చైనా ప్రధాని ఎక్కబోయే భారతీయ విమానంలో బాంబు ఉందని తెలిసినా ఆ దేశం కావాలనే చెప్పలేదా?

ఫొటో సోర్స్, JAICO PUBLICATION
- రచయిత, రేహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
జవహర్ లాల్ నెహ్రూ ప్రోత్సాహంతో 1955 ఏప్రిల్‌లో ఇండోనేసియాలోని బాండుంగ్ నగరంలో ఆఫ్రో-ఆసియా కాన్ఫరెన్స్ జరిగింది.
తన ప్రతినిధుల కోసం ‘కశ్మీర్ ప్రిన్సెస్’ అని పిలిచే ఎయిరిండియా విమానాన్ని చైనా ప్రభుత్వం అద్దెకు తీసుకుంది. అందులో ప్రయాణించే వారిలో చైనా ప్రధాని జౌఎన్ లై కూడా ఉన్నారు.
1955 ఏప్రిల్ 11న మధ్యాహ్నం 12.15 గంటలకు బ్యాంకాక్ నుంచి హాంకాంగ్‌లోని కాయి టక్ విమానాశ్రయానికి ఎయిరిండియా విమానం చేరుకుంది. ఫ్లైట్ ఇంజినీర్ ఏఎన్ కార్నిక్ పర్యవేక్షణలో ఆ విమానాన్ని శుభ్రం చేశారు.
గ్రౌండ్ స్టాఫ్ ద్వారా విషయం తెలుసుకున్న కొ-పైలెట్ గొడ్బొలే, ‘ఈరోజు చైనా ప్రధానిని చూసే అవకాశం మనకు వస్తుంది’ అని అన్నారు.
చైనా వ్యతిరేక తైవాన్ ఏజెంట్లు హాంకాంగ్‌లో ఉన్నందున తమ ప్రధాని అక్కడి నుంచి విమానంలో ప్రయాణిస్తున్నారనే వార్తను బయటకు రాకుండా చైనా చర్యలు తీసుకుంది. అయినా ఈ విషయం బయటకు పొక్కింది.
ఎయిరిండియా ‘కశ్మీర్ ప్రిన్సెస్’ చైనా ప్రధాని జౌ ఎన్ లై కోసం ఎదురు చూస్తోంది. అయితే చైనా ప్రధాని ఇండోనేసియా పర్యటన రద్దు అయినట్లు చివరి నిమిషంలో కెప్టెన్ డీకే జటార్‌కు సందేశం వచ్చింది.
దాంతో జౌ ఎన్ లై లేకుండానే చైనా ప్రతినిధుల బృందంతో రాత్రి 1.26 గంటలకు విమానం టేకాఫ్ అయింది. లాక్‌హీడ్ కంపెనీకి చెందిన ఆ ఎల్-749 కాన్స్‌టెల్లేషన్ విమానం ఇండోనేసియా రాజధాని జకార్తాలో దిగాల్సి ఉంది. కెప్టెన్, ఏడుగురు సిబ్బంది, 11 మంది ప్రయాణికులు అందులో ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కాక్‌పిట్‌లో పేలుడు
విమానం ఎగిరిన అయిదు గంటల తరువాత కాక్‌పిట్‌లో ఒక్క సారిగా పేలుడు జరిగింది. ఒక ఇంజిన్ నుంచి మంటలు మొదలయ్యాయి. విమానం వేగంగా కిందకు పడిపోతోంది. లోపల ఉన్న వాళ్లు భయంతో కేకలు వేస్తున్నారు. ఆ సమయంలో విమానం 18వేల అడుగుల ఎత్తులో ఉంది.
పరిస్థితిని వివరించే సంకేతాన్ని కంట్రోల్ రూమ్‌కు పైలెట్ పంపించారు. ప్రస్తుతం తాము దక్షిణ చైనా సముద్రంలోని నతునా ద్వీపం మీద ఎగురుతున్నట్లు వారికి వెల్లడించారు. ఆ తరువాత వేగాన్ని పూర్తిగా పెంచి విమానం ముందు భాగాన్ని కిందకు వంచారు.
దగ్గర్లోని విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే సమయం వారికి లేదు. ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలంటే సముద్రంలో దించడమే ఏకైక మార్గమని కెప్టెన్ అనుకున్నారు. విమానంలో సముద్రంలో పడిపోగానే మంటలు అంటుకున్నాయి. విమానంలో 19 మంది ఉండగా వారిలో ముగ్గురు మాత్రమే బతికారు.
