారు
ఈ పథకం కింద డబ్బులు వద్దు అనుకునే విద్యార్థులకు దాని బదులుగా ల్యాప్‌ట్యాప్ లేదా ట్యాబ్‌లు కూడా పొందే వీలుంటుంది.
తల్లి లేకపోతే
ఒక వేళ విద్యార్థికి తల్లిగనుక లేకపోతే ఆ బిడ్డ సంరక్షకులకు ఈ పథకం వర్తిస్తుంది.
ఒక్క కుటుంబానికి రూ.15 వేలే
ఒక తల్లికి లేదా కుటుంబంలో ఎంతమంది బడి ఈడు పిల్లలున్నా కుటుంబానికి ప్రభుత్వం రూ.15వేలు మాత్రమే ఇస్తుంది.
ఇంటర్మీడియెట్ వరకే
ఈ పథకం రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి 12వ తరగతి లేదా ఇంటర్మీడియెట్ వరకు చదివే విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది. ఆ పైన చదువులకు ఈ పథకం వర్తించదు.
పదో తరగతి తరువాత ఇంటర్మీడియట్ కాకుండా పాలిటెక్నిక్ లేదా ఐటీఐ చదివే వారికి ఈ పథకం వర్తించదు.
ఈ పథకం ప్రభావం పాఠశాల విద్యపై ఎలా ఉందనే దాన్ని కూడా ప్రభుత్వం మదింపు వేయిస్తోంది
ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్ అండ్ మానిటరింగ్ కమిషన్ అధ్యయనం చేసి ఈ పథకం ప్రభావాలను మదింపు వేస్తుంటుంది.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణలో తొలి ట్రాన్స్‌జెండర్ డాక్టర్: ‘రోగులు మొదట నా దగ్గర వైద్యం చేయించుకోవడానికి సంకోచిస్తారు, తరువాత చేతులెత్తి మొక్కుతారు’
- సైన్యంలో పనిచేస్తున్న కొడుక్కి తండ్రి వార్నింగ్: ‘బిడ్డా నిన్ను కచ్చితంగా చంపేస్తాను’
- చైనా ప్రధానిని చంపడానికి భారత విమానంలో బాంబు పెట్టినప్పుడు ఏం జరిగింది
- రొయ్యల సాగు రైతులను ఎందుకు కష్టాల్లోకి నెడుతోంది, వారి ఆందోళనకు కారణమేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