బతికిన వారిలో ఫ్లైట్ నావిగేటర్ పాఠక్, మెకానికల్ ఇంజినీర్ ఏఎన్ కార్నిక్, కొ-పైలెట్ ఎంసీ దీక్షిత్ ఉన్నారని ‘ఆర్ఎన్ కావ్: జెంటిల్‌మాన్ స్పైమాస్టర్’ అనే పుస్తకంలో నితిన్ గోఖలే రాశారు.
నాడు ఎయిరిండియాలోని అత్యంత సమర్థవంతమైన పైలెట్స్‌లో కెప్టెన్ జటార్ ఒకరు. ఆయన తన సీటులోనే చనిపోయి కనిపించారు. విమానం సముద్రంలో పడిపోవడానికి ముందు ఎయిర్ హోస్టెస్ గ్లోరీ ఎస్పెన్సన్ ఎంతో ధైర్యంతో ప్రయాణికులందరికీ లైఫ్ జాకెట్స్ అందించారు.
కార్నిక్ సుమారు 9 గంటలు సముద్రంలో ఈది, ఒక దీవికి చేరుకున్నారు. కొందరు జాలర్లు ఆయనను కాపాడి, సింగపూర్ వెళ్లే బ్రిటన్ యుద్ధనౌకలో ఎక్కించారు. ఆ తరువాత ఆయనకు అశోక్ చక్ర పురస్కారం లభించింది.
ఒక వేళ నాడు చైనా ప్రధాని జౌ ఎన్ లై తన పర్యటనను రద్దు కాకపోయినట్లయితే ఆయన కూడా ఆ ప్రమాదంలో చనిపోయే అవకాశం ఉంది. 2004లో చైనా విడుదల చేసిన పత్రాల ప్రకారం...నాడు బీజింగ్‌లో జౌ ఎన్ లైకు అపెండిసైటిస్ ఆపరేషన్ జరిగింది. దాంతో ఆయన పర్యటన రద్దు అయింది.

ఫొటో సోర్స్, Getty Images
నెహ్రూ విమానంలో జౌ ఎన్ లై
ఆపరేషన్ జరిగిన మూడు రోజుల తరువాత రంగూన్‌కు వెళ్లిన జౌ ఎన్ లై, భారత ప్రధాని నెహ్రూను కలిశారు. నెహ్రూ ప్రయాణించే విమానంలోనే ఆయన ఎక్కి ఇండోనేసియాకు వెళ్లారు.
విమానం ప్రమాదం వెనుక ఏదో కుట్ర ఉందని, భారత్-చైనాల మధ్య సంబంధాలను దెబ్బతీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని నాడు చైనా రేడియో ప్రకటించింది. ఆ ఘటన వెనుక తైవాన్ నిఘా సంస్థ కేఎంటీ ఉన్నట్లు చైనా ఆరోపించింది.
విమానం ప్రమాదం మీద చేపట్టిన విచారణలో భాగంగా కావాల్సిందిగా నెహ్రూను జౌ ఎన్ లై కోరారు.
తనకు విశ్వాసపాత్రుడైన బీఎన్ మాలిక్‌కు నెహ్రూ ఆ బాధ్యత అప్పగించారు. ఆయన అప్పట్లో ఇంటెలిజెన్స్ బ్యూరోకు నేతృత్వం వహిస్తున్నారు. సమర్థవంతమైన అధికారికి కేసును అప్పగించాలని నెహ్రూ సూచించారు.
దాంతో 37ఏళ్ల రామ్‌నాథ్ కావ్‌కు విమాన ప్రమాదం కేసును బీఎన్ మాలిక్ అప్పగించారు. డిప్యూటీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ చంద్రపాల్ సింగ్‌ను తన బృందంలోకి రామ్‌నాథ్ కావ్ తీసుకున్నారు. ఆ తరువాత హిందుస్థాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఫ్యాక్టరీకి చెందిన ఇంజినీర్ విశ్వనాథన్ కూడా విచారణ బృందంలో భాగమయ్యారు.

ఫొటో సోర్స్, BLOOMSBURY
ఒక విచారణ... 5 దేశాలు
విమాన ప్రమాదంలో బతికిన ముగ్గురు భారతీయులను చాలా లోతుగా విచారించారు రామ్‌నాథ్ కావ్. విచారణలో భాగంగా బాండుంగ్ వెళ్లి, చైనా ప్రధాని జౌ ఎన్ లై ని కూడా కావ్ కలిశారు.
చైనా ప్రధానికి జరిగిన ఘటన గురించి వివరించేందుకు పేపర్ మీద బొమ్మ గీయాలని కావ్ అనుకున్నారు. ‘బ్రీఫ్ కేసులోని ఫౌంటైన్ పెన్ తీసుకొని మూత తీయగానే దాంట్లోని ఇంక్ కారడం మొదలైంది. నా చేతులకు ఇంక్ మరకలు అయ్యాయి. నేను నా బ్రీఫ్ కేసు నుంచి కొన్ని పేపర్లు తీసి చేతులు శుభ్రం చేసుకునేందుకు ప్రయత్నించాను.
ఇంతలో జౌ ఎన్ లై లేచి పక్క గదిలోకి వెళ్లారు. ఒక్క మాట కూడా చెప్పకుండా అలా వెళ్లినందుకు నాకు బాధ కలిగింది. కానీ కొద్ది క్షణాల్లోనే సహాయకులతో మళ్లీ ఆయన వచ్చారు. సహాయకుని వద్ద తడి తువాలు ఉంది. నా చేతులు తుడవాల్సిందిగా అతనికి జౌ ఎన్ లై సైగ చేశారు’ అని తన పుస్తకంలో కావ్ రాసుకున్నారు.
తనకు చెప్పిన విషయాలు బ్రిటిష్ నిఘా అధికారులతో చెప్పవద్దని కావ్‌ను కోరారు జౌ ఎన్ లై.
ఈ విమాన ప్రమాదంలో అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. హాంకాంగ్ నుంచి బయలుదేరిన విమానం ఇండోనేసియా సముద్ర జలాల్లో పడి పోయింది. అమెరికా కంపెనీ తయారు చేసిన ఆ విమానం యజమాని భారత్. చనిపోయిన ప్రయాణికులు చైనా వారు. దాంతో చైనా, భారత్, బ్రిటన్, ఇండోనేసియా, అమెరికా ఈ దర్యాప్తులో భాగమయ్యాయి.
బీజింగ్‌లో రెండో సారి కావ్, చైనా ప్రధాని జౌ ఎన్ లైని కలిశారు. తనను హత్య చేసేందుకు తైవాన్ నిఘా సంస్థ కేఎంటీ ప్రయత్నించినట్లు చైనా ప్రభుత్వానికి సమాచారం ఉందని ఆయన కావ్‌కు తెలిపారు. కాబట్టి ఈ విచారణలో జాగ్రత్తగా ఉండాల్సిందిగా కావ్‌ను ఆయన హెచ్చరించారు.
కావ్ అక్కడి నుంచి హాంకాంగ్‌కు వెళ్లారు. హాంకాంగ్ స్పెషల్ బ్రాంచ్ అధిపతిని ఆయన కలిశారు. మీకు తగిన భద్రత కల్పించాలనే ఆదేశాలు వచ్చాయని ఆయన కావ్‌కు తెలిపారు. హాంకాంగ్‌లో ఎప్పుడూ ఒక బ్రిటిష్ పోలీసు అధికారి కావ్‌తో ఉండేవారు. రాత్రి పూట కావ్ బయటకు వెళ్లేవారు కాదు. తెలియని ప్రదేశాల్లో తినే వారు కాదు. హోటల్ నుంచి బయటకు వెళ్లేటప్పుడు కేసుకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలను తనతో తీసుకెళ్లేవారు.
‘హోటల్ గదిలో కూడా బ్రీఫ్ కేసును ఎప్పుడూ నాతోనే ఉంచుకునే వాడిని. బాత్రూమ్‌కు వెళ్లినా అది నాతోనే ఉండేది. రాత్రి పూట పరుపు కింద పెట్టుకుని నిద్రపోయే వాడిని’ అని కావ్ రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
విమానం కింద టైం బాంబ్
విమానం కింద చక్రాల వద్ద టైం బాంబు పెట్టినట్లు విచారణలో తేలింది. హాంకాంగ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజినీరింగ్ కంపెనీకి చెందిన చొ చు అనే తైవాన్ వ్యక్తి దీని వెనుక ఉన్నట్లుగా చైనా ప్రధాని జౌ ఎన్ లైకు కావ్ తెలిపారు. చొ చు చేత హాంకాంగ్‌లోని కేఎంటీ అధికారి ఆ పని చేయించినట్లు కూడా విచారణలో బయట పడింది. నాటి తైవాన్ నేత చాంగ్ కాయ్ షెక్ ఈ ప్రణాళిక రచించారు.
హాంకాంగ్ నుంచి బాండుంగ్‌కు చైనా ప్రధాని ప్రయాణిస్తున్నారనే వార్త బయటకు రాగానే అందులో బాంబు పెట్టాలని భావించారు. విమానంలో బాంబు పెట్టిన చొ చు హాంకాంగ్ నుంచి తైవాన్‌కు పారిపోయినట్లు హాంకాంగ్ పోలీస్ కమిషనర్ మాక్స్‌వెల్ తెలిపారు.
తైవాన్‌లో చొ చు దిగగానే, కేఎంటీ అధికారులు ఆయనను రహస్య స్థావరానికి తీసుకెళ్లారు. ఆ తరువాత ఆయన గురించి ప్రపంచానికి ఏమీ తెలియలేదు.
‘కశ్మీర్ ప్రిన్సెస్’ పేలుడుకు సంబంధించి సమాచారం ఇచ్చిన వారికి 1 మిలియన్ హాంకాంగ్ డాలర్లు ఇస్తామని హాంకాంగ్ పోలీసులు 1955 జూన్‌లో ప్రకటించారు. కానీ ఎవరూ సమాచారం ఇవ్వలేదు.
అయితే పేలుడు జరగడానికి ముందు రోజు, మూవీల్యాండ్ అనే హోటల్‌కు చొ చు వెళ్లినట్లు రామ్‌నాథ్ కావ్ తన విచారణలో తెలుసుకున్నారు. అక్కడి నుంచి బ్రౌన్ పేపరులో చుట్టిన టైం బాంబ్‌తో ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. కేఎంటీ ఏజెంట్ స్వయంగా తానే చొ చును హాంకాంగ్ విమానాశ్రయం వద్ద దించారు.
కావ్ ప్రతిభను చైనా ప్రధాని మెచ్చుకోవడంతోపాటు ఆయనను ప్రశంసిస్తూ నెహ్రూకు లేఖ కూడా రాశారు. తనతో విందుకు కూడా కావ్‌ను జౌ ఎన్ లై ఆహ్వానించారు.
కానీ పేలుడు జరగడానికి రెండు రోజుల ముందే ఆ కుట్రకు సంబంధించి చైనాకు కొంత సమాచారం అందింది. కానీ తైవాన్ నిఘా సంస్థను ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టడానికి ఎయిరిండియా విమాన ప్రయాణాన్ని అడ్డుకోలేదనే వాదనలు ఉన్నాయి.
‘హాంకాంగ్‌లోని కేఎంటీ ఏజెంట్ల బండారాన్ని బయట పెట్టేందుకు ఆ విమాన ప్రయాణాన్ని చైనా అడ్డుకోలేదు. అలాగే అమెరికా సీఐఏ, తైవాన్ కేఎంటీ కలిసి చైనా ప్రధానిని చంపేందుకు కుట్ర పన్నాయని చైనా విదేశాంగ శాఖ ప్రచారం చేయడం ప్రారంభించింది’ అని ‘మిషన్ రా’ అనే పుస్తకంలో ఆర్కే యాదవ్ రాశారు.
కానీ విమానంలో పెట్టిన టైం బాంబు అమెరికాలో తయారైందని తెలియడం తప్ప, అమెరికా కుట్ర గురించి చైనా ఎటువంటి ఆధారాలు ఇవ్వలేదు. చొ చును అప్పగించాల్సిందిగా హాంకాంగ్ చేసిన విజ్ఞప్తులను కూడా తైవాన్ తోసి పుచ్చింది.
విమానం పేలుడులో బతికి బయటపడిన ఎంసీ దీక్షిత్, 105ఏళ్ల వయసులో మరణించారు.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణలో తొలి ట్రాన్స్‌జెండర్ డాక్టర్: ‘రోగులు మొదట నా దగ్గర వైద్యం చేయించుకోవడానికి సంకోచిస్తారు, తరువాత చేతులెత్తి మొక్కుతారు’
- ఆంధ్రప్రదేశ్: 20 రూపాయలకే ‘మన భోజనం’ - ఎక్కడంటే...
- రైలు ప్రయాణం: ప్రయాణికులకు తగినన్ని రైళ్లు నడపటం లేదా? రిజర్వేషన్ బోగీలలో తరచూ తగాదాలెందుకు?
- కోవిడ్-19 బీఎఫ్7: భారత్‌లోనూ ముప్పు తప్పదా, ఇప్పుడు ఏం చేయాలి
- హంపి ఆలయం: రాతి స్తంభాల్లో సంగీతం ఎలా పలుకుతోంది? 500 ఏళ్ల కిందటి ఆ రహస్యం ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













